close

తాజా వార్తలు

పక్కా లోకల్‌ కానక్కర్లేదు..!

తెలుగువారి మనసులు దోచేస్తున్నారు

చక్కగా హావభావాలు పలికిస్తే ప్రేక్షకులు ఏ నటుడికైనా నీరాజనాలు పలుకుతారు. భాషతో సంబంధం లేకుండా వారిని గుండెల్లో పెట్టుకుంటారు. భావానికి, భావోద్వేగానికి భాషతో సంబంధం లేదు.. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు రుజువైంది. ఇతర భాషలకు చెందిన నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అజిత్‌, సూర్య, విజయ్‌, విశాల్‌, విక్రమ్‌, ధనుష్‌ తదితరుల్ని తెలుగు వారు ఎంతగానో ఆదరించారు. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ వీరికి మంచి మార్కెట్‌ ఏర్పడింది. దీంతో వీరి చిత్రాల్ని తెలుగులోనూ డబ్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు వారిని పలకరిస్తున్న ఇతర భాషా నటుల సంఖ్య ఎక్కువైంది. వారిని మనవారు కూడా ఆదరిస్తున్నారు. ఆ జాబితాలో కొందర్ని చూద్దాం..

అమితాబ్‌ బచ్చన్‌

డు పదుల వయసులోనూ జోరుగా సినిమాల్లో నటిస్తున్నారు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఆయన కేవలం హిందీలోనే కాకుండా పలు దక్షిణాది సినిమాల్లో నటించారు. ‘అమృతవర్షం’ (2005), ‘మనం’ (2014) చిత్రాల్లో అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఇటీవల వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవిలో స్ఫూర్తి నింపే గురువు గోసాయి వెంకన్నగా హుందా పాత్రలో ఆకట్టుకున్నారు. త్వరలో ఎస్‌జే సూర్య నటిస్తున్న చిత్రంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. 

మోహన్‌లాల్‌

న్నబిడ్డ కన్నా నిజాయతీకి, న్యాయానికి ఓటు వేసే వ్యక్తి ఆయన. రక్త సంబంధాల్ని కాదనుకుని ముందుకు సాగే వ్యక్తిగా మలయళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన పాత్ర సత్యం. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్‌’లోని సత్యం పాత్రలో ఆయన నటనకు తెలుగు వారు ఫిదా అయ్యారు. టాలీవుడ్‌లో నేరుగా ఆయన నటించిన చిత్రమిది. మోహన్‌లాల్‌ నటించిన ‘మన్యంపులి’, ‘మనమంతా’ చిత్రాలకు కూడా మంచి స్పందన లభించింది. సూర్యతో కలిసి ఆయన నటించిన ‘బందోబస్త్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

దుల్కర్‌ సల్మాన్‌

లయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నేరుగా నటించిన సినిమా ‘మహానటి’. అలనాటి తార సావిత్రి భర్త జెమిని గణేశన్‌ పాత్రను ఆయన పోషించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దుల్కర్‌ నటనకు తెలుగు వారు మంచి మార్కులు వేశారు. ఆయన నటించిన మలయాళ చిత్రాలు ‘ఓకే బంగారం’, ‘హేయ్‌ పిల్లగాడా’, ‘అందమైన లోకం’, ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’ తదితర టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఉన్ని ముకుందన్‌

‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో మోహన్‌లాల్‌ కుమారుడిగా నటించారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌. ఈ సినిమాతో ఆయన తెలుగు వారికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘భాగమతి’లో అనుష్క ప్రియుడిగా నటించి మెప్పించారు. త్వరలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా ‘మామాంగం’ తెలుగులోనూ విడుదల కాబోతోంది.

