close

తాజా వార్తలు

లాభంగా వెళ్లి.. క్షేమంగా రండి

దసరదాకు సన్నద్ధం

దసరా సెలవులు ఎప్పుడా? అని ఇప్పట్నుంచే క్యాలెండర్‌ తిరిగేస్తుంటారు పిల్లలు. సెలవుల్లో యాత్రకు వెళ్తే...! అని పెద్దల ఆలోచన. ఇవన్నీ అనుకుంటుండగానే.. కాలం కరిగిపోతుంది.. సెలవులు దగ్గర పడ్తాయి. రైల్వే వెయింటింగ్‌ లిస్ట్‌లో పేరు వెతుక్కోవడమే మిగులుతుంది. దసరా విహారం సరదాగా సాగిపోవాలంటే.. ఇప్పుడే స్పందించండి.. ఇలా సన్నద్ధమవ్వండి.

పండగ దగ్గర పడుతున్న కొద్ధీ. బస్‌ టికెట్ల ధరలు రెండింతలుంటాయి. రైళ్ల గురించి ఆలోచించే ప్రసక్తే ఉండదు. చూస్తుండగానే సెలవులు అయిపోతుంటాయి. విహారం వాయిదా పడుతుంది. ముందుగా సన్నద్ధం కాకపోతే ఇదీ పరిస్థితి. సరైన సమయంలో ఏర్పాట్లన్నీ చేసుకోగలిగితే.. యాత్ర సజావుగా సాగుతుంది. విహారానికి వెళ్లాలని అనుకున్నాక.. అందుబాటులో ఉన్న వనరులను పక్కాగా ఉపయోగించుకోగలిగితే.. అంతో ఇంతో ఖర్చూ కలిసి వస్తుంది.

పక్కాగా అంచనా..

టికెట్లు, బస.. ఎంత ముందుగా ఈ ఏర్పాట్లు చేసుకుంటే అంత మంచిది. ఫలానా ప్రదేశానికి వెళ్లాలని అనుకున్న తర్వాత.. అక్కడికి చేరడానికి అనువైన మార్గమేమిటో తెలుసుకోవాలి. విమాన యానమా, రైలు మార్గమా నిర్ణయించుకున్న తర్వాత మిగతా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి.

ముందుగా ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయానికి రావాలి. పర్యాటక కేంద్రం ఎంపికలో కుటుంబసభ్యుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి.

వాతావరణం, ప్రయాణ వసతి, బస సౌకర్యం తదితర విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

పర్యటన ఎన్ని రోజులు, బడ్జెట్‌ పరిధిపై కచ్చితమైన అంచనాకు రావాలి.

అనుకున్న బడ్జెట్‌లో ఏమైనా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయేమో తెలుసుకోవాలి.

ఆఫర్లుంటాయ్‌..

విహారయాత్ర బడ్జెట్‌ను నిర్ణయించేది ప్రయాణ టికెట్లు, బస ఖర్చులే. టికెట్లు ఎంత ముందుగా బుక్‌ చేసుకుంటే అన్ని ఆఫర్లు లభించే ఆస్కారం ఉంటుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు రీడిమ్‌ పాయింట్లతోనూ విమాన టికెట్లు, ఇతర టికెట్లు బుక్‌ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పలు వెబ్‌సైట్లు టికెట్‌ బుకింగ్‌పై ఊరించే ఆఫర్లు ఇస్తుంటాయి. పండగ సీజన్‌ దగ్గరికొచ్చే కొద్దీ వీటికి డిమాండ్‌ పెరుగుతుందని గుర్తించండి. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు బుకింగ్స్‌పై వాయిదాల ఆఫర్లు కూడా ఉంటాయి. వాటిని ఉపయోగించుకుంటే.. ప్రయాణ భారం తగ్గుతుంది. మేక్‌మై ట్రిప్‌, క్లియర్‌ట్రిప్‌ వంటి ట్రావెల్‌ యాప్‌లు ప్యాకేజీలపై వాయిదాలు ప్రకటిస్తుంటాయి. సున్నా వడ్డీపై లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు విహారయాత్రలకు రుణాలు అందిస్తున్నాయి. తక్కువ వడ్డీతో సులభ వాయిదాల్లో చెల్లించవచ్ఛు దేశీయ విహారాలకు రుణం అవసరం రాకపోవచ్ఛు బ్యాంకు రుణంతో.. విదేశీ పర్యటన కల నెరవేర్చుకోవచ్ఛు.

ఇవీ చూసుకోండి..

దసరా పర్యటనల్లో.. వినోదయాత్రలే కాకుండా.. తీర్థయాత్రలూ ఉంటాయి. రామేశ్వరం నుంచి కాశీ, పూరీ నుంచి ద్వారక వరకు ఏ క్షేత్ర పర్యటనకైనా ఈ సమయం అనుకూలమే. అందుకే చాలామంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న పర్యాటక కేంద్రాలనూ చుట్టేస్తుంటారు. దసరా నవరాత్రుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దర్శనం వేళల్లో మార్పులు ఉంటాయి. తీరా అంతదూరం వెళ్లిన తర్వాత.. దర్శనం చేసుకోలేకపోతే యాత్ర సంపూర్ణం కాలేదనిపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా అవసరమైన సమాచారం పొందవచ్ఛు.

వాళ్లకు ప్రత్యేకం..

సెలవుల్లో విహారాలన్నీ.. దాదాపుగా సకుటుంబ సమేతంగానే ఉంటాయి. ప్రయాణం ఆద్యంతం ఆనందంగా సాగాలంటే.. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. ప్రయాణానికి ముందే వ్యక్తిగత వైద్యుడిని కలిసి.. తగిన సూచనలు, అత్యవసర పరిస్థితుల్లో వేసుకోవాల్సిన మందుల వివరాలు తెలుసుకోవాలి. సొంత వాహనాల్లోనే బయల్దేరినా.. గంటల తరబడి ప్రయాణించొద్ధు బృందంలో వయసు పైబడిన వారుంటే.. ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. నాలుగైదు గంటలకు ఒకసారి అరగంట విరామం ఇవ్వడం మరచిపోవద్ధు అర్ధరాత్రి, అపరాత్రి ప్రయాణాలు చేయొద్ధు రాత్రయ్యేసరికి ఏదైనా బస కేంద్రానికి చేరుకునేలా ప్రణాళిక ఉండాలి. వీలైనంత ముందుగా స్పందించి.. ఈ నియమాలన్నీ పాటిస్తే.. లాభంగా వెళ్తారు.. క్షేమంగా వస్తారు.

దసరా సంబరాలు మిన్నంటే పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ఆయా ప్రాంతాలు చుట్టొచ్చేలా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే.. స్వామి కార్యం.. స్వకార్యం రెండూ కలిసి వస్తాయి.

మైసూర్‌ టు అగుంబే

దసరా వైభవం చూడాలంటే మైసూర్‌కు వెళ్లాల్సిందే. లక్షల మంది ప్రజలు పాల్గొనే మైసూర్‌ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతిని కళ్లముందు ఉంచుతాయి. మైసూర్‌ నుంచి ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నెన్నో చారిత్రక, ఆధ్యాత్మిక విహార కేంద్రాలు పలకరిస్తాయి. మైసూర్‌, బేలూరు, హాలిబేడు, చిక్కమగళూరు, హోరనాడు, శృంగేరి, అగుంబే దారిలో అద్భుతమైన ఆటవిడుపు లభిస్తుంది. మైసూర్‌ దాకా రైలులో వెళ్లి.. అక్కడి నుంచి ట్యాక్సీలో ఇవన్నీ చూసేయొచ్ఛు.

రాజ్‌కోట్‌ టు డయ్యూ

దాండియా ఆటలు, పడుచుల పాటలతో దసరా వేళలో గుజరాత్‌ అంతా సరదాలే కనిపిస్తాయి. సంప్రదాయాలు ఒకవైపు, నోరూరించే వంటకాలు మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అక్కడి దాకా వెళ్తేనే కదా.. వీటిని ఆస్వాదించగలం. తెలుగు రాష్ట్రాల నుంచి టూర్‌ ఆపరేటర్లు ద్వారక, సోమ్‌నాథ్‌ యాత్రలు నిర్వహిస్తున్నారు. రాజ్‌కోట్‌, ద్వారక, పోరుబందర్‌, సోమ్‌నాథ్‌, డయ్యూ ప్రాంతాల విహారం ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తుంది. అహ్మదాబాద్‌ వరకు రైళ్లు, విమానంలో వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పర్యటన కొనసాగించవచ్ఛు.

కోల్‌కతా వీధుల్లో

దసరా నవరాత్రులకు చిరునామా కోల్‌కతా నగరం. వీధివీధిలో అమ్మవారి మంటపాలు వెలుస్తాయి. ఇంటింటా పండగ సందడి కనిపిస్తుంది. దీనిని ఆస్వాదించాలంటే దసరా కన్నా మించిన సమయం లేదు. కోల్‌కతా విహారం చరిత్రను పరిచయం చేస్తుంది. సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. రామకృష్ణ పరమహంస, వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి మహనీయుల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. పనిలోపనిగా సుందర్‌బన్‌, డార్జిలింగ్‌, విష్ణుపూర్‌ తదితర ప్రదేశాలూ చూడొచ్ఛు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.