close

తాజా వార్తలు

చరణ్‌కు 100 మార్కులు ఇస్తా: చిరంజీవి

అలా అనుకుంటే అత్యాశవుతుంది

హైదరాబాద్‌: నటుడిగా, నిర్మాతగా రామ్‌ చరణ్‌కు వంద మార్కులు ఇస్తానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఈ విషయాన్ని ఓ తండ్రిగా చెప్పడం లేదని, తనతో కలిసి పనిచేసిన నటుడిగా చెబుతున్నానని పేర్కొన్నారు. సోమవారం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రబృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. చిరుతో పాటు దర్శకుడు సురేందర్‌ రెడ్డి, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, నటులు సాయిచంద్‌, రవి కిషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
* ఈ సినిమా అన్ని విధాలుగా సవాలుతో కూడుకున్నది. బడ్జెట్‌ కూడా చాలా ఎక్కువ? మీరు ధైర్యంగా ఎలా ముందడుగు వేశారు? 
చిరంజీవి: మేం మొదటి నుంచే ధైర్యంగా ఉన్నాం. ఎంత బడ్జెట్‌ అయినా పర్వాలేదు, ఎంత కష్టపడినా పర్వాలేదు అనిపించింది. సినిమా విజయం గురించి మాకున్న నమ్మకం ఎంత శ్రమ అయినా పడేలా చేసింది. సైరా క్యారెక్టరైజేషన్‌ మాలో నమ్మకం నింపింది.

* ఈ సినిమాకుగానూ మీరు అందుకున్న ఉత్తమ ప్రశంస?
చిరంజీవి: ఈ సినిమా డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు అమితాబ్‌ సర్‌ నాతో ఓ మాట అన్నారు. ‘ఇది మామూలు సినిమా కాదు.. ఇది ఓ గౌరవప్రదమైన సినిమా. మన భారతదేశంలో ఇలాంటి సినిమాలు అరుదుగా ఉంటాయి. వాటిలో ఇది ఒకటి. అలాంటి సినిమాలో నేను నటించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అప్పుడు ఆయన మాటలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి.

* వయసులో చిన్నవాడైన సురేందర్‌ రెడ్డితో భారీ ప్రాజెక్టు ‘సైరా’ తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అతడిపై అంత నమ్మకం ఎలా ఏర్పడింది?
చిరంజీవి: అవకాశం ఇస్తే తప్ప ఎవరూ తమలోని ప్రతిభను బయటికి తీసుకురాలేరు. సురేందర్ రెడ్డి తీసిన ‘కిక్‌’, ‘రేసుగుర్రం’ అద్భుతంగా ఉంటాయి. వాటిని చాలా మోడ్రన్‌గా తీశాడు. పురాతన కాలం నాటి ఈ కథను నేటి తరానికి నచ్చేటట్లు తీయగలడు అనే నమ్మకం వచ్చింది. ‘ధృవ’ తర్వాత దర్శకుడిగా అతడినే తీసుకోవాలి అనుకున్నాం. ఆ విషయాన్ని చరణ్‌కు చెప్పా. సురేందర్‌ మేము తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు.

* ‘రంగస్థలం’లో నటుడిగా చరణ్‌కి ఎన్ని మార్కులు వేస్తారు? నిర్మాతగా ‘సైరా’కు ఎన్ని మార్కులు వేస్తారు?
చిరంజీవి: ‘సైరా’కు దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అయ్యింది. ఆ విషయంలో చరణ్‌ ఏ మాత్రం భయపడలేదు. వాడి వెనకాల చిరంజీవి ఉన్నాడనే ధైర్యం ఉంది (నవ్వుతూ.. అది వేరే విషయం). చరణ్‌ చిత్ర బృందాన్ని బాగా కో- ఆర్డినేట్‌ చేశాడు. నిర్మాతగా వాడికి 100 మార్కులు వేస్తాను. ఓ తండ్రిగా కాదు.. వృత్తిపరంగా ఈ మాట చెబుతున్నా. ‘రంగస్థలం’ సినిమా చూసిన తర్వాత చరణ్‌ పట్ల అసూయపడ్డాను. వాడి నటనకు జాతీయ అవార్డు ఇవ్వొచ్చు. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పా. ఆ చిత్రానికి కూడా 100 మార్కులు వేస్తా.

