close

తాజా వార్తలు

నింగికి దగ్గర్లో..నిభిడాశ్చర్యంతో..

దిల్‌ కా ధడ్కన్‌ లద్దాఖ్‌

కొండలు మంచుదుప్పటి తొలగించుకుంటుంటే.. తుషారం జలపాతంగా మారి సవ్వడి చేస్తుంటే.. అంతెత్తున కూడా కొలనులు అలలతో అబ్బురపరుస్తుంటే.. అది కచ్చితంగా లద్దాఖ్‌. ఓ నిశ్శబ్దం..  ఓ ఆశ్చర్యం..ఓ తన్మయత్వం..అద్భుత అనుభూతుల సంగమం కోసం బయల్దేరండి..

హిమగిరుల మధ్యనున్న లద్దాఖ్‌ ఓ అద్భుతం. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దులు పంచుకున్న లద్దాఖ్‌లో ఎల్లల్లేని సౌందర్యం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు.. ఏడాదిలో సింహభాగం దట్టమైన మంచుతో ఉంటాయి. మే నెల రాకతో.. పర్వతాలన్నీ మంచువీడి రంగురంగుల రాళ్ల గుట్టల్లా దర్శనమిస్తాయి. అందులోనూ ఓ ఆకర్షణ ఉంటుంది. లోయల వెంట సింధు, జంస్కార్‌ నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటాయి. నది ఒడ్డున ఉన్న పల్లెల్లో సింధూ నాగరికత ఆనవాళ్లూ కనిపిస్తాయి. శతాబ్దాల పాటు ప్రపంచానికి దూరంగా.. నిగూఢంగా ఉన్న లద్దాఖ్‌.. 1974 తర్వాత ట్రావెలోకంలోకి ప్రవేశించి అందరి మజిలీ అయింది.
లద్దాఖ్‌ అంటే.. పాస్‌ల (రెండు పర్వతాల మధ్య నుంచి వెళ్లే దారుల) నిలయం అని అర్థం. ఇది జమ్ము-కశ్మీర్‌లో భాగమే అయినా.. ప్రత్యేక కారణాల  వల్ల లద్దాఖ్‌కు ఓ రాజధాని ఉంది. దాని పేరు లేహ్‌. విస్తీర్ణం పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద జిల్లా.  శ్రీనగర్‌ నుంచి లేహ్‌కు 434 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భిన్న సంస్కృతుల సమాహారంగా కనిపిస్తుందీ నగరం. లిటిల్‌ టిబెట్‌గా పేరొందిన లేహ్‌ పరిసరాల్లో బౌద్ధ ఆరామాలు కోకొల్లలు. హిందూ ఆలయాలూ ఉన్నాయి. నగరంలోని కొండలపై శతాబ్దాల కిందట నిర్మించిన ఆవాసాలు చూడొచ్చు. లేహ్‌ ప్యాలెస్‌, బౌద్ధ ఆరామాల నిర్మాణశైలి ఆశ్చర్యం కలిగిస్తుంది. షాపింగ్‌కు కూడా లేహ్‌ ప్రసిద్ధి. టిబెటన్‌ కళాకారులు రూపొందించిన లోహాకృతులు, లద్దాఖీ మహిళలు తీర్చిదిద్దిన కళాత్మక వస్తువులు వేటికవే మేటిగా నిలుస్తాయి. కార్పెట్లు, శాలువాలు, మఫ్లర్లు.. అతిథుల తిరుగుప్రయాణంలో చోటు దక్కించుకుంటాయి. లద్దాఖ్‌ వచ్చే పర్యాటకుల్లో చాలామంది ట్రెక్కింగ్‌ క్యాంపులకు వెళ్తుంటారు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో, చల్లని గాలులకు వెరవకుండా.. చిటారు కొండకు చేరుకొని సత్తా చాటుతుంటారు. లేహ్‌లో అడ్వెంచర్‌ క్లబ్‌లు బోలెడు. ట్రెక్కింగ్‌ సామగ్రి కూడా తక్కువ ధరలో లభిస్తుంది. ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకొని, రివ్యూలు పరిశీలించి సాహసానికి పూనుకోవడం మంచిది.

