close

తాజా వార్తలు

పైసా ఖర్చవకుండా పైలట్‌!

నవ యువతకు వాయుసేన అండ

యువతలో క్రేజ్‌ ఉన్న రక్షణ రంగ ఉద్యోగాలకు చిరునామాగా నిలుస్తోంది... ఎయిర్‌ఫోర్స్‌! సంఘంలో గుర్తింపు, మంచి వేతనాలు, సౌకర్యాలు.. ఇవన్నీ ఆకర్షణీయమే. ఉచితంగా పైలట్‌ కావడానికైనా, పదో తరగతితోనే ఎయిర్‌మెన్‌ ఉద్యోగం పొందటానికైనా ఇదే వేదిక. ఇంటర్‌ ఉంటే చాలు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ కోసం ప్రయత్నించవచ్చు. డిగ్రీ, డిప్లొమా...విద్యార్హత ఏదైనప్పటికీ అందుకు తగ్గ ఉద్యోగాలెన్నో వాయుసేనలో ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి ఆరు నెలలకు ఒకసారి ప్రకటనలూ వెలువడుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..!.

పైసా ఖర్చవకుండా పైలట్‌!

చిన్నప్పుడు విమానాన్ని ఆశ్చర్యంగా కన్నార్పకుండా చూస్తూ పెరిగినవాళ్లమే. అప్పట్లో విమానాశ్రయానికి వెళ్లడం ఒక విశేషం. తొలిసారి విమానంలో ప్రయాణించడం ఎప్పటికీ మధుర జ్ఞాపకమే. అదే విమానం నడిపే అవకాశమే పైసా ఖర్చవకుండా పైలట్‌!వస్తే...ఎంతో సంతోషమే కదా. మరి పైలట్‌ శిక్షణ ఎంతో ఖర్చుతో కూడింది కదా అని ఆలోచిస్తున్నారా? మరేం ఫర్వాలేదు. ఆసక్తి, ఉత్సాహం మీ సొంతమైతే పైసా చెల్లించకుండా పైలట్‌ శిక్షణ పొందవచ్చు. వెంటనే ఉద్యోగంలోనూ చేరిపోవచ్చు. మామూలు విమానాలే కాదు యుద్ధ విమానాలతో ఆకాశంలో విన్యాసాలూ చేయొచ్చు. ఈ అవకాశాన్ని ఎయిర్‌ఫోర్స్‌ కల్పిస్తోంది. విమానాలు, హెలికాప్టర్లు నడపడానికి పైలట్లు, వాటి నిర్వహణ, మరమ్మతులకు టెక్నికల్‌, గ్రౌండ్‌ డ్యూటీ సిబ్బంది, ఎయిర్‌మెన్లు...ఎన్నో ఉద్యోగాలున్నాయి.

ఆకాశ మార్గంలో..

ఆఫీసర్‌ హోదాతో ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో విధులు ఉంటాయి. ఫ్లయింగ్‌ బ్రాంచీలో ఎంపికైనవారు పైలట్‌గా సేవలు అందిస్తారు. ఇందులో ఫైటర్లు, ట్రాన్స్‌పోర్టర్లు, హెలికాప్టర్‌ పైలట్లు ఉంటారు. యుద్ధ విమానాలు నడిపేవాళ్లు ఫైటర్స్‌. సరకు, మనుషులను తీసుకెళ్లేవారు ట్రాన్స్‌పోర్టర్లు. హెలికాప్టర్లను నడిపేవాళ్లు హెలికాప్టర్‌ పైలట్లు. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ ద్వారా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌లో అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌, లాజిస్టిక్స్‌, ఎడ్యుకేషన్‌, మెటీరియాలజీ విభాగాలుంటాయి. 
ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌(పైలట్‌) ఉద్యోగాలను యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈలతోపాటు ఏఎఫ్‌ క్యాట్‌- ఎస్‌ఎస్సీ స్పెషల్‌ ఎంట్రీ (మెన్‌ అండ్‌ విమెన్‌), ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ (మెన్‌) ద్వారా దక్కించుకోవచ్చు. 
ఎన్డీఏ: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవారు, ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి. ఏడాదికి రెండుసార్లు జనవరి, ఆగస్టుల్లో ప్రకటన వెలువడుతుంది. ఎంపికైనవాళ్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్డీఏ) పుణెలో శిక్షణతోపాటు బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. శిక్షణ అనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదా పొందుతారు. 
సీడీఎస్‌ఈ: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) పేరుతో యూపీఎస్సీ ఏడాదికి రెండుసార్లు జూన్‌, అక్టోబరుల్లో ప్రకటన వెలువరిస్తుంది. ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలకు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదువుకున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. వయసు 20 - 24 ఏళ్లలోపు ఉండాలి. 
ఏఎఫ్‌ క్యాట్‌: ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌క్యాట్‌) ద్వారా ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులో రెండు విభాగాల్లో పైలట్‌ కావచ్చు. అవి ఎస్సెస్సీ ఎంట్రీ, ఎన్సీసీ స్పెషల్‌ ఎంట్రీ. ఈ పరీక్షకు సంబంధించి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి.
ఎస్సెస్సీ ఎంట్రీ:  షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్సీ) విధానంలో నియామకాలు చేపడతారు.మహిళలూ ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. దీంతోపాటు ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లోనూ 60 శాతం మార్కులు తప్పనిసరి. 
ఎన్సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఎన్సీసీ సీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రత్యేకంగా ఎన్సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో అవకాశం కల్పిస్తున్నారు. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ 

టెక్నికల్‌ బ్రాంచ్‌: ఈ ఉద్యోగాలన్నీ ఏఎఫ్‌ క్యాట్‌ తోనే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాలు ఉన్నాయి.
నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఈ ఉద్యోగాలన్నీ ఏఎఫ్‌ క్యాట్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటీరియాలజీ విభాగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మహిళలూ అర్హులే. అయితే వీరిని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో తీసుకుంటారు. అందువల్ల 14 ఏళ్ల తర్వాత వైదొలగాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్లు:
www.careerairforce.nic.in

ఎయిర్‌మెన్‌

ఇందులో గ్రూప్‌ ఎక్స్‌, గ్రూప్‌ వై అనే రెండు ట్రేడ్లు ఉంటాయి. వీటిలో గ్రూప్‌ వైలో మ్యుజీషియన్‌, మెడికల్‌ అసిస్టెంట్‌, ఇతర ట్రేడ్లు ఉంటాయి. గ్రూప్‌ ఎక్స్‌లో ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఇతర ట్రేడ్లు ఉన్నాయి. పరీక్షలో ప్రతిభ, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

గ్రూప్‌ వై 

పైసా ఖర్చవకుండా పైలట్‌!

మ్యుజీషియన్‌: ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. అయితే ఏదైనా సంగీత/ వాద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 
మెడికల్‌ అసిస్టెంట్‌: 10+2 / ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు. ఇంగ్లిష్‌లో విడిగా 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 17-21 
ఇతర ట్రేడ్లు: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు వీటికి అర్హులు. ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17-21 లోపు ఉండాలి.

గ్రూప్‌ ఎక్స్‌

టెక్నికల్‌: ఈ విభాగంలో పోస్టులకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నిర్దేశిత ట్రేడుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిప్లొమా/ఇంటర్‌/పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. 
ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌: బీఎడ్‌తోపాటు డిగ్రీ/  పీజీ అర్హతలతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా బీఏ లేదా ఫిజిక్స్‌ /సైకాలజీ/ కెమిస్ట్రీ /మ్యాథ్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ /కంప్యూటర్‌ సైన్స్‌/ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీసీఏ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులు తప్పనిసరి. వీటితోపాటు 50 శాతం మార్కులతో బీఎడ్‌ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 20-25 ఏళ్లలోపు ఉండాలి. ఎంఏ- ఇంగ్లిష్‌ /సైకాలజీ లేదా ఎమ్మెస్సీ-మ్యాథ్స్‌ /ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదా ఎంసీఏ వీటిలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 శాతం మార్కులతో బీఎడ్‌ తప్పనిసరి. వయసు 20 - 28 ఏళ్లలోపు ఉండాలి.
పూర్తి కథనం www.eenadupratibha.net లో.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.