close

తాజా వార్తలు

అవకాశాల పాలపుంత.. అంతరిక్షం!

కెరియర్‌ గైడెన్స్‌ స్పేస్‌ సైన్స్‌

ఒక చిన్న ఉపగ్రహాన్ని స్పేస్‌లోకి ప్రవేశపెట్టగానే ఇంత పెద్ద దేశం పండగ చేసుకుంటుంది. శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసలతో ముంచెత్తుతారు. వేల కోట్ల ఖర్చు.. క్షణ క్షణం నరాలు తెగే ఉత్కంఠ.. అంతరిక్ష విజయంతో అందరిలోనూ ఆనందం. అలా విశ్వవీధిలోకి చేరిన శాటిలైట్ల సహకారంతోనే మన టీవీలు, రేడియోలు, ఫోన్లు, విమానాలు... ఇలా ఎన్నో పనిచేస్తుంటాయి. వీటి వెనుక ఎందరో పరిశోధకులు, ఎన్నో రకాల నిపుణుల కృషి ఉంటుంది. వారిలో ఒకరిగా ఆ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలంటే అంతరిక్షాన్ని అర్థం చేసుకోవాలి. పాలపుంతలపై పరీక్షలు రాయాలి. అప్పుడే అనంత విశ్వంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అందుకోసం స్పేస్‌ సైన్స్‌ కోర్సులు చదవాలి.

అవకాశాల పాలపుంత.. అంతరిక్షం!

విష్యత్‌లో అంతరిక్ష యుగం మొదలవుతుంది. ఎలాంటి విపత్తులు ఎదురైనా మానవాళి మనుగడను కాపాడేందుకు ఇతర గ్రహాల్లో అన్వేషణలు, భూమికి ప్రత్యామ్నాయ గ్రహాన్ని కనుగొనడం చాలా కీలకం. ఇందుకనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు. వీటన్నింటి కారణంగా అంతరిక్షరంగ ప్రాధాన్యం పెరుగుతోంది. భారత ప్రభుత్వం ఈ రంగానికి బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయిస్తోంది. 2022లో చేపట్టే మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’కు రూ.10వేల కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ యాత్రవల్ల దీర్ఘకాలంలో అనేక ఉద్యోగాలను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువశాతం ఉద్యోగాలు పరిశ్రమల్లోనూ, మిగతావి విద్యాసంస్థల్లో వస్తాయని అంచనా. 2020లో ఒక మానవరహిత యాత్రనూ భారత్‌ చేపట్టనుంది. ఈ ఏడాది సంక్లిష్టమైన చంద్రయాన్‌ -2 సహా 32 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు భారత అంతరిక్షసంస్థ- ఇస్రో ప్రకటించింది.
స్పేస్‌ సైన్స్‌ అంటే విశ్వం గురించి చేసే శాస్త్రీయ అధ్యయనం. ప్రత్యేకించి దీని కదలిక, పొజిషన్స్‌, పరిమాణం, కంపోజిషన్‌తోపాటు ఖగోళ వస్తువుల ప్రవర్తన గురించి పరిశోధనలు చేయడం. టీవీ, రేడియో, ఫోన్‌ సిగ్నల్స్‌; కార్లు, విమానాలలో వాడే శాటిలైట్‌ నావిగేషన్లు అంతరిక్షంలోని ఉపగ్రహాలు మనకు పంపించే సమాచారం ఆధారంగానే పనిచేస్తున్నాయి. కార్లు, మోటారు బైక్‌ల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ఓజోన్‌ పొర ఎలా దెబ్బతింటోంది?, వాతావరణం, మహాసముద్రాలు, అడవులు, ఎడారులు, వివిధ మారుమూల ప్రాంతాల గురించి మనం తెలుసుకునే సమాచారమంతా శాటిలైట్లు పంపించేదే. వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకుని ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలోనూ ఉపగ్రహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఏ కోర్సులు చేయటం మేలు?

