close

తాజా వార్తలు

అట్లీ.. నిజమైన ప్రేమకు అర్థం తెలిపాడు!

రీల్‌పైనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ..

‘ప్రేమ విఫలం తర్వాత కూడా జీవితం ఉంటుంది.. ప్రేమలో ఓడిపోయిన తర్వాత కూడా ప్రేమ ఉంటుంది..’ అంటూ యువతను ఎంతో ప్రభావితం చేసిన దర్శకుడు అట్లీ. తొలి సినిమా ‘రాజా రాణి’తోనే చిత్ర పరిశ్రమలో తనదైన మార్క్‌ వేశారు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఒక్కో చిత్రం ఒక్కో మైలురాయిగా నిలిచింది. అట్లీ టేకింగ్‌ ఆయన్ను స్టార్‌ దర్శకుడ్ని చేయడమే కాదు.. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.  బాక్సాఫీసు వద్ద వసూళ్లు గ్యారెంటీ.. అనే ముద్ర పడేలా చేసింది. అట్లీ తీసిన నాలుగో సినిమా ‘విజిల్‌’ దీపావళి సందర్భంగా అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

శంకర్‌ శిష్యుడు

ప్రముఖ దర్శకుడు శంకర్‌ శిష్యుడు అట్లీ. 2010లో ‘రోబో’, 2012లో ‘నన్బన్‌(స్నేహితుడు)’ సినిమాల కోసం ఆయన దగ్గర పనిచేశారు. ఆ తర్వాత 2013లో నయనతార, జై, ఆర్య, నజ్రియా నజీమ్ ప్రధాన తారాగణంగా వచ్చిన ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.

ప్రేమించిన అమ్మాయి ఈ లోకం నుంచి వెళ్లిపోతే, సర్వం కోల్పోయినట్లా?.. ఇష్టపడ్డ అబ్బాయి దూరమైతే, జీవితం ముగిసినట్లా?.. కానే కాదని ‘రాజా రాణి’తో వెండితెరపై అద్భుతంగా చూపించిన దర్శకుడు అట్లీ. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయిత విభాగంలో తమిళనాడు రాష్ట్ర అవార్డు, ఉత్తమ దర్శకుడు (పరిచయం) విభాగంలో ఎడిసన్‌ అవార్డు దక్కాయి.

విజయ్‌తో కాంబినేషన్‌ ‘అదిరింది’

ట్లీ-విజయ్‌ ‘తెరి’ సినిమా కోసం తొలిసారి కలిసి పనిచేశారు. ఇందులో విజయ్‌ పోలీసు అధికారిగా మెప్పించారు. అమ్మ, భార్యను కోల్పోయి.. భార్య కోరిక ప్రకారం అన్నీ వదిలేసి కుమార్తెతో జీవించే వ్యక్తిగా ఆకట్టుకున్నారు. ఇందులో ఓ తండ్రీ కుమార్తె మధ్య బంధాన్ని ఇందులో చక్కగా చూపించారు అట్లీ. ఇందులో సమంత, అమీ జాక్సన్‌ కథానాయికలు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా సైమా, ఐఫా అవార్డులు అందుకున్నారు అట్లీ.

రూ.5కే వైద్యం అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మెర్సల్‌’(అదిరింది). పేదలకు ఉచిత వైద్యం ఎంత ముఖ్యం, సరైన చికిత్స కోసం గ్రామాల్లోని ప్రజలు పడుతున్న కష్టాలు తదితర విషయాన్ని ఈ సినిమాలో ప్రభావవంతగా చూపించారు. విజయ్‌ త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ ఫేవరెట్‌ డైరెక్టర్‌, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో అట్లీ విజయ, సైమా అవార్డులు గెలుచుకున్నారు. అట్లీ-విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్‌హిట్‌ కావడంతో వీరి కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేసిన మూడో సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను కూడా సందేశాత్మకంగా రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బలమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తీసినట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఎలా అలరించనుందో చూడాలి.

షారుక్‌తో..

షారుక్‌ ఖాన్‌ నటించనున్న కొత్త సినిమాకు అట్లీ దర్శకత్వం వహించనున్నారట. దీన్ని రెడ్‌ చిల్లీస్‌ ప్రొడక్షన్‌ పతాకంపై షారుక్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకుగానూ షారుక్‌.. అట్లీకి రూ.30 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు ‘విజిల్‌’కు అట్లీ రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్‌లో కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.

స్పెషల్‌ ప్రపోజల్‌..

ట్లీ తీసిన అన్నీ సినిమాల్లోనూ బలమైన ప్రేమకథలు ఉంటాయి. రీల్‌పైనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ ఆయనది బలమైన ప్రేమే. 2014లో ఆయన నటి ప్రియను ప్రేమ  వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ కథ ఓసారి మీడియాతో పంచుకున్నారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ప్రియకు నటన, సంగీతం, డ్యాన్స్‌పై ఆసక్తి ఉండేదట. దీంతో కొన్ని లఘు చిత్రాలు, సీరియల్స్‌లో నటించారు. ‘కన కానుమ్‌ కాలనగల్‌’ ఆమెకు గుర్తింపు తెచ్చిన షో. ఆ తర్వాత ‘సింగం’తోపాటు పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇదే సమయంలో అట్లీ ‘రాజా రాణి’ సినిమా కథ రాస్తున్నారు. తన ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికలో పడ్డారు. ఈ తరుణంలో ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా అట్లీ, ప్రియకు పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం కావడంతో త్వరగానే మంచి స్నేహితులయ్యారు. ‘రాజా రాణి’ సినిమా సమయంలో అట్లీకి ప్రియ సపోర్ట్‌గా ఉన్నారట.

సినిమా హిట్‌ తర్వాత విజయోత్సవ వేడుకను నిర్వహించారు. దీనికి ప్రియతోపాటు పలువురు హాజరయ్యారు. ఈ సమయంలో.. ‘నాకు పెళ్లి కుమారుడ్ని చూస్తున్నారు’ అని అట్లీతో ప్రియ చెప్పారు. వెంటనే ఆయన ‘మీ తల్లిదండ్రులకు నా జాతకాలు ఎందుకు చూపించకూడదు’ అని నవ్వుతూ అన్నారట. ఆయన జోక్‌ చేయడంతో అక్కడి వారంతా నవ్వారట. ప్రియ మౌనంగా ఇంటికి వెళ్లిపోయారు. అట్లీకి ఫోన్‌ చేసి.. ‘ఎందుకు అలా మాట్లాడావు’ అని అడిగారు. ‘నా మనసుకు అనిపించింది చెప్పా. నీకు ఇష్టం ఉంటే మీ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడతా’ అని అన్నారట. అలా వీరి ప్రపోజల్‌ విచిత్రంగా జరిగింది. అట్లీ వ్యక్తిత్వం నచ్చి ప్రియ తల్లిదండ్రులు కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో 2014 నవంబరు 9న వీరి వివాహం జరిగింది.

తను నా ఫీలింగ్స్‌ తెలుసుకోలేకపోయింది

ప్రియ గురించి ఓ సారి అట్లీ మాట్లాడుతూ.. ‘ప్రియ అంటే నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉందని నటుడు శివకార్తికేయన్‌తోపాటు నా స్నేహితులకు కూడా తెలుసు. కానీ ప్రపోజల్‌కు ముందు ప్రియ మాత్రం నా ఫీలింగ్స్‌ తెలుసుకోలేకపోయింది’ (నవ్వుతూ) అన్నారు. ‘అట్లీ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. అదే తనలోని అతి పెద్ద క్వాలిటీ’ అని ఓ సందర్భంలో ప్రియ చెప్పారు. అట్లీ, ప్రియ జోడీపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. వీరి జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదని కూడా అన్నారు. కానీ ప్రియ, అట్లీ ఒకరికొకరై.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జంటను, వీరి మధ్య ప్రేమను ప్రశంసించిన వారు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో నిజమైన ప్రేమ గురించి అట్లీని మీడియా ప్రశ్నించగా.. ‘నేడు ప్రేమకు అర్థం మారిపోయింది. ఇప్పటి జంట అర్థం చేసుకుని, సర్దుకుని ముందుకు సాగడం లేదు. నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తే మన అవసరాల కన్నా ముందు.. వారికి ఏం కావాలో చూస్తాం. అది నేటి ప్రేమకథల్లో, యువతలో కనిపించడం లేదు. నా ప్రకారం.. ప్రేమ అనేది మరింత నిస్వార్థంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. అట్లీతో దిగిన ఫొటోలను ప్రియ సోషల్‌మీడియా తరచూ షేర్‌ చేస్తుంటారు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.