close

తాజా వార్తలు

అందుకే ‘రంగమ్మత్త’ పాత్ర ఒప్పుకోలేదు!

‘నిజం’లో ఆ పాత్ర తప్పక చేయాల్సి వచ్చింది!

తన చూపుతో ఎన్ని కుర్ర హృదయాలను గిల్లిందో తీయగా గాయపడిన ఆ హృదయాలకే తెలుసు. తన నవ్వుతో ఎన్ని ప్రాణాలకు ప్రాణంగా మారిందో ఆ ప్రాణాలకే తెలుసు. ఏ రాశి వారికైనా ఈ రాశి నచ్చి తీరుతుంది. పన్నెండు రాశులకు లేని అందం ఈ ఒక్క రాశికే ఉంది. బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించి స్టార్‌ హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమే రాశి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరాదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..

మిమ్మల్ని రాశి.. మంత్ర.. విజయలక్ష్మి ఏమని పిలవాలి?
రాశి: విజ్జి అని పిలవాలి (నవ్వులు) 

మొదటి చిత్రం ఏంటి?
రాశి: గిరఫ్తార్‌(హిందీ) అమితాబ్‌బచ్చన్‌ సినిమాతో ఎంట్రీ. అప్పటికి సినిమాల్లో నటిస్తున్నానన్న సంగతి కూడా తెలియదు. అందులో ఒక సీన్‌లో నా తల్లిదండ్రులు చనిపోతారు. వేరే వాళ్లు ఎత్తుకుంటే నేను ఏడుపు ఆపలేదట. దీంతో మా అమ్మే స్వయంగా నటించాల్సి వచ్చింది. 

మీ సొంతూరు ఏది?
రాశి: నేనూ అన్నయ్య పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. నాన్నది కూడా అక్కడే. అమ్మది మాత్రం భీమవరం. మా తాతగారు  పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్‌ ఆర్టిస్ట్‌ సప్లయర్‌గా పనిచేసేవారు. నాన్న చిన్నప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించినా.. ఆ తర్వాత డ్యాన్సర్‌ అయ్యారు. నేను పుట్టిన తర్వాత నన్ను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేయాలని అనుకున్నారు. అలా నా కెరీర్‌ మొదలైంది. 

ఏం చదువుకున్నారు?
రాశి: నేను పదో తరగతి వరకూ స్కూల్‌కు వెళ్లా. హీరోయిన్‌ అయిన తర్వాత బీఏ ఇంగ్లిష్ లిటరేచర్‌ చేశా. 

హీరోయిన్‌గా మీ తొలి సినిమా ఏది?
రాశి: హిందీలో మిథున్‌ చక్రవర్తితో తొలిసారి కలిసి నటించా. ఆ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు. అందులో నేనూ ఒకదాన్ని. చిన్నప్పుడు ఆయనతో కలిసి చేశా. మా కుటుంబానికి చాలా దగ్గరవ్యక్తి. చాలా కూల్‌గా ఉండేవారు. 

భానుమతి, సావిత్రి మీ ఇంటికి వచ్చి ఆడుకునేవారట!
రాశి: వాళ్లంతా మా నాన్నమ్మకు స్నేహితులు. భానుమతమ్మ.. నన్నూ, మా అన్నయ్యనూ వాళ్లింటికి తీసుకెళ్లేవారు. వాహిని స్టూడియో దగ్గర మా ఒక షాప్‌ ఉండేదట. అందులో మా నాన్నమ్మ కూర్చొనేవారట. అప్పుడు ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ తదితర నటులంతా అక్కడకు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకోవడంతో అలా వారంతా మా నాన్నమ్మకు పరిచయం అయ్యారు. 