* ఈ రంగంలో స్థిరపడాలంటే ఇంటర్‌లో తప్పనిసరిగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్ట్స్‌ను తీసుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జెస్ట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌ లాంటి ప్రవేశపరీక్షల ఆధారంగా కోర్సుల్లో చేరొచ్చు.
* ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కాలవ్యవధి అయిదేళ్లు. ఫిజిక్స్‌ ప్రధానాంశంగా డిగ్రీ చేసి ఎంఎస్సీ ఫిజిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ (ఫిజిక్స్‌) చేయొచ్చు.
* బీఈ- స్పేస్‌ టెక్నాలజీ వ్యవధి నాలుగేళ్లు. ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌, కాస్మాలజీ, స్టెల్లార్‌ సైన్స్‌, ప్లానెటరీ సైన్స్‌ గురించి చదువుతారు. ఏర్‌క్రాఫ్ట్‌ నిర్మాణం, రూపకల్పనలో అభిరుచి ఉన్నవారు ఈ కోర్సులో చేరొచ్చు.
* బీటెక్‌ ఏవియానిక్స్‌ ఇంజినీరింగ్‌ వ్యవధి నాలుగేళ్లు. విశ్లేషణ సామర్థ్యం, లాజికల్‌, రీజనింగ్‌ స్కిల్స్‌, గణితంలో నైపుణ్యం ఉన్నవారు ఈ కోర్సును అధ్యయనం చేస్తే కెరియర్‌ బాగుంటుంది.
* బీటెక్‌ స్పేస్‌ టెక్నాలజీ కోర్సు నాలుగేళ్లు. సోలార్‌ సిస్టమ్‌, భూమి, ఇతర గ్రహాలు, అంతరిక్షం మొదలైన విషయాలను గురించి తెలుసుకుంటారు.
* ఎంటెక్‌ క్రయోజనిక్‌ ఇంజినీరింగ్‌ రెండేళ్ల కోర్సు. బీఈ/బీటెక్‌ తర్వాత ప్రవేశపరీక్ష ఆధారంగా చేరొచ్చు. ఇది మెకానికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ల కలయిక. రాకెట్‌ ప్రొపెల్షన్‌లో క్రయోజనిక్‌ది కీలకపాత్ర.
* డిప్లొమా ఇన్‌ స్పేస్‌ టెక్నాలజీ వ్యవధి మూడేళ్లు. పదో తరగతి తర్వాత చేయాలి. విద్యార్థులు మేథమేటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, థర్మోడైనమిక్స్‌ సంబంధిత సబ్జెక్టులు అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మాస్టర్‌ డిగ్రీలో చేరొచ్చు లేదా రిసెర్చ్‌వైపూ వెళ్లొచ్చు.
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ కంప్ట్రోల్‌ ఇంజినీరింగ్‌ కాలవ్యవధి సంవత్సరం. ఇంటర్‌ (ఎంపీసీ) తర్వాత చేయొచ్చు. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఉంది.

నిరంతర కృషి అవసరం

అవకాశాల పాలపుంత.. అంతరిక్షం!ఖగోళశాస్త్రం విశ్వం గురించి చేసే అధ్యయనం. మానవుడు దీని అధ్యయనంలో ఎంత పరిశోధన చేసినా తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఈ ప్రక్రియలో ఎన్నో వైవిధ్యమైన కోర్సులతో ఖగోళశాస్త్రం ముందంజలో ఉంది. పరిశోధనా రంగంలో యువ మేధస్సుకు అనేక అవకాశాలను కల్పిస్తోంది. అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను తెలుపుతూ ప్రజలలోని మూఢనమ్మకాలను పారదోలడానికి కృషి చేస్తోంది.
ఒక విద్యార్థి ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే నిరంతర కృషి, పట్టుదల, దూరదృష్టి, సహనం కలిగి ఉండాలి. దీనికి సంబంధించి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులు (టీఎంటీ- థర్టీ మీటర్‌ టెలిస్కోప్‌, జీఎంటీ- జెయింట్‌ మెజెలెన్‌ టెలిస్కోప్‌, ఎల్‌ఐజీఓ - లేజర్‌ ఇంటర్‌ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌ - వేవ్‌ అబ్జర్వేటరీ) రానున్నాయి. కాబట్టి యువతకు ఖగోళశాస్త్ర పరిశోధన రంగంలో ఎన్నో అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ రంగాన్ని నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.

- డాక్టర్‌ డి. శాంతిప్రియ, హెడ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆస్ట్రానమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌

ఉద్యోగావకాశాలు

అవకాశాల పాలపుంత.. అంతరిక్షం!

