close

తాజా వార్తలు

హాలీవుడ్‌ నుంచి వచ్చామండీ..!

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం మూస కథలు, ఫక్తు కమర్షియల్‌ సినిమాలన్న ముద్ర ఉండేది. అప్పుడప్పుడు కొన్నిచిత్రాలు వచ్చినా, అవి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయాయి కానీ, ఆ ట్రెండ్‌ను ఎవరూ కొనసాగించలేకపోయాయి. ఇక విలన్స్‌, అతిథి పాత్రలకు నటులు బాలీవుడ్‌ నుంచి దిగుమతి అయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కొత్త దర్శకులు సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. అగ్ర దర్శకులు వారికి దీటుగా కథలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో సినిమా స్థాయి, అందులో నటించేవారు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. సినిమాను బాలీవుడ్‌కు తీసుకెళ్లడం కోసం దర్శక-నిర్మాతలు అక్కడి నటులను తెలుగులో నటింపజేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా హాలీవుడ్‌ నటులను తీసుకుంటున్నారు. ఇటీవల ‘సైరా’లో కొందరు హాలీవుడ్‌ నటులు సందడి చేయగా..  త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో అలరించేందుకు మరికొందరు సిద్ధమయ్యారు. 

ఒలివియా మోరిస్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో జెన్నీఫర్‌ అనే పాత్రలో నటించనుందీ హాలీవుడ్‌ ముద్దుగుమ్మ. ఒలివియా నటి మాత్రమే కాదు ఓ మోడల్‌ కూడా. లండన్‌లో పుట్టిన ఒలివియా థియేటర్‌ ఆర్టిస్ట్‌. నటనపై ఉన్న ఇష్టంతో బుల్లి తెరపై సీరియల్స్, షోస్‌లో నటించింది. వాటిలో ‘7 ట్రైల్స్‌’ అనే ఓ టీవీ సిరీస్‌ ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. లండన్‌లోని ‘రాయల్‌ వెల్ష్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్రామా’లో మెళకువలు నేర్చుకుంటుంది. ఆమెకు సంగీతం, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. కేవలం బుల్లితెరపైనే నటించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెండితెరపై సందడి చేసే అవకాశం అందుకుంది. 


రే స్టీవెన్‌ సన్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథానాయకులతో తలపడే పాత్ర (స్కాట్‌)లో కనిపించనున్నాడు స్టీవెన్‌. 1964 మే 25న నార్త్‌ ఐర్లాండ్‌లో జన్మించాడు. 1998లో వచ్చిన ‘ది థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’ చిత్రంతో హాలీవుడ్‌ వెండితెరకు పరిచయమయ్యాడు. ‘ఔట్‌ పోస్ట్‌’, ‘పనిషర్‌: వార్‌ జోన్‌’, ‘బిగ్‌ గేమ్‌’, ‘కోల్డ్‌ స్కిన్‌’, ‘ఫైనల్‌ స్కోర్‌’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హాలీవుడ్‌ నటుడు దర్శకధీరుడి కంట్లో పడ్డాడు. చిత్రాల్లోకి రాకముందు 1993లోనే బుల్లి తెరపై ఓ  సీరియల్‌లో నటించాడు. ఇప్పటికీ కొన్ని టెలివిజన్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నాడు.


అలిసన్‌ డూడే

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ప్రతినాయిక పాత్ర (లేడీ స్కాట్‌)లో కనిపించబోతుంది అలిసన్‌. 1966లో నవంబరు 11న ఐర్లాండ్‌లో జన్మించింది. ఈమె నటి, మోడల్‌. 1985లో వచ్చిన ‘ఏ వ్యూ టు ఎ కిల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది. ‘ఏ ప్రేయర్‌ ఫర్‌ డైయింగ్‌’, ‘ది సీక్రెట్‌ గార్డెన్‌’, ‘డ్యుయల్‌ ఆఫ్‌ హార్ట్స్‌’, ‘డివిజన్‌ 19’ వంటి చిత్రాల్లోని తన నటనకు మంచి గుర్తింపు లభించింది. అలిసన్‌ వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా నటించింది.  అంతేకాదు రెండు డాక్యుమెంటరీలు చేసింది. 


మైఖేల్‌ మ్యాడిసన్‌

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంతో భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నాడు హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌. 1957లో సెప్టెంబరు 25న అమెరికాలో జన్మించాడు. ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, ఫొటోగ్రాఫర్‌. మ్యాడిసన్‌ పూర్తి స్థాయి నటుడిగా కనిపించిన ఆంగ్ల చిత్రం ‘థెల్మా అండ్‌ లూసీ’. 1991లో విడుదలైంది. అంతకంటే ముందు 1982లో ‘అగైన్ట్స్‌ ఆల్‌ హోప్‌’ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించాడు.  1990 వరకు అలాంటి పాత్రలకే పరిమితమయ్యాడు. అటు చిత్రాల్లో నటిస్తూనే టెలివిజన్‌ సిరీస్, మ్యూజిక్‌ ఆల్బమ్స్, పలు వీడియో గేమ్స్‌కు వాయిస్‌ అందించేవాడు. అన్ని విభాగాల్లో టాలెంట్‌ ఉన్న ఈ హాలీవుడ్‌ నటుడు  తెలుగు ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.


వీరే కాదు, గతంలో పలువురు హాలీవుడ్‌ నటులు భారతీయ సినిమాల్లో మెరిశారు. అక్షయ్‌కుమార్‌, కరీనాకపూర్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘కంబక్త్‌ ఇష్క్‌’ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ నటులు అలరించారు. సిల్వస్టర్‌ స్టాలోన్‌, బ్రాండన్‌ రౌత్‌, డెనిస్‌ రిచర్డ్స్‌, హోలీ వ్యాలెన్స్‌లు అతిథి పాత్రల్లో అలరించారు. 

‘గాంధీ’ పాత్రలో తనదైన నటనతో అలరించిన ఇంగ్లిష్‌ నటుడు బెన్‌ కింగ్‌స్లే. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించిన ‘తీన్‌పత్తి’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. 


అనురాగ్‌ బసు దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కైట్స్‌’. 2010లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇందులో హృతిక్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి బార్బరా మోరీ నటించడం విశేషం.

జానీ ట్రై నుగేన్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, డాంగ్‌ లీ అంటే మాత్రం తప్పకుండా గుర్తొస్తాడు. సూర్య కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్‌ సెన్స్‌’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు ఈ వియత్నాం నటుడు. దృష్టి వశీకరణంతో ఒకరిని ఒకరు చంపుకొనేలా చేసే సన్నివేశాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. 


అక్షయ్‌కుమార్‌ నటించిన ‘చాందిని చౌక్‌ టు చైనా’ చిత్రంలో పలువురు అమెరికన్‌, చైనీస్‌ స్టంట్‌ మాస్టర్లు యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేశారు. ఇలా పలువురు హాలీవుడ్‌ నటులు భారతీయ చిత్రాల్లో నటించి మెప్పించారు. మరి భవిష్యత్‌లో ఇంకెంతమంది నటిస్తారో చూడాలి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.