
తాజా వార్తలు
రెండు భాషల్లో హిట్ కొట్టిన కథ ఇది...
చుట్టూ పొలాలు, మధ్యలో అక్కడక్కడా ఇళ్లు, ఊరి మధ్యలో ఎప్పుడూ సందడిగా ఉండే చిన్న బజారు. బాగుంది కదా లొకేషన్. ఇలాంటి ఏరియాలోనే మన హీరో ఉంటాడు. తండ్రి వారసత్వంగా వచ్చిన ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. చిన్న ఊరు కదా... ఫొటోలు తీయమని వచ్చేవాళ్లు తక్కువే. ఆ షాపు పక్కనే ఓ ఫ్లెక్సీ షాపు పెట్టుకున్న రాజు అనే ఫ్రెండ్ ఉంటాడు. మన హీరోకి ఖాళీ దొరికితే రాజుతో ముచ్చట్లు పెడుతుంటాడు. హీరో అన్నాక హీరోయిన్ కూడా ఉండాలి కదా. అలాగే మన హీరోగారికీ ఓ దిల్ కా ధడ్కన్ ఉంది. పేరు సౌమ్య... ఆ అమ్మాయిదీ ఆ ఊరే. రోజూ ఫస్టాఫ్‌లో బిజినెస్... సెకండాఫ్ లవ్‌స్టోరీతో సాఫీగా సాగిపోతున్న హీరోగారి కథలో ఫస్ట్ ట్విస్ట్ టైమ్ వచ్చింది.
ఓ రోజు మధ్యాహ్నం హీరో షాపు ఎదురుగా ఏదో గొడవ జరుగుతుంటుంది. ఏంటా అని వెళ్లి చూస్తే... ఫ్లెక్సీ షాప్ రాజు అసిస్టెంట్ ఓ వ్యక్తితో గొడవపడుతుంటాడు. ఆపుదామని వెళ్లిన రాజుతో కూడా ఆ వ్యక్తి గొడవకు కొస్తాడు. దీంతో హీరో రంగంలోకి దిగుతాడు. కానీ, సీన్ రివర్స్ అవుతుంది. గొడవ అటుతిరిగి ఇటుతిరిగి మన హీరో మీద ఆ వ్యక్తి చేయి చేసుకుంటాడు. దీంతో మన హీరోకి ఎక్కడి లేని కోపం వస్తుంది. ఊరు మధ్యలో నా మీద ఒకడు చేయి చేసుకోవడమా అంటూ ‘దాన వీర శూర కర్ణ’లో దుర్యోధనుడి స్టైల్లో అవమానంగా ఫీల్ అవుతాడు. కొట్టింది ఎవరా అని ఆరాతీస్తే అదే ఊరుకు చెందిన వివేక్ అని తెలుసుకుంటాడు. దీంతో అతని మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు చెప్పులు వేసుకునేది లేదని ‘మంగమ్మ శపథం’ చేస్తాడు... కాదు కాదు ‘చెప్పుల శపథం’ చేస్తాడు.
శపథం మాటేమో కానీ, గొడవతో చిరాకులో ఉన్న హీరోకి మరో ఝలక్ తగులుతుంది. ఈ గొడవలు గట్రా నచ్చని హీరోయిన్... వేరొకరిని పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోతుంది. దీంతో మనోడు డీలాపడిపోతాడు. కానీ శపథం వీడడు. మరోవైపు వివేక్ కూడా దేశం విడిచి దుబాయి వెళ్లిపోతాడు. ‘ఇక మనం చేసేదేం లేదు... ఆ గొడవ మరిచిపో’ అని రాజు ఎంత చెప్పినా హీరో వినడు. ‘వివేక్ దుబాయి నుంచి వచ్చేంత వరకు ఆగుతా.. వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటా’ అని తెగేసి చెబుతాడు. అంతేనా దాని కోసం కుంగ్‌ఫూ కోర్సులో కూడా చేరతాడు.
ఇప్పుడు హీరో లైఫ్‌లో మూడో ట్విస్ట్ వస్తుంది. ఫొటో స్టూడియోకి వైశాఖి అనే ఓ అమ్మాయి వచ్చి ఫొటో తీయమంటుంది. ఓ మ్యాగజైన్ కోసం కవర్ ఫొటో కావాలని హీరోను అడుగుతుంది. అప్పటివరకు హీరోకి ఆ స్టైల్ ఫొటోగ్రఫీనే రాదు. కానీ ఎలాగోలా తీస్తాడు. ఫొటోలు బాగా రాకపోయేసరికి ఆ అమ్మాయితో చీవాట్లు తింటాడు. అది చూసిన హీరో వాళ్ల నాన్న సరైన శిక్షణ ఇస్తాడు. ఆ తర్వాత ‘ఒకే ఒక్కడు’ స్టైల్లో మన హీరో ఆ అమ్మాయి ఫొటోల్ని తీసి మ్యాగజైన్‌కు పంపిస్తాడు. అవి సెలక్ట్ అయ్యి... అమ్మాయికి మంచి పేరొస్తుంది. ఆ తర్వాత హీరో లైఫ్‌లో సెకండ్ లవ్ స్టోరీ స్టార్ట్.
ఇక పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ‘నేను వివేక్ సోదరిని’ అంటూ వైశాఖి బాంబు పేలుస్తుంది. దీంతో హీరో కోపం నషాలానికి ఎక్కుతుంది. కానీ వైశాఖి మీద ప్రేమతో వివాహానికి ఒప్పుకొంటాడు. ఈలోగా వివేక్ కూడా అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని దుబాయి నుంచి వచ్చేస్తాడు. ఇంకేముంది క్లైమాక్స్ స్టార్ట్. వివేక్ వచ్చిన విషయం తెలుసుకున్న హీరో ఓ సవాలు విసురుతాడు. తనతో కుస్తీతో గెలిచి నీ సత్తా నిరూపించుకోమంటాడు. భీకరపోరులో హీరో గెలిచి... విలన్ని హాస్పిటల్‌కి పంపిస్తాడు. ఆ తర్వాతి రోజు హాస్పిటల్‌కి వెళ్లి వివేక్ని పరామర్శిస్తాడు. చెల్లి వైశాఖిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒప్పిస్తాడు.
ఇంకేముంది... సీన్‌కి ఓ సైడ్‌లో కింద నుంచి పైకి ఎండ్ టైటిల్స్ పడతాయి. అదిరిపోయింది కదా కథ. ఇంతకీ హీరో పేరు చెప్పలేదు కదా. మన హీరో పేరు ‘మహేశ్’. కథ అదిరిపోయింది కదా.. ఈ కథతో మలయాళంలో మూడేళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అదే ‘మహేశింటే ప్రతీకారం’. ఆ తర్వాత గతేడాది తమిళంలోనూ తీసుకొచ్చారు. ఇప్పుడు త్వరలో తెలుగులోనూ రాబోతోంది. ‘కేరాఫ్ కంచరపాలెం’తో తక్కువ బడ్జెట్లో హిట్ కొట్టిన వెంకటేశ్ మహా మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇదివరకే దీనికి సంబంధించి వార్తలొచ్చాయి. వెంకటేశ్ ఎంచుకున్న కథ ఈ సినిమానే. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఇక్కడకు తీసుకొస్తున్నారని సమాచారం. ఇందులో సత్యదేవ్ ప్రధాన పాత్రధారిగా నటిస్తాడని సమాచారం. త్వరలోనే సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. మరిక్కడ మహేశ్ ప్రతీకారం ఏం చేస్తుందో చూడాలి.