ఆస్ట్రోనాట్స్‌: ఆస్ట్రోనాట్‌ కావడానికి సంబంధిత విభాగానికి చెందిన సైన్స్‌ లేదా మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ చేసి, తప్పనిసరిగా అనుభవం పొందిన పైలట్‌ అయి ఉండాలి. ఫిట్‌నెస్‌ ప్రమాణాలనూ పాటించాలి. ఇందుకు కఠినమైన శిక్షణ ఉంటుంది. వీరు అంతరిక్ష అన్వేషణ కార్యక్రమంలో పాల్గొంటారు.
స్పేస్‌ ఇంజినీర్స్‌: స్పేస్‌ ఇంజినీర్లు తమ సాంకేతిక నైపుణ్యంతో అంతరిక్ష యాత్రను విజయవంతం చేస్తారు. వీరు స్పేస్‌ - క్రాఫ్ట్స్‌, స్పేస్‌ వెహికల్‌, స్పేస్‌ స్టేషన్లను రూపొందిస్తారు. అలాగే ఒక ఉపగ్రహ వాహనానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు. దాని ప్రసార, కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తారు.
స్పేస్‌ సైంటిస్ట్‌: అనేక విభాగాల్లోని శాస్త్రవేత్తలు స్పేస్‌సైన్స్‌లో శాస్త్రవేత్తలుగా మారొచ్చు. ఉదాహరణకి ఫార్మాలజీ శాస్త్రవేత్త స్పేస్‌ యాత్రలో లభించిన ఉల్కల లాంటి పదార్థాలతో మందులను తయారు చేయడం.
టెక్నాలజిస్టు, టెక్నీషియన్స్‌: స్పేస్‌ సైంటిస్టులు, ఇంజినీర్లు వివిధ స్పేస్‌ ప్రాజెక్టులు, సాంకేతిక ఆవిష్కరణల నిర్మాణం, అభివృద్ధి, వాటికి సంబంధించి పరీక్షలను జరిపినపుడు టెక్నాలజిస్టు, టెక్నీషియన్స్‌ సహాయపడతారు. వీరే కమ్యూనికేషన్‌ టెక్నీషియన్లు. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (సీఏడీ) ఆపరేటర్స్‌, డ్రాఫ్ట్‌ర్స్‌, ఎలక్ట్రీషియన్స్‌, లేజర్‌ టెక్నీషియన్స్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ స్పెషలిస్ట్స్‌, రాడార్‌ టెక్నీషియన్స్‌, రోబోటిక్‌ టెక్నీషియన్లు, ఉపగ్రహ సాంకేతిక నిపుణులు ఈ విభాగంలోకి వస్తారు.
* అంతరిక్ష శాస్త్రవేత్తలు విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా, పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గా, పేపర్ల పబ్లిషర్‌గా, అకడమిక్‌ కమిటీల్లో సభ్యుడిగా, ప్రతిపాదనలను రాయడం, పబ్లికేషన్స్‌కు పేపర్లను రిఫర్‌ చేసేవారిగా పని చేయవచ్చు. ఇవే కాకుండా అబ్జర్వేటరీస్‌, సైన్స్‌ మ్యూజియం, అంతరిక్ష పరిశోధన సంస్థలు మొదలైనవాటిలో ఆస్ట్రానమర్లు, ఆస్ట్రోఫిజిస్ట్‌లుగా పని చేయవచ్చు.
* స్పేస్‌ సైన్స్‌ నిపుణులు సాఫ్ట్‌వేర్‌ లేదా టెక్నాలజీకి సంబంధించిన వ్యాసాలు రాయడం, టెలిస్కోప్‌ డిజైనింగ్‌, మ్యానుఫాక్చరింగ్‌, స్పేస్‌ ల్యాబొరేటరీల్లో పనిచేయవచ్చు. వీటితో పాటు ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, మిలటరీ ఆపరేషన్స్‌లో స్పేస్‌ క్రాఫ్ట్‌ రూపకల్పన, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయవచ్చు. అలాగే స్పేస్‌ టూరిజం ఆపరేటర్లుగానూ ఉండొచ్చు.
* ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌, ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లు అంతరిక్ష శాస్త్రవేత్తలకు పరిశోధనలకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
సైంటిస్టులకు వారి విద్యార్హత, పని తీరు, సంస్థను బట్టి వేతనం ఉంటుంది. నైపుణ్యం బాగుంటే వేతనాలూ అధికంగానే ఉంటాయి.

ఇస్రోలో కోర్సు, కొలువు

ప్రపంచంలోనే అతి పెద్ద అంతరిక్ష సంస్థల్లో ఆరోదైన తిరువనంతపురం(కేరళ)లోని ఇస్రోను 1969లో విక్రం సారాభాయ్‌ నేతృత్వంలో నెలకొల్పారు. ఈ సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, జియోగ్రఫిక్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్స్‌, వెదర్‌ ఫోర్‌కాస్ట్‌, టెలిమెడిసిన్‌, కార్టోగ్రఫీ, నేవిగేషన్‌, డెడికేటెడ్‌ డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ శాటిలైట్స్‌ ద్వారా భారత్‌కు అంతరిక్ష సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఎంతోమంది నిపుణుల అవసరముంది.
* 2019 కిగానూ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియానిక్స్‌లో బీటెక్‌ చేయడానికి, అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ (బీటెక్‌ అండ్‌ మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌/ఎంటెక్‌) ప్రోగ్రామ్‌కు సంబంధించి ఇస్రో నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 22 నుంచి జూన్‌ 5లోపు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అర్హత: ఈ కోర్సులకు అప్లై చేసే అభ్యర్థి తప్పనిసరిగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసిఉండాలి. మరిన్ని వివరాలకు
www.iist.ac.in/admissions/undergraduate ను చూడొచ్చు.
* 2019 సంవత్సరానికి ఇస్రో సైంటిస్ట్‌ పోస్టులను ప్రకటించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు. అర్హత: భారతీయ పౌరుడై ఉండాలి. కనీస వయసు 21. జనవరి 15, 2019 నాటికి 35 ఏళ్లు మించకూడదు. కనీసం 65%తో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
చివరితేది: జనవరి 15, రాతపరీక్ష: మార్చి 10. వెబ్‌సైట్‌:
http://www.isro.gov.in/ career

కోర్సులు, ఉపాధి అవకాశాలను అందిస్తున్న సంస్థల వివరాలు ‌www.eenadupratibha.net లో.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.