close

తాజా వార్తలు

రివ్యూ: సైరా నరసింహారెడ్డి

చిత్రం: సైరా నరసింహారెడ్డి
నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క, రవికిషన్‌, నిహారిక, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియం(నేపథ్య సంగీతం); సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; డైలాగ్స్‌: బుర్రా సాయిమాధవ్‌; కథ: పరుచూరి బ్రదర్స్‌
ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవన్‌; నిర్మాత: రామ్‌చరణ్‌; దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
బ్యానర్‌: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ విడుదల తేదీ: 02-10-2019

చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నంబర్‌ 150’తో రీఎంట్రీ ఇచ్చిన ఆయనకు ఘన విజయంతో స్వాగతం పలికారు. మరి 151వ చిత్రంగా ఏ కథను ఎంచుకోవాలి? అనుకున్న చిరుకు కనిపించిన పాత్ర తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. తన పన్నెండేళ్ల కలల ప్రాజెక్టు ‘సైరా’ను భారీ బడ్జెట్‌తో పట్టాలెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిరు. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు పలువురు స్టార్‌ నటులు ఇందులో నటిస్తుండటం, చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తుండటం, స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండటం, యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ పనిచేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ విడుదలైన నాటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు ఆ తరుణం వచ్చింది. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ‘సైరా’ ఎలా ఉన్నాడు? బ్రిటిష్‌ వారిపై అతని పోరాటం ఎలా సాగింది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ఎలా అలరించారు? అభిమానుల అంచనాలను అందుకుందా?

కథేంటంటే...
త్త మండలాలతో కూడిన రేనాడు ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్లు చిన్న చిన్న సంస్థానాలుగా చేసుకుని పరిపాలన సాగిస్తుంటారు. అయితే, ఎవరి మధ్యా ఐకమత్యం ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు. రేనాడుపై పన్ను వసూలు చేసుకునే హక్కు ఆంగ్లేయులు పొందడంతో ఎవరికీ స్వయం పాలన ఉండదు. మరోవైపు వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ప్రజలను ఆంగ్లేయులు హింసిస్తుంటారు. అలాంటి సమయంలో మజ్జారి నరసింహారెడ్డి(చిరంజీవి) అనే పాలెగాడు ఆంగ్లేయులపై ఎలా పోరాటం చేశాడు? ఐకమత్యం కొరవడిన 61మంది పాలెగాళ్లను ఎలా ఏకతాటిపైకి తీసుకొచ్చాడు? వీరారెడ్డి(జగపతిబాబు), అవుకు రాజు(సుదీప్‌), పాండిరాజా(విజయ్‌ సేతుపతి), లక్ష్మి(తమన్నా)లు తొలి స్వాతంత్ర్యపోరాటంలో నరసింహారెడ్డికి ఎలా సహకరించారు? చివరకు నరసింహారెడ్డి పోరాటం ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

ఎలా ఉందంటే... 
ఝాన్సీపై ఆంగ్లేయులు దాడి చేయటంతో కథ ప్రారంభమవుతుంది. తొలి స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నది మనం కాదని, అంతకుముందే ఆంగ్లేయులను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి గడగడలాడించాడని అతని గురించి లక్ష్మీబాయి(అనుష్క) తన సైనికులకు వివరించడంతో ‘సైరా’ కథ మొదలవుతుంది. రేనాడులోని చిన్న చిన్న సంస్థానాలు, వాటి మధ్య ఐకమత్యం లేకపోవడం, మరోపక్క పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ఆంగ్లేయులు ప్రజలను హింసించడంతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, ఆరంభ సన్నివేశాలన్నీ పాత్రల పరిచయం కోసం వాడుకున్నాడు. 61 సంస్థానాలు వాటిల్లో పన్నులు వసూలు చేసేందుకు ఆంగ్లేయులు చేసే అకృత్యాలను కళ్ల కట్టినట్లు చూపించారు. ప్రజల కష్టాలను చూసిన నరసింహారెడ్డి ఆంగ్లేయులపై పోరాటం చేయడానికి ఏం చేశాడు? ఐకమత్యంలేని సంస్థానాలు ఏకతాటిపైకి పైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రథమార్ధం సాగుతుంది. ముఖ్యంగా విరామానికి ముందు ఆంగ్లేయులతో నరసింహారెడ్డి చేసే పోరాట సన్నివేశాలు ఒళ్లు గగురుపొడుస్తాయి. దీంతో కథలో ప్రేక్షకుడు మరింత లీనమవుతాడు. బ్రిటిష్ అధికారి జాక్సన్‌ తల నరికి ఆంగ్లేయులకు పంపడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుందన్న ఉత్సుకత ఏర్పడుతుంది. 