పెళ్లంటూ చేసుకుంటే హీరో వెంకటేశ్‌ను లేదా రాజీవ్‌గాంధీని చేసుకుంటానని చెప్పారట!
రాశి: (నవ్వులు) అప్పుడు నాకు ఆరేళ్లు. వెంకటేశ్‌గారి సినిమాల హవా నడుస్తోంది. అప్పట్లో ప్రివ్యూ షోలు వేసేవారు. నాయుడిగారి బ్యానర్‌లో తాత పనిచేసేవారు. దీంతో వాళ్ల సినిమాలకు మాకు పాస్‌లు దొరికేవి. వెంకటేశ్‌గారి సినిమాలు చూసి ఆయనంటే ఇష్టపడేదాన్ని. ‘ఎవరిని పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడిగితే, ‘వెంకటేశ్‌ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను’ అనేదాన్ని. ఆయనతో నటించే అవకాశం రాలేదు. కేవలం పాట చేశానంతే. కొన్నాళ్లు ఆ సీజన్‌ నడిచింది. ఆ తర్వాత రాజీవ్‌గాంధీగారిని చూసిన తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంటానని అనేదాన్ని!

హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు?
రాశి: దాదాపు 75కు పైగా సినిమాలు చేసి ఉంటా. 14ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. తెలుగులో నా మొదటి చిత్రం ‘శుభాకాంక్షలు’. అయితే, అంతకుముందే ‘బదిలీ’ అనే సినిమా చేశా. అందులో నేను సెకండ్‌ హీరోయిన్‌. పెద్దగా స్కోప్‌ ఉన్న పాత్ర కాదు. అందులో నా పేరు విజయ అనే వేశారు. ‘శుభాకాంక్షలు’ తీస్తున్నప్పుడు ‘ఇండస్ట్రీలో చాలా మంది విజయలు ఉన్నారు కదా! పేరుమారిస్తే బాగుంటుంది’ అని దర్శకుడు భీమినేని శ్రీనివాస్‌ అనడంతో ‘ఏదైనా మీరే పెట్టండి సర్‌. అదృష్టం కలిసి రావాలి’ అనడంతో ఆయనే ‘రాశి’ అని పెట్టారు. తమిళంలో ‘మంత్ర’ అని పేరు పెట్టారు.

ఏం టాలెంట్‌ చూసి మిమ్మల్ని హీరోయిన్‌గా చేద్దామని మీ తండ్రి అనుకున్నారు?
రాశి: ‘రావుగారి ఇల్లు’ చేస్తున్నప్పుడు నాకు అన్నీ బాగానే తెలుసు. నేను చేసిన పాత్రను ఇంకో అమ్మాయి చేయాల్సి ఉంది. అయితే, ఆమె ఎదుటి పన్ను ఊడిపోవడంతో డైలాగ్స్‌ సరిగా చెప్పలేకపోతోందని ఆ అవకాశం నాకు ఇచ్చారు. నేను కూడా బాగా చెప్పడంతో నా పాత్రను కొనసాగించారు. ఆ సినిమాకు డబ్బింగ్‌ కూడా నేనే చెప్పా. నాలో ఉన్న ఆ టాలెంట్‌ను గుర్తించి మా నాన్న నన్ను హీరోయిన్‌ను చేద్దామని అనుకున్నారు. 

14ఏళ్లకు హీరోయిన్‌గా అయిపోయారు. ఆ స్టార్‌డమ్‌ ఎలా అనిపించింది?
రాశి: ఆ వయసులో అవేవీ తెలియవు. చాలా సరదాగా ఉండటమే తెలుసు. నాతో షూటింగ్‌లకు అమ్మానాన్న కూడా వచ్చేవారు. బయట ఎంత క్రేజ్‌ ఉంటుందో కూడా తెలియదు. నాకు ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారో తెలియదు. సినిమా చూడటానికి థియేటర్‌కు వస్తున్నామని తెలిస్తే పూలు చల్లేవాళ్లు. నాకు చాలా సరదాగా అనిపించేది. అప్పట్లో నాకు మహిళా అభిమానులు ఎక్కువ.

