close

తాజా వార్తలు

ఇక్కడికొస్తే మీరు మారిపోతారండి

కారుణ్య నిలయాలివి

ఆ ప్రాంతాలు చూసి వచ్చాక.. అక్కడి దృశ్యాలు మనతో ప్రయాణిస్తాయి ఆ మాటలు మన మాటల్లో అప్రయత్నంగా దొర్లుతాయి వారి మంచితనం మన జీవితాల్లో అయాచితంగా ప్రతిఫలిస్తుంది ఇలాంటి అనుభూతినిస్తుంది  ఆనంద్‌వన్‌, హేమల్‌కసా విహారం ఓ పెద్దాయన సంకల్పం ఆ రెండు ప్రదేశాలను సేవకు చిరునామాగా, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాయి అంతేకాదు, ఇవి వేసవి విహారానికి అనువైన ప్రాంతాలు, పిల్లల వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే మార్గాలు కూడా..

 

ఒక్కరి ఆశయం.. ఎందరికో ఆశ్రయం

హ్లాదకరమైన వాతావరణం.. ఆ ప్రశాంతతను రెట్టింపు చేస్తూ బడిపిల్లలు వల్లె వేస్తున్న పాఠాలు వినిపిస్తాయి. లయ బద్ధంగా ఆడుతున్న కుట్టుమిషన్ల శబ్దం మహిళల సాధికారత గురించి చెబుతుంది. వైకల్యాన్ని ఎదిరించి నిలిచిన వారి సంగతి.. వెల్డింగ్‌ వర్క్‌షాప్‌లో నుంచి వినిపించే ఇనుప చువ్వల శబ్దం తెలియజేస్తుంది. గాలిలో తేలుతూ వచ్చే పల్లెపదాలు.. ఆ పక్కన చేనులో సాగు చేస్తున్న కర్షకుల ఆనందాన్ని చెవిన వేస్తాయి. ఇన్ని చేస్తున్న వారు.. అనాథలు. ఒకప్పుడు కుష్ఠు వ్యాధితో సతమతమైన అభాగ్యులు, వైకల్యంతో జీవితంపై ఆశ వదులుకున్న వాళ్లు! ఓ పెద్దాయన సంకల్పంతో ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

మహారాష్ట్రలో వరోరా పొలిమేరలో ఉంది ఆనందవన్‌. సుమారు ఏడు దశాబ్దాల కిందట ఎవరికీ పట్టని కుష్ఠు రోగుల కోసం పురుడు పోసుకుందీ ఆశ్రమం. ఈ అద్భుత వనాన్ని 1951 మహారోగి సేవా సమితి పేరిట గాంధేయవాది, సమాజ సేవకుడు బాబా ఆమ్టే ప్రారంభించారు. యాభై ఎకరాల పరిధిలో మొదలైన సమితి సేవలు.. ఇప్పుడు 500 ఎకరాలకు విస్తరించాయి. వేల మంది అభాగ్యులకు జీవితాన్నిస్తోంది. ఆనందవనంలో ఆరోగ్యాన్ని పొందిన వారంతా.. ఇప్పుడు జీవితంలో విజయం దిశగా సాగుతున్నారు. ఆనంద్‌వన్‌లో జేబు రుమాలు నుంచి దుప్పట్ల వరకూ తయారవుతాయి. స్టీలు చెంచా నుంచి మూడు చక్రాల వాహనం వరకూ రూపొందుతున్నాయి. ఎవరి కర్తవ్యం వాళ్లు సమర్థంగా నిర్వర్తిస్తుంటారిక్కడ. ఆ కార్యదక్షులను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తుంటారు. ఓ పూటంతా అక్కడే ఉంటారు. ఆనందవన్‌లో హాయిగా సేదతీరుతారు

 

మానవత్వం చిరునామా..

నందవన్‌ అభాగ్యులకు కొత్త జీవితాన్నిస్తే.. హేమల్‌కసాలోని ‘లోక్‌ బిరాదరీ ప్రకల్ప్‌’ ఎలా జీవించాలో నేర్పుతుంది. మహారాష్ట్రలోని గఢ్చిరోలీ జిల్లాలో ఉంటుందీ ప్రాంతం. దండకారణ్యంలో విసిరేసినట్టుండే హేమల్‌కసా విభిన్న పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. వరోరాలోని ఆనంద్‌వన్‌ వటవృక్షానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో చిగురించిన కొమ్మ ఇది. దట్టమైన అరణ్యం గుండా సాగే హేమల్‌కసా ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పొడవాటి చెట్లు.. గుబురు గుబురు చెట్లు.. మహావృక్షాలు.. మధ్యమధ్యలో చిన్నాపెద్దా కాల్వలు.. చిన్నచిన్న పల్లెలు.. కొత్తగా అనిపిస్తుంది. హేమల్‌కసా చేరుకోగానే.. ‘లోక్‌ బిరాదరీ ప్రకల్ప్‌’ అనే పెద్ద బోర్డు ఉన్న స్వాగత ద్వారం లోనికి దారి చూపుతుంది.

వరోరాలో ఆనంద్‌వన్‌ స్థాపించిన బాబా ఆమ్టేనే 1973లో ‘లోక్‌ బిరాదరీ ప్రకల్ప్‌’ను ప్రారంభించారు. ఆయన చిన్నకుమారుడు ప్రకాశ్‌ ఆమ్టేకు దాని బాధ్యతలు అప్పగించారు. మూఢ నమ్మకాలు, అరాచక శక్తులు, ఆకలి చావులు ఇవీ ఆశ్రమం ప్రారంభించే నాటికి హేమల్‌కసా చుట్టుపక్కల ఉన్న మాడియాగోండ్‌ ఆదివాసీల పరిస్థితులు. ప్రకాశ్‌ ఆమ్టే పట్టుదల, ఆయనకు భార్య మందాకినీ సహకారం.. ఆ ప్రాంతం రూపురేఖలను మార్చేశాయి. ఆదివాసీల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. హేమల్‌కసా ఆశ్రమం సమీపంలో ఇంద్రావతీ నది త్రివేణి సంగమం ఉంటుంది. ఆదివాసీలకు విద్య, వైద్యం, జీవనోపాధి కల్పించే సంగమ క్షేత్రంగా లోక్‌ బిరాదరీ దర్శనమిస్తుంది.

