close

తాజా వార్తలు

ఆరోగ్యయానం 

మనసుకూ.. తనువుకూ..

కుదురు లేదు.. కునుకు రాదు..లేచింది మొదలు పరుగులు పడుకుంది మొదలు కలలు ఎక్కడికైనా వెళ్తే..శీతల ప్రాంతాలా ‘అమ్మో ఉబ్బసం’ సముద్ర తీరాలా ‘వామ్మో ఉబ్బరం ’శరీరం తట్టుకోందే..ధైర్యం చేసి వెళ్లినా.. క్షణం తీరిక లేకుండా తిరిగి తిరిగి అలసిపోవడమే గానీ, ఆనందం పొందేది కొంతే! ఇవన్నీ కాదు గానీ, ఈసారి వేసవి విహారానికి పలికే ఘనమైన ముగింపు.. మెరుగైన జీవితానికి స్వాగతం కావాలంటేే.. ఆరోగ్యయానం చేసి రండి.

‘ఎలా ఉంది డాక్టర్‌?‘ఏం ఫర్వాలేదు.. ఓ నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్లి రండి. మనసు కుదుటపడితే ఆరోగ్యమూ మెరుగవుతుంది’ నలుపు-తెలుపు చిత్రాల్లో ఎక్కువగా వినిపించే మాటలివి. సినిమా కథనంలో ఓ మేలిమలుపు ఇక్కడే మొదలవుతుంటుంది. సినిమా ముచ్చట్లు అక్కడితో ఆపేస్తే.. అలా నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్తే జీవితంలోనూ ఓ మార్పు రావాలి. ఆరోగ్య యాత్రలు అలాంటివే! మనసుకు ఆహ్లాదాన్నివ్వడంతో పాటు తనువుకు సత్తువనిస్తాయి. జీవనశైలినీ, ఆలోచనా విధానాన్నీ మార్చేస్తాయి. 

ఆరోగ్యంతో ముడిపడిన వెల్‌నెస్‌ టూరిజంపై ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఔత్సాహిక పర్యాటకులు యోగాసనాల కోసం హరిద్వార్‌, రుషీకేశ్‌ వంటి క్షేత్రాలకు వెళ్లిపోతున్నారు. తైలమర్దనం కోసం కేరళ బ్యాక్‌వాటర్స్‌లో తిరుగుతున్నారు. వారం నుంచి పక్షం రోజులు సాగే ఈ విహారంలో అక్కడి నిర్వాహకులు చెప్పిందే వేదంగా తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బరువు తగ్గాలనుకున్న వాళ్లు కాస్తోకూస్తో తగ్గుతున్నారు. మనసు బాగోని వారు అంతోకొంతో మారుతున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగొస్తున్నారు.

ఆరోగ్య యాత్రలంటే మహానగరాల్లో కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లడం కాదు. భారతీయ సంప్రదాయ వైద్యవిధానం ఆయుర్వేదం ఆహ్వానాన్ని మన్నించడం. శాస్త్రీయ యోగాన్ని అభ్యసించడం. ఆధ్యాత్మిక సాధనకు సంసిద్ధులవ్వడం. ఇందుకోసం అడవితల్లి ఒడిలో అద్భుతమైన ఆశ్రమాలు ఉన్నాయి. మంచుకొండల నడుమ మహోన్నతమైన ప్రదేశాలు ఉన్నాయి. అన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవే! మెచ్చిన చోటుకు వెళ్లి మనసుకు నచ్చినన్ని రోజులు ఉండి రావడమే చేయాల్సింది. చేరుకునేదిలా: కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కోవళం 18 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి తిరువనంతపురానికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోవళం మీదుగా సోమతీరం చేరుకోవచ్చు. 


