close

తాజా వార్తలు

ఆఫ్‌బీట్‌గా... ఆనందంగా

ఏదయినా కొత్త ఊరు వెళ్తే... అక్కడ దొరికే వస్తువుల్ని తెచ్చుకుని మురిసిపోతాం. అందరికీ గొప్పగా చూపిస్తాం. అక్కడితోనే ఆగిపోకుండా... స్థానికంగా ఉండే రైతులతో వ్యవసాయం చేసే అవకాశం వస్తే... గ్రామీణుల ఇళ్లలో బస చేసి... వారి వంటల్నీ నేర్చేసుకుంటే... ఆ అనుభూతే వేరు కదూ! హైదరాబాద్‌కు చెందిన వందనా విజయ్‌ తన సంస్థ ఆఫ్‌బీట్‌ ట్రాక్స్‌ ద్వారా అలాంటి జ్ఞాపకాలనే మనకు అందిస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుదందంటే...

ఇప్పటివరకూ సుమారు ఐదువందలకు పైగా వైవిధ్యమైన టూర్లను ఏర్పాటు చేయగలిగాం. అమ్మాయిలకోసం ప్రత్యేకంగా  టూర్లు ఉంటాయి. ఒంటరిగా ప్రయాణం చేయాలనుకునేవారికి అవసరమైన భద్రత కల్పిస్తాం.  దేశవిదేశాల్లో సుమారు రెండువందలకు పైగా ప్రాంతాల్లో మేం ఈ పర్యటనలు నిర్వహిస్తున్నాం. లద్దాక్‌, కశ్మీర్‌, సిక్కిం, శ్రీలంక, కంబోడియా, భూటాన్‌, మేఘాలయ, అసోం, నాగాలాండ్‌, కూర్గ్‌, ఒడిశా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి  చోట్ల ఈ పర్యటనలు నిర్వహిస్తున్నాం.

ర్యటనలు... మనలో కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. భిన్న సంస్కృతుల్ని తెలియజేస్తాయి. ఆ ప్రయాణం ఎప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోయేలా చేయాలన్నదే నా ఆలోచన. అందుకే రూరల్‌ టూరిజం, ఎకోటూరిజం ప్రధాన అంశాలుగా ఆఫ్‌బీట్‌ ట్రాక్స్‌ని ప్రారంభించా. ఈ ఆలోచన రావడానికి నాకు ఎదురైన అనుభవమే కారణం. మా నాన్న ఆర్మీ ఆఫీసర్‌. నా చదువంతా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సాగింది.  వెళ్లిన చోటల్లా నాకు కొన్ని జ్ఞాపకాలు ఉండిపోయాయి. ప్రయాణాలపై ఇష్టం పెరిగింది. ఏ కాస్త సమయం దొరికినా... నచ్చిన ప్రాంతానికి వెళ్లేదాన్ని. వాటిల్లో ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాలు ఉండేవి. నేను ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా లద్దాక్‌లో వలంటీరుగానూ పనిచేశా. అప్పుడే అక్కడ గ్రామీణుల జీవనాన్ని దగ్గర్నుంచి చూసి ఇష్టం పెంచుకున్నా. అప్పటికే ఫేస్‌బుక్‌లో చేస్తున్నా. కార్పొరేట్‌ కెరీర్‌లో నిచ్చెనలు ఎక్కడం కంటే...ఈ పని సంతృప్తినిస్తుందని నమ్మా. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటువైపు వచ్చా.

అలా మొదలుపెట్టా...
టూరిజం సంస్థ అనగానే కొన్ని ప్యాకేజీలు ఇచ్చి ప్రయాణాలు ఏర్పాటు చేస్తే కొత్తేమీ ఉండదు. పర్యటకులు వెళ్లే ప్రదేశంలో స్థానికంగా గ్రామీణుల ఇళ్లల్లో బస చేయడం, అక్కడి ఆహారాన్ని రుచి చూడటం, వారి వంటలు నేర్చుకోవడం, ఉపాధి తెలుసుకోవడం, స్థానిక ప్రాంతాలని వారితో కలిసి చూసి రావడం వంటివన్నీ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలనుకున్నా. దీనివల్ల స్థానికులకు ఆదాయం కూడా అందుతుంది. వారి జీవనం మెరుగుపడుతుంది. మా వంతుగా గ్రామీణ ప్రాంతాభివృద్ధికి తోడ్పడినట్లూ అవుతుందని అనిపించింది. నిజానికి చిన్నప్పటినుంచీ గ్రామీణ భారతంలోని మారుమూల ప్రజల్ని ప్రభావితం చేసేలా పని చేయాలనుకున్నా. అది ఆఫ్‌బీట్‌ ట్రాక్స్‌తో సాధ్యమయ్యింది. పక్కా ప్రణాళికతో మూడేళ్లక్రితం మా సేవల్ని హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా అందుబాటులోకి తెచ్చాం.

