close

తాజా వార్తలు

అదే నాకు కత్తిమీద సామైంది

‘‘దర్శకుడిగా నేనే కాదు... ‘సైరా నరసింహారెడ్డి’తో మా బృందంలో చాలా మంది చాలా విషయాలు నేర్చుకొన్నారు. ఈ సినిమా నాకొక గ్రంథంలాంటిది’’ అన్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’తోనే ప్రతిభని నిరూపించుకొన్న ఆయన ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘ధృవ’ తదితర చిత్రాలతో విజయాల్ని  అందుకొన్నారు. స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్‌ చరణ్‌ నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సురేందర్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
 

‘‘ధృవ’ తర్వాత రామ్‌చరణ్‌ ‘డాడీతో సినిమా చేస్తావా’ అని అడిగారు. నేను వెళ్లి చిరంజీవిగారిని కలిశా. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ గురించి చెప్పారు. అంత పెద్ద సినిమా చేయాలంటే ముందు నేను  మానసికంగా సిద్ధం కావాలి. అందుకే కొంత సమయం అడిగా. 20 రోజులపాటు పుస్తకాలు, పాటలు, బుర్రకథలు, గెజిట్‌... ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా నరసింహారెడ్డి గురించి తెలుసుకొన్నా. గెజిట్‌లో నరసింహారెడ్డి గురించి రాసింది చదివాక నాకు కథపై ఆసక్తి ఏర్పడింది. గెజిట్‌లో రాసిన ఒక విషయం ఆధారంగా స్క్రిప్టు తయారు చేశా. ఈ కథని మొదట పరుచూరి బ్రదర్స్‌ రాశారు. వాళ్ల దగ్గరే కథ విన్నా. కానీ మన వీరుడిని మనం ఎలా చూడాలి, మనం ఎలా చూడలేకపోయామో... ఆ కోణంలో ఆలోచించి స్క్రిప్టు రాశా’’
* ‘‘బ్రిటిష్‌వాళ్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక బందిపోటు దొంగ అనే రాశారు. అయితే ఆయన వెంట 9 వేల మంది వచ్చారనీ, రెండు యుద్ధాలు కూడా చేశారని కూడా రాశారు. కానీ ఆ 9 వేల మంది సైన్యం కాదు, ప్రజలే. నాకెంతో స్ఫూర్తినిచ్చిన విషయమది. ఆయనను బహిరంగంగా ఉరి తీయడమే కాకుండా, ఆయన అనుచరుల్లో 250 మందికి ద్వీపాంతర శిక్ష వేశారు. ఉరి తీశాక తలని 30 ఏళ్లపాటు గుమ్మానికి వేలాడదీశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర శక్తిమంతమైంది.నరసింహారెడ్డి ఎంతోమంది పాలెగాళ్లని, 9 వేల మంది జనాన్ని ఎలా సమీకరించాడు? వాళ్లలో ఎలా స్ఫూర్తిని రగిలించాడనేది ఆసక్తికరం. ఈ పాత్రలో గొప్ప శిష్యుడు, గొప్ప కొడుకు, గొప్ప నాయకుడు, ప్రేమికుడు కనిపిస్తాడు.’’
* ‘‘చిరంజీవిగారిది 150 సినిమాల అనుభవం. విలువైన సలహాలు ఇచ్చారు. కానీ తన అనుభవాన్ని దర్శకులపై రుద్దరు. ఆయనతో పాటు అమితాబ్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు... ఇలా ఎంతోమంది అగ్ర నటులు ఉన్నారు. ఈ సినిమా వాస్తవికంగా ఉంటూనే గ్రాండియర్‌గా కనిపించాలి. అది నాకు కత్తిమీద సాములాగా అనిపించింది. అప్పటి వాతావరణం, పరిస్థితులపై ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ పరిశోధన చేశారు. మా ప్రీవిజువలైజేషన్‌ నచ్చి హాలీవుడ్‌ సాంకేతిక బృందం సినిమా చేయడానికి ముందుకొచ్చింది. రామ్‌చరణ్‌ 250 మందిని   విదేశాలకి తీసుకెళ్లారు. బాలీవుడ్‌లో కూడా ఇంతమంది ఒక చిత్రం కోసం విదేశాలకి వెళ్లలేదేమో’’
* ‘‘నేను మూడేళ్లు ‘సైరా’తో ప్రయాణం చేశా. చిత్రీకరణ చేసింది 225 రోజులయితే, 125 రోజులు యుద్ధ సన్నివేశాలే తీశాం. ‘సైరా...’ను ఐదు భాషల్లో తీశాం. నాకు ఐదు సినిమాలు తీసినట్టుగానే ఉంది. ఈ చారిత్రక కథని సినిమాకి తగ్గట్టుగా స్వేచ్ఛ తీసుకొని చేసిందేంలేదు. 9 వేలమంది నరసింహారెడ్డి వెనక ఉన్నారని చరిత్రలో ఉంటే... మేం తెరపై 20 వేల మందిని చూపించి ఉండొచ్చు. అంతకుమించి స్వేచ్ఛ తీసుకోలేదు. బ్రిటిష్‌వాళ్లు మన దేశానికి సంపద కోసమే వచ్చారు. అప్పటి వరకు మనం గొప్పగానే బతికామని చెప్పేందుకే హంగులతో కూడిన సన్నివేశాలు తీశాం. దక్షిణాదిలో చాలామంది వీరులు ఉన్నారు. ‘సైరా...’ స్ఫూర్తితో మరిన్ని వీరుల కథలు వెలుగులోకి వస్తాయి’’.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.