close

తాజా వార్తలు

అమితాబ్‌, అనుష్క రూపాయి కూడా తీసుకోలేదు!

అందరూ అలా మాట్లాతుంటే చాలా ఆనందంగా ఉంది

‘సైరా’ థ్యాంక్యూ మీట్‌లో అగ్ర కథానాయకుడు చిరంజీవి

హైదరాబాద్: ‘‘ఇప్పటివరకూ చిరంజీవి నటించిన 150 సినిమాలు ఒకెత్తు. ‘సైరా: నరసింహారెడ్డి’ మరొక ఎత్తు’ అని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైరా’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ‘థ్యాంక్యూ మీట్‌’ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘‘సైరా’ కంటే ముందు ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలని, అలాంటి పాత్ర ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూశా. భగత్‌సింగ్‌ పాత్ర చేయాలన్నది నా కల అని పలు సందర్భాల్లో చెప్పాను. 12ఏళ్ల కిందట నాకు ఈ కథను పరుచూరి బ్రదర్స్‌ వినిపించారు. బాగా నచ్చింది. కానీ, తెరపై చూపించాలంటే భారీ బడ్జెట్‌ కావాలి. ఎక్కడ వెనక్కి తగ్గినా ఆ కథకు న్యాయం చేయలేం. దీంతో సినిమా వాయిదా వేస్తూ వచ్చాం. గత రెండున్నర సంవత్సరాలుగా మేమంతా కష్టపడి నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఈ ప్రయాణం ఎంతో సంతృప్తి కలిగించింది. ‘సైరా’ కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. ‘ధ్రువ’ చూడగానే ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి అయితే న్యాయం చేస్తాడని మాకు అనిపించింది. మేము అడిగిన వెంటనే చేయడానికి ఒప్పుకొన్నా, కొంత సమయం కావాలని అడిగారు. మా దగ్గర ఉన్న కథను నేడు మీరు చూస్తున్న సినిమాగా తీర్చిదిద్దారు. ఆయన శైలికి నిజంగా హ్యాట్సాఫ్‌. ఫైనల్‌ స్క్రిప్ట్‌ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామని చాలా ఆసక్తిగా ఎదురు చూశా. మేము ఇచ్చిన కథను అద్భుతమైన కథనంతో చక్కగా తీర్చిదిద్దాడు. సత్యానంద్‌ సలహాలు సినిమాకు ఎంతో ఉపయోగపడ్డాయి’’

మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు
‘‘సైరా’కు పనిచేసే అవకాశం సురేందర్‌రెడ్డికి మేము ఇచ్చాం అని మీరు అనుకుంటున్నారు. కానీ, సరైన దర్శకుడిని మేము ఎన్నుకుని కథను ఆయన చేతుల్లో పెట్టాం. అలా ఆయనపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక ఎపిక్‌లాంటి సినిమాను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ‘ఖైదీ నంబర్‌ 150’లో రత్నవేలు నన్ను ప్రజెంట్‌ చేసిన విధానం అందరికీ నచ్చింది. చూసిన వాళ్లందరూ చిరు 20ఏళ్ల వెనక్కి వెళ్లారని మెచ్చుకున్నారు. ఇప్పుడు చారిత్రక చిత్రమైన దీని కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు.  ప్రొడక్షన్‌ డిజైన్‌ రాజీవన్‌ ఆనాటి పరిస్థితులను చక్కగా అధ్యయనం చేసి వాటిని పునః సృష్టించారు. వీఎఫ్‌ఎక్స్‌ ఈ సినిమాకు చాలా బలం. 3800 షాట్స్‌ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అనేక స్టూడియోలకు ఈ గ్రాఫిక్స్‌ వర్క్‌ను అందించారు. వీఎఫ్‌ఎక్స్‌ ఇంత అద్భుతంగా ఉన్నాయంటే కమల్‌ కణ్ణన్‌ కారణం. బుర్రా సాయిమాధవ్‌ అద్భుతమైన సంభాషణలు రాశారు. డైలాగ్‌లు మరోస్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారంటే అందుకు ఆయనే కారణం’’