బాలకృష్ణ సినిమాలో బాలనటిగా చేసిన మీరు.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా చేశారు. అప్పుడు ఆయన ఏమనేవారు?
రాశి: ‘బాలగోపాలం’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశా. అందులో కల్యాణ్‌రామ్‌ కూడా ఉంటారు. ఆయనను ఎలా చూసుకునేవారో.. నన్ను కూడా అంతే ఆప్యాయంగా చూసుకునేవారు. ఆ తర్వాత ‘క్రిష్ణబాబు’లో హీరోయిన్‌గా చేస్తుంటే, చాలా చక్కగా పలకరించేవారు. అప్పుడు ఎలా ఉన్నారో.. ఈ సినిమాకు అంతే ఫన్‌గా ఉన్నారు. 

హీరోయిన్లు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. మీరెందుకు చేసుకోరు?
రాశి: నా జీవితంలో 18వ పుట్టినరోజు చాలా విషాదకరమైనది. ఎందుకంటే, ఆ సమయంలో నేను ఒక తమిళ షూటింగ్‌ నిమిత్తం ఊటీలో ఉన్నా. సాధారణంగా ప్రతి పుట్టినరోజుకు రాత్రి 12గంటలకు మా నాన్న నిద్రలేపి విష్‌ చేస్తారు. కానీ, ఈసారి చేయలేదు. నాకేమో ఆందోళనగా అనిపించింది. అన్నయ్య అడిగితే నాన్న ఫోన్‌ చేయలేదన్న విషయం చెప్పా. ‘సాయంత్రం వెళ్లిపోతాం కదా! నేరుగా మాట్లాడవచ్చులే’ అన్నాడు. షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతుంటే.. ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నాన్న చేశారేమోననుకుని  నేనే ఫోన్‌ లిఫ్ట్‌ చేశా. డ్రైవర్‌ మాట్లాడుతూ.. ‘అన్నయ్యకు ఫోన్‌ ఇవ్వండి’ అన్నాడు. అన్నయ్య ఫోన్‌ మాట్లాడుతూ షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘నాన్న చనిపోయారు’ అని చెప్పారు. మానసికంగా ఒక్కసారిగా షాకయ్యా. అప్పటి నుంచి నేను పుట్టినరోజు వేడుకలు చేసుకోను. కుటుంబ సభ్యులు బలవంతం చేసి, అన్నీ ఏర్పాట్లు చేస్తే, ఏదో మమ అనిపిస్తా. నా జీవితంలో ఆయన లేని లోటు పూడ్చలేనిది. నాన్నతో అన్నీ పంచుకునేదాన్ని. అలాంటి వ్యక్తి నా జీవితంలో లేరని తెలిసిన తర్వాత ఎంతకష్టంగా అనిపించింది. ఆయన తర్వాత ఆ స్థానాన్ని అన్నయ్య తీసుకున్నారు. 

మీ తల్లి నుంచి మీకు ఎలాంటి సహకారం ఉండేది?
రాశి: నాన్న చనిపోయిన తర్వాత తను కూడా కుంగిపోతే, మేము ఏమైపోతామోనని ఆమె ధైర్యంగా ఉండేవారు. 

మీ తోటి హీరోయిన్లు అందరూ నటిస్తున్నారు. మీరెందుకు చేయటం లేదు?
రాశి: పెళ్లయిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరితోనూ టచ్‌లో లేను. అంతేకాకుండా, చిన్నప్పటి నుంచి నటిస్తూ ఉండటం వల్ల కొంత విరామం తీసుకుందామనుకున్నా. ఎక్కువ సమయం మా పాప రిథిమ కోసం కేటాయించాలనుకున్నా. దాంతో ఆఫర్లు వచ్చినా, సినిమాలు చేయలేదు. పెళ్లయిన తర్వాత రెండు మూడు సినిమాలు చేశానంతే.

