close

తాజా వార్తలు

పటం గీయగలరా?

కార్టోగ్రఫీ

పటం గీయగలరా?

ఉత్తరాన హిమాలయాలు.. దక్షిణాన హిందూ మహాసముద్రం.. పైన చైనా.. అడుగున ఆస్ట్రేలియా.. ముందుకెళితే అమెరికా.. వెనక్కి మళ్లితే ఆఫ్రికా.. మనం వెళ్లి చూశామా? కాదు.. మ్యాప్‌ ఆధారంగా చెప్పేశాం. మందిరాలు, మసీదులు, రోడ్లు, రైలు పట్టాలు, కుంటలు, కాలువలు, చెరువులు... ఒకటేమిటి భూమి మీద కనిపించే అన్నింటినీ కచ్చితమైన దూరంలో.. కరెక్టయిన దిక్కులో అలా రాసి పెట్టేశారు. ఎవరు? ఇంకెవరు మన కార్టోగ్రాఫర్లే. అంటే మ్యాపులను (పటాలు) అధ్యయనం చేసేవారు. భూగోళాన్ని చుట్టేసి ఎప్పటికప్పుడు పటాలపై పెట్టేయాలంటే   ఎంత మంది కావాలో ఊహించండి. జాగ్రఫీని ఎంజాయ్‌ చేసేవారికి ఇది ఆసక్తికరమైన ఉద్యోగం. శాటిలైట్ల సాయంతో మరింత అభివృద్ధి చెందుతున్న ఈ కార్టోగ్రఫీ (పటాల అధ్యయన శాస్త్రం) ఇప్పుడో పెద్ద ఉపాధి ప్రపంచం. కొత్త కోర్సులు, కొలువులు కోరుకునే వారికి సరైన మ్యాపింగ్‌ మార్గం.

పటం గీయగలరా?

బోర్డు మీద పెద్ద పటాన్ని ఉంచి, దానిలో ఫలానా దేశాన్నో, ప్రాంతాన్నో గుర్తించమని టీచర్‌ పిల్లలను అడుగుతుంటారు. ఒక తెలియని ప్రదేశానికి టూర్‌కు వెళతాం. మంచి రెస్టారెంట్‌ ఎక్కడ ఉందో, చూడదగ్గ ప్రదేశాలింకేమున్నాయో చూస్తాం. వెళ్లడానికి గూగుల్‌ మ్యాప్‌ తెరుస్తాం. ఒకటి పేపర్‌ ద్వారా గుర్తించేదైతే, మరొకటి డిజిటల్‌ సాయం. రెండింటి లక్ష్యం ఒక ప్రదేశాన్ని గుర్తించడమే. మనకు ఇంత వీలుగా ఉన్నవాటిని ఎవరు అందుబాటులోకి తీసుకొచ్చారో తెలుసా?వారే కార్టోగ్రాఫర్లు. పటాలు (మ్యాపులు), సంబంధిత అంశాలను అధ్యయనం చేసే కార్టోగ్రఫీలో కెరియర్‌  కొత్తగా, భిన్నంగా ఉండటమే కాదు; ఉపాధికి కూడా బాగా ఉపయోగకరం!
పటం గీయగలరా?నిత్య జీవితంలో ప్రతి సందర్భంలో శాటిలైట్‌ టెక్నాలజీ, జీఐఎస్‌ల వాడకం పెరుగుతోంది. దీంతో కార్టోగ్రఫీ మంచి కెరియర్‌గా ఎదుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా ఎన్నో సంస్థలు ప్రత్యేకమైన కోర్సులనూ అందిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం సంపాదించినవారు  సాధారణ ప్రజలకు సాయపడేలా మ్యాపులను రూపొందిస్తారు. పూర్వం నావికులు ఎక్కువగా వివిధ ప్రదేశాలను కనుక్కోవడానికి మ్యాపులను ఉపయోగించేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి అయింది. వివిధ రెస్ట్టారెంట్ల నుంచి ఏ సమయంలోనైనా కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసి, తెప్పించుకోగలుగుతున్నాం. వెళ్లాల్సిన ప్రదేశాలకు క్యాబ్‌లను బుక్‌ చేసుకుంటే... నేరుగా మన ఇంటి ముందుకు వచ్చి సేవలను అందిస్తున్నారు. ఇదంతా కార్టోగ్రాఫర్లు, జియో ఇన్ఫర్మాటిక్‌ నిపుణుల కృషి ఆధారంగానే సాధ్యమవుతోంది.
శాస్త్రీయ, కళాత్మక అంశాలు కార్టోగ్రఫీలో భాగం. గ్లోబలైజేషన్‌ కారణంగా ప్రపంచ సమాచారం అంతా ఒకేచోట అది కూడా డిజిటల్‌, దృశ్యరూపకంగా ఉండటం తప్పనిసరి అయింది. దీంతో కార్టోగ్రాఫిక్‌ నిపుణుల అవసరం బాగా పెరిగింది. వీరు అక్షాంశాలు, రేఖాంశాలు, ఎత్తులు మొదలైన అంశాల సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి వాటికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అందిస్తారు. తద్వారా ఒక ప్రదేశంలో జనాభా, భూభాగాన్ని ఉపయోగిస్తున్న తీరు, వాతావరణ మార్పులు, జనాభా వయసు, వారి ఆదాయం, జీవన పరిస్థితులు వంటి అంశాలన్నింటినీ అంచనా వేయగలుగుతున్నారు.

