close

తాజా వార్తలు

ఇదో.. 24 ఫ్రేముల కోర్సు కథ! 

లైట్స్‌.. కేమెరా.. యాక్షన్‌! 
కెరియర్‌ గైడెన్స్‌ సినిమా, టీవీ రంగాలు

ఇదో.. 24 ఫ్రేముల కోర్సు కథ! 

సినిమా... ప్రతి ఒక్కరిని ఆకర్షణతో కట్టిపడేసే రంగుల ప్రపంచం.  లక్షలాదిమందికి ఉపాధి కల్పించే కల్పతరువు. నటులు, దర్శకులు, రచయితలు, సంగీత నిపుణులు, టెక్నీషియన్లు... ఇలా ఎందరో ఈ చలనచిత్ర ఛత్రం కింద లైట్స్‌.. కేమెరా.. యాక్షన్‌.. కట్‌ అనే సినీ బీజాక్షరాలతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.  వెండితెరతోపాటు బుల్లితెర కూడా ఇప్పుడు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. షార్ట్‌ఫిల్మ్‌లూ, వెబ్‌ సిరీస్‌లూ సరికొత్త ట్రెండ్‌లు. ఈ తారాలోకంలోకి అడుగుపెట్టాలంటే వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులతోపాటు కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది. 
పేరు ప్రతిష్ఠలు, అభిమానులు, సెలబ్రిటీ హోదా, మంచి ఆదాయం.. వీటన్నిటినీ కొద్దికాలంలోనే అందించగలిగేవి సినిమా, టీవీలు. అందుకే యువతీయువకులకు ఈ వినోద రంగంపై అమితాసక్తి. దీనిలో సృజనాత్మకతకు సాంకేతికత మిళితమై ఉంటుంది. ఒక సినిమా గానీ, టెలి ఫిల్మ్‌/ సీరియల్‌ గానీ విజయవంతంగా రూపొందడానికి వివిధ రకాల నిపుణుల అవసరం ఉంటుంది. యాక్టింగ్‌, డైరెక్షన్‌, ప్రొడ్యూసింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, సినిమాటోగ్రఫీ, సౌండ్‌ రికార్డింగ్‌, విజువల్‌ మిక్సింగ్‌, ఎడిటింగ్‌ మొదలైనవన్నీ ఇందులో భాగమే. 
ఫిల్మ్‌ మేకింగ్‌ పోటీ ఎక్కువుండే రంగం. విస్తృత ఉద్యోగావకాశాలనూ కల్పిస్తోంది. ఏటా అధిక సంఖ్యలో సినిమాలు (800కు పైగా) రూపొందిస్తున్న దేశంగా మనకు పేరుంది. టెలివిజన్‌లో వినోద కార్యక్రమాలూ, గేమ్‌ షోలూ, సీరియళ్లూ ఇంటిల్లపాదినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా, టీవీ రంగాల్లో రాణించాలంటే ఆసక్తితోపాటు ప్రతిభ ఉండాలి. దాన్ని సానపెట్టుకునేందుకు ఎన్నో సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. 
కోర్సుల వివరాలు 
బ్యాచిలర్స్‌, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని చదవడానికి ఒక్కో సంస్థ ఒక్కో విధమైన అర్హతలను కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను చదవడానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను కనీసం 50% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. పీజీ కోర్సులకు ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కొన్ని పీజీ కోర్సులకు ఆర్ట్స్‌ విభాగంలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చదివివుండటం తప్పనిసరి. కోర్సుల్లో కొన్ని సినిమాకు చెందిన 24 విభాగాలపైనా అవగాహన కల్పిస్తున్నాయి. మరికొన్ని రెండేళ్లపాటు అన్ని విభాగాలపైనా అవగాహన కల్పించి, మిగిలిన సమయంలో స్పెషలైజేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో రెండు స్పెషలైజేషన్లను ఎంచుకునే వీలుంది. ఇంకొన్ని సంస్థలు నేరుగా స్పెషలైజ్‌డ్‌ విభాగంలోనే డిగ్రీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. చాలావరకు సంస్థలు కోర్సులో భాగంగా ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలనూ అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి టెలివిజన్‌, అడ్వర్టైజ్‌మెంట్‌, ఫిల్మ్‌మేకింగ్‌ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. 
డిగ్రీ స్థాయిలో..: బీఎఫ్‌ఏ (ఫిల్మ్‌ మేకింగ్‌) బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ టెక్నాలజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, బీటెక్‌ (టీవీ, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మీడియా టెక్నాలజీ), బి.డిజైన్‌ (ఆనిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్‌; ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌; ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడక్షన్‌), బీఎస్‌సీ/ బీఏ (ఫిల్మ్‌ మేకింగ్‌; ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌), బీఏ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ న్యూ మీడియా ప్రొడక్షన్‌, బీఎస్‌సీ (ఫిల్మ్‌ మేకింగ్‌; ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడక్షన్‌), బీఎస్‌సీ ఫిల్మ్‌ టెక్నాలజీ మొదలైన కోర్సులున్నాయి.  కాలవ్యవధి మూడు నుంచి నాలుగేళ్లు. 
డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్‌ సినిమాటోగ్రఫీ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌ డిప్లొమా ఇన్‌ డైరెక్షన్‌, స్క్రీన్‌ప్లే రైటింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌ డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌ డిప్లొమా ఇన్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ సినిమాటోగ్రఫీ అడ్వాన్స్‌డ్‌డిప్లొమా ఇన్‌ టీవీఅండ్‌ వీడియో ప్రొడక్షన్‌ మొదలైనవి. 
పీజీ స్థాయిలో..: ఎంఏ (ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడక్షన్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (ఎంఎఫ్‌ఏ) ఇన్‌ ఫిల్మ్‌, పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ సినిమా, పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ సౌండ్‌ డిజైన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ టీవీ డైరెక్షన్‌ మొదలైన కోర్సులున్నాయి. కాలవ్యవధి ఏడాది నుంచి మూడేళ్లు. 
సర్టిఫికెట్‌ కోర్సులు: ‌సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ స్క్రిప్ట్‌ రైటింగ్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ స్క్రీన్‌ రైటింగ్‌ అండ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ మొదలైనవి. వీటి కాలవ్యవధి 3 నెలల నుంచి 9 నెలల వరకు ఉంటుంది.