పాప పుట్టినరోజుకు పవన్‌కల్యాణ్‌ను కలవాలనుకున్నారా?
రాశి: పుట్టినరోజు వేడుకకు ఆయనను పిలుద్దామని వెళ్లా. ‘గోకులంలో సీత’ తర్వాత ఆయనను ఎక్కువగా కలవలేదు. తెలిసిన మనిషే కదానని నేరుగా కలవడానికి వెళ్లిపోయా. అయితే, అప్పటికే చాలా మంది ఆయనను కలిసి వస్తుండటంతో అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలేమోననుకున్నా. చాలా సేపు వెయిట్‌ చేసిన తర్వాత ఆయన వ్యానిటీ వ్యాన్‌ నుంచి బయటకు వచ్చారు. ‘నువ్వు వెళ్లి రాశి వచ్చారని చెప్పు. అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని చెబితే, వెళ్లి మళ్లీ వద్దాం’ అని నా డ్రైవర్‌కు చెప్పా. నేను వచ్చానన్న విషయం తెలుసుకున్న ఆయన నన్ను రమ్మన్నారు. చాలా ఆప్యాయంగా స్వాగతం పలికారు. చాలా సేపు మాట్లాడుకున్నాం. ‘మీకు వీలైతే తప్పకుండా మా పాప పుట్టినరోజుకు రండి’ అని పిలిచా. ఆయన షూటింగ్‌ కోసం వేరే దేశం వెళ్లడంతో రాలేకపోయారు.

హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు ‘నిన్ను పెళ్లి చేసుకుంటా. లేకపోతే చచ్చిపోతా’ అని అన్న ఆ వ్యక్తి ఎవరు?
రాశి: ‘కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి’ షూటింగ్‌ సామర్లకోట జరుగుతోంది. ఒక పెద్ద ఇంట్లో ఉండేలా మాకు ఏర్పాట్లు చేశారు. అందరికీ అన్ని రూమ్‌లు ఇచ్చారు కానీ, ఒక గదిని మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. దర్శకుడు ఆ గది కావాలని అడిగితే, ఆ ఇంటి యజమాని అబ్బాయి మాత్రం దాన్ని ‘ఇవ్వను’ అని చెప్పాడు. అసలు ఆ గదిలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. బతిమిలాడగా, అరగంట మాత్రం ఇస్తానని చెప్పాడట. అతను బయటకు రాగానే సెట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఆ గదిలోకి వెళ్లి షాకయ్యారు. ఆ గదిలో మొత్తం నా ఫొటోలే ఉన్నాయట. అయితే, అన్నిరోజులు షూటింగ్‌ జరిగినా, ఒక్కసారి కూడా ఆ అబ్బాయి వచ్చి నన్ను కలవలేదు.

నువ్వు కోరుకుంటే ఎంతో మంది కోటీశ్వరులు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, అసోసియేట్‌ డైరెక్టర్‌ను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? 
రాశి: నేను ఏ సినిమా షూటింగ్‌ వెళ్లినా, ఒకళ్లిద్దరిని ఆట పట్టించడం అలవాటు. ఒక సినిమాకు మా ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్నారు. అప్పట్లో ఆయన చాలా కష్టపడేవారు. సరదాగా ఆటపట్టిద్దామని ‘మేడమ్‌ మీ గురించి ఒక మాట చెప్పారు. నేనే షాకైపోయా’ ఈ మాట ఆయనకు చెప్పమని నా అసిస్టెంట్‌కు చెప్పా. ఆమె వెళ్లి చెబితే, కనపడిన ప్రతిసారీ ‘మేడమ్‌ నా గురించి ఏం చెప్పారు’ అని అడుగుతూ ఉండేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇలాగే సాగింది. ‘మీ ఫోన్‌ నెంబరు ఇవ్వండి. ఫోన్‌ చేసి చెబుతా’ అని నెంబర్‌ తీసుకున్నా. ఆ తర్వాత ఫోన్‌ చేస్తే, ‘ప్రతి సినిమా యూనిట్‌లోనూ ఒకరిద్దరు తెలివైన అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉంటారు. అలా మిమ్మల్ని చూస్తే అనిపించింది. మీకు మంచి భవిష్యత్‌ ఉందని నా అసిస్టెంట్‌కు చెప్పా’ అని వివరించా. దాంతో అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్‌ అయ్యాం. వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం మొదలుపెట్టాం. అలా కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు నేను ఫోన్‌ చేసి ‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగేశా. ఆయన కూడా ‘సరే’ అన్నారు. అలా మా ఇద్దరి వివాహం జరిగింది. 

