close

తాజా వార్తలు

పురుష జవాన్ల నాయకి

నాలుగేళ్ల క్రితం వరకూ ఆమె అందరిలాంటి సాధారణ అమ్మాయే. 
సంప్రదాయ నృత్యం, సంగీతం, చదువు... ఇవే ఆమె ప్రపంచం. 
నాణేన్ని తిరగేసినట్లు ఒక్కసారిగా ఆమె పూర్తిగా మారిపోయింది. 
కత్తిరించిన జుట్టు, చేత్తో రైఫిల్‌తో మార్చ్‌పాస్ట్‌ చేస్తూ... 
ఇంటికి దూరంగా, దేశరక్షణే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 
ఆమే తెలుగమ్మాయి, హైదరాబాదీ లెఫ్టినెంట్‌ భావనాకస్తూరి.

రానున్న జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో 144 మంది పురుష జవాన్ల బృందాన్ని పురుష జవాన్ల నాయకిముందుండి నడిపించబోతోంది భావన. అదీ ఇరవైమూడేళ్ల తరువాత. ఒక అమ్మాయిగా ఈ అవకాశాన్ని మొదటిసారి అందుకుంది ఆమె. సైన్యంలో ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌లో ఆఫీసర్‌గా చేస్తోందామె. ఆ విభాగం 23 సంవత్సరాల తరువాత గణతంత్ర దినోత్సవంలో భాగం కాబోతోంది. అలా బృందానికి నాయకత్వం వహిస్తోంది భావన. ‘ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌ అనేది సైన్యంలో ఓ విభాగం. భారత సైన్యానికి లాజిస్టిక్స్‌ సహకారం అందించడం మా పని. ఇప్పుడు నాకు వచ్చిన ఈ  అవకాశాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా. సాధారణంగా మహిళలకు రాదు. ఆరునెలల క్రితం మమ్మల్ని బెంగళూరు రమ్మన్నారు. అక్కడ ఎంపికలు జరిగాయి. సైనిక బృందానికి నాయకత్వం వహిస్తానని అనుకోలేదు. నాతోపాటు మరో అమ్మాయి కూడా ఉంది. శిక్షణ మొదలైంది. పరేడ్‌, డ్రిల్‌ ఇలా చాలా జరిగాయి. డిసెంబరు చివరివారంలో నన్ను కంటింజెంట్‌ కమాండర్‌గా ఎంపిక చేస్తూ నాయకత్వం వహించమన్నారు...’ అని చెబుతుంది భావన.

నాలుగోసారి సాధించి... 
భావనది సంప్రదాయ కుటుంబ నేపథ్యం. పుట్టిపెరిగినదంతా హైదరాబాద్‌లోనే. తండ్రి సీసీఎంబీ ఉద్యోగి. తల్లి స్టెనోగ్రాఫర్‌. చిన్నప్పుడు ఇష్టంతో నాట్యం, సంగీతం నేర్చుకుంది. ఆ రెండే తన భవిష్యత్తు అనుకుంది. సాధన చేయడం, ప్రదర్శనలు ఇవ్వడమే ప్రపంచంగా గడిపింది.   అయితే చదువుకుంటున్నప్పుడు సైన్యం గురించి వింది. దానికి కారణం డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్‌సీసీలో చేరడమే. ఎలాగైనా సైన్యంలోకి రావాలనుకుంది. దానికి షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికలు జరుగుతాయని తెలుసుకుంది. ప్రతిఏటా దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ పరీక్షలు రాసినా అవకాశం మాత్రం నలుగురికే వస్తుందని తెలుసుకున్న ఆమె... ఆ పరీక్షలో అర్హత సాధించేందుకు ప్రణాళికలు వేసుకుంది. అప్పటికే డిగ్రీ పూర్తిచేసిన భావన ఓ వైపు ఆ పరీక్షలకు సిద్ధమవుతూనే... మరోవైపు సమయం వృథా కాకుండా ఉస్మానియాలో ఎంఎస్సీ మైక్రోబయాలజీలో చేరింది. కానీ అమె అనుకున్నది ఒక్కటి. జరిగింది మరొకటి. మొదటిసారి ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసింది. అవకాశం వస్తుందని అనుకుంది... కానీ రాలేదు. మరో రెండుసార్లు ప్రయత్నించినా సాధించలేకపోయింది. అయినా పట్టు వదల్లేదు. నాలుగోసారి ప్రయత్నించింది. ఈసారి పలు ఇంటర్వ్యూలు, వడపోతల అనంతరం నాలుగోసారి, నాలుగో అమ్మాయిగా అవకాశం అందుకొంది. అలా చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’ (ఓటీఏ)లో శిక్షణకు అర్హత సాధించింది.