ప్రవేశం ఎలా? 

ఇదో.. 24 ఫ్రేముల కోర్సు కథ! 


చాలావరకు అన్ని సంస్థలూ అడ్మిషన్లకు తమకంటూ ప్రత్యేకమైన రాతపరీక్షను నిర్వహిస్తున్నాయి.  మహాత్మా జ్యోతీరావ్‌ పూలే యూనివర్సిటీ, జయపుర; సీఎంఆర్‌ యూనివర్సిటీ, బెంగళూరు వంటి అతికొద్ది సంస్థలు మాత్రమే మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రవేశపరీక్షలు దాదాపుగా ఫిల్మ్‌ మేకింగ్‌కు సంబంధించిన అవసరాలను అభ్యర్థి ఎంతమేరకు అర్థం చేసుకోగలుగుతున్నాడనే విషయాన్ని అంచనా వేసేలా ఉంటాయి. చాలావరకూ ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, ఫిల్మ్‌ ఆప్టిట్యూడ్‌లపైనే ఉంటాయి. 
అందిస్తున్న కొన్ని సంస్థలు 
ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణె అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, హైదరాబాద్‌ మధు ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌ రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌, హైదరాబాద్‌సత్యజిత్‌ రే ఫిల్మ్స్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ (క్రాఫ్ట్‌), దిల్లీ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, దిల్లీ విజిలింగ్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌, ముంబయి ఏషియన్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, నోయిడా దిల్లీ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, దిల్లీ జీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా ఆర్ట్స్‌, ముంబయి ఎస్‌ఆర్‌ఎం శివాజీ గణేశన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎల్‌వీ ప్రసాద్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ అకాడమీ, చెన్నై *నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అహ్మదాబాద్‌ డిజిటల్‌ అకాడమీ ద ఫిల్మ్‌ స్కూల్‌, ముంబయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌అండ్‌ఫైన్‌ ఆర్ట్స్‌, కోల్‌కతామొదలైనవి.

కొన్ని కోర్సులు సినిమాకు చెందిన 24 విభాగాలపైనా అవగాహన కల్పిస్తున్నాయి. మరికొన్ని రెండేళ్లపాటు అన్ని విభాగాలపైనా అవగాహన కల్పించి, మిగిలిన సమయంలో స్పెషలైజేషన్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఈ వినోదరంగం విస్తృత ఉపాధి  అవకాశాలను కల్పిస్తోంది. కానీ సినిమా, టీవీ రంగాల్లో ప్రవేశించి రాణించాలంటే ఆసక్తితోపాటు ప్రతిభ అవసరం. దాన్ని సానపెట్టుకునేందుకు ఎన్నో సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సహజ ప్రతిభకు ప్రామాణిక శిక్షణ తోడైతే తిరుగుండదు.

ఇదో.. 24 ఫ్రేముల కోర్సు కథ! 

చాలా సంస్థలు అడ్మిషన్లకు ప్రత్యేకమైన రాతపరీక్షను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ఉత్తీర్ణులైనవారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

స్పెషలైజేషన్లివి!