ఎన్నో అనుభవాలు...
ఈ రంగంలో ఇప్పుడు ఎన్నో మార్పులు. ఏదో ఒక ఊరికి కాకుండా... ఎవరికివారు కస్టమైజ్డ్‌ ప్లాన్స్‌ అడుగుతున్నారు. సైట్‌ సీయింగ్‌ అంటే...అలా చూసి వచ్చేయడం కాకుండా కొత్త కొత్త అనుభవాల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. అదీ ఒకవిధంగా మంచిదే. దీనివల్ల గ్రామీణులు  అదనంగా కొంత సంపాదించుకోగలుగుతారు. సూటిగా చెప్పాలంటే... పర్యటకులకు వారి ఇళ్లల్లో బస చేసే అవకాశం కల్పించడం, వారికి భోజనాన్ని అందించడం వంటివాటిద్వారా ఆదాయం పొందగలుగుతారు. వాళ్లు స్థానికుల రోజువారీ జీవితంతో మమేకమై కొత్త ప్రాంతాలను చూడగలుగుతారు. ఉదాహరణకు... కశ్మీర్‌ లోయల్లో ఉన్ని దుస్తుల అల్లిక వారి ప్రధాన ఉపాధి మార్గం. అక్కడికి వెళ్తే అల్లడమూ నేర్చుకోవచ్చు. స్థానికంగా వారి నుంచి కొనుగోలు చేయొచ్చు. నాగాలాండ్‌లో రెడ్‌రైస్‌, బ్లాక్‌ రైస్‌ వంటివెన్నో వైవిధ్యమైన పంటల్ని చూడొచ్చు. వ్యవసాయంపై ఇష్టం ఉన్నవారు వారితో కలిసి సరదాగా పనిచేయొచ్చు. వాళ్ల వంటింట్లో వంటలు చేయొచ్చు. వారివంటల్ని నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా భిన్న ప్రాంతాలకు ప్రయాణించేవారికి కొత్త అనుభవాల్ని ఇస్తాయి.

సమస్యలు ఉన్నాయి...
ఇదంతా చెప్పినంత సులువేం కాదు. ముందు స్థానికులు మనల్ని నమ్మాలి. సంస్థ ప్రారంభించే ముందే... వారికి సుస్థిర ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించాం. మా బృందం వారంలో ఐదు రోజులు వారితో పాటు ఉంటూ వారి జీవనశైలిని తెలుసుకునేది. మంచి చెడులు విచారించేది. స్థానికంగా ఉండే అమ్మకందార్లను ఒప్పించగలిగాం. మాకు ఎదురైన మరో ప్రధాన సమస్య... ఆయా ప్రాంతాల భాష. అదీ ఎంతోకొంత నేర్చుకున్నాం. మేం ఎంచుకున్నవన్నీ మారుమూల పర్వత ప్రాంతాలు.. అక్కడ కొన్నిచోట్ల తిరుగుబాట్లు, అధికవర్షాలు, మంచు... వంటి సమస్యలెన్నో ఎదురయ్యేవి. ఓ సారి లద్దాక్‌లో విపరీతంగా మంచు కురవడం వల్ల మూడు నెలల పాటు నెట్‌వర్క్‌ తెగిపోయింది. అక్కడ ఇలాంటి పరిస్థితి మామూలే. మొదటిసారి కంగారుపడ్డాం కానీ... తరువాత జాగ్రత్తలు తీసుకున్నాం. మా పర్యటకుల భద్రత కోసం ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాం. ప్రత్యామ్నాయంగా ఇతర పర్యటక ప్రాంతాలకు వారిని తరలిస్తాం. మరోసారి సిక్కిం, భూటాన్‌ ప్రాంతాల్లో గూర్ఖాల్యాండ్‌ ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో మా బృందం మధ్యలో ఇరుక్కుపోయింది.   వారిని భద్రంగా అసోం పర్యటక ప్రాంతానికి మార్చగలిగాం. ఇవన్నీ సవాళ్లే...

గ్రామీణాభివృద్ధి కోసం....
పర్యటకంతో పాటు ఎకోటూరిజం, గ్రామాభివృద్ధీ ముఖ్యమే. అందుకే లోకల్‌ కాటేజీల నిర్మాణంతో స్థానిక గ్రామాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నాం. సౌరవిద్యుత్తు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే లద్ధాఖ్‌ లోయలోని టాక్‌మాచిక్‌, జన్‌స్క్రార్‌ వంటి గ్రామాల్లో సౌర విద్యుత్తుని ఏర్పాటు చేశాం. వారి ప్రత్యేకతలైన హస్తకళల్ని అమ్ముకుని ఆదాయ మార్గాన్ని పెంచుకునేలా ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాం. ఇందుకు కొన్ని ఎన్‌జీవోలూ మాకు సాయం చేస్తున్నాయి. మా వ్యాపారానికి ప్రధాన వేదిక ఫేస్‌బుక్‌. వెబ్‌సైట్‌ ఉన్నప్పటికీ ఎక్కువగా దీని ద్వారానే మేం మార్కెటింగ్‌ చేస్తాం. ఇప్పటివరకూ సొంత డబ్బునే సంస్థ కోసం వెచ్చించా. నేను ఆదాయం పొందుతూ, మరికొందరికి ఉపాధి కల్పిస్తూ, గ్రామీణాభివృద్ధికి పనిచేయడం కన్నా ఇంకేం కావాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.