అయితే, అందుకు తగ్గట్టుగానే ద్వితీయార్ధాన్ని కూడా మలిచాడు దర్శకుడు. కథ, కథనాల్లో వేగం పెంచాడు. రేనాడులో నరసింహారెడ్డి పోరాటం గురించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియడం, దాన్ని అణచివేసేందుకు ఆ ప్రాంతానికి అత్యంత క్రూరుడైన మరో అధికారిని పంపడంతో ద్వితీయార్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే కథ మరింత రసకందాయంలో పడుతుంది. కథలో నాటకీయత మొదలవుతుంది. ఒకపక్క నరసింహారెడ్డి మిగిలిన సంస్థానాధీశుల్లో స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తిని రగిలించి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేయడం తదితర సన్నివేశాలతో సాగుతుంది. ఇక్కడే దర్శకుడు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. చిరంజీవిలోని మాస్‌ ఇమేజ్‌, స్టార్‌ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు. అవుకురాజు, వీరారెడ్డి, బసిరెడ్డి పాత్రలు నరసింహారెడ్డికి సహకరిస్తున్నాయా? లేక వెన్నుపోటు పొడుస్తున్నాయా? అన్న ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగించేలా సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి నుంచి ప్రేక్షకులను ఏం ఆశిస్తారో అవన్నీ దర్శకుడు దృష్టిలో పెట్టుకున్నాడు. దీంతో ద్వితీయార్ధంలో తీసిన పోరాట ఘట్టాలు రోమాంచితంగా చిరు అభిమానులకు పండగలా ఉంటాయి. అయితే, అతి చిన్నదైన సైరా సైన్యం 10వేలమంది ఆంగ్లేయ సైన్యాన్ని చంపడం ఇవన్నీ కొంత లాజిక్‌కి దూరంగా సాగే సన్నివేశాలే. క్లైమాక్స్‌లో మరింత లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. చరిత్రలో ఆంగ్లేయులు నరసింహారెడ్డిని ఉరితీసినట్లుగా ఉంది.  అయితే క్లైమాక్స్‌కు భావోద్వేగాలు జోడించడంతో సినిమా విషాదాంతంగా ముగించినట్లు అనిపించకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. 

 

ఎవరెలా చేశారంటే... 
చిరంజీవి ‘సైరా’ తన 12ఏళ్ల కలల ప్రాజెక్టు అని ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగినట్లే ఆ పాత్రకు సిద్ధమయ్యారు. తన 150 చిత్రాల అనుభవం ఎలాంటిదో ‘సైరా’లో మనకు కనబడుతుంది. స్వాతంత్ర్యపోరాట యోధుడిగా చిరు ఆహార్యం, నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక పోరాట ఘట్టాల్లో ఆయన నటన అద్భుతం. నేటి యువ కథానాయకులకు దీటుగా యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేశారు. సంభాషణలు పలకడంలోనూ చిరు తనదైన మార్కును చూపించారు. తన నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో ఆయా అంశాలను అన్ని పరిగణనలోకి తీసుకుని తెరపై ఎన్నో జాగ్రత్తలు వహించారు. 