స్క్రీన్‌ప్లే రైటింగ్‌: ఏదైనా కట్టడాన్ని నిర్మించేముందు వేసుకునే ప్లాన్‌, పెయింటింగ్‌కు ముందు వేసుకునే అవుట్‌లైన్‌ స్కెచ్‌ ఎలాగో సినిమా విషయంలో స్క్రిప్ట్‌దీ అదే పాత్ర. సినిమాకు సంబంధించిన వెర్బల్‌ ప్రింట్‌ ఇది. కథలోని వివిధ సందర్భాలు, సీన్లు, డైలాగులు అన్నీ దీనిలో ఉంటాయి. సినిమాకు ఒకరకంగా ఇదే ప్రాణం. కోర్సులో భాగంగా ఏయే అంశాలు ఉండాలో బోధిస్తారు. కథా స్వరూపాలను వివరిస్తారు. సన్నివేశాలను ఎలా రాసుకోవాలో అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తిచేసినవారికి రైటర్‌, అసిస్టెంట్‌ రైటర్‌, ఇన్‌హౌజ్‌ రైటర్‌, టీవీ రైటర్‌, ఫిల్మ్‌ రైటర్‌ వంటి అవకాశాలుంటాయి. సృజనాత్మక రాత నైపుణ్యాలు, ఊహాశక్తి, భాషపై మంచి పట్టు ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. 
డైరెక్షన్‌: తెరపై కనిపించే పాత్రలను తెర వెనక నుంచి నడిపేవాడు డైరెక్టర్‌. కథను ఏవిధంగా చెప్పాలి? ఎప్పుడు ఏం చెప్పాలి అన్న విషయాలపై పట్టు ఉంటుంది. ఒకరకంగా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగాన్నీ ముందుండి నడుపుతాడు. అందుకే ఇతన్ని ‘కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌’ అంటారు. కోర్సులో భాగంగా నటీనటులతో కలిసి ఎలా పనిచేయాలో నేర్చుకుంటారు. ఏ షాట్లను ఉపయోగించాలి, కదిలే బొమ్మల సాయంతో కథను ఎలా చెప్పాలి, ఏ కాన్సెప్టులను ఉపయోగించాలి, ఏ సెట్లయితే బాగుంటుంది.. వంటివన్నీ నేర్చుకుంటారు. కోర్సు పూర్తిచేసినవారికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌, ఫిల్మ్‌ మేకర్‌ వంటి కెరియర్‌ అవకాశాలుంటాయి. 
సినిమాటోగ్రఫీ: లైటింగ్‌, మూవ్‌మెంట్‌లను ఉపయోగించడంలో వీరు నిష్ణాతులు. జీవం తప్పి ఉన్నవాటికీ లైటింగ్‌తో ప్రాణం తీసుకురాగలుగుతారు. ఎక్కడ ఫోకస్‌ పడాలో, ఏ షట్టర్‌ యాంగిల్స్‌ను ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. కోర్సులో భాగంగా.. వివిధ కెమెరాల గురించి ముఖ్యంగా కెమెరా మోషన్‌, వివిధ రకాల లైటింగ్‌ టెక్నిక్స్‌, సెటప్‌లు, లెన్స్‌లు, ఫిల్టర్స్‌ వంటి అంశాలను తెలుసుకుంటారు. స్టూడియోలు, అవుట్‌డోర్లలో పనిచేయడం, షార్ట్‌ ఫిల్మ్‌లు తీయడం, సింగిల్‌, మల్టీ కెమెరాలతో పనిచేయడాన్ని నేర్చుకుంటారు. టెలివిజన్‌, యాడ్స్‌, డాక్యుమెంటరీలు, కార్పొరేట్‌ వీడియోలను ఎలా తీయాలో నేర్చుకుంటారు. కోర్సు పూర్తిచేసినవారికి అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌, లైటింగ్‌ చీఫ్‌, టీవీ కెమెరామేన్‌, డాక్యుమెంటరీ సినిమాటోగ్రాఫర్‌, అడ్వర్టైజింగ్‌ సినిమాటోగ్రాఫర్‌, కార్పొరేట్‌ సినిమాటోగ్రాఫర్‌ అవకాశాలుంటాయి. 
ఎడిటింగ్‌: సినిమా షూటింగ్‌ను ముడి పదార్థం అనుకుంటే అది తన పూర్తి రూపాన్ని తెచ్చుకునేది ఎడిటింగ్‌లోనే. సినిమా రూపకల్పనలో దీని ప్రాముఖ్యం ఎక్కువ. ఏ సీన్లు ఉండాలో, వేటిని తొలగించాలో ఎడిటర్‌ నిర్ణయం తీసుకుంటాడు. ఇది పూర్తిగా సాంకేతిక, కళాత్మక అంశాలతో కూడుకుని ఉంటుంది. కోర్సులో భాగంగా వివిధ ఎడిటింగ్‌ రకాల గురించి తెలుసుకుంటారు. ఇందుకుగానూ వివిధ భాషల సినిమాలను చూసి, విశ్లేషిస్తారు. వీటిని తమ ప్రాజెక్టుల్లో ఎలా ఉపయోగించొచ్చో నేర్చుకుంటారు. వీరికి ఫిల్మ్‌ ఎడిటర్‌, టెలివిజన్‌ ఎడిటర్‌, యాడ్‌ ఫిల్మ్‌ ఎడిటర్‌, కార్పొరేట్‌ ఫిల్మ్‌ ఎడిటర్‌, మల్టీ కామ్‌ ఆన్‌లైన్‌ ఎడిటర్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌ ఎడిటర్‌, డేటా ఇంటిగ్రేషన్‌ టెక్నాలజిస్ట్‌, ప్రోమో ప్రొడ్యూసర్‌, ప్రోమో ఎడిటర్‌, లొకేషన్‌ ఎడిటర్‌, ఆఫ్‌లైన్‌ ఎడిటర్‌, న్యూ మీడియా కంటెంట్‌ ప్రొవైడర్‌, ప్రోగ్రామ్‌ ప్యాకేజింగ్‌ మొదలైన కెరియర్‌ అవకాశాలుంటాయి. 
సౌండ్‌ రికార్డింగ్‌: సినిమా ఆద్యంతం ధ్వనులతో నడుస్తుంది. సౌండ్‌ ట్రాక్‌లు, సన్నివేశానికి సరిగా సరిపోయే దానికి కూర్చడం వంటివన్నీ వీరి పనే. కోర్సులో భాగంగా ఫీల్డ్‌లో శబ్దాలను రికార్డు చేయడం, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వాటిని జత చేయడం, సరైన దిశలో వాటిని ఉపయోగించడం వంటివి నేర్చుకుంటారు. వీరికి స్టూడియో రికార్డిస్ట్‌, లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌, సౌండ్‌ డిజైనర్‌, డాల్బీ ఇంజినీర్‌గా అవకాశాలుంటాయి. 
వీటితోపాటు యాక్టింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కోర్సులకూ ఎక్కువ ప్రాధాన్యముంది. ప్రత్యేకంగా స్పెషలైజ్‌డ్‌ విభాగంలో డిగ్రీ చేసేవారికి సబ్జెక్టుతోపాటు టెక్నికల్‌ అంశాలనూ నేర్పిస్తారు. చాలావరకూ సంస్థల్లో కోర్సులో భాగంగా పలు రకాల ప్రాజెక్టులనూ చేయాల్సి ఉంటుంది.