ఒకరోజు విశ్రాంతి..
లద్దాఖ్‌కు చేరుకున్న వెంటనే విహారానికి శ్రీకారం చుడితే ఇబ్బందే! సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో ఆక్సిజన్‌ లభ్యత తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడికి చేరుకోగానే చాలామంది ‘ఆటిట్యూడ్‌ సిక్‌నెస్‌’కు గురవుతారు. అక్కడి వాతావరణంలో ఇమడలేకపోవడంతో తలనొప్పి, విరేచనాలు వంటి ఇబ్బందులు రావొచ్చు. వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులు వెంట ఉంచుకోవాలి. లేహ్‌కు చేరిన తర్వాత.. ఆ రోజంతా హోటల్‌ గదిలో విశ్రాంతి తీసుకుని మర్నాడు నుంచి విహారం మొదలుపెట్టాలి.

చుట్టుపక్కల బోలెడు
లేహ్‌లో వీధులు, నివాసాలు చూడముచ్చటగా ఉంటాయి. రాళ్లు, మట్టితో నిర్మించిన గోడలు, భారీ గృహాలు గమ్మత్తుగా అనిపిస్తాయి. నగరంలోని లేహ్‌ ప్యాలెస్‌, శివాలయం, శాంతి స్తూపం, మైత్రేయ ఆరామం, టిబెటన్‌ మార్కెట్‌ ఇవన్నీ చూడొచ్చు. లద్దాఖ్‌లోని మిగిలిన పర్యాటక కేంద్రాలు విహరించాలంటే ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ (ప్రత్యేక అనుమతి) తప్పనిసరి. నగరంలోని డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తుతో పాటు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం నకలు అందజేసి, రూ.400 రుసుం కడితే అనుమతి లభిస్తుంది. ‌్ర్ర్ర.ః్చ్త్ట‘ః’్త్ప’౯్ఝi్మ.i- వెబ్‌సైట్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అనుమతి పత్రంపై డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి ముద్ర వేయించాలి. అప్పుడే అది చెల్లుబాటు అవుతుంది.

* లేహ్‌కు 160 కి.మీ. దూరంలో ఉంటుంది ప్యాంగాంగ్‌ సరస్సు. హిమాలయాల మధ్య, సముద్రమట్టానికి సుమారు 14,280 అడుగుల ఎత్తులో ఉప్పునీటి సరస్సు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 690 చ.కి.మీ. విస్తరించిన ఈ సరస్సులోని కొంత భాగం భారత్‌లోనూ, కొంత భాగం చైనా (టిబెట్‌)లో ఉంటుంది. ప్యాంగాంగ్‌ సరస్సు హిమాలయాలు ఏర్పడటానికి కన్నా పూర్వం నుంచి ఉందని చెబుతుంటారు. లద్దాఖ్‌ రీజియన్‌లో ఉండే మరో అద్భుతమైన సరస్సు సో మోరిరీ. చంగ్‌తాంగ్‌ పీఠభూమిలో ఉండే భారీ తటాకం సూర్యుడి గమనం ఆధారంగా రంగులు మారుస్తుంది.
* ఖర్దూంగ్‌లా పాస్‌ లేహ్‌ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన పాస్‌. దీని ఎత్తు సుమారు 18,380 అడుగులు.
లద్దాఖ్‌ రీజియన్‌లో అందమైన గ్రామం టుర్‌టుక్‌. సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ దగ్గర ఉంటుంది. పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న టుర్‌టుక్‌ గ్రామం.. 1971 ఇండో-పాక్‌ యుద్ధం తర్వాత భారత్‌లో విలీనమైంది. 2010 నుంచి గ్రామంలోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఖుబానీ (ఆప్రికాట్‌) పండ్ల చెట్లు, గోధుమ పంటలు స్వాగతం పలుకుతాయి. పచ్చదనం నిండి ఉండే లోయలో జలపాతాలు అంతులేని ఆనందాన్నిస్తాయి.
* లేహ్‌ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే నుబ్రా లోయ ట్రెక్కర్‌ జోన్‌గా పేరొందింది. ప్రకృతి విశేషాలను ఆస్వాదిస్తూ వందల మంది ట్రెక్కింగ్‌లో పాల్గొంటారు. ఇండో-ఆర్యన్‌ జీవనశైలి కనిపిస్తుంది. లోయవాసుల హస్తకళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. చిన్న చిన్న గ్రామాలు, పెద్ద పెద్ద ఆరామాలు చూడొచ్చు. ఈ లోయలోనే ఓ ఎడారి కనిపిస్తుంది. హిమాలయాల్లో ఎడారి ఏమిటా? అనుకోకండి. కనుచూపుమేరలో ఉండే బూడిద వన్నె ఇసుక తిన్నెలు.. ఎడారిలో వింత సందడికి తెరదీస్తాయి. జంట మూపురాల ఒంటెలు ఒయ్యారాలు పోతూ పర్యాటకులను అలరిస్తాయి.
* లేహ్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హెమిస్‌ నేషనల్‌ పార్క్‌. హిమసీమలో ఉన్న ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలా ఉంటుంది. ఎలుగుబంట్లు, నక్కలు, అడవి దున్నలు, రకరకాల పక్షులకు ఆవాసంగా కనిపిస్తుంది. మంచు చిరుతలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి.
* కార్గిల్‌ నుంచి లేహ్‌ వెళ్లే దారిలో వచ్చే అందమైన ఊరు లామాయురు. ‘మూన్‌ ల్యాండ్‌’గా పేరొందిన ఈ ప్రాంతం.. బౌద్ధ ఆరామాలకు కేంద్రం. ట్రెక్కింగ్‌ జోన్‌ కూడా!

