close

తాజా వార్తలు

తీరంలో వీరులు!

టెన్త్‌ నుంచి పీజీ వరకూ అర్హతకు తగిన ఉద్యోగాలు

శాంతికి చిహ్నమైన ధవళ వస్త్రాలను ధరించి.. అణ్వాయుధాలు సహా అన్ని రకాల అస్త్రాలను సంధించి.. సముద్రాల్లో కన్ను రెప్పపడకుండా దేశానికి కాపలా కాసే ఉద్యోగం ఎంత గొప్ప యోగం. యువతకు ఎన్నో మార్గాల్లో భారత నౌకాదళం (ఇండియన్‌ నేవీ) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారిని... సెయిలర్‌ నుంచి ఆఫీసర్‌ వరకు పలు రకాల ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటోంది. తీరంలోని ఈ వీరులకు ఆకర్షణీయమైన జీతభత్యాలతోపాటు సమాజంలో మంచి గౌరవమూ అందుతాయి.

తీరంలో వీరులు!

దేశ రక్షణకు సంబంధించి భారతీయ నౌకాదళం ప్రాధాన్యం ఎంతో. కానీ దీనిలో ఉద్యోగుల కొరత ఉంది. ప్రస్తుతం నేవీలో దాదాపు 15వేల సైలర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 71,651 మంది నావికులు అవసరం కాగా 56,835 మంది సేవలు అందిస్తున్నారు.  ఆఫీసర్ల విషయానికొచ్చేసరికి 11,827 మందికి గానూ 10,393 మందే ఉన్నారు. 1434 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలను ముఖ్యంగా రెండుగా విభజించవచ్చు. మొదటిది పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో అవకాశం కల్పించే సెయిలర్‌ ఎంట్రీ పోస్టులు. రెండోది  ఆఫీసర్‌ ఎంట్రీ ఉద్యోగాలు.

సెయిలర్లుగా..

తీరంలో వీరులు!

విభాగంలో ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) మ్యుజీషియన్‌, స్పోర్ట్స్‌ ఉద్యోగాలుంటాయి. ఆయా పోస్టుల వారీ అర్హతలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌): పదో తరగతి ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో చెఫ్‌, స్టివార్డ్‌, హైజీనిస్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయి. 17 నుంచి 21 ఏళ్లలోపు వయసువారు అర్హులు.
సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌-  వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివినవారు ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు అర్హులు. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి.
ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్‌ (ఏఏ): ఇంటర్మీడియెట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌... వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండాలి.
మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్లో పనిచేయడానికి మ్యుజీషియన్లను ఎంపిక చేస్తారు. సంగీత పరికరాల్లో ప్రావీణ్యం ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.
స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: పదో తరగతి విద్యార్హతతో ఈ విభాగంలో చేరవచ్చు. ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ ఉద్యోగాలకు ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలుంటాయి. వీటిలోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులను శిక్షణకు ఎంపికచేస్తారు.

10+2 టెక్నికల్‌ ఎంట్రీ

ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. జేఎన్‌యూ, న్యూదిల్లీ నుంచి బీటెక్‌ పట్టా పుచ్చుకుని వెంటనే నేవీలో ఇంజినీర్‌ విధులు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నిర్వర్తించవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అలాగే జేఈఈ మెయిన్లో అర్హత సాధించినవారై ఉండాలి.
యూనివర్సిటీ ఎంట్రీ స్కీం
ఈ విధానంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా బీఈ/ బీటెక్‌ విద్యార్థులను ఎంపికచేస్తారు. ఏడో సెమిస్టర్లో ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అయిదో సెమిస్టరు వరకు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పోస్టుల భర్తీ పర్మనెంట్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ రెండు విధాల్లోనూ ఉంటుంది. క్యాంపస్‌లో ఎంపికైనవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూలు చేపడుతుంది. ఏడాదికి ఒకసారి జూన్‌ లేదా జులైలో ప్రకటన వెలువడుతుంది.
మహిళలకూ...
నేవీలో కొన్ని పోస్టులకు మహిళలూ అర్హులే. అయితే వీరిని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో తీసుకుంటారు. గరిష్ఠంగా 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. ఏటీసీ, అబ్జర్వర్‌, లా, లాజిస్టిక్స్‌, ఎడ్యుకేషన్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, పైలట్‌, నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో పలు ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచీల్లో బీఈ/  బీటెక్‌ చదివినవారికి అవకాశం కల్పిస్తున్నారు.

ఆఫీసర్‌గా అడుగేయాలంటే..