* మీరు ‘సైరా’లాంటి పాత్రలో నటిస్తున్నారంటే కొంత మంది భయపడ్డారు. అయినా మీరు ధైర్యం చేశారు. ఇదెలా జరిగింది?
చిరంజీవి: మన రాయలసీమలో ఉండే ఓ పాలెగాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయనే విషయాన్ని నేను కాస్త ఊహించా. మా దగ్గర ఆయన ఫొటో మాత్రమే ఉంది. నిజానికి అది ఆయనది కాదట. ఆయన వారసుల్లో ఒక వర్గం మమ్మల్ని కలిసింది. ‘అది నరసింహారెడ్డి ఫొటో కాదు. ఆయన మనవడిది. ఆయన (మనవడు) కాస్త నరసింహారెడ్డిలా ఉండేవాడు. అందుకే నరసింహారెడ్డి గెటప్‌ వేసి, ఫొటో తీశాం. అప్పట్లో ఫొటోలు లేవు’ అని అన్నారు. ఇవి నాతో వారన్న మాటలు. ‘సైరా’ పాత్ర చదువుతుంటే, వింటుంటే.. ఆయన ఇలా ప్రవర్తించి ఉంటాడు అని ఊహించుకున్నా. ఓ ధీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు తొణకని నిండుకుండలా ఉంటాడు. దాన్ని నేను ఊహించుకుని ఓ అంచనాకి వచ్చాను. నా ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా నటించాలి అని నేను ఆలోచించా. నా వస్త్రధారణ, లుక్స్‌ గురించి అందరూ కలిసి పనిచేశారు.

* మీ 151 సినిమాల కెరీర్‌లో ఎన్నో ఘన విజయాలు చూశారు? ‘సైరా’కు ఏ స్థానం ఇస్తారు?
చిరంజీవి: కచ్చితంగా నంబర్‌.1 ఇస్తా.. అందులో సందేహం లేనేలేదు.

* ‘సైరా’ మీ మొత్తం కెరీర్‌లో ఉన్నతమైన సినిమా అవుతుందనుకుంటున్నారా?
చిరంజీవి: దీనికి మించిన సినిమా రావాలి, కావాలి అనుకోవడం నా అత్యాశ అవుతుంది. రాదనే అనుకుంటున్నా.. వస్తే నాకంటే అదృష్టవంతుడు ఉండదు.

సిరివెన్నెల: ‘సైరా’ మాత్రమే నంబరు.1 కాదు.. ఇలా చిరు ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు.

* భగత్‌ సింగ్‌ సినిమా చేయమంటే చేస్తారా?
చిరంజీవి: తప్పకుండా చేస్తాను. మనకు తెలియని వీరులు చాలా మంది ఉన్నారు. వారి గురించి అందరికీ చెప్పాలనే ఆలోచన ఇప్పటికే మొదలైంది. అలాంటి కథలు తీయాలంటే నేను, చరణ్‌, ఇంకా ఎవరైనా సరే సిద్ధంగా ఉంటాయి.

* చరణ్‌ మీకు రెండు సినిమాలు బహుమతిగా ఇచ్చారు? మీరు తండ్రిగా తిరిగి ఏం బహుమతి ఇస్తారు?
చిరంజీవి: వాడికి జన్మ ఇవ్వడమే పెద్ద గిఫ్ట్‌. ఇక నేను వాడికి ఏం బహుమతి ఇస్తాను (నవ్వుతూ).

* వాటర్‌ సీన్‌ ఎలా చేశారు? 
చిరంజీవి: విరామ సన్నివేశంలో ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. ముంబయిలో షూట్‌కు సంబంధించి ఓ స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. అక్కడికి నా కంటే ముందు రోజు సురేందర్‌ వెళ్లి, సీన్‌ గురించి అందరికీ చెప్పారు. నన్ను తర్వాతి రోజు రమ్మన్నారు. ఉదయం 11.30గంటలకు పూల్‌లోకి దిగాను. (మధ్యలో సురేందర్‌ కల్పించుకుని... ముందు సర్‌ నీటిలోకి దిగాలి. సీన్‌ ఇలా తీయాలి.. అని రెండు రోజులు టీం మొత్తం ప్లాన్‌ చేశాం. నేను చాలా కంగారుపడ్డా. నీటిలో సీన్‌ ఎలా వస్తుందో, ఏమో అని అనుకున్నా. చిరు సర్‌ ముందు ఓ రోజు ప్రాక్టీస్‌ చేయాలి అని అక్కడి టీం సూచించింది. కానీ ఆయన ‘వద్దు.. మనం చేసేద్దాం’ అన్నారు. రెండు రోజుల్లో అనుకున్న షూట్‌.. 2 గంటల్లోనే పూర్తయింది. అందుకే ఆయన మెగాస్టార్‌’ అని ముగించారు).

* చిరు సర్‌.. క్లైమాక్స్‌లో సీన్‌ గురించి మీ భార్య, తల్లి ఏం అన్నారు?
చిరంజీవి: నా శ్రీమతితో కలిసి సినిమా రషెస్‌ చూశా. ఇందులో తల తెగిన తర్వాత తల్లి సీన్‌ ఉంటుంది. నిడివి తగ్గించేందుకు దాన్ని మేమంతా కట్‌ చేయాలి అనుకున్నాం. కానీ సురేఖ ‘దాన్ని కట్‌ చేయొద్దు. తల్లి ఎమోషన్‌ చూపిస్తే బాగుంటుంది’ అని చెప్పింది.

* 300 మంది బ్రిటీష్‌ వాళ్లను చంపిన తర్వాత మీరు వారికి మెసేజ్‌ పంపిస్తారు. ఆ లేఖలో ఏం ఉండదు. మీరే నేరుగా వెళ్లి, హెచ్చరించిన సీన్ హైలైట్‌ అయ్యింది. ఆ సీన్‌ ఆలోచన ఎవరిది?
సురేందర్‌ రెడ్డి: అన్నీ సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే మొత్తం చేసింది నేనే. ఆ ఆలోచన నాదే.
* చిరు సర్‌.. పాతికేళ్ల కింద మిమ్మల్ని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని మేం రాశాం. ఇప్పుడు ‘సైరా’కు నిర్మాత చరణ్‌, సమర్పకురాలు సురేఖ మీకు ఏం ఇచ్చారు?
చిరంజీవి: చరణ్‌, సురేఖ సినిమా తీసి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు, అది చాలు. తెలుగు కళామతల్లి ఇలాంటి బిడ్డల్ని కన్నందుకు సంతోషిస్తోంది.

* దేశభక్తిని రగిలించేలాగా మీరు మళ్లీ సినిమా తీస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మీరు, పవన్‌ కల్యాణ్‌ కలిసి సినిమా తీస్తారని ఆశించొచ్చా?
చిరంజీవి: నా బిడ్డతో సినిమా చేయడం నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో.. ఇంత మంది ప్రేమను పొందిన నా తమ్ముడితో సినిమా చేయడం కూడా నాకు అంతే కిక్‌, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి కథ ఉంటే నేను, కల్యాణ్‌ రెడీ. పవన్‌ ‘సైరా’ సినిమా చూసిన సాయంత్రం నాతో వచ్చి మాట్లాడాడు. ఈ సినిమాను మేమిద్దరం కలిసి పబ్లిక్‌లో చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. మొన్న నాగార్జున, అఖిల్‌తోపాటు సురేఖ స్నేహితులతో కలిసి సినిమా చూశా. నాతోటి నటులు ట్వీట్ల ద్వారా ప్రశంసించారు. నాగార్జున నాతో సినిమా చూసిన తర్వాత హత్తుకుని, కళ్లలో నీరు పెట్టుకున్నాడు. ‘మిమ్మల్ని కలవాలి సర్‌’ అని వెంకటేష్‌ మెసేజ్‌ చేశాడు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి, హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇంత కంటే ఏం కావాలి. మహేశ్‌బాబు ట్వీట్‌ చేశాడు. అందరు దర్శకులు నన్ను వ్యక్తిగతంలో కలిసి అభినందించారు.
అక్టోబరు 2న తెల్లవారుజామున అమెరికా నుంచి నాకు ఫోన్‌ వస్తుంది. ఆ రోజు ఫోన్లు రాలేదు. 2.30 గంటలకి దేవిశ్రీ ప్రసాద్‌ మెసేజ్‌ చేశాడు. అప్పుడు అతడు అమెరికాలో ఉన్నాడు. ‘మొదటి భాగం పూర్తయింది. అద్భుతంగా ఉంది’ అన్నాడు. 4 గంటలకు నా స్నేహితుడి దగ్గరి నుంచి రావాల్సిన ఫోన్‌కాల్‌ రాలేదు. ఉదయం 6.30 గంటలు అయ్యింది. అయినా అమెరికా నుంచి ఫోన్‌ రాలేదు. కంగారుపడ్డా, కాఫీ తాగి అలా కూర్చొన్నా. దేవిశ్రీ రెండో భాగం చూసి నిరాశ చెందాడా? అనుకున్నా. కృష్ణ జిల్లాలో మంచి టాక్‌ ఉందని బన్నీ మెసేజ్‌ చేశాడు. అయినా నాకు సంతృప్తిగా లేదు. ఆ తర్వాత ఒకొక్కరు మెసేజ్‌లు చేస్తున్నారు. అమెరికా నుంచి ఫోన్‌ వచ్చింది. టికెట్‌ దొరకలేదని నా స్నేహితుడు అన్నాడు. చివరికి అద్భుతమైన రిపోర్ట్‌ చూసి.. సర్‌ప్రైజ్‌ అయ్యా.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.