close

తాజా వార్తలు

ఇన్‌స్టాలో రాణిస్తున్నారు

ఇన్‌స్టాగ్రామ్‌... ఫొటోలు పంచుకోవడానికి...  ప్రముఖుల గురించి తెలుసుకోవానికి లాగిన్‌ అవుతాం. ఈ వనితలు మాత్రం... ఇన్‌స్టా ద్వారా రకరకాల అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యం,  మానసిక సమస్యలు, ఫ్యాషన్‌ వంటివి చర్చిస్తూ... సలహాలు అందిస్తున్నారు.

ఆలోచనలు అదుపుచేసేలా...

చేసిందే మళ్లీ చేస్తాం... ఆలోచించిందే మళ్లీ మళ్లీ ఆలోచిస్తాం. ఎప్పుడూ పరధ్యానమే. ఇవి అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌(ఓసీడీ) లక్షణాలు. ఇది మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. పదమూడేళ్ల వయసులోనే ఈ సమస్యతో సతమతమయ్యేది కాజల్‌ గుప్తా. వైద్యులను సంప్రదిస్తే... నిత్యం ఆమె వెంట ఒక డైరీ ఉంచుకోమని సలహా ఇచ్చారు. తనకు వచ్చే ప్రతికూల ఆలోచనలన్నింటినీ అందులో రాసుకోమని చెప్పేవారు. అది కాజల్‌కి కష్టంగా అనిపించేది. ఎప్పుడూ పుస్తకాన్ని వెంట తీసుకెళ్లలేకపోయేది. వీటన్నింటినీ ట్రాక్‌ చేసేలా ఏదైనా సాంకేతికతను రూపొందించాలని నిర్ణయించుకుంది.

ప్రణాళికతో మార్పు: కాజల్‌కి ముందు నుంచే కోడింగ్‌, ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌ మీద ఆసక్తి ఎక్కువ. భవిష్యత్తులో వీటిపై పట్టు సాధించాలని అనుకునేది. ప్రతిఒక్కరూ ఫోన్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి... దానికి అనుసంధానించేలా ‘లిబరేట్‌: మై ఓసీడీ ఫైటర్‌’ పేరుతో ఓ యాప్‌, ఇన్‌స్టా పేజీని మొదలుపెట్టింది. దేశంలో ఓసీడీ ఉన్న వారికి ఆన్‌లైన్‌ ద్వారా సాయం చేస్తోన్న మొదటి యాప్‌ ఇదే కావడం విశేషం. ఈ సమస్యతో బాధపడేవారు తమ ఆలోచనల్ని నియంత్రించుకోవడానికి కష్టపడతారు. దీని గురించి చాలా మందికి అవగాహనా ఉండదు. అలాంటివారంతా తమ సమస్యల్ని ఇందులో పంచుకోవచ్చు. పరిష్కారంగా కొన్ని రకాల వ్యాయామాల్ని సూచిస్తుంది కాజల్‌, ఆమె బృందం. మానసికంగా మెరుగవడానికి కొన్ని ప్రణాళికలు రూపొందించిందామె. ఈ రెండింటి ఆధారంగా వైద్యులకు ప్రతివారం వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె కొందరు వైద్యుల సహాయమూ తీసుకుంటోంది. ప్రస్తుతం దీన్ని మరింత అధునాతనంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ‘కొంత మంది ఆర్థిక స్థోమత లేక వైద్యులను సంప్రదించలేరు. అలాంటి వారికి మా ఇన్‌స్టా పేజీ, యాప్‌ ఉపయోగపడతాయని’ని చెబుతుంది పదహారేళ్ల కాజల్‌.

పీసీఓఎస్‌పై సలహాలిస్తూ...

ఇద్దరూ ‘పీసీఓఎస్‌’ బారిన పడటంతో రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు. తమలాంటి మహిళలు ఎంతోమంది ఉంటారని అర్థం చేసుకున్న వీళ్లు బాగా ఆలోచించి ఇన్‌స్టా పేజీ ద్వారా ఆ సమస్యపై అవగాహన కల్పిస్తున్నారు. సలహాలూ అందిస్తున్నారు. వాళ్లే కొచ్చిన్‌కు చెందిన నమ్రతాజార్జ్‌, థెరిస్సా బబాన్‌.

చదువైపోయాక నమ్రత, థెరిస్సా బెంగళూరులోని ఓ సంస్థలో ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా ఇద్దరూ ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఎదుర్కొన్నారు. చివరకు వాటన్నింటికీ కారణం పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) అని వైద్యులు తేల్చారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే దీనిపై అవగాహన కల్పించాలనుకున్నారు. ఇందుకు సోషల్‌మీడియాని వేదికగా ఎంచుకున్నారు. అంతకన్నా ముందు ఈ సమస్యపై తమదైన అధ్యయనం చేశారు. ఎందరో వైద్యులతో మాట్లాడారు. చివరకు ‘టు బ్రోక్‌ గాళ్స్‌ విత్‌ పీసీఓఎస్‌’ పేరుతో పేజీని ప్రారంభించారు. మొదట్లో స్నేహితులు, పరిచయస్తులకు దీన్ని షేర్‌ చేశారు. ఏడాదిలోపే ఈ పేజీ చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

సంకేతాలు గుర్తించేలా... మహిళల్లో అకస్మాత్తుగా కనిపించే  సమస్య కాదిది అంటుంది నమ్రత. కొన్ని లక్షణాలను గమనిస్తే దీన్ని  మొదట్లోనే గుర్తించి, తగ్గించుకోవచ్చని చెబుతుందామె. ‘తరచూ నెలసరి ఆలస్యం కావడం, బరువు పెరగడం, తీవ్ర ఆందోళన, ఒత్తిడి, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు, మొటిమలు... ఇవన్నీ పీసీఓఎస్‌ సంకేతాలే’ అని చెబుతుందామె. వీటిని గమనించుకుని, వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే... అదుపులో ఉంచడం సులువంటారు ఈ స్నేహితులు.

పేజీలో ఏమేం ఉంటాయంటే... వీళ్లు ప్రారంభించిన పేజీలో సమస్యపై అవవగాహన మాత్రమే కాదు... తీసుకోవాల్సిన జాగ్రత్తలూ ఉంటాయి. ఇందులో ఎవరైనా తమ సమస్యను తెలియజేయొచ్చు. వాటికి ఈ స్నేహితులు వైద్యులతో మాట్లాడి సమాధానాలు ఇస్తారు. ‘నాకు యుక్తవయసు నుంచే పీసీఓఎస్‌ ఉంది. జీవితాంతం పీసీఓఎస్‌ ఉన్నా మందులు వాడుతూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. సంతానలేమి సమస్యా ఉండదు. ఇవన్నీ మేం మా పేజీ ద్వారా సూచిస్తున్నాం...’ అని చెబుతుంది థెరిస్సా.

ఫ్యాషన్‌పై అవగాహన కల్పిస్తూ...

కాలంలో ఎటువంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయి.. తక్కువ ధరలో నప్పేవాటిని ఎంచుకోవడం ఎలా.. ఇటువంటి సందేహాలు చాలామంది మహిళలకు సహజమే. తన బ్లాగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఐజీటీవీ ఛానెల్‌ ద్వారా వీటిపై అవగాహన కల్పిస్తోంది హైదరాబాద్‌కు చెందిన స్నేహ పోలాప్రగడ. ఆమె ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఎంబీఏ చదివింది. పీజీ చదివే సమయంలో ఆమె ప్రొఫెసర్‌ ఒకరు వార్తాపత్రికలకు వ్యాసాలు రాసేవారు. ఆమె వాటిని సమీక్షించేది. స్నేహ ప్రతిభను గుర్తించి బ్లాగ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన ప్రోత్సహించారు. దాంతో స్నేహ మొదట్లో ఆర్థిక అంశాలకు సంబంధించిన వాటిని రాయడానికి ఓ బ్లాగును ప్రారంభించింది. తరువాత జీవనశైలి, ఫ్యాషన్‌లపై అభిరుచి పెంచుకుంది. ‘ది వోగ్‌ డైరీస్‌’ పేరుతో ప్రయాణం, ఆహారం, జీవనశైలి, ఫ్యాషన్‌ రంగాలకు సంబంధించిన వాటిని వివరిస్తోంది. ఆమె ఎక్కువగా తెలుగు సంస్కృతీసంప్రదాయాలు, స్థానిక కళలపై దృష్టి పెడుతోంది. చేనేత వస్త్రాలకు ప్రాచూర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. స్నేహ కొన్నాళ్లుగా ఇన్‌స్టాలో ఐజీటీవీ ద్వారా ఫ్యాషన్‌, జీవనశైలి అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఎప్పుడు ఎలాంటి దుస్తులు ఎంచుకోవాలి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో ఏవి వేస్తే   స్టైలిష్‌గా కనిపిస్తారనే విషయాలను వివరిస్తుంది. స్నేహ కొన్ని దుస్తుల బ్రాండ్లతో అనుసంధానమై వాటికి సమీక్షలు రాస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు ఆదరణా ఎక్కువే. బ్లాగు నిర్వహణలో, దాని యాజమాన్యంలో ఆమె తన ఇంజినీరింగ్‌, ఎంబీఏ నైపుణ్యాలను ఉపయోగించుకుంటోందామె. ఇవే కాదు... బ్లాగ్‌ నిర్వహణపై వర్క్‌షాప్‌లు, తరగతులు నిర్వహించాలనుకుంటోంది స్నేహ.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.