ఆరోగ్యప్రదాతలు 

భారతావనిలో ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే పర్యాటక స్థలాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఆధ్యాత్మిక యోగా శిక్షణ కేంద్రాలే ఎక్కువ. ఆయా కేంద్రాలకు మనవాళ్లే కాదు విదేశీ పర్యాటకులూ క్యూ కడతారు. అలాంటి ప్రదేశాల్లో కొన్ని.. 
* ఈషా ఫౌండేషన్‌, కోయంబత్తూరు 
* ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కేంద్రం, బెంగళూరు 
* శ్రీ అరబిందో ఆశ్రమం, పుదుచ్చేరి 
* పతంజలి యోగ పీఠం, హరిద్వార్‌ 
* గంగా కినారే, రుషీకేశ్‌ 
* ఆనంద ఇన్‌ హిమాలయా, రుషీకేశ్‌ 
* భక్తి కుటీర్‌, గోవా 
ధర్మాలయ కేంద్రం, బిర్‌ (ధర్మశాల) 


మలయయోగం 
కోవళం, కేరళ 

ఆయుర్వేదానికి ఆయువుపట్టు కేరళ. దేశవిదేశాల నుంచి వైద్యం కోసం కేరళలోని పల్లెల చుట్టూ తిరుగుతుంటారు. ఏ రుగ్మతా లేకున్నా.. ప్రకృతి ఆలయంలో నాలుగు రోజులు ఉండటానికి ఇక్కడికి వస్తారు. కోవళం, కొట్టాయం, కొల్లాం, వార్కల తదితర ప్రాంతాల్లోని ఆయుర్వేదశాలలు, వెల్‌నెస్‌ రిసార్టులు పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. కోవళం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమతీరం ప్రత్యేకమైంది. ఆయుర్వేద గ్రామంగా పేరొందిన ఈ ప్రదేశంలో వైద్యశాలలు, రిసార్టులు కోకొల్లలు. అరేబియా సముద్రం అంచున, నిండైన పచ్చదనంతో మెరిసిపోయే సోమతీరం ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్నిస్తుంది. పంచకర్మ, సౌందర్య చికిత్సలు, యోగాభ్యాసం, ఒత్తిడిని తగ్గించే విధానాలు ఇలా ఎన్నో! రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. భోజనం, బస కూడా ప్యాకేజీలో భాగంగా అందిస్తారు. మరిన్ని వివరాలకు somatheeram.org వెబ్‌సైట్‌ని సందర్శించండి. కేరళలోని ఇతర ప్రాంతాల్లోని ఆయుర్వేదశాలల సమాచారం కోసం www.keralatourism.org/ayurveda/ వెబ్‌సైట్‌ చూడండి. 


కరుణ కురిసేలా 
కొడైకెనాల్‌, తమిళనాడు 

తమిళనాడులోని కొడైకెనాల్‌ వేసవి విడిదిగా ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చే వారంతా.. కొండల్లో, కోనల్లో హాయిగా షికార్లు చేస్తారు. కాఫీ తోటల్లో విహరిస్తారు. గుండెల నిండా సంతోషాన్ని నింపుకొని వస్తారు. కానీ, ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో.. దట్టమైన చిట్టడవిలో.. ‘కరుణ ధామ్‌’ ఉంటుంది. కాస్త వీలు చూసుకొని అక్కడి దాకా వెళ్ల గలిగితే.. అదనంగా ఆరోగ్యమూ చేకూరుతుంది. చిటారు కొండన ఉన్న ప్రకృతి ధామమిది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మానసిక ఉల్లాసానికి సేంద్రియ వ్యవసాయం, శారీరక శ్రమ కలిగించే పనులు చేయిస్తారు. వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా బృంద చర్చలు ఉంటాయి. ధామానికి వచ్చిన వారి ఆతిథ్యం పూర్తయ్యేలోపు ప్రకృతితో మమేకం చేసి, పండ్ల తోటల్లో పని కల్పించి అందరిలోనూ కరుణ కలిగిస్తామంటారు నిర్వాహకులు. కరుణధామ్‌లో ఆతిథ్యం కోసం ‌www.karunadham.org.in  వెబ్‌సైట్‌ని సందర్శించండి. 
చేరుకునేదిలా: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం మదురైకి రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొడైకెనాల్‌ వెళ్లొచ్చు. చెన్నై నుంచి మదురై మీదుగా చేరుకోవచ్చు. 


