close

తాజా వార్తలు

Updated : 19/04/2019 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేసవికి గిరిగీద్దాం

సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? సూరీడు సుర్రుమంటుంటే.. ఎటు వెళ్తామని నిరుత్సాహపడకండి.. ఎండకన్నెరగని చోట్లు.. వడగాలి విసుర్లు లేని గిరులెన్నో! అలాగని ఏ హిమాలయాలకో వెళ్లాల్సిన పనిలేదు.. మన పక్క రాష్ట్రాల్లోకి తొంగిచూస్తే చాలు.. భానుడి తాపానికి విరుగుడు మంత్రం పఠించే ప్రాంతాలెన్నో!! ఆ విశేషాలే ఇవి.. అనువైన చోటుకు వెళ్లండి. భగభగలను తప్పించుకోండి.


కిమ్మనకుండా చూసేద్దాం
కెమ్మనగుండి, కర్ణాటక

పచ్చదనానికి ఆలవాలమైన కర్ణాటకలో వేసవి విడుదులు ఎన్నెన్నో. ఎండకు చల్లని గొడుగు పట్టే కొడుగు ప్రాంతం.. వడగాలిని మలయమారుతంగా మార్చే గిరులు.. కన్నడసీమను చల్లగా ఉంచుతున్నాయి. ఈ రాష్ట్రంలో పడమటి కనుమలు పరుచుకున్న చోటంతా పర్యాటక కేంద్రాలే! వాటిలో ఒకటి కెమ్మనగుండి. సముద్రమట్టానికి సుమారు 1450 మీటర్ల ఎత్తులో ఉంటుందీ ప్రాంతం. ఒకప్పుడు మైసూరు రాజులు వేసవిలో కెమ్మనగుండికి విహారానికి వస్తుండేవారు. ఎత్తయిన కొండలు, దట్టమైన అరణ్యం, జలజలదూకే జలపాతాలు, అంతుబట్టని లోయలు ఇలా అడుగడుగున పలకరించే అందాలు కిమ్మనకుండా చూస్తూ.. గుండె నిండా ఆనందాలను మూటగట్టుకోవాల్సిందే! పడమటి కనుమల్లో భాగమైన కెమ్మనగుండిలోని పర్వత శ్రేణులను బాబా బూదాన గిరులు అని పిలుస్తుంటారు. ఈ కొండల్లోని ముల్లాయనగిరి పర్వతం.. కర్ణాటకలో అతిపొడవైనదిగా గుర్తింపు పొందింది. ఈ కొండవాలులో ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. మౌంటెయిన్‌ బైకింగ్‌ అవకాశమూ ఉందిక్కడ. బస గురించి బెంగ అవసరం లేదు. రెస్టారెంట్లకు కొదవ లేదు.

చేరుకునేదిలా: కెమ్మనగుండి.. చిక్కమగళూరు నుంచి 61 కి.మీ, బెంగళూరు నుంచి 273 కి.మీ. దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి నేరుగా బస్సులు, ట్యాక్సీల్లో కెమ్మనగుండి చేరుకోవచ్చు. చిక్కమగళూరు నుంచి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు.

చూడాల్సినవి

* హెబ్బే, శాంతి జలపాతాలు
* ముల్లాయనగిరి పర్వతం (ఈ పర్వతంపై పురాతనమైన శివాలయం ఉంటుంది)
* రాక్‌, రోజ్‌ గార్డెన్‌
* జీ పాయింట్‌
* కల్లత్తిపుర జలపాతం (సమీపంలో వీరభద్రస్వామి గుడి ఉంటుంది)