రెండు దారుల్లో..

లేహ్‌కు రెండు దారుల్లో చేరుకోవచ్చు. శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌ మీదుగా (434 కి.మీ.) వెళ్లొచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి నుంచి లేహ్‌ (473 కి.మీ.) చేరుకోవచ్చు. ఈ రెండు దారులూ నవంబరు మొదలు ఏప్రిల్‌ చివరి వరకు మంచు పేరుకుపోయి ఉంటాయి. మే మధ్య వారంలో తెరుచుకుంటాయి. అప్పటి నుంచి ఈ రహదారులపై వాహనాల జోరు పెరుగుతుంది. బైకులు దూసుకుపోతుంటాయి. కార్లు షికారుకెళ్తుంటాయి. బస్సుల్లోనూ పర్యాటకులే! బైక్‌ రైడర్లు చాలామంది మనాలి నుంచి లేహ్‌ వెళ్లడానికి ఇష్టపడతారు. ఎత్తయిన పాస్‌ల మీదుగా సాగే ప్రయాణం ఆద్యంతం సాహసోపేతంగా ఉంటుంది.
* శ్రీనగర్‌ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.
* మనాలి నుంచి బస్సులు, ట్యాక్సీలు ఉన్నాయి. బైకులు అద్దెకు లభిస్తాయి.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి దిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి శ్రీనగర్‌ మీదుగా లేహ్‌ చేరుకోవచ్చు. దిల్లీ నుంచి లేహ్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
* హైదరాబాద్‌ నుంచి ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు ప్యాకేజీలు కూడా నిర్వహిస్తున్నాయి. వీటి ధర రూ.26,000 నుంచి మొదలవుతుంది

సాహసాల విందు

లద్దాఖ్‌ వచ్చే పర్యాటకులు చాలామంది సాహసాల్లో పాల్గొనే ఆసక్తి ఉన్నవాళ్లే. వారి ఉత్సాహానికి తగ్గట్టుగా ఎన్నో సాహసక్రీడలు అందుబాటులో ఉన్నాయి.
ట్రెక్కింగ్‌: చాదర్‌ ట్రెక్‌, స్టొక్‌ కాంగ్రీ, జంస్కార్‌ నది, మోరిరీ సరస్సు, నుబ్రా లోయ, షామ్‌ లోయ, సింధు లోయ ట్రెక్కింగ్‌ జోన్లుగా ప్రసిద్ధి చెందాయి. ట్రెక్కింగ్‌లో గతానుభవం ఉంటే మంచిది.
క్యాంపులు: లేహ్‌ వెళ్లే పర్యాటకులు కొండల్లో, లోయల్లో నిర్వహించే క్యాంప్‌లలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తారు. చలిగాలికి వెరవకుండా.. నీలాకాశంలో నక్షత్రాలు లెక్కిస్తూ.. నిద్దట్లోకి జారుకుంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులతో కలిసిపోయి.. తమ విహారాన్ని కలకాలం గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. ప్యాంగాంగ్‌, మోరిరీ సరస్సులు, నుబ్రా, స్పిటి లోయల్లో క్యాంప్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి.
రివర్‌ రాఫ్టింగ్‌: సింధు, జంస్కార్‌ నది పరివాహక ప్రాంతాల్లో రాఫ్టింగ్‌ అవకాశం ఉంది. చిన్న చిన్న నదీపాయల్లోనూ రాఫ్టింగ్‌ నిర్వహిస్తుంటారు. లేహ్‌లో బుక్‌ చేసుకోవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.