close

తాజా వార్తలు

ఈ అడవిలో దాగిపోదామా!

వారాంతంలో..

చాలా పట్టణాల్లో హరితవనాలు ఉంటాయి. నిండైన పచ్చదనంతో కనువిందు చేస్తాయి. మహబూబ్‌నగర్‌ సమీపంలోని మయూరి ఎకో పార్క్‌ ప్రత్యేకమైంది. అటవీశాఖ పరిధిలో ఉన్న నర్సరీ అద్భుత హరితవనంగా రూపుదిద్దుకుంది. జిప్‌లైన్‌, జిప్‌ సైకిల్‌, టైర్‌ వాక్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి ఈవెంట్లతో సాహసవంతుల అడ్డాగా మారింది. వారాంతపు విహార కేంద్రంగా అందరినీ అలరిస్తోంది.

సాధారణంగా పార్కుల్లో విహారం ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటుంది. ఈ వనంలో రాత్రంతా ఉండొచ్చు. గుడారాల్లోకి దూరి.. నిద్రలోకి జారుకోవచ్చు. నింగి వంక చూస్తూ చుక్కల్ని లెక్కించవచ్చు. 24 గంటలు హరిత వనంలో ఉండడానికి ఒక్కరికి రూ.1,200 చెల్లిస్తే చాలు.. రేయంతా కీచురాళ్ల సందడి వింటూ దట్టమైన అడవిలో ఉన్నామన్న అనుభూతిని పొందవచ్చు. ప్యాకేజీలో భాగంగా రాత్రి బస, భోజనం, మర్నాడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తారు. మధ్యలో స్నాక్స్‌ ఇస్తారు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లే పర్యాటకులు రూ.800 చెల్లిస్తే మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్‌ ఏర్పాటు చేస్తారు. రాత్రంతా వనదేవత ఒడిలో సేదతీరిన పర్యాటకులు ఉదయం ట్రెక్కింగ్‌, సాహస శిబిరం ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఇక్కడి కరెన్సీ పార్క్‌ జోన్‌లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నమూనాలతో ఏర్పాటు చేసిన బోర్డులు మరో ఆకర్షణ.

స్ప్రింకర్ల సాయంతో కృత్రిమ వర్షం కురిపించే జోన్‌.. వనంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అడవిలో వర్షంలో తడిసిన అనుభూతి పొందుతున్నారు. ఈ జోన్‌లోకి ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50. వనంలో సాధారణ పర్యటనకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 రుసుం చెల్లించాలి. జిప్‌ సైకిల్‌ కోసం రూ.100, జిప్‌లైన్‌ కోసం రూ.50 రుసుం వసూలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో నడక కోసం 4 కి.మీ. ట్రాక్‌ ఏర్పాటు చేశారు.

చేరుకునేదిలా: హరితవనం మహబూబ్‌నగర్‌ నుంచి 10 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌-కర్నూలు రహదారిలోని జడ్చర్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్లే మార్గంలో 5 కి.మీ. ప్రయాణిస్తే హరితవనం చేరుకోవచ్చు. ఎకోపార్క్‌లో విహారం, బస వివరాల కోసం www.mayuriecopark.com వెబ్‌సైట్‌ని సందర్శించండి.

- షర్ఫొద్దీన్‌, వీరన్నపేట


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.