సుదీప్‌

‘రక్తచరిత్ర 1’, ‘రక్తచరిత్ర 2’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కన్నడ స్టార్‌ సుదీప్‌కు ‘ఈగ’తో మంచి గుర్తింపు లభించింది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో అస్లామ్‌ ఖాన్‌గా కనిపించి, మెప్పించారు. ఇటీవల వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో ‘అవుకు రాజు’గా అలరించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే అసూయ కలిగిన వ్యక్తిగా చక్కగా నటించారు. అదే సమయంలో ఆంగ్లేయులపై చేసే పోరాటంలో నరసింహారెడ్డికి సహకరించడం ఆకట్టుకుంది. సుదీప్‌ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకున్న కన్నడ నిర్మాతలు ఆయన ‘పహిల్వాన్‌’ సినిమాను తెలుగులో కూడా ఇటీవల విడుదల చేశారు.

అక్షయ్‌ కుమార్‌

బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు అక్షయ్‌ కుమార్‌. హిందీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన తొలిసారి దక్షిణాదిలో నటించిన సినిమా ‘2.ఓ’. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా కనిపించారు. ‘పక్షిరాజు’గా బలమైన పాత్రలో అందరి ప్రశంసలు పొందారు. ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

విజయ్‌ సేతుపతి

చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ ఆరంభించి ఇప్పుడు స్టారయ్యారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. 2012లో ‘సుందరిపాండియన్‌’ సినిమాకు గానూ ఉత్తమ విలన్‌గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు.  ‘పిజ్జా’ (2012) చిత్రంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. అనువాద చిత్రంగా తెలుగులో విడుదల కాగా, ఇక్కడా ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత విజయ్‌ వరుస సినిమాలు, హిట్లతో బిజీ అయ్యారు. ఆయన తెలుగులో నేరుగా చేసిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులో పాండిరాజాగా ఆయన నటన మెప్పించింది. చిరంజీవి అల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సినిమా ‘ఉప్పెన’. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మమ్ముట్టి

ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘స్వాతికిరణం’ (1992)లో కనిపించారు మలయాళ స్టార్‌ మమ్ముట్టి. దీని తర్వాత ఆయన ‘సూర్య పుత్రులు’ (1997)లో పోలీసు అధికారిగా సందడి చేశారు. చాలా ఏళ్ల తర్వాత మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌ను పలకరించారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. దీంతో ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటించిన ‘మామాంగం’ను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు.

అధర్వ మురళి

మిళ నటుడు అధర్వ మురళి తెలుగులో నటించిన తొలి సినిమా ‘గద్దలకొండ గణేష్‌’. ఇందులో దర్శకుడిగా ఎదగాలనే తపన ఉన్న యువకుడిగా ఆయన కనిపించి, మెప్పించారు. ఇప్పటికే అధర్వ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యాయి.

సంజయ్‌ దత్‌

బాలీవుడ్‌లో అగ్ర నటుడిగా రాణిస్తున్నారు సంజయ్‌ దత్‌. ప్రస్తుతం ఆయన ‘కేజీఎఫ్‌ 2’లో నటిస్తున్నారు. సూపర్‌హిట్‌ ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్యవర్థన్‌ తమ్ముడు అధీర పాత్రను తొలి భాగంలో చూపించలేదు. దీంతో ఈ పాత్రను సంజయ్‌దత్‌ చేస్తుండటంతో అంచనాలు పెరిగాయి. కన్నడ స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. సంజయ్‌ గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

అజయ్‌ దేవగణ్‌

ఎస్.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం తెలుగులో నటిస్తున్న బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ ప్రత్యేక పాత్రలో సందడి చేయబోతున్నారు. నిజానికి ఈ పాత్ర నిడివి తక్కువ కావడంతో అజయ్‌ తొలుత నటించేందుకు సమ్మతించలేదు. కానీ రాజమౌళి కథ చెప్పిన విధానం తనలో నటించాలనే ఆసక్తిని పెంచిందని అజయ్‌ ఓ సందర్భంలో అన్నారు. అంతేకాదు తమిళ స్టార్‌ అజిత్‌ 60వ సినిమాలోనూ అజయ్‌ నటించనున్నట్లు సమాచారం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

 

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.