వివిధ విభాగాల్లో నేవీలో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాలున్నాయి.
ఎగ్జిక్యూటివ్‌ విభాగం: ఇందులో జనరల్‌ సర్వీస్‌,  హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్‌, పైలట్‌, అబ్జర్వర్‌, నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌...తదితర పోస్టులకు విద్యార్హత బీఈ/  బీటెక్‌. వీటిలో కొన్నింటికి ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదవాలి. లాజిస్టిక్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ, బీకాం...తదితరాల్లో ఏదో ఒకటి అర్హతగా సరిపోతుంది. జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (జాగ్‌) లేదా లా ఆఫీసర్‌ పోస్టులకు ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి ఉండాలి. స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏదైనా పీజీ లేదా బీటెక్‌ చదివుండాలి. ఏదైనా క్రీడలో జాతీయ స్థాయి సీనియర్‌ విభాగంలో ప్రతిభను ప్రదర్శించి ఉండాలి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగాలకు బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, బీఎస్సీల్లో ఎందులోనైనా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు చదివినవారు అర్హులు. బీసీఏ, ఎంసీఏ పూర్తిచేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యుజీషియన్‌ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ కోర్సు చదివినవారు అర్హులు. సంగీతంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉన్నవారైతే ఇంటర్‌ విద్యార్హతతోనూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్‌ విభాగం: ఇందులో ఇంజినీరింగ్‌ జనరల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌, సబ్‌ మెరైన్‌ ఇంజినీర్‌ ఆఫీసర్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ ఉద్యోగాలున్నాయి. జనరల్‌ సర్వీస్‌ సంబంధిత విభాగాల్లో పోస్టులకు బీఈ లేదా బీటెక్‌ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్‌ మెరైన్‌ విభాగంలో ఉద్యోగానికి సంబంధిత బ్రాంచీల్లో బీఈ/  బీటెక్‌ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. నేవల్‌ ఆర్కిటెక్చర్‌లో మెకానికల్‌/  సివిల్‌/ ఏరోనాటికల్‌/  మెటలర్జీ/  నేవల్‌ ఆర్కిటెక్చర్‌ వీటిలో ఏ విభాగంలోనైనా కనీసం 60 శాతం మార్కులతో బీఈ/  బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్‌ విభాగం: ఇందులో జనరల్‌ సర్వీస్‌, సబ్‌ మెరైన్‌ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. జనరల్‌ సర్వీస్‌ (ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌) ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/  టెలి కమ్యూనికేషన్‌ వీటిలో ఏ విభాగంలోనైనా లేదా అనుబంధ విభాగంలో బీఈ/  బీటెక్‌ పూర్తిచేసుండాలి.
సబ్‌ మెరైన్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌కు ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/  టెలి కమ్యూనికేషన్‌/ కంట్రోల్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌/ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌- వీటిలో ఏ విభాగంలోనైనా కనీసం 55 శాతం మార్కులతో బీఈ/  బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడ్యుకేషన్‌ విభాగం: ఈ విభాగంలో పోస్టులకు కనీసం ద్వితీయ శ్రేణితో పీజీలో మ్యాథ్స్‌ / ఫిజిక్స్‌ /  కెమిస్ట్రీ / ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. పీజీలో మ్యాథ్స్‌ చదివినవారు యూజీలో ఫిజిక్స్‌, అలాగే ఫిజిక్స్‌ పూర్తిచేసుకున్నవారు యూజీలో మ్యాథ్స్‌ చదివుండడం తప్పనిసరి. పీజీలో కెమిస్ట్రీ చదివినవారు యూజీలో ఫిజిక్స్‌, పీజీలో ఇంగ్లిష్‌ అభ్యర్థులు కనీసం ఇంటర్‌ స్థాయిలో మ్యాథ్స్‌ లేదా ఫిజిక్స్‌ చదివుండాలి.   ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు యూజీ స్థాయిలో ఫిజిక్స్‌ లేదా మ్యాథ్స్‌ చదివుండాలి. ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌- వీటిలో ఎందులోనైనా పీజీ చదివినా ఎడ్యుకేషన్‌ విభాగం పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడికల్‌ విభాగం:  మెడికల్‌ విభాగంలో  ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా ఎంపికలు ఉంటాయి. వయసు గరిష్ఠంగా 45 ఏళ్లకు మించరాదు. ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, బీడీఎస్‌, ఎండీఎస్‌ విద్యార్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏ ప్రకటన ఎప్పుడు?

* పర్మనెంట్‌ కమిషన్‌ - క్యాడెట్‌ ఎంట్రీ (ఏడాదికి రెండుసార్లు) 10+2 (బీటెక్‌) - జూన్‌, డిసెంబరు
ఎస్‌ఎస్సీ (పైలట్‌, అబ్జర్వర్‌)- మార్చి, అక్టోబరు
ఎస్‌ఎస్సీ (ఎగ్జిక్యూటివ్‌, టెక్‌, సబ్‌ మెరైన్‌ టెక్‌)- ఫిబ్రవరి, సెప్టెంబరు

* పర్మనెంట్‌ కమిషన్‌ -డైరెక్ట్‌ ఎంట్రీ (ఏడాదికి ఒకసారి)
పీసీ (లాజిస్టిక్స్‌) - మార్చి
పీసీ (ఎడ్యుకేషన్‌, నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాడర్‌) - నవంబరు
పీసీ (లా, మ్యుజీషియన్‌) - ఖాళీలు ఉన్నప్పుడు

* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ డైరెక్ట్‌ ఎంట్రీ ఏడాదికి ఒకసారి ఎస్‌ఎస్సీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)- సెప్టెంబరు
ఎస్‌ఎస్సీ (నేవల్‌ ఆర్మమెంట్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఎడ్యుకేషన్‌)- ఏప్రిల్‌
ఎస్‌ఎస్సీ (లాజిస్టిక్స్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌) నవంబరు
ఎస్‌ఎస్సీ (లా, స్పోర్ట్స్‌) - ఖాళీలు ఉన్నప్పుడు
వెబ్‌సైట్లు:
www.joinindiannavy.gov.in, www.upsc.gov.in
(యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈ వివరాలు, అన్ని రకాల పోస్టులకు నిర్వహించే పరీక్షలు, జీతభత్యాల సమాచారం కోసం www.eenadupratibha.net చూడవచ్చు.)

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.