ఇక్కడి పాఠశాలలో 750 మంది ఆదివాసీ పిల్లలు ఉచిత విద్య అభ్యసిస్తున్నారు. వైద్యశాలలో వందల మంది ఉచిత చికిత్స పొందుతున్నారు. హస్తకళలు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న వారు కొందరు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో ఎందరో డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. ప్రకాశ్‌ ఆమ్టే మనవలు కూడా ఆశ్రమ పాఠశాలలోనే చదువుతుండటం విశేషం. చుట్టూ అడవి, కొండల మధ్య ఉండే హేమల్‌కసా పచ్చని ప్రకృతికి అలవాలంగా ఉంటుంది. వన విహారంతో పాటు ఇక్కడి విశేషాలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వస్తారు. ఆశ్రమంలో హాయిగా ఉంటారు. వారి ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు. అడవి తప్ప అన్యం ఎరుగని ఆదివాసీలకు ప్రకాశ్‌ ఆమ్టే, ఆయన భార్య అందిస్తున్న సేవలను చూసి మానవత్వం చిరునామా ఇదేననుకొని తిరుగు ప్రయాణం అవుతారు.

 

వన్యమృగాలు సాధుజీవుల్లా..

హేమల్‌కసా ఆదివాసీల సంరక్షణ ఆశ్రమం మాత్రమే కాదు.. వన్యమృగాల శరణాలయం కూడా ఉందిక్కడ. అడవిలో తప్పిపోయిన క్రూర మృగాలను ఇక్కడ ఉంచుతారు. ఆత్మీయంగా పెంచుతారు. మానవత్వం పరిమళించిన నెలవులో పెరగడం వల్లేమో.. క్రూరమృగాలు సైతం సాధుజీవుల్లా ప్రవర్తిస్తుంటాయి. ఆమ్టేతో అవి సాగించే విన్యాసాలు తప్పక చూడాల్సిందే. ఆయన అటుగా వెళ్తుంటే చిరుత అలా వచ్చి ఒళ్లో కూర్చుంటుంది. చిరుతను లాలిస్తున్న ఆయన్ని చూసి.. ఎలుగు గారాలు పోతుంటుంది. తన దగ్గరికి రావెందుకన్నట్టు! ఎలుగు ముచ్చట తీరుద్దామని వెళ్తుంటే.. ఉడతలు ఆయన నెత్తినెక్కి కూర్చుంటాయి. విష సర్పాలు సైతం ఆమ్టే అడుగుల్లో వయ్యారాలు పోతూ పాకుతుంటాయి. ఇవన్నీ ఆయనకు అలవాటే! చూసే వాళ్లకు మాత్రం అద్భుతం.

 

బుకింగ్‌ ముందుగానే

నంద్‌వన్‌, హేమల్‌కసా పర్యటించాలంటే ముందుగానే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి www.anandwan.in వెబ్‌సైట్‌లో తేదీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలి. ఒక్కొక్కరికి రూ.1,000 రుసుము చెల్లించాలి. ఇందులోనే బస, భోజన వసతి కల్పిస్తారు.
ఆనంద్‌వన్‌ విహారానికి visitors@anandwan.in కు మెయిల్‌ చేయొచ్చు. 09011994626 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.
లోక్‌ బిరాదరీ ప్రకల్ప్‌ సందర్శన కోసం sachinmukkawar83@gmail.com కు మెయిల్‌ చేయాలి. 07588772858 నెంబర్‌కు సంక్షిప్త సందేశం పంపిస్తే.. తిరిగి వారే సంప్రతిస్తారు.
సేవాగ్రామ్‌-వరోరా-హేమల్‌కసా ఈ క్రమంలో వెళ్తే విహారం సులభంగా సాగుతుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి సేవాగ్రామ్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు వరోరా మీదుగానే వెళ్తాయి. సేవాగ్రామ్‌ నుంచి వరోరాకు రైలు, రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. వరోరా నుంచి హేమల్‌కసాకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

 

బాపూ నడిచిన చోటు..

గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం తర్వాత మహాత్మాగాంధీ ఎక్కువ కాలం గడిపిన ప్రాంతం మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌. వార్ధా శివారులో ఉన్న ఈ ఆశ్రమం 1936లో ప్రారంభమైంది. 1946 వరకు బాపూ ఈ ఆశ్రమంలోనే ఉన్నారు. ఇక్కడ మహాత్ముడు నివసించిన కుటీరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆది నివాస్‌, బాపూ కుటీ, బా కుటీ, ఆఖ్‌రీ నివాస్‌, పర్చురే కుటీ,  కిషోర్‌ నివాస్‌, మహాదేవ్‌ కుటీ ఇలా ఒక్కో కుటీరం వెనుక ఒక్కో కథ ఉంది. ఆశ్రమ పరిసరాల్లో గాంధీజీ ప్రదర్శనశాల నిర్మించారు. యాత్రికుల బస కోసం 1982లో యాత్రి నివాస్‌ నిర్మించారు. ఆశ్రమానికి వచ్చే అతిథులు యాత్రి నివాస్‌లో గద్దులు అద్దెకు తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు
www.gandhiashramsevagram.org/ వెబ్‌సైట్‌ని చూడండి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.