close

తాజా వార్తలు

మంచు కరిగే వేళలో..

 

చార్‌ధామ్‌ ద్వారాలు తెరుచుకున్నాయి..అమరనాథుడి దర్శనానికి తరుణం ఆసన్నమైంది..కైలాసగిరికి తరలి వెళ్లే సమయమూ దగ్గరికొచ్చింది..భక్తుల మనసెరిగి.. మంచు కరిగి మహాధామాలకు దారి చూపుతోంది. మరెన్నో విహార కేంద్రాలు మంచు చెర వీడి మనోహరంగా దర్శనమిచ్చే కాలమిది! ఆరేడు నెలలుగా అంటిపెట్టుకున్న తుషారం పరారవ్వడంతో.. అక్కడి గిరులు మరింత హుషారుగా కనిపిస్తాయి సెలయేళ్ల ప్రవాహం జోరందుకుంటుంది..కొండగాలిలో చలి మాయమైనా.. గిలిగింతలు కొనసాగుతాయి..ఆహ్లాదకర వాతావరణంలో అద్భుతాలను ఆస్వాదించాలని భావిస్తున్నారా..? ఎందుకాలస్యం..

చుట్టూ అందాలే: అల్మోరా, ఉత్తరాఖండ్‌ 

చుట్టూ హిమాలయాలు.. కుమావూ పర్వత సానువుల్లో కొలువై ఉన్న అందమైన ప్రాంతం అల్మోరా. కోసి నది ఒడ్డునుండే ఈ పర్వత ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రాల నెలవు. సముద్రమట్టానికి 1650 అడుగుల ఎత్తులో ఉన్న అల్మోరాకు ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడి ఆలయాలను శతాబ్దాల కిందట నిర్మించారు. చాంద్‌ వంశీయుల పాలనలో అల్మోరా పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నందాదేవి ఆలయం, కాసర్‌ దేవి ఆలయం, సమీపంలోని జగేశ్వరధామ్‌ మరెన్నో గుళ్లు యాత్రికులతో కిటకిటలాడుతుంటాయి. హిమాలయాల సౌందర్యం ఇక్కడి నుంచి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం మనసును తేలిక పరుస్తుంది. స్వామి వివేకానంద కాసర్‌దేవి ఆలయ ప్రాంతంలో కొన్నాళ్లు ధ్యానం చేశారని చెబుతారు. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు కావాల్సినంత కాలక్షేపం లభిస్తుందిక్కడ. ట్రెక్కింగ్‌, రివర్‌ రాఫ్టింగ్‌ విన్యాసాల్లో పాలుపంచుకోవచ్చు. గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మ్యూజియం, బిన్సార్‌ జంతు సంరక్షణ కేంద్రం దర్శనీయ స్థలాలు. బిన్సార్‌ పార్క్‌లో జీరో పాయింట్‌ నుంచి అల్మోరా పరిసరాలతో పాటు అల్లంత దూరంలోని కేదార్‌నాథ్‌, నందాదేవి తదితర పర్వతాలనూ వీక్షించవచ్చు. 
* అల్మోరా నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం రాణిఖేత్‌ 45 కి.మీ దూరంలో, నైనిటాల్‌ 63 కి.మీ. దూరంలో ఉంటాయి. 
చేరుకునేదిలా: దిల్లీ నుంచి పంత్‌నగర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి నైనిటాల్‌ మీదుగా అల్మోరా (116 కి.మీ.) రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. 
*దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నైనిటాల్‌ మీదుగా అల్మోరా (105 కి.మీ.)కు వెళ్లొచ్చు.


శివయ్య శీతకాల విడిది: కిన్నౌర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ 

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌.. హిమాలయాల మధ్యలో ఉంటుంది. సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో, టిబెట్‌ సరిహద్దులో ఉంటుంది. శీతకాలంలో దట్టమైన మంచుతో నిండుగా ఉండే ఈ ప్రాంతం మే చివరి నాటికి అద్భుతంగా దర్శనమిస్తుంది. హిమసీమ సొగసులకు పచ్చదనం తోడవ్వడంతో కిన్నౌర్‌ భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. అందుకే కాబోలు.. ఆదిదేవుడు కూడా కిన్నౌర్‌కు తరలి వచ్చాడు. శీతకాలం విడిదిగా దీనిని ఎంచుకున్నాడు. కిన్నౌర్‌లోనూ ఓ కైలాసగిరి ఉంది. ఇది పరమేశ్వరుడి రెండో కైలాస సదనం. ఇక్కడి పర్వతంపై ఉండే శిలను శివలింగంగా భావిస్తారు. కిన్నెర కైలాస్‌గా పిలిచే పర్వతం టిబెట్‌లోని కైలాసగిరిని పోలి ఉండటం విశేషం. గిరిపైనున్న శిల ఉదయం తెలుపు, మధ్యాహ్నం పసిడి వన్నె, సాయంత్రం నీలిరంగులీనుతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. కిన్నౌర్‌ పరిసరాల్లో బౌద్ధ ఆరామాలు కోకొల్లలు. కల్ప, నాకో గ్రామాల్లో వీటిని చూడొచ్చు. సాంగ్లా, చాంగో లోయల్లోనూ ఆరామాలు ఉన్నాయి. సట్లెజ్‌, బాస్పా, స్పిటి నదులు లోయల్లో వేగంగా పరుగులు తీస్తుంటాయి. వీటిలో రాఫ్టింగ్‌ చేయొచ్చు. కల్ప, కిన్నౌర్‌, సాంగ్లా ప్రాంతాల్లో అడ్వెంచర్‌ క్లబ్‌లు ఉన్నాయి. 

చేరుకునేదిలా: దిల్లీ నుంచి సిమ్లాకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్సీలు, బస్సుల్లో కూడా సిమ్లాకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిన్నౌర్‌ (235 కి.మీ.) వెళ్లొచ్చు. ఈ మార్గంలో కొండల అంచున ప్రయాణం ఉద్వేగభరితంగా సాగుతుంది.


రంగుహంగులు: శ్రీనగర్‌, జమ్మూ కశ్మీర్‌ 

మంచు కరిగే వేసవిలో కశ్మీర సౌందర్యం కొత్తగా కనువిందు చేస్తుంది. పూల పల్లకీలు.. పూల అల్లికలు.. శ్రీనగర్‌ విచ్చేసే అతిథులను విశేషంగా ఆకర్షిస్తాయి. తులిప్‌ తోటలో ప్రకృతి ప్రసాదించిన విరులు.. అక్కడ లభించే కార్పెట్లపై కశ్మీరీలు తీర్చిదిద్దిన పుష్పాకృతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శీతవేళలో ధవళకాంతులీనే ఈ హిమనగరి.. వేసవిలో సప్తవర్ణాలతో శోభిల్లుతుంటుంది. నీలాల నింగిని ప్రతిబింబించే దాల్‌ సరస్సు, అందులో పిల్లగాలి కన్నా నెమ్మదిగా సాగే రంగురంగుల గూటిపడవలు, అలలపై అలా ముందుకు వెళ్లాక నీటిపై తేలియాడే కూరగాయల అంగళ్లు.. ఇలా ఈ సరోవరం.. మరోలోకాన్ని మరిపిస్తుంది. శ్రీనగర్‌ వీధుల్లోనూ చీరలమ్మే చిన్నకొట్లు.. దాని పక్కనే పింగాణీ కళాకృతుల దుకాణాలు.. ఆ చెంతనే శాలు‘వాలా’ షాపులు.. అన్నీ రంగులే! ఇన్ని తిరిగాక లోయల్లో విహారం మరవొద్దు. అక్కడి జనావాసాలు వివిధ వర్ణాల్లో అలరిస్తాయి. రోజంతా సాహసయాత్రికులకు ట్రెక్కింగ్‌, పారాగ్లైడింగ్‌ ఈవెంట్లు ఉండనే ఉంటాయి. ఇలా చెప్పుకొంటూ పోతే.. శ్రీనగర్‌ విశేషాలకు ముగింపు ఉండదు. అక్కడి దాకా వెళ్తే గానీ, ఇవన్నీ ఆస్వాదించలేం. 
* శ్రీనగర్‌ నుంచి పహల్గాం 85 కి.మీ దూరంలో ఉంటుంది. మంచు తొలిగిపోవడంతో ఇటీవలే ఈ దారి కూడా తెరుచుకుంది. జూన్‌ 20వ తేదీ నుంచి పహల్గాం సమ్మర్‌ ఫెస్టివల్‌ జరగనుంది. మూడు రోజులు జరిగే ఈ వేడుక సాహసవంతులకు సరైన వేదికగా నిలుస్తుంది. లిద్దార్‌ నదిలో రాఫ్టింగ్‌ చేయొచ్చు. జలక్రీడల్లో తడిసి ముద్దయిపోవచ్చు. మంచు బైక్‌లపై దూసుకుపోవచ్చు. ఇక్కడి బేతాబ్‌ లోయ, అరూవ్యాలీ, మామలేశ్వర్‌ ఆలయం తదితర పర్యాటక కేంద్రాలు చూడొచ్చు. అందాల లోయల్లో గుర్రాలపై స్వారీ చేయొచ్చు. 
* పూలదారిగా పేరున్న గుల్మార్గ్‌... శ్రీనగర్‌ నుంచి 51 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆపిల్‌ తోటలు, ఓక్‌ చెట్ల బారులతో అద్భుతంగా ఉంటుందీ ప్రాంతం. శీతకాలంలో స్కేటింగ్‌ విన్యాసాలకు వేదికగా నిలిచే గుల్మార్గ్‌లో ఇప్పుడు రాఫ్టింగ్‌ జోరుగా సాగుతుంది. కేబుల్‌ కారులో గుల్మార్గ్‌ అందాలను వీక్షించవచ్చు.

చేరుకునేదిలా: 
* దిల్లీ నుంచి శ్రీనగర్‌కు విమానంలో వెళ్లొచ్చు. 
* సికింద్రాబాద్‌, విజయవాడ, వరంగల్‌, నెల్లూరు, ఒంగోలు నుంచి జమ్మూ వెళ్లే రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు సుమారు 266 కిలోమీటర్లు. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. ఈ ప్రయాణం భలే పసందుగా ఉంటుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.