close

తాజా వార్తలు

అటవిడుపు

జంతుప్రపంచం పిలుస్తోంది

ఆకురాలిన వనాల్ని దీనంగా చూడొద్దు.. నిదురిస్తున్నట్టుగా ఉన్న అడవిలోని అందాలు ఆస్వాదించడానికి ఇదే మంచి సమయం.. ఎండుటాకుల సవ్వడి కొండచిలువ జాడను చూపుతుంది.. మండుటెండలో నీటికొలను పులిరాజును రప్పిస్తుంది.. పచ్చదనం కొరవడిన పరిసరాలు మచ్చల జింక సౌందర్యాన్ని కళ్లముందుంచుతాయి అందుకే శిశిరం వచ్చిందంటే.. జంతుప్రేమికులు ఆటవిడుపు కోసం అడవిబాట పడతారు. సఫారీలో వనవిహారం చేస్తారు. మీరూ జంతు ప్రపంచంలోని వింతలు, విశేషాలను ఆస్వాదించాలని భావిస్తున్నారా.. ఎందుకు ఆలస్యం..

దట్టమైన అడవిలో..
బారనవాపారా అభయారణ్యం, ఛత్తీస్‌గఢ్‌

అంచున మహానది పరుగులు.. మరో అంచున జోంక్‌ నది ఉరుకులు.. మధ్యలో పిల్లకాల్వల జోరు.. ఛత్తీస్‌గఢ్‌లోని బారనవాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వివరాలివి. అడవిలోకి వెళ్లే కొద్దీ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. బారులు తీరిన సాలవృక్షాలు, టేకు చెట్లు అడవి తల్లిని చల్లగా ఉంచుతాయి. ఈ నీడపట్టున కొమ్ములు తిరిగిన అడవి దున్నలు, కంగారు కంగారుగా దిక్కులు చూసే జింకలు, వీటన్నిటినీ ఉన్నఫళంగా ఉరికెత్తించే చిరుతలు కంటపడతాయి. అడుగులో అడుగేస్తూ.. ఠీవీగా ముందుకు సాగిపోయే పులులు అక్కడక్కడా దర్శనమిస్తాయి. వంద రకాలకు పైగా పక్షిజాతులను ఇక్కడ చూడొచ్చు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బారనవాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ వనంలో చిన్నచిన్న గ్రామాలెన్నో ఉన్నాయి. అక్కడి ప్రజల జీవన విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న రిసార్టులో బస చేయవచ్చు.

చేరుకునేదిలా: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి రాయ్‌పూర్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. రాయ్‌పూర్‌ నుంచి బారనవాపారాకు పర్యాటక శాఖ బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

* ప్యాకేజీల బుకింగ్‌, మరిన్ని వివరాల కోసం ఛత్తీస్‌గఢ్‌ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ chhattisgarhtourism.co.in ను చూడండి.

బందీలు కావాల్సిందే..
బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌, కర్ణాటక

కప్పుడు మైసూరు రాజుల వేట స్థలం బందీపూర్‌ అటవీ ప్రాంతం. కర్ణాటకలోని పడమటి కనుమల్లో 875 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉందీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. చిక్కగా ఉన్న అడవిలో చిన్నచిన్న నదులు, జలజల దూకే జలపాతాలు, సెలయేళ్లు ఇలా ఎన్నో ఉన్నాయి. గతంలో ఇక్కడ పులులు బాగా సంచరించేవి. ఇప్పుడు వీటి సంఖ్య పరిమితంగానే ఉన్నా.. అద్భుతమైన జీవ వైవిధ్యం దర్శనమిస్తుంది. పులుల సంగతి అటుంచితే.. మందలు మందలుగా సంచరించే మదగజాలను చూడొచ్చు. ఎలుగుబంట్లు, తోడేళ్లు, జింకలు, దుప్పులు, అడవిదున్నలు ఇలా రకరకాల జంతుజాలం విన్యాసాలను చూస్తూ బందీలైపోతాం. కబిని, మొయర్‌ నదుల్లో బోటు విహారం చేయవచ్చు. రాఫ్టింగ్‌ అవకాశమూ ఉంది. సఫారీతో వన్యమృగాలను దగ్గరగా చూడొచ్చు. నల్లరంగు చిరుత బందీపూర్‌ పార్క్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

చేరుకునేదిలా: బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ మైసూరు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరు నుంచి ఇక్కడికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఊటీ నుంచి బందీపూర్‌ సుమారు 105 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్‌, విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి మైసూరు మీదుగా నేషనల్‌ పార్క్‌ చేరుకోవచ్చు.

* సఫారీ, ప్యాకేజీ వివరాల కోసం ‌www.bandipurnationalpark.in వెబ్‌సైట్‌ను చూడండి.