ఎందుకు ఆ నిర్ణ్రయం తీసుకోవాల్సి వచ్చింది?
రాశి: ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనిపించింది. ఎందుకంటే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో చిరంజీవిగారు హీరోగా సినిమా ఒకే చేశారు. నేను ప్రాజెక్టుపై సంతకం పెట్టి అడ్వాన్స్‌ కూడా తీసుకున్నా. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు ఆగిపోయిందో ఆ సినిమా మొదలు పెట్టలేదు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే, నా కెరీర్‌ ఇంకొన్నాళ్లు సాగేదేమో. అయితే, కెరీర్‌లో మంచి స్థానంలో ఉండగానే సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకున్నా. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. మా పెళ్లయి 15ఏళ్లు దాటింది. చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. త్వరలోనే ఓ పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం ఉంది. 

‘క్యారెక్టర్‌ బాగుంటుంది’ అని చెప్పి నమ్మించి ‘నిజం’ సినిమా విషయంలో మోసం చేశారని చాలా సార్లు చెప్పారు. ఎందుకలా జరిగింది?
రాశి: సాధారణంగా నేను ఎవరి ఆఫీస్‌లకు వెళ్లను. అలాంటిది తేజ పిలిచారని ఆయన ఆఫీస్‌కు వెళ్లా. ‘నిజం’ కథ చెప్పి మహేశ్‌బాబు హీరో అన్నారు. ‘గోపీ చంద్‌.. నువ్వు లవర్స్‌. మధ్యలో విలన్‌  వస్తాడు. మొత్తం మీదే లవర్‌స్టోరీ నడుస్తుంది’ అని చెప్పడంతో నేనూ ఒప్పుకొన్నా. షూటింగ్‌ వెళ్లిన తర్వాత ఫస్ట్‌సీన్‌ తీయగానే నాకు అర్థమైపోయింది. దీంతో సినిమా నుంచి తప్పుకొందామని అనుకున్నా. ఇదే విషయాన్ని మా పీఆర్వో బాబూరావుగారికి చెప్పా. ‘మేడమ్‌ మీరు ఇప్పటివరకూ ఏ సినిమా విషయంలో ఇలా చేయలేదు. సడెన్‌గా ఇలా చేస్తే, ఇండస్ట్రీలో బ్యాడ్‌ అవుతారు. ఒప్పుకొన్నారు కదా! ఈసారికి కానిచ్చేయండి’ అన్నారు. మా అన్నయ్య కూడా ‘పోనీలే చెయ్’ అన్నాడు. దీంతో ఒప్పుకోక తప్పలేదు. కానీ,  పాత్రకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరు చాలా బాగా చేశారంటే... మరికొందరు ‘ఎందుకు ఒప్పుకొన్నారు మేడమ్‌’ అన్నారు. నాగబాబుగారు ఫోన్‌ చేసి, ‘నీ పాత్ర నెగిటివ్‌గా ఉన్నా, నువ్వు కత్తిలా ఉన్నావ్‌’అంటూ మెచ్చుకున్నారు. 

ఇటీవల మీరు మాట్లాడుతూ.. ‘బోల్డ్‌ పాత్రలు చేయాలి’ అన్నారు. మీ ఉద్దేశం ఏంటి?
రాశి: ‘అత్తారింటికి దారేది’లో నదియా చేసిన పాత్రల్లాంటివి చేయాలి. ప్రస్తుతం రెండు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తున్నా.

హీరోయిన్‌గా మంచి స్థానంలో ఉండగా, ఐటమ్‌ సాంగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది?
రాశి: హీరోయిన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేయడం ఇప్పుడు కామన్‌. కానీ, అప్పుడు చేసేవారు కాదు. వెంకటేశ్‌గారి మీద ఇష్టంతో ‘ఓ మనాలీ.. ఓ మనాలీ..’ చేశా. రవితేజతో సినిమాలోమాత్రం మనీ, క్రేజ్‌ కోసమే చేశా. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా బాగానే ఉన్నాం.