జుట్టు కత్తిరించుకుంది... 
వచ్చిన అవకాశం గురించి తెలిసి, తన చుట్టూ ఉన్నవారు సంతోషిస్తారనుకుంది భావన. కానీ చాలామంది నుంచి ప్రతికూల సమాధానమే వచ్చింది. ‘ఆర్మీ శిక్షణ అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆడపిల్లవి. నీ వల్ల కాదు...’ అని కొందరంటే... ‘చక్కగా నాట్యం నేర్చుకున్నావ్‌. సంగీతం కూడా వచ్చు. ప్రయత్నిస్తే ఐటీ ఉద్యోగం వస్తుంది. భవిష్యత్తు బాగుంటుంది. పెళ్లి చేసుకుని హాయిగా స్థిరపడక ఇంత కష్టం అవసరమా’ అని మరికొందరు అన్నారు.  ఎవరెన్ని చెప్పినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకే సిద్ధమైంది. శిక్షణ కోసం అప్పటివరకూ ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని కత్తిరించుకోవాల్సి వచ్చింది. అదే చేసింది. అలా 2015లో సైనికురాలిగా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు అసలు సవాళ్లు ఎదురయ్యాయి. శిక్షణలో భాగంగా కఠినమైన పరీక్షలు తప్పలేదు. ‘ఒక్క క్షణం ఖాళీ దొరికేది కాదు. ఒక్కోసారి పరుగెడుతున్నప్పుడు కాళ్లు కదపలేని స్థితిలో కూర్చుండిపోయేదాన్ని. కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నా మరో పని ఉండేది. మొదట్లో మనసూ, శరీరం రెండూ సహకరించేవి కావు. శరీరం పుండులా మారిపోయింది. అలసిపోయినా నిద్రపట్టేది కాదు. గుర్రపుస్వారీ, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, ఈత, రాకెట్‌ లాంచింగ్‌... ఒకటేమిటి ఎన్నో ఉండేవి. ఓసారి 20 కిలోల బరువైన బ్యాగును భుజాన వేసుకుని నలభై కిలోమీటర్లు పరుగెత్తాలని చెప్పారు. అదీ రాత్రంతా పరుగెత్తి తెల్లారేసరికల్లా చేరుకోవాలి. మా బ్యాచ్‌లో మొత్తం 250 మంది ఉంటే అమ్మాయిల సంఖ్య 30. మొదట మా వల్ల ఆ పని సాధ్యమవుతుందా అని అనుకున్నాం. కానీ ఒకరు వెనకడుగు వేసినా... మరొకరం ప్రోత్సహించుకుంటూ పరుగెత్తాం. అలా నేను చెప్పిన సమయం కన్నా ముందే చేరుకోగలిగా. అప్పుడే అనిపించింది. మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగలరని. అలా శిక్షణలో భాగంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా... అన్నింటినీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమించా. ఇంట్లో ఓ పట్టాన నిద్రలేచేదాన్ని కాదు. శిక్షణలో భాగంగా నాలుగ్గంటలకే లేచేదాన్ని. పరేడ్‌, పరుగు ఇలా అబ్బాయిలతో సమానంగా చాలా చేయాలి. ఒక్కోసారి చేయలేకపోయినా నా లక్ష్యం గుర్తొచ్చినప్పుడల్లా కసిపుట్టేది. చివరకు రోప్‌పుషింగ్‌, ఫైరింగ్‌... ఇలా చాలా విభాగాల్లో ముందున్నా. శిక్షణ పూర్తయ్యేసరికి అకాడమీలో టాపర్‌గా నిలిచా. అవన్నీ నాకు గుర్తింపునే కాదు, ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి...’ అని చెబుతుంది భావన.

శిక్షణలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇంట్లోవాళ్లతో రోజూ ఫోను మాట్లాడే అవకాశం ఉండదు. శిక్షణలో ఉన్నప్పుడయితే ఉత్తరాలు రాసేదాన్ని. అప్పుడు అది నాకు కొత్తే కానీ అలవాటైపోయింది. ఇప్పుడు కూడా ఏ మూడునాలుగు రోజులకోసారో అమ్మకు ఫోను చేస్తా. వాళ్ల మాటల్లో నేను వాళ్లకు దూరంగా ఉన్నాననే బాధ కన్నా ఆనందమే ఎక్కువగా ఉంటుంది. అంతకన్నా కావల్సిందేముంటుంది.