గోకులంలో అతిథిగా 
గోవర్ధన్‌, మహారాష్ట్ర 

సహ్యాద్రి పర్వతాల పాదాల చెంతన తీర్చిదిద్దిన గ్రామం గోవర్ధన్‌. ముంబయి నగరానికి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూల వనాలు, వ్యవసాయ క్షేత్రాలు, గోశాలలు, కుటీరాలు, జాజుతో అలికిన అరుగులు ఇలా పల్లెదనం పల్లవించే చోటిది. ఇస్కాన్‌ నిర్వహిస్తున్న గోవర్ధన్‌ ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కృష్ణ మందిరం నుంచి నిరంతరం లీలగా వినిపించే ‘హరే రామ.. హరే కృష్ణ’ భజనలు పర్యాటకులకు బృందావనంలో విహరిస్తున్నామన్న అనుభూతిని కలిగిస్తాయి. ఒకవైపు ప్రకృతి, మరోవైపు ఆధ్యాత్మికత కలగలసి గోవర్ధన్‌ గ్రామంలో ఒక్కరోజు ఉండగలిగినా ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఓ పది రోజులు ఉండగలిగారా.. అద్భుతమైన జీవన విధానం అలవడుతుంది. ఆలోచనా పరిధి విస్తృతం అవుతుంది. పర్యాటక భక్తుల కోసం తరచూ యోగా క్యాంప్‌లు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు ఇలా ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. అయితే ఇక్కడున్నన్ని రోజులు వారు సూచించిన దినచర్యే పాటించాలి. యోగా, గోసేవ, భజనలు రోజంతా అద్భుతంగా సాగిపోతుంటుంది. ఒక రోజు నుంచి 28 రోజుల వరకూ ఉండొచ్చు. బుకింగ్స్‌, ఇతర వివరాల కోసం ‌www.ecovillage.org.in వెబ్‌సైట్‌ చూడండి. 
చేరుకునేదిలా: గోవర్ధన్‌ ఆశ్రమం.. ముంబయి నుంచి పాల్‌గఢ్‌ వెళ్లే దారిలో ఉంటుంది. ముంబయి నుంచి ట్యాక్సీల్లో ఆశ్రమానికి చేరుకోవచ్చు. 


అతిథి యోగోభవ 
గోకర్ణం, కర్ణాటక 

వెయ్యికిపైగా సంప్రదాయ కుటుంబాల గడపలు, ఆ ఇంటి అరుగులపై దేశవిదేశాల నుంచి వచ్చిన వాళ్లు ప్రాణాయామమో, ఆసనాలో, వేదాలో సాధన చేస్తూ కనిపిస్తారు. ఇంతలో ఇంటావిడ వచ్చి.. ‘వారిని లోపలికి’ రమ్మంటుంది. ఆమె పెట్టిందేదో ఇంత తిని.. మళ్లీ అరుగుపైకి చేరుకొని సాధనలో మునిగిపోతారా అతిథులు. కర్ణాటకలోని గోకర్ణం క్షేత్రంలో ఇంటింటా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. విదేశీయులు, దేశీయులు.. ఏ ప్రాంతం వారికైనా ఇక్కడ ఘనమైన ఆతిథ్యం లభిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు అభ్యసించే వారు కొందరైతే.. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చిన వాళ్లు ఇంకొందరు. అరేబియా ఒడ్డున ఉన్న గోకర్ణ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగానే తెలుసు. కానీ, తరగని సంప్రదాయాలకు నెలవీ పట్టణం. శంకర్‌ప్రసాద్‌ ఫౌండేషన్‌, స్వస్వర, స్పిరిట్యువల్‌ ల్యాండ్‌, గోకర్ణ యోగా స్కూల్‌ ఇలా పాతిక వరకూ యోగా కేంద్రాలు అతిథులను సదా ఆదరిస్తుంటాయి. 


చేరుకునేదిలా: 
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి హుబ్లీ వరకు రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో గోకర్ణం (147 కి.మీ.) చేరుకోవచ్చు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.