close

తాజా వార్తలు

కొత్త జంటల..ప్రణయానం

ముహూర్తాల కాలం వచ్చేసింది.. పర్యాటక సీజన్‌ జోరుమీదుంది..కొంగుముడి వేసుకున్న కొత్తదంపతులకు కొంగొత్త ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయ్‌! అందుబాటు ధరలోనే చేరుకునే అందాల సీమలు ఎన్నో ఇంకేం.. నచ్చిన ప్రదేశానికి హనీమూన్‌కు వెళ్లండి చలిగింతలకు గంతలు కట్టేయండి ప్రణయనాదంతో మధుర ప్రయాణం మొదలుపెట్టండి

ర్యాటక పర్వంలో నవంబరు-ఫిబ్రవరి కాలం ఉత్తమోత్తమం. ఈ సమయంలో శరత్‌ చంద్రికలు మనసును ఉల్లాసపరుస్తాయి. హేమంత వెన్నెల మంచు కురిపించి.. తనువును పరవశింపజేస్తుంది. అందుకే వినోదయానాలు, తీర్థయాత్రలు విశేషంగా సాగే కాలమిది. మంచి తరుణం ముంచుకొస్తున్న వేళ ఒక్కటవుతున్న జంటల కోసం హనీమూన్‌ ప్యాకేజీలు సిద్ధంగా ఉన్నాయి. పరిమితి దాటని బడ్జెట్‌లోనే అపరిమిత ఆనందాన్నిచ్చే ప్రదేశాలు బోలెడున్నాయి. కేరళలో.. మున్నార్‌, కొట్టాయం, అలెప్పీ, కుమరకోమ్‌, తమిళనాట.. ఊటీ, కొడైకెనాల్‌, ఎలగిరి, కర్ణాటకలో.. కూర్గ్‌, గోకర్ణం, చిక్కమగళూరు, మహారాష్ట్రలో.. లోనావాలా, మహాబలేశ్వర్‌, మధ్యప్రదేశ్‌లో.. ఖజురహో, పచ్‌మడీ ఇలా వివిధ రాష్ట్రాల్లో రకరకాల పర్యాటక కేంద్రాలు.. నవదంపతులను స్వాగతిస్తున్నాయి. మంచుతెరలు కమ్ముకొచ్చే వేళ ఉత్తరాది సుమనోహరంగా మారిపోతుంది. నచ్చిన చోటుకు వెళ్లిపోవడమే చేయాల్సింది. అక్కడి పరిసరాలే కాగల కార్యానికి కార్యోన్ముఖులను చేస్తాయి.

ఒకే గొడుకు కింద కొడుగు, కర్ణాటక

టు చూసినా పచ్చదనం.. కావేరీ నది పరవళ్లు.. కమ్ముకొచ్చే పొగమంచు.. కొత్తజంటకు ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. అలాంటి పరిసరాలను పరిచయం చేస్తుంది కూర్గ్‌. దీనికే కొడుగు అని పేరు. స్కాట్లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందింది. పడమటి కనుమల్లో సముద్ర మట్టానికి 1750 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొడుగు జిల్లా కేంద్రం మడికెరి చుట్టూ పర్యాటక కేంద్రాలే. ప్రణయ సీమలే. జలపాతాలు, కాఫీ తోటలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, భారీ రిసార్టులతో అలరిస్తుంది. వనం మధ్యలో ఉండే ఉడెన్‌ కాటేజీల్లో బస మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. రివర్‌ రాఫ్టింగ్‌, ట్రెక్కింగ్‌ చేయొచ్ఛు

చేరుకునేదిలా: మడికెరి.. మైసూర్‌ నుంచి 118 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీల్లో మడికెరి వెళ్లొచ్ఛు అక్కడి నుంచి ట్యాక్సీల్లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టేయొచ్ఛు.

కొత్త విడిది లాన్స్‌డౌన్‌, ఉత్తరాఖండ్‌

హిమగిరి సోయగాలు, జలపాతాల హొయలు లాన్స్‌డౌన్‌ వచ్చిన పర్యాటకులను అలరిస్తాయి. పైన్‌ చెట్లు, పచ్చిక బయళ్లతో నిండి ఉన్న పరిసరాలు చలితీవ్రతను పట్టించుకోకుండా చేస్తాయి. దిల్లీవాసుల వారాంతపు విహార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన లాన్స్‌డౌన్‌.. ఆంగ్లేయుల కాలంలో వేసవి విడిదిగా పేరొందింది. ట్రెక్కింగ్‌, బోట్‌ రైడింగ్‌ యువజంటల ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇక్కడి రిసార్ట్‌లు ఘనమైన ఆతిథ్యాన్ని అందిస్తాయి. చుట్టుపక్కల తాండకేశ్వరాలయం, కణ్వ మహర్షి ఆశ్రమం, స్నో వ్యూపాయింట్‌, కాలాగఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ తదితర ప్రదేశాలు కాలక్షేపానికి చిరునామాగా నిలుస్తాయి.

చేరుకునేదిలా: లాన్స్‌డౌన్‌.. కోట్‌ద్వార్‌ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దిల్లీ నుంచి కోట్‌ద్వార్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్ఛు మీరట్‌ నుంచి కూడా రోడ్డు మార్గంలో (170 కి.మీ.) లాన్స్‌డౌన్‌కు వెళ్లొచ్ఛు విజయవాడ నుంచి మీరట్‌కు రైళ్లున్నాయి.

మినీ స్విస్‌ ఖజ్జియార్‌, హిమాచల్‌ప్రదేశ్‌

హిమాచల్‌ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఉంటుంది ఖజ్జియార్‌. మినీ స్విట్జర్లాండ్‌గా దీనికి పేరు. దట్టంగా విస్తరించిన దేవదారు వనం మధ్యలో విశాలమైన మైదానాలతో కనువిందు చేస్తుంది. సాహస క్రీడల అడ్డాగా పేరుంది. హనీమూన్‌ స్పాట్‌గా గుర్తింపు పొందింది. ఈ చిన్న పర్వత పట్టణంలో కొండంత ఆనందం దొరుకుతుంది. ఖజ్జియార్‌ సరస్సు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే! పారాగ్లైడింగ్‌ చేస్తూ.. వినువీధుల నుంచి ఖజ్జియార్‌ సౌందర్యం చూసేయొచ్ఛు 12వ శతాబ్దంలో నిర్మించిన నాగాలయం అద్భుతంగా ఉంటుంది. కాలాటాప్‌ జంతుసంరక్షణ కేంద్రం సందర్శనీయ స్థలం. కాటేజీలు, రిసార్టులు చాలా ఉంటాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం డల్హౌసీ ఇక్కడికి 22 కి.మీ. దూరంలో ఉంటుంది.

చేరుకునేదిలా: దిల్లీ నుంచి పఠాన్‌కోట్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఖజ్జియార్‌ (102 కి.మీ.) చేరుకోవచ్ఛు విజయవాడ నుంచి పఠాన్‌కోట్‌కు రైళ్లున్నాయి.

కొంకణ సౌందర్యం తార్‌కర్లీ, మహారాష్ట్ర

కొంకణ తీరం సౌందర్యమే వేరు. అందులో మహారాష్ట్రలోని తార్‌కర్లీ ప్రత్యేకం. తెల్లటి ఇసుక తిన్నెలు.. పచ్చదనంతో మెరిసిపోయే సముద్ర జలాలు.. అందరినీ అలరిస్తాయి. విశాలమైన తీరంలో వెన్నెల రాత్రుల్లో విహారం మనసులో కొత్త ఊసులు ఊరించేలా చేస్తుంది. అడ్వెంచర్‌ డెస్టినేషన్‌గా పేరున్న తార్‌కర్లీలో స్కూబాడైవింగ్‌, స్పీడ్‌బోటింగ్‌ వంటి ఈవెంట్లతో కాలం ఇట్టే కరిగిపోతుంది. కర్లీ నది అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రాంతంలో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, పైగా సముద్ర తీరం.. వీటిని ఆస్వాదించడానికి వీలుగా రకరకాల రిసార్టులు ఉన్నాయి. బడ్జెట్‌ బస నుంచి ఖరీదైన వసతి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని మహాపురుష, విఠల ఆలయాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. మాల్వన్‌లోని సింధ్‌దుర్గ్‌ కోట చారిత్రక వైభవాన్ని చూపుతుంది. తార్‌కర్లీ నుంచి గోవా 130 కి.మీ. దూరంలో ఉంటుంది.

చేరుకునేదిలా: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ నుంచి వాస్కో-డా-గామాకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తార్‌కర్లీ చేరుకోవచ్ఛు హైదరాబాద్‌, తిరుపతి నుంచి బెళగావికి (బెల్గాం) రైళ్లో వెళ్లి అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో తార్‌కర్లీ (148 కి.మీ.) చేరుకోవచ్ఛు.

బడ్జెట్‌లో విదేశాలకు

కప్పుడు హనీమూన్‌ అంటే తెలుగునాట అరకు.. పొరుగు రాష్ట్రమైతే ఊటీ, కొడైకెనాల్‌. కాస్త సంపన్నులైతే కులు, మనాలి.. ఇవే ఉండేవి. బడ్జెట్‌లో ప్యాకేజీలు అందుబాటులో ఉండటంతో ఇప్పుడు ఎంతోమంది విదేశాలకూ వెళ్తున్నారు. బాలీ, భూటాన్‌, నేపాల్‌, కంబోడియా, మారిషస్‌, మాల్దీవులు, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, శ్రీలంక తదితర దేశాలను హనీమూన్‌ గమ్యాలుగా ఎంచుకుంటున్నారు. ఇండోనేషియాలోని బాలీ ద్వీపం సర్వహంగులతో స్వర్గాన్ని తలపిస్తుంది. మారిషస్‌, మాల్దీవుల్లోని సముద్రతీరాలు సాహస క్రీడలతో స్వాగతం పలుకుతున్నాయి. నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, కంబోడియా లాంటి దేశాల్లోని ప్రశాంత నెలవులు.. అంతులేని ఆనందాన్ని పరిచయం చేస్తున్నాయి. ట్రావెల్‌ ఆపరేటర్లు, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థలు.. ఊరించే ధరలో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నాయి. రోజులను బట్టి ప్యాకేజీ ధరలు రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు ఉంటున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.