నరసింహారెడ్డికి విద్యలు నేర్పి, స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తిని రగిలించే గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్‌ పాత్ర హుందాగా ఉంది. ఆ పాత్రలో ఆయన ఇమిడిపోయారు. ఇక అవుకు రాజుగా సుదీప్‌ నటనను మెచ్చుకోకతప్పదు. నరసింహారెడ్డి అంటే అసూయ కలిగిన వ్యక్తిగా చక్కగా నటించారు. అదే సమయంలో ఆంగ్లేయులపై చేసే పోరాటంలో నరసింహారెడ్డికి సహకరించడం ఆకట్టుకుంటుంది. ఇక వీరారెడ్డిగా జగపతిబాబు పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. మొదటి నుంచి నరసింహారెడ్డి వైపు ఉండే వీరారెడ్డి అనుకోని పరిస్థితుల్లో మారతాడు. బసిరెడ్డిగా రవికిషన్‌ మోసపూరిత పాత్రలో కనిపించారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార చక్కగా సరిపోయింది. ఆ పాత్రలో చక్కగా నటించింది. ఇక ‘సైరా’లో మరో ప్రధాన పాత్ర తమన్నా, నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా చాలా చక్కగా నటించింది. తన డ్యాన్స్‌, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రేకెత్తిస్తుంది. ఇక పాండిరాజాగా విజయ్‌సేతుపతి నటన ఆకట్టుకుంటుంది. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి చేస్తున్న పోరాటానికి తనవంతు సహకారాన్ని అందిస్తాడు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పవన్‌కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌, చివరిలో నాగబాబు స్వరం వినిపించడం మెగా అభిమానులను ఆకట్టుకుంటాయి.

 

సాంకేతికంగా... 
‘సైరా’కు దర్శకత్వం వహించమనగానే ‘సమయం కావాలి’ అని దర్శకుడు సురేందర్‌రెడ్డి ఎందుకు చెప్పాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. చరిత్ర అర్థం చేసుకోవడం, చిరంజీవి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకోవడం ఇలా ఎన్నో అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. దర్శకుడు తీసుకున్న ప్రతి జాగ్రత్త తెరపై కనపడుతుంది. చిరంజీవి సినిమా అంటే అభిమానులు ఏం ఆశిస్తారో వాటిని దృష్టిలో పెట్టుకుని మరీ కథ, కథనాలను తీర్చిదిద్దాడు. పరుచూరి బ్రదర్స్‌ అందించిన కథకు మెరుగులు దిద్ది అద్భుతమైన విజువల్‌ వండర్‌గా రూపొందించాడు. స్టైలిష్‌ దర్శకుడిగా పేరున్న ఆయన చరిత్ర ప్రాధాన్యమున్న కథను అద్భుతంగా మలిచాడు. 

ఇక ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ ప్రాణం. రత్నవేలు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడి ఊహలకు ఆయన ప్రతిబింబంగా నిలిచారు. ఈ సినిమా ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియంలు ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జూలియస్‌ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వినిపించే నేపథ్య సంగీతంతో ఒళ్లు గగురుపొడుస్తుంది. ‘సైరా’లో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌, గ్రెగ్‌పావెల్‌ అతని బృందం, రామ్‌లక్ష్మణ్‌లు తీర్చిదిద్దిన పోరాట ఘట్టాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్‌లు చిరు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ ఆనాటి రోజులను కళ్లకు కట్టింది. 

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది నిర్మాత రామ్‌చరణ్‌ గురించే. ఒక కథను నమ్మి ఈ స్థాయిలో ఖర్చు చేసి సినిమాను తీయడం నిజంగా ధైర్యమనే చెప్పాలి. తన తండ్రి కలల ప్రాజెక్టు అద్భుతంగా రావడానికి నిజంగా ఎంతో శ్రమించారు. ప్రతి ఫ్రేములోనూ భారీదనం కనపడుతుంది. 

బలాలు
+ చిరంజీవి నటన; + కథనం
+ విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు
+ సాంకేతికవర్గం పనితీరు

బలహీనతలు

- ప్రథమార్ధంలో ప్రారంభ సన్నివేశాలు

- తెలిసిన స్టోరీ లైన్‌

చివరిగా: ‘సైరా’ తెలుగు సినిమా ఖ్యాతిని చాటి ‘ఔరా’ అనిపిస్తుంది!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.