అన్ని అంశాల్లోనూ...

పటం గీయగలరా?

కార్టోగ్రాఫర్లు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్స్‌ను తరచుగా ఒక ప్రదేశాన్ని పక్కాగా గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (జీఐఎస్‌) కూడా వీరు ఉపయోగించే సాధనాల్లో ఒకటి. వీరు రిమోట్‌ సెన్సింగ్‌ సిస్టమ్స్‌, జియోడెటిక్‌ సర్వేలను ఉపయోగించి గ్రాఫిక్‌లు, డిజిటల్‌ రూపంలో మ్యాపులను తయారు చేస్తుంటారు. ఇవి వాతావరణ సంబంధిత అంశాలు, రైల్వే లైన్లు, విమాన మార్గాలను తెలుసుకోవడంలోనూ, సముద్ర మార్గాలను గుర్తించడంలోనూ తోడ్పడుతున్నాయి. ప్రకృతి వనరులు, పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన వివరాల సేకరణ, నగర- పట్టణ ప్రణాళికల రూపకల్పన, ట్రాఫిక్‌ హెచ్చుతగ్గులు తెలుసుకోవడం, రవాణా, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన అంశాల్లో సహకరిస్తాయి.

ఏమేం కోర్సులున్నాయ్‌?

పటం గీయగలరా?

భూగోళశాస్త్రం (జాగ్రఫీ)లో ఆసక్తి ఉన్నవారికి కార్టోగ్రఫీ అనుకూలమైన కోర్సు. చాలావరకు డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ జాగ్రఫీ కోర్సుల్లో కార్టోగ్రఫీలో కొంత భాగం కలుస్తుంది కూడా. అయితే కొన్ని సంస్థలు మాత్రం ప్రత్యేకంగా దీనిపైనే కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, మాస్టర్స్‌ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
సర్టిఫికేషన్‌ స్థాయిలో: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కార్టోగ్రఫీ అందుబాటులో ఉంది. ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సును జాగ్రఫీ సబ్జెక్టుగా పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి మూడు నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది.
డిప్లొమా: డిప్లొమా ఇన్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌ అందుబాటులో ఉంది. ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సును జాగ్రఫీ సబ్జెక్టుగా పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి రెండు నుంచి మూడేళ్ల వరకూ ఉంటుంది.
గ్రాడ్యుయేషన్‌: బీఈ (జియో ఇన్ఫర్మాటిక్స్‌), ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సును జాగ్రఫీ సబ్జెక్టుగా పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- నాలుగేళ్లు.
బీఎస్‌సీ (జాగ్రఫీ), బీఏ (జాగ్రఫీ) కోర్సులకు ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సును జాగ్రఫీ సబ్జెక్టుగా పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు.
బీటెక్‌ (జియో ఇన్ఫర్మాటిక్స్‌): ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- నాలుగేళ్లు
పీజీ: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జాగ్రఫికల్‌ కార్టోగ్రఫీ, ఎంఏ (జాగ్రఫీ), ఎంఈ (జియో ఇన్ఫర్మాటిక్స్‌), ఎంఎస్‌సీ (జాగ్రఫీ), ఎంఎస్‌సీ (జియో ఇన్ఫర్మాటిక్స్‌), ఎంటెక్‌ (రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జాగ్రఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌), ఎంఫిల్‌ (జాగ్రఫీ) కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి- రెండేళ్లు. ఏదేని గ్రాడ్యుయేషన్‌ కోర్సు చేసినవారు అర్హులు.
డాక్టొరల్‌: పీహెచ్‌డీ (జియోమాగ్నటిజమ్‌), పీహెచ్‌డీ (జాగ్రఫీ) కోర్సులున్నాయి. కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు. ఏదేనీ పీజీ కోర్సు 55% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు.
ప్రవేశ ప్రక్రియ ఒక్కో సంస్థకు ఒక్కోలా ఉంది. సంస్థ, ఎంచుకున్న కోర్సును బట్టి, ప్రవేశ పరీక్షలున్నాయి. కొన్ని సంస్థలు తమకంటూ ప్రత్యేకమైన ప్రవేశపరీక్షను నిర్వహిస్తుండగా, మరికొన్ని జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్షల స్కోరు ఆధారంగా ఎంచుకుంటున్నాయి. కొన్ని సంస్థలు వచ్చిన దరఖాస్తుల్లో నుంచి ఎంపిక చేసినవారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించి, ఆపై కోర్సుల్లోకి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ప్రవేశ ప్రకటనలు సాధారణంగా జూన్‌, జులై, సెప్టెంబరు నెలల్లో విడుదలవుతాయి.

కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు

* అన్నామలై యూనివర్సిటీ, చెన్నై * బర్డ్వాన్‌ యూనివర్సిటీ, వర్ధమాన్‌ * ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌, హైదరాబాద్‌ * ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ముంబయి * జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, దిల్లీ * ఎంఎస్‌ యూనివర్సిటీ, వడోదర * ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ * పండిట్‌ రవిశంకర్‌ శుక్లా యూనివర్సిటీ, రాయ్‌పుర్‌ * ఐఐటీ- ఖరగ్‌పుర్‌, రూర్కీ, కాన్పూర్‌ * సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌ * నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, హైదరాబాద్‌ * ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

ఈ నైపుణ్యాలుండాలి

* జాగ్రఫీ, పర్యావరణ అంశాలపై ఆసక్తి ఉండాలి. * ఊహా శక్తి తప్పనిసరి.  * ప్రాథమిక ఐటీ పరిజ్ఞానం ఉంటే మేలు. విశ్లేషణ, సమస్యా పరిష్కార నైపుణ్యాలుండాలి. * ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగల స్వభావం అవసరం. * ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కొన్నిసార్లు ఏకధాటిగా గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. అందుకే సహనం అవసరం.

ఉద్యోగావకాశాలు

పటం గీయగలరా?

ప్రపంచవ్యాప్తంగా కార్టోగ్రాఫిక్‌ నిపుణుల అవసరం పెరిగింది. వివిధ అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్‌ పరంగా, దృశ్యపరంగా ప్రతి దేశ సమాచారం తప్పనిసరి అయ్యింది. భారీ పరిశ్రమల అభివృద్ధికీ ఇది ఎంతో సాయపడుతోంది. ప్లానర్లు, ఇంజినీర్లు, యుటిలిటీ సంస్థలు, ఏజెన్సీలు, నిర్మాణ సంస్థలు, సర్వేయర్లు, ఆర్కిటెక్ట్‌లు మొదలైనవారికి తమ వృత్తిలో భాగంగా కార్టోగ్రాఫర్లు/ మ్యాపులు అవసరమవుతున్నాయి. వాతావరణ పరిస్థితుల అంచనా, పర్యాటక రంగం, జియొలాజికల్‌, మినరల్స్‌ను వెలికితీయడానికి, రక్షణ వ్యవస్థలోనూ జీఐఎస్‌ పాత్ర ప్రధానం.
మంచి నైపుణ్యాలున్నవారికి ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ చక్కటి ఉద్యోగావకాశాలున్నాయి. పబ్లిషింగ్‌, సర్వేయింగ్‌, కన్జర్వేషన్‌ సంస్థలూ వీరిని ఎంచుకుంటున్నాయి. ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా రక్షణ శాఖ, పర్యాటకం, రవాణా సంస్థల్లో వీరి అవసరం ఎక్కువ. జీఐఎస్‌, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలకూ వీరి సేవలు అవసరమే. స్థానిక ప్లానింగ్‌ విభాగాలు, చమురు సంస్థలు, కమర్షియల్‌ మ్యాప్‌ పబ్లిషర్లు, జియొలాజికల్‌ సర్వే సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎన్‌జీఓలు, జనాభా గణన, గ్రామీణాభివృద్ధి, వాతావరణ అంశాలపై పనిచేసే అభివృద్ధి సంస్థల్లోనూ వీరి నియామకాలుంటాయి. వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా వీరిని ఎంచుకుంటున్నాయి. గూగుల్‌, యాపిల్‌, నాసా, ప్రపంచ బ్యాంకు, యునెస్కోతోపాటు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ ఎనర్జీ, సైబర్‌టెక్‌ సిస్టమ్స్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, జియోఫినీ టెక్నాలజీస్‌, మాగ్నా సాఫ్ట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ మొదలైనవి వీరిని నియమించుకుంటున్న ప్రముఖ సంస్థల్లో ఉన్నాయి.
చాలా సంస్థలు వీరిని జీఐఎస్‌ నిపుణులు, అనలిటిక్స్‌, సైంటిస్టులు, రిసెర్చర్లు, ఆర్కైవిస్ట్‌, సర్వే ఇంటర్వ్యూయర్‌ టీచర్‌, అర్బన్‌ ప్లానర్‌, అసిస్టెంట్‌ కార్టోగ్రాఫర్‌ సర్వేయర్‌, ఇతర హోదాలకు ఎంచుకుంటున్నాయి. బాగా అనుభవమున్నవారిని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, ఇన్‌స్ట్రక్టర్లు, రిసెర్చర్లుగా తీసుకుంటారు.
కోర్సు, అనుభవంతోపాటు ఎంపికైన సంస్థ, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి వేతనాల్లో మార్పులుంటాయి. సాధారణంగా ప్రారంభ వేతనం రూ.15,000 నుంచి రూ.20,000 వరకూ లభిస్తుంది. విదేశాల్లో అయితే ఏడాదికి రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకూ పొందగలుగుతారు. అనుభవం పొందే కొద్దీ వేతనంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.