ఫౌండేషన్‌ కోర్సులకు ప్రకటన విడుదల

ఇదో.. 24 ఫ్రేముల కోర్సు కథ! 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) ఫిల్మ్‌, టెలివిజన్‌ రంగాల్లో షార్ట్‌ ఫౌండేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. పుణెలోని ఎఫ్‌టీఐఐ భాగస్వామ్యంతో సంస్థ ఈ కోర్సులను నిర్వహిస్తోంది. కోర్సుల కాలవ్యవధి- 5 నుంచి 20 రోజుల వరకూ ఉంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో బోధన ఉంటుంది. 18 సంవత్సరాలు నిండినవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత- ఇంటర్మీడియట్‌. 
ఇవీ కోర్సులు: ఫౌండేషన్‌ కోర్స్‌ ఇన్‌ స్క్రీన్‌ యాక్టింగ్‌ ఫౌండేషన్‌ కోర్స్‌ ఇన్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌ ఫౌండేషన్‌ కోర్స్‌ ఇన్‌ రైటింగ్‌ ఫర్‌ టీవీ ఫిక్షన్‌ ఫౌండేషన్‌ కోర్స్‌ ఇన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ బేసిక్‌ ఫిల్మ్‌ ఓరియెంటేషన్‌ కోర్స్‌ ఫిల్మ్‌ అప్రిసియేషన్‌ కోర్స్‌ 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆధారంగా  సంబంధిత కమిటీ అర్హులైనవారిని ఎంపిక చేస్తుంది. ఎంపికైన విద్యార్థులు నాన్‌ రిఫండబుల్‌ కోర్సు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో కోర్సుకు ఫీజు రూ.1000 నుంచి రూ.5000 వరకు ఉంది. 
దరఖాస్తు చివరితేదీ: డిసెంబరు 15, 2018 
ఇతర వివరాలకు వెబ్‌సైట్‌  www.apsftvtdc.in ను సందర్శించవచ్చు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.