ఏడుపొచ్చేసింది..

పురుష జవాన్ల నాయకి

భామనే సత్యభామే అంటూ జడని వయ్యారంగా తిప్పుతూ... నృత్యం చేస్తూ, దేశవిదేశాల్లో ప్రదర్శన ఇచ్చిన నేను ఇటువైపు వస్తానని అనుకోలేదు. శిక్షణ పూర్తయిన వెంటనే నాకు కార్గిల్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ క్షణం నాకు మేజర్‌ పద్మపాణి ఆచార్య గుర్తొచ్చారు. ఒక్క క్షణం భయం అనిపించినా... ఆయన వీర మరణం ఎంత మందిలో దేశభక్తి రగిలించిందో గుర్తొచ్చింది. ఉత్సాహంగా చేరిపోయా. మహిళా జవానుగా భరతమాతకు సేవ చేసే అవకాశం నాకు వచ్చిందని సంతోషించా. మొదటిసారి కార్గిల్‌కి వెళ్లినప్పుడు ఆ ప్రాంతం నాకు చాలా అందంగా కనిపించింది. అక్కడ యుద్ధంలో చనిపోయిన వార్‌ హీరోల ఉత్తరాలు ఉంటాయి. వాటిని చదివినప్పుడు   ఏడుపు వచ్చేసింది. ఒక సైనికురాలిగా నేనెలా ఉండాలో కూడా అర్థమైంది. దేశం కోసం నిస్వార్థ సేవ చేయాలని, చనిపోయినా ఆనందమేనని, దేశం తరువాతే కుటుంబం అని ఆ క్షణానే నిర్ణయించుకున్నా. 

శిఖ... స్టంట్‌ ఉమన్‌గా!

ఈమె పేరు కెప్టెన్‌ శిఖా సురభి. ఐదేళ్లక్రితం సైన్యంలోకి వచ్చిన ఆమె... అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే మరో అరుదైన అవకాశాన్ని అందుకుంది.  

పురుష జవాన్ల నాయకి

శిఖది సైన్యంలో ఫస్ట్‌ కార్ప్స్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌ విభాగం. ప్రస్తుతం పంజాబ్‌లోని బటిండాలో పనిచేస్తోంది. ఇప్పుడు డేర్‌డెవిల్స్‌ టీం తరఫున జనవరి 26న మోటార్‌సైకిల్‌మీద స్టంట్‌ చేయబోతోంది. భారత సైన్యం తరఫున మొదటిసారి ఇలాంటి అవకాశాన్ని అందుకుందామె. ఇందుకోసం కఠోర శిక్షణ కూడా తీసుకుంది. శిఖా సురభిది జార్ఖండ్‌. ఆమె కుటుంబసభ్యుల్లో కొందరు ఇప్పటికే సైన్యంలో ఉన్నారు. తల్లి పీటీ టీచర్‌. దాంతో శిఖను చిన్నతనం నుంచీ... కరాటె, కిక్‌బాక్సింగ్‌తోపాటు ఇతర క్రీడల్లోనూ ప్రోత్సహించిందామె. అలా శిఖ ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కిక్‌బాక్సింగ్‌లో జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. బీటెక్‌ పూర్తిచేసిన ఆమె రెండేళ్లు ఓ ఎంఎన్‌సీలోనూ పనిచేసింది. మొదటినుంచీ సైన్యంపై ఆసక్తి ఉండడంతో 2014లో ఇటువైపు వచ్చింది. ఏడాదికే లెఫ్టినెంట్‌ ఆ తరువాత కెప్టెన్‌ స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం భారత సైన్యం మహిళా అధికారుల చేత స్టంట్స్‌ చేయించాలనే ఉద్దేశంతో కొందరిని ఎంపిక చేయాలనుకుంది. దానికోసం ట్రయల్స్‌ నిర్వహించింది. శిఖకు ముందే బైక్‌ నడపడం వచ్చు. అలా డేర్‌ డెవిల్స్‌కి ఎంపికైన ఆమె... తరువాత ఆ బృందం నేతృత్వంలో స్టంట్స్‌ చేయడం మొదలుపెట్టింది. ‘దీనికి ఎంపికవడం ఆనందం కలిగించినా ప్రారంభంలో భయపడుతూనే సాహసాలు చేయడానికి సిద్