మెగాస్టార్‌ సతీమణి పిలిచి ‘గోకులంలో సీత’లో హీరోయిన్‌ పాత్ర ఇచ్చారట! 
రాశి: అప్పుడు ఆమె చెన్నైలో ఉన్నారు. ‘శుభాకాంక్షలు’ చూసి నేను నచ్చడంతో నన్ను హీరోయిన్‌గా తీసుకోమన్నారు. పైగా, చిరంజీవిగారితో చిన్నప్పుడు నటించా. వారి కుటుంబంతో పరిచయం ఉంది. పిలిస్తే, చిరంజీవిగారు పిలిచారేమోననుకోని వెళ్లాం. వెస్ట్రన్‌ దుస్తుల్లో ఫొటో షూట్‌ చేసి ఒకే చేశారు. 

మీ మనసుకు నచ్చిన సినిమాలేంటి?
రాశి: చాలా ఉన్నాయి. ప్రేయసి రావే, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, గోకులంలో సీత ఇవంటే బాగా ఇష్టం. 

‘రంగస్థలం’లో రంగమ్మ అత్త పాత్రకు మిమ్మల్ని అడిగితే నో చెప్పారట!
రాశి: అవును! అది చాలా మంచి పాత్ర. కానీ, ఆ పాత్ర ప్రకారం మోకాళ్లపై వరకూ చీర కట్టుకుని ఉండాలి. ఆ లుక్‌ నాకు సరిపోదేమోనని అనిపించింది. ఆ సినిమా గురించి, నా పాత్ర గురించి చెప్పారు. నేనే ఒప్పుకోలేదు. 

ఎవరికైనా డబ్బింగ్‌ చెప్పారా?
రాశి: ‘లక్ష్మీ కల్యాణం’లో కాజల్‌కు చెప్పా. ‘కేక’లో హీరోయిన్‌కు చెప్పా. ‘మిర్చి’లో నదియా పాత్రకు కూడా నేనే వాయిస్‌ ఇచ్చా. ‘అత్తారింటికి దారేది’లో కూడా నదియాకు చెప్పా. అయితే ఫస్టాఫ్‌ అయిన తర్వాత నేను చెన్నై వెళ్లాల్సి రావడంతో సరిత చెప్పినట్లున్నారు. 

సౌందర్య, రోజా, రమ్యకృష్ణ, రంభ వీరిలో ఎవరితో బాగా క్లోజ్‌గా ఉండేవారు?
రాశి: సాందర్య. చాలాసార్లు కలిసేవాళ్లం. అప్పుడు నాకు పెళ్లి ఫిక్సయింది. సడెన్‌గా మా అన్నయ్య ఫోన్‌ చేసి ‘సౌందర్య చనిపోయారు’ అని చెప్పాడు. సరదాగా చెబుతున్నాడేమోనుకున్నా. ఆ తర్వాత నిజం తెలిసి చాలా బాధపడ్డా. ఆమె సంతాప సభకు వెళ్దామంటే ‘నిన్ను పెళ్లి కూతుర్ని చేయాలి. వెళ్లొద్దు’ అని అమ్మ చెప్పినా వినలేదు. వెళ్లి నివాళి అర్పించి వచ్చా. 

మీ ఆయనకు వార్నింగ్‌ ఇస్తారా?
రాశి: ఎప్పుడైనా  ఇంటికి రావడం ఆలస్యమైతే ‘ఇంటికి రాకు.. తలుపు తాళం వేస్తున్నా. కాలింగ్‌ బెల్‌ కనెక్షన్‌ కూడా తీసేశా. ఎక్కడ ఉంటావో నీ ఇష్టం’ అని కాస్త ఘాటుగా మాట్లాడేదాన్ని. అంతే త్వరగా వచ్చేసేవారు.

మీరు పనిచేసి దర్శకుల్లో ఎవరినైనా మర్చిపోమంటే ఎవరిని మర్చిపోతారు?
రాశి: తేజ (నవ్వులు). ఇక నేను ఎప్పటికీ మర్చిపోలేని దర్శకుడు కోడిరామకృష్ణ అంకుల్‌.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.