close

తాజా వార్తలు

చిరంజీవి తప్ప మరొకరు కనిపించలేదు: సురేందర్‌

‘డాడీతో సినిమా చేస్తావా’ అని చరణ్‌ అడిగారు

హైదరాబాద్‌: పరుచూరి బ్రదర్స్‌ ‘సైరా’ కథ చెబుతుంటే చిరంజీవి తప్ప మరొకరు కనిపించలేదని దర్శకుడు సురేందర్‌ రెడ్డి అన్నారు. మెగాస్టార్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా బుధవారం విడుదల కాబోతోంది. రామ్‌ చరణ్‌ నిర్మించారు. అమిత్‌ త్రివేది సంగీతం అందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సురేందర్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలివి..

ఓ మంచి అనుభవం
150 సినిమాలు చేసిన అనుభవం చిరంజీవిది. నాకు చాలా విలువైన సలహాలు ఇచ్చారు. ఆయనతోపాటు, అమితాబ్, సుదీప్, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు... ఇలా ఎంతోమంది అగ్ర నటులు ఉన్నారు. అప్పట్లో బళ్లారి నుంచి చెన్నై వరకు దత్తమండలంగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. ఇక్కడ ఉద్యమం జరుగుతున్నప్పుడు తమిళనాడు నుంచి ఒక పాత్ర వస్తుంది. ఆ పాత్రని విజయ్‌ సేతుపతి చేశారు. సుదీప్‌ అవుకురాజు పాత్రలో కనిపిస్తారు. నరసింహారెడ్డికి నిజంగా గురువైన గోసాయి వెంకన్న పాత్రని అమితాబ్‌ బచ్చన్‌ చేశారు.

చరణ్‌ అడిగారు
‘సైరా’ నాకు ఎంతో నేర్పింది. నేనే కాదు... మా బృందంలో చాలా మంది చాలా విషయాలు నేర్చుకొన్నారు. ఈ సినిమా నాకొక గ్రంథంలాంటిది. ‘ధృవ’ తర్వాత రామ్‌చరణ్, నేను అమెరికా వెళ్లాం. అక్కడే ‘డాడీతో సినిమా చేస్తావా’ అని అడిగారు చరణ్‌. అప్పుడు చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చేస్తున్నారు. నేను వెళ్లి కలిశా. మనం పెద్ద సినిమా చేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ గురించి చెప్పారు. అంత పెద్ద సినిమా చేయాలంటే ముందు నేను మానసికంగా సిద్ధం కావాలి. అందుకే కొంత  సమయం అడిగా. 20 రోజులపాటు రకరకాల మాధ్యమాల ద్వారా నరసింహారెడ్డికి సంబంధించిన విషయాల్ని తెలుసుకొన్నా. గెజిట్‌ చూశాక, అందులో నరసింహారెడ్డి గురించి రాసింది చదివాక నాకు కథపై ఆసక్తి ఏర్పడింది. వెంటనే ఈ సినిమా చేస్తానని ఆయనకు చెప్పా.

కథలో ఎన్నో విషయాలు..
‘సైరా’ కథ నాలో ఆసక్తిని పెంచింది. బ్రిటిష్‌వాళ్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక బందిపోటు దొంగ అని రాశారు. వాళ్లకి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా అలాగే చిత్రీకరించారు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వెంట 9 వేల మంది వచ్చారనీ, రెండు యుద్ధాలు కూడా చేశారని రాశారు. ఆయన మరణానికి సిద్ధమయ్యే కదనరంగంలోకి దిగారని అందులో ఉంది. ఈయన వెనక వచ్చిన 9 వేల మంది కూడా సైన్యం కాదు, ప్రజలే. నాకెంతో స్ఫూర్తినిచ్చిన విషయమది. ఈ కథ ప్రత్యేకత కూడా అదే. బహిరంగంగా ఉరి తీయడమే కాకుండా, ఆయన వెంట నడిచిన 250 మంది ప్రధాన వ్యక్తులకి ద్వీపాంతర శిక్ష వేశారు. ఉరి తీశాక తలని 30 ఏళ్లపాటు గుమ్మానికి వేలాడదీశారు. దీన్నిబట్టి ఆయన వెనకాల ఏం జరిగిందో, ఆయన ఏ స్థాయి వీరుడో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి.

పాత్రే బలమైంది
ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నరసింహారెడ్డి పాత్రే శక్తివంతమైనది. అభిమానుల కోసం 12 ఏళ్ల క్రితం చిరంజీవి ఈ కథ చేయాలనుకొన్నారంటే ఆ పాత్రలోని బలాన్ని అర్థం చేసుకోవచ్చు. అభిమానులు కోరుకొనే అన్ని విషయాలూ ఈ పాత్రలోనే ఉంటాయి. పరుచూరి బ్రదర్స్‌ ఈ కథ చెప్పినప్పుడు చిరంజీవి తప్ప నాకు మరొకరు కనిపించలేదు. ఇది ఎప్పుడూ తీసే కమర్షియల్‌ సినిమా కాదు. ఒక వీరుడి కథని అంతే స్వచ్ఛంగా తీయాల్సిన సినిమా.

తదుపరి సినిమాలు..
‘సైరా’ తర్వాత నా సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. కానీ ఇంత బడ్జెట్‌తో కూడిన సినిమాని మాత్రం చేయలేను.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.