కరిమల కొనల్లో
పెరియార్‌ నేషనల్‌ పార్క్‌ కేరళ

డమటి కనుమల్లో నెలకొని ఉన్న పెరియార్‌ నేషనల్‌ పార్క్‌ కేరళ, తమిళనాడు సరిహద్దులో ఉంది. శబరిమల ఆలయం ఈ పార్క్‌లోనే ఉండటం విశేషం. ఇక్కడ ప్రతిదృశ్యమూ నేత్రపర్వంగానే ఉంటుంది. పెరియర్‌ సరస్సు సోయగాలు, అందులో జలకాలాడే ఏనుగులు, ఆ పక్కనే జింకలు, మేము ప్రత్యేకమంటూ సింహం తోకతో అలరించే కొండముచ్చులు.. ఇలా  ఎన్నో విశేషాలను ఆస్వాదిస్తుండగానే.. పెద్దపులి కనిపించవచ్చు. ఈ వనంలో నలభై వరకు పులులుంటే.. ఏనుగులు వెయ్యికిపైగా ఉన్నాయి.

చేరుకునేదిలా: పెరియార్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలోని తెక్కడి పట్టణం మదురై నుంచి 140 కి.మీ., కొట్టాయం నుంచి 114 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి కొట్టాయం, మదురైలకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తెక్కడి చేరుకోవచ్చు.

* సఫారీ, బోటింగ్‌,  నేచర్‌వాక్‌, నైట్‌క్యాంప్‌ తదితర వివరాలు, బుకింగ్స్‌ కోసం www.periyarfoundation.online వెబ్‌సైట్‌ సందర్శించండి.

గుంపుగా సింహాలు..
గిర్‌ నేషనల్‌ పార్క్‌, గుజరాత్‌

సింగిల్‌గా ఉన్న సింహం కంటపడితేనే ఓ అద్భుతాన్ని చూస్తునట్టు అనిపిస్తుంది. అదే.. సింహాలన్నీ గుంపుగా ఎదురుపడితే..! జూలువిదుల్చుతూ రాజసంగా నడిచొచ్చే మగసింగం, దానివెంట గంభీరంగా అడుగులేసే ఆడ సింహం.. ఆ వెనకాల ఒకదాన్నొకటి తోసుకుంటూ పరుగులు తీసే పిల్ల సింహాలు.. ఇలాంటి దృశ్యం కనిపించాలంటే.. గిర్‌ నేషనల్‌ పార్క్‌కు వెళ్లాలి. గుజరాత్‌లోని జునాగఢ్‌, సోమ్‌నాథ్‌, అమ్రేలి జిల్లాల పరిధిలో గిర్‌ అరణ్యం విస్తరించి ఉంది. వందల రకాల జాతుల వృక్షాలు, చిన్నా, పెద్ద నదులు, విశాలమైన గడ్డి మైదానాలు.. వేలాది వన్యమృగాలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఒకప్పుడు రాజులు, ఆంగ్లేయులు వేట సరదా కోసం గిర్‌ అరణ్యంలోకి విహారానికి వచ్చేవారు. కాలక్రమంలో సింహాల సంఖ్య డజనుకు పడిపోవడంతో.. జునాగఢ్‌ నవాబు వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. స్వాతంత్య్రానంతరం 1965లో సుమారు 258 చ.కి.మీ. పరిధిలో సింహాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గిర్‌ నేషనల్‌ పార్క్‌లో 550కిపైగా సింహాలున్నాయి. 300 చిరుతలు, జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, దుప్పులు, హైనాలు, నక్కలు, వేట కుక్కలు ఇలా జీవవైవిధ్యానికి కేరాఫ్‌గా నిలుస్తోందీ అడవి. ఏటా నవంబర్‌ నుంచి మే వరకు పార్క్‌లోకి పర్యాటకులను అనుమతిస్తారు. గిర్‌ నేషనల్‌ పార్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సఫారీని ముందుగానే బుక్‌ చేసుకోవాలి. ఫిబ్రవరి- మార్చిలో సఫారీకి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఏప్రిల్‌, మేల్లో ఎండలు ఎక్కువ.

చేరుకునేదిలా: ససన్‌ గిర్‌ ప్రాంతం నుంచి నేషనల్‌ పార్క్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది జునాగఢ్‌కు 65 కి.మీ. దూరంలో, సోమ్‌నాథ్‌ నుంచి 45 కి.మీ. దూరంలో, రాజ్‌కోట్‌ నుంచి 132 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి రాజ్‌కోట్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
* సఫారీ బుకింగ్స్‌, బస, ఇతర వివరాల కోసం ‌www.girnationalpark.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.

ఇంకా ఎన్నెన్నో..

దేశవ్యాప్తంగా మరెన్నో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. చాలా వరకు నవంబరు నుంచి మే వరకు సందర్శకులను లోనికి అనుమతిస్తారు. రణథంబోర్‌, రాజస్థాన్‌ బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్క్‌, మధ్యప్రదేశ్‌ కజిరంగ నేషనల్‌ పార్క్‌, అసోం తాడోబా టైగర్‌ రిజర్వ్‌, మహారాష్ట్ర ముదుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.