అమితాబ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు
‘‘సైరా’ గురువుగా ఎవరు చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక రోజు సురేందర్‌రెడ్డి వచ్చి ఆ పాత్రను అమితాబ్‌ చేస్తే బాగుంటుందని అన్నారు. ఆయనతో నాకున్న అనుబంధం కారణంగా ఫోన్‌ చేయగానే ‘ఈ పాత్ర నేను న్యాయం చేస్తానని అనిపిస్తోందా?’ అని అడిగారు. నేను ‘అవును’ అంటే, ‘తప్పకుండా చేస్తా’న్నారు. అమితాబ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయనే స్వయంగా చూసుకున్నారు. సొంత ఖర్చులతో ప్రైవేట్‌ జెట్‌ పెట్టుకుని మరీ వచ్చారు. ‘నేను నా స్నేహితుడి కోసం చేస్తున్నా. నేను మీకు భారం అవ్వకూడదు. నాకు ఆ తృప్తిని ఇవ్వండి’ అని ఆయన ఖరాకండీగా చెప్పి మరీ నటించారు. ఆయనను చూసి నేను ఎంతో నేర్చుకున్నా. స్నేహానికి ఎంత విలువ ఇస్తారో చెప్పారు. ఆయన రుణం నిజంగా తీర్చుకోలేనిది’’

‘సైరా’కోసం సాయిచంద్‌ మరో సినిమా ఒప్పుకోలేదు
‘‘ఇక కన్నడ నుంచి సుదీప్‌, తమిళనాడు నుంచి విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుబ్బయ్య పాత్ర చేసిన సాయిచంద్‌ ఇలా ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేశారు. సాయి చంద్‌కు వేరే అవకాశాలు వచ్చినా, ఈ సినిమా కోసం గడ్డం పెంచడంతో మరో సినిమా ఒప్పుకోలేదు. చిన్న ప్రాత అయినా సరే, దాని ప్రాముఖ్యత ఎంతో గుర్తించి చేశారు. జగపతిబాబు తన పాత్ర కోసం ప్రాణం పెట్టారు. నా పాత్రను పక్కన పెడితే ఆ స్థాయిలో ప్రతి ఒక్కరినీ కదిలించిన పాత్ర తమన్నాది. లక్ష్మిగా ఆమె అభినయం ఎంత మెచ్చుకున్నా తక్కువే. నయనతార సిద్ధమ్మగా ఒదిగిపోయారు’’

సినిమా నిర్మించడం ఎంతో గర్వంగా ఉంది
‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే గొప్ప యోధుడి గురించి ఎన్ని కథలు వచ్చినా, పుస్తకాలు వచ్చినా ఎక్కువమంది తెలియాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం సినిమా. ‘సైరా’తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ నరసింహారెడ్డి గురించి తెలుస్తుంది. ఈ సినిమా నిర్మించినందుకు మేము గర్వపడుతున్నాం. ముంబయిలో ప్రీమియర్స్‌ వేస్తే అక్కడి విలేకరులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. దక్షిణాది, ఉత్తరాది సినిమా అని చూడకుండా భారతీయ సినిమాగా ముద్రపడింది. ‘సైరా’ను నా తనయుడు నిర్మించినందుకు గర్వపడుతున్నా. ఈ సినిమా కోసం నా కుమార్తె సుస్మిత ఎంతో కష్టపడి పనిచేసింది. చివరిగా మరోసారి దర్శకుడు సురేందర్‌రెడ్డి గురించి చెప్పాలి. ‘సైరా’ కోసం ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలియదు కానీ, తెరపై ఇంత అత్యద్భుతంగా కనిపిస్తుందంటే ఆ క్రెడిట్‌ మొత్తం సురేందర్‌రెడ్డిదే. ఈ సినిమాకు న్యాయం చేయాలన్న కసితో ఆయన పనిచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన మరో అద్భుతమైన వ్యక్తి. ఇక అనుష్క కూడా ఈ సినిమా కోసం ఏమీ తీసుకోకుండా, అమెరికా నుంచి వచ్చి ఇందులో నటించారు. ఆమెకు కూడా నా ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని చెప్పుకొచ్చారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.