ప్రకృతి ఎస్టేట్‌
మున్నార్‌, కేరళ

పడమటి కనుమల పొత్తిళ్లలో ఉన్నట్టుంటుంది మున్నార్‌. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్‌.. రుతురాగాల వేళ మేఘసందేశాన్ని మోసుకొస్తుంది. చలి కౌగిలిలో గిలిగింతలు పెడుతుంది. మండువేసవిలోనూ వసంతగాలులతో పర్యాటకులను అలరిస్తుంటుంది. నింగిలో తేలిపోయే మబ్బులు.. మున్నార్‌ కొండలను ముద్దాడుతూ గమనం మరచిపోతాయి. ఇంతలో కొండవాలులో ఉన్న తేయాకు తోటలపై నుంచి వచ్చే గాలి సోకి.. హుషారొచ్చి ముందుకు సాగిపోతాయి.ట్రెక్కింగ్‌, హైకింగ్‌ వంటి ఆటల కోసం సాహసవంతులు వస్తుంటారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న జంతుజాలాన్ని చూసేందుకు వస్తారు. ప్రకృతితో మమేకమవ్వడం కోసమే వచ్చే పర్యాటకులూ ఉంటారు! అందుకే ఏడాది పొడవునా మున్నార్‌కు పర్యాటకుల తాకిడి ఉంటుంది. బడ్జెట్‌ నుంచి లగ్జరీ రిసార్టుల వరకు అందుబాటులో ఉన్నాయి.

చేరుకునేదిలా: మున్నార్‌.. ఎర్నాకులం నుంచి 125 కి.మీ., కోయంబత్తూరు నుంచి 158 కి.మీ. దూరంలో ఉంది. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి ఈ రెండు ప్రాంతాలకు రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరుకోవచ్చు. హైదరాబాద్‌, విశాఖ నుంచి కొచ్చి వరకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులున్నాయి. అక్కడి నుంచి బస్సులో, ట్యాక్సీల్లో మున్నార్‌ (128 కి.మీ.) వెళ్లొచ్చు.

చూడాల్సినవి

టీ ఎస్టేట్స్‌
టాటా టీ మ్యూజియం
పల్లివాసల్‌ డ్యామ్‌
న్యాయకడ్‌, అట్టుకడ్‌ జలపాతాలు
పంబదుమ్‌ షోలా, ఎరవికులం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు

మైమరపుల మలుపులు
కొల్లీహిల్స్‌, తమిళనాడు

తమిళనాడులో వేసవి విడిది ఎక్కడంటే.. అందరూ చెప్పే సమాధానం ఊటీ, కొడైకెనాల్‌. చాలామందికి తెలియని శీతలజాలం ఆ రాష్ట్ర నడిబొడ్డున ఉంది. నమక్కల్‌ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది కొల్లీహిల్స్‌. ఎన్నో గిరిజన గ్రామాలకు ఆలవాలమైన ఈ గిరిశ్రేణుల పైకి వెళ్లే మార్గం అద్భుతంగా ఉంటుంది. దట్టమైన మానుల మధ్య సాగిపోయే రహదారి 70 మలుపుతో మైమరపిస్తుంది. మలుపు మలుపులో ప్రకృతికాంత వింతగా పలకరిస్తుంది. ఓ చోట జలపాతమై ఆహ్వానిస్తే.. ఇంకోచోట లతలు అల్లుకున్న వృక్షాలు స్వాగతిస్తాయి. మలుపులన్నీ మలిగి గిరులపైకి చేరాక.. చల్లని గాలి ముంగురులను ముద్దాడుతుంది. పచ్చదనం మనసును హత్తుకుంటుంది. ఈ కొండకోనల్లో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. వారి జీవనశైలి ఆశ్చర్యం కలిగిస్తుంది. వేసవిలోనూ జలజలజారే జలపాతాలు ముచ్చటగొలుపుతాయి. అక్కడక్కడా ఉన్న ఆలయాలు ఆధ్యాత్మికతను పంచుతాయి. అంతటా విస్తరించి ఉన్న కాఫీ తోటలు ఆనందాన్ని అందిస్తాయి. యుగాల కిందట అగస్త్య మహర్షి ఈ కొండల్లో తపమాచరించారని చెబుతారు. శతాబ్దాల కిందట ‘ఒరి’ వంశానికి చెందిన రాజులు కొల్లీకొండలు కేంద్రంగా రాజ్యపాలన చేశారట. వేసవి విడిదిగానే కాదు ట్రెక్కింగ్‌ జోన్‌గా కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి.

చేరుకునేదిలా: కొల్లీహిల్స్‌ నమక్కల్‌ జిల్లా కేంద్రానికి 25 కి.మీ., సేలం నుంచి 61 కి.మీ. దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి సేలం వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొల్లీహిల్స్‌ చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి నమక్కల్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో కొల్లీహిల్స్‌ వెళ్లొచ్చు.

చూడాల్సినవి

ఆకాశగంగ జలపాతం
అరపలేశ్వరస్వామి ఆలయం
ఇట్టుక్కయి అమ్మన్‌ గుడి
వాసలూర్‌పట్టి పండ్ల తోటలు
సిద్ధాగుహలు

అతిథులకు ప్రత్యేకం
అంబోలి, మహారాష్ట్ర

సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంటుంది అంబోలి. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో ఉంటుందీ ప్రాంతం. అంబోలి అంటే ప్రత్యేకమనే అర్థం ఉంది. పేరుకు తగ్గట్టే.. ఇక్కడ ఎన్నో వింతలు దాగున్నాయి. వానాకాలం భారీ వర్షాలతో కొండలపై ఉన్న వాగులు, సెలయేళ్లు నిండుకుండలు అవుతాయి. నిండు వేసవిలోనూ పిల్లకాల్వల్లో నీటి జాడ కనిపిస్తుంది. జలపాతాలు నెమ్మదించినా.. వసంత ఆగమనంతో పచ్చదనం పురివిప్పుతుంది. చెట్లన్నీ గొడుగుపట్టి ఎండకన్నెరగకుండా చూస్తాయి. అగాధంగా ఉండే కొండల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అంబోలి పరిసర ప్రాంతాల్లో 108 ఆలయాలు ఉన్నాయని చెబుతారు. పదుల సంఖ్యలో గుళ్లు సందర్శనకు అనువుగా ఉన్నాయి. భక్తులు ఆలయాల బాట పడితే! సాహసయాత్రికులు ట్రెక్కింగ్‌లో బిజీగా ఉంటారు. ప్రకృతి ప్రేమికులు పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతతను పొందుతారు.

చేరుకునేదిలా: మహారాష్ట్రలోని ప్రముఖ నగరం బెల్గాం నుంచి అంబోలి 88 కి.మీ., కర్ణాటకలోని హుబ్లీ నుంచి 160 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి హుబ్లీ వరకు రైల్లో వెళ్లాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బెల్గాం మీదుగా అంబోలి చేరుకోవచ్చు.

చూడాల్సినవి

హిరణ్యకేశి ఆలయం (శివపార్వతుల గుడి)
నాగర్తా, అంబోలి జలపాతాలు
మారుతీ దేవాలయం
సన్‌సెట్‌ పాయింట్‌
మహాదేవ్‌గఢ్‌
నారాయణగఢ్‌
షిర్‌గావ్‌కర్‌ పాయింట్‌

మన దగ్గర్లో..

తెలుగు రాష్ట్రాల్లోనూ వేసవి వేడి నుంచి కాపు కాచే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వారాంతంలో వెళ్లి వచ్చేంత దూరంలోనే.. శీతలజాలం చేసే ప్రదేశాలివి.
* అనంతగిరి, వికారాబాద్‌
* ఏటూరునాగారం, ములుగు
* అరకు, విశాఖ
* హార్స్‌లీహిల్స్‌, చిత్తూరు
* మహేంద్రగిరి, శ్రీకాకుళం
* శ్రీశైలం, కర్నూలు
* మారేడుమిల్లి, రంపచోడవరం తూర్పుగోదావరి

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని