close

తాజా వార్తలు

గెలుపు పొందె వరకూ..అలుపు లేదు తనకు!

పట్టుదల, పోరాటతత్వం, సంకల్ప బలం.. ఇవన్నీ కలబోతే విరాట్‌ కోహ్లీ. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అతడి అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలు చూసి క్రికెట్ ప్రపంచమంతా అబ్బురపడుతోంది. జట్టుకు అతడే బలం.. బలహీనత అనే రీతిలో చెలరేగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అదరగొట్టే ఇలాంటి ఆటగాడిని ఎన్నడూ చూడలేదంటూ మహామహులంతా విరాట్‌ను కీర్తిస్తున్నారు. మంచినీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు బాదడం అతడికే చెల్లుతుంది. అతడు క్రీజులో నిలబడితే రికార్డుల మోతే. కఠిన పరిస్థితుల్లో జట్టు బాధ్యతను భుజాన వేసుకొని టీమ్‌ఇండియాకు ఎన్నో అపూర్వ విజయాలు అందించాడు. విజయంతో తప్ప రాజీపడని పోరాట యోధుడు కోహ్లీ జన్మదినం నేడే..

అంకిత భావానికి నిదర్శనం!
విరాట్ తండ్రి ప్రేమ్‌కోహ్లీ చిన్నతనంలోనే విరాట్ సామర్థ్యాన్ని గమనించి క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. విరాట్ గొప్ప క్రికెటర్ కావాలని ప్రేమ్‌కోహ్లీ ఎంతో ప్రోత్సహించారు. ఆది నుంచే కఠోర శ్రమ చేస్తున్న విరాట్ 2002లో దిల్లీ అండర్‌-15 జట్టుకు ఎంపికయ్యాడు. పాల్గొన్న తొలి ట్రోఫీలోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాతి ఏడాదే జట్టుకు నాయకుడు అయ్యాడు. కొద్దికాలంలోనే భారత్‌ అండర్‌-19 జట్టులో చోటు సంపాదించాడు. 2006 ఇంగ్లాండ్‌ పర్యటనలో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ కోహ్లీ అదరగొట్టాడు. 

2006 డిసెంబర్‌లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌ విరాట్‌కు ఎప్పటికే జ్ఞాపకమే.  తండ్రి మరణించాడని తెలిసినా.. జట్టు కోసం క్రీజులో నిలబడి విలువైన 90 పరుగులు చేశాడు. ఔటైన అనంతరం నేరుగా అంత్యక్రియల దగ్గరికి వెళ్లాడు. క్రికెట్‌ పట్ల అతడి అంకిత భావానికి నిదర్శనమిది. తన తండ్రి కలను సాకారం చేయాలని ఆ తర్వాతి రోజు నుంచి విరాట్‌ మరింత కసిగా ఆడటం మొదలుపెట్టాడు. మలేషియాలో జరిగిన 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ భారత జట్టుకు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. పరుగుల వరద పారిస్తూ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. పరుగులే కాదు.. నాయకుడిగా సత్తా చాటుతానని క్రికెట్‌ ప్రపంచానికి సంకేతాలు పంపాడు. ఈ యువ మెగాటోర్నీలో వెస్టిండీస్‌పై బాదిన అతడి శతకం ‘ఇన్నింగ్స్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా వర్ణిస్తారు. 

మొదలైంది ఈడెన్‌లోనే:
అండర్‌-19 ప్రపంచకప్‌ను దేశానికి అందించిన కోహ్లీకి కొద్ది కాలంలోనే టీమ్‌ఇండియాలో చోటు దక్కింది. సచిన్‌ తెందుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్ గాయమవ్వడంతో అవకాశం లభించింది. 2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో తన అంతర్జాతీయ క్రికెట్‌ను కోహ్లీ మొదలుపెట్టాడు. సిరీసులకు ఎంపికవుతున్నా ఆటగాళ్లకు గాయమైనప్పుడు మాత్రమే అతడికి అవకాశాలు వచ్చేవి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. 2009లో స్వదేశంలో జరిగిన శ్రీలంక సిరీస్‌లో యువరాజ్‌కు గాయమవ్వడంతో విరాట్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకంతో చెలరేగాడు. గంభీర్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈడెన్‌లో మొదలైన తన శతకాల జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మంచి నీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు బాదుతూ రికార్డుల రారాజు అయ్యాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 26 సెంచరీలు బాదాడు. అన్ని ఫార్మాట్లలో పరుగుల సునామీ సృష్టిస్తూ పరుగుల యంత్రంగా పేరుగాంచాడు. 

కోహ్లీ వేదన
నతి కాలంలోనే కోహ్లీ జట్టుకు వెన్నముకగా మారాడు. జట్టుకు బలం.. బలహీనత రెండూ అతడే అయ్యాడు. 2015 ప్రపంచకప్‌లో అతడు ఆశించినరీతిలో రాణించకపోవడం టీమ్‌ఇండియాకు ప్రతికూలాంశంగా మారింది. ఆ తర్వాత తన బ్యాటింగ్‌ లోపాలను సవరించుకున్నాడు. కఠోర సాధన చేశాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ సాధించడానికి బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రతి విజయానికి కోహ్లీయే కారణమంటే అతియోశక్తి కాదు. 5 మ్యాచుల్లో 136.5 సగటుతో 273 పరుగులు చేశాడు. 146.77 స్ట్రైక్‌రేట్‌. దీనిలో 3 అర్ధశతకాలు, 3 నాటౌట్‌లు. కోహ్లీ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు 89 (ధోనీ). ఈ గణాంకాలను చూస్తే సరిపోతుంది భారత విజయంలో కోహ్లీ పాత్ర చాటి చెప్పడానికీ. సొంత అభిమానుల మధ్య పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడడానికి కోహ్లీ ఎంతో కృషి చేశాడు. కానీ, సెమీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో టీమ్‌ఇండియా పరాజయాన్ని చవిచూసింది. ఓటమి అనంతరం కోహ్లీ వేదనను చూసి ప్రతి అభిమాని మనస్సు బరువెక్కింది. శక్తిని మించి పోరాడినా జట్టును గెలిపించలేకపోయాననే నిరాశ నిస్పృహలు అతడి ముఖంలో కనిపించాయి. నేల మీదికి కూలబడిపోతున్న కోహ్లీని నెహ్రా ఓదారుస్తున్న క్షణాలు.. దేశంలోని ప్రతి క్రికెట్ అభిమానిని కంటతడి పెట్టించాయి. 

ప్రత్యర్థులకు సింహస్వప్నమైన అతడి ఆటను ఎంత వర్ణించినా తక్కువే. ఛేదనలో అందరూ తడబడుతుంటే కోహ్లీ మాత్రం ప్రత్యర్థులను చిత్తుచేస్తూ పరుగుల ప్రవాహం సృష్టిస్తాడు. అందుకే అతడిని ప్రపంచ అత్యుత్తమ ఛేదకుడిగా అభివర్ణిస్తారు. మైదానంలో ప్రత్యర్థులు కవ్విస్తే నష్టపోయేదీ ప్రత్యర్థులే అన్న రీతిలో చెలరేగిపోతాడు. కోహ్లీపేరు కెప్టెన్‌గా ప్రచారంలోకి వచ్చినప్పుడు అందరిలోనూ ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అప్పటిదాకా మిస్టర్ కూల్‌ ధోనీ స్థానంలో దూకుడుగా ఉండే కోహ్లీని ఊహించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కానీ, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అత్యుత్తమ సారథుల్లో మేటిగా విరాట్ నిలిచాడు. తన దూకుడును సానుకూలంగా ఉపయోగిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. ఎన్నో చారిత్రక విజయాలను అందుకుంటున్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ సాధించిన రికార్డులకు కొదవలేదు. అన్ని ఫార్మాట్లలోనూ అసాధారణ రీతిలో చెలరేగుతూ సచిన్ రికార్డులను అధిగమించే దిశగా దూసుకెళ్తున్నాడు. మరికొన్ని రోజుల్లో క్రికెట్‌ దేవుడు 100 శతకాల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం ఖాయమని భావిస్తున్నారంతా!!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.