close

తాజా వార్తలు

ఇంద్ర భవనాలా... మండపాలా?

కలకత్తా కాళిక

 

నేస్తాలూ! చిన్నూనోచ్చేశా... అందరికీ దసరా శుభాకాంక్షలు.... ఈ సెలవేల్లో నేను మామయ్యా వాళ్ల ఇంటికెళ్లొచ్చా...వాళ్లుండేది కోలకతాలో మరి... వినాయకచవితి సంబరాలంటే మనకు హైదరాబాద్‌, ముంబయి గుర్తుచ్చేస్తాయ్‌... అలాగే దసరా అంటే అందరి చూపు కోల్‌కతావైపే... ఎందుకనుకుంటున్నారూ? అక్కడ ఈ పండుగ ఎంతో ప్రత్యేకం మరి... నేనివాళ మీకోసం ఆ కబుర్లన్నీ చెప్పేస్తానే!

పండుగ ఆరు రోజులే!

మనకు దసరా అంటే తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజలు చేస్తాం. బతుకమ్మలు ఆడేస్తుంటాం. మరేమో అక్కడ... అంటే కోల్‌కతాలో దసరా ముఖ్యంగా ఆరు రోజుల పండుగే. విజయదశమికి సరిగ్గా ఐదు రోజుల ముందు నుంచే హడావిడి మొదలైంది. పంచమి రోజు సాయంత్రానికల్లా అద్దిరిపోయే మండపాలు సిద్ధమై పోయాయి. ఆరోజే అమ్మవార్ని ప్రతిష్ఠిం చేశారు. మరుసటి రోజు నుంచి ఉదయం పూజ, సాయంత్రం హారతి... ఇస్తున్నారు.

కళ్లప్పగించాల్సిందే!

అక్కడ దసరా మండపాల్లో అందమైన దుర్గామాత ప్రతిమలు కొలువుదీరాయి. ఇక వాటి పైనున్న మండపాల గురించి చెప్పడానికి మాటలు చాలవనుకోండి. కొన్నైతే ఇంద్రభవనాల్లా అనిపించాయి. నేనైతే అంత పెద్ద మండపాల్ని కళ్లప్పగించి చూశాను. రకరకాల సెట్టింగుల్లో నిజమైన భవనాల్లాగే అనిపించాయి. ఒక్కో మండపమూ రెండు, మూడు, నాలుగంతస్థులు కూడా ఉన్నాయి తెల్సా. వాళ్లు ఈ సెట్టింగుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తార్ట.

అమ్మ నోట్లో నైవేద్యం!

ముందు నుంచే పూజలు మొదలు పెట్టేసినా, అసలు పండుగంతా మొన్నటి నుంచే మొదలయ్యింది. అంటే అష్టమి, మహర్నవమి, విజయదశమి... ఈ మూడు రోజుల్నీ ఇక్కడి వాళ్లు ఎంతో భక్తితో జరుపుకొంటున్నారు. అందరూ ఉదయాన్నే తల స్నానాలు చేసి మండపాలకు చేరుకుంటున్నారు. అమ్మవారి దగ్గర దీపం పెట్టి, తెచ్చిన నైవేద్యాలు పెడుతున్నారు. కొత్తగా అనిపించిన విషయం చెప్పమంటారా? నైవేద్యాన్ని అమ్మవారి నోటి దగ్గర పెట్టి తినిపిస్తున్నారు. దాన్ని మళ్లీ  మాత పాదాల దగ్గర పెడుతున్నారు. రసగుల్లాలు, పంచదార లడ్డూల్లాంటి మిఠాయిల్ని ఎక్కువగా అమ్మవారి దగ్గర పెట్టడం చూశాన్నేను.

ఎన్ని చూస్తే అంత గొప్ప!

సెలవులకి మన దేశంలోని వేరే రాష్ట్రాల్లో ఉన్న స్థానికులు, విదేశాల్లో ఉంటున్న వారూ కోల్‌కతా చేరిపోయారు. సాయంత్రం కాగానే అంతా మండపాలు చూసేందుకు బయలుదేరుతున్నారు. మామయ్యా వాళ్లతో కలిసి నేనూ మండపాలు చుట్టొచ్చాను. అక్కడ అంతా ఎన్ని మండపాలు చూశారు? అని అడుగుతున్నారు. అందరూ పోటీలు పడి మరీ ఎక్కువ మండపాల్ని చూసొస్తున్నారు. అర్ధరాత్రిళ్ల వరకూ వీరి సందడే రోడ్ల మీద. ఇక పానీపూరీల్లాంటి స్ట్రీట్‌ఫుడ్‌ల స్టాళ్లకు లెక్కేలేదిక్కడ. మండపాల పక్కనే వీటినీ పెట్టారు. అంతా సరదాగా తిరుగుతూ పనిలో పనిగా వీటినీ తింటూ ఆనందిస్తున్నారు. ఇదంతా చూసేందుకు నాకు భలే సరదాగా అనిపిస్తోంది.

సంబరాలకు చివరి రోజు!

విజయ దశమితో అక్కడ సంబరాలు ముగిసిపోతాయట. మామయ్య చెప్పారు. ఇవాళ సాయంత్రం అమ్మవారి మండపాలకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుంటార్ట. దుర్గాదేవికి సిందూరాన్ని పూస్తారు. వాళ్లలో వాళ్లూ సిందూరం పూసుకుంటూ ఆనందిస్తారు. హారతిచ్చిన తర్వాత అమ్మ విగ్రహాల్ని దగ్గర్లోని హుగ్లీ నదిలో కలిపేస్తారు. ఇది గంగానది పాయే. అందుకే దీన్నంతా ‘గంగా’ అనే పిలుస్తారక్కడ. ఇంతే మరి అక్కడి దసరా సంగతులు. రేపటి నుంచి నాన్నకు ఆఫీసు ఉంది కదా. అందుకే ఇవాళే మా ఊరొచ్చేశాం. ఈ సెలవులు నాకెంతో సరదాగా గడిచిపోయాయి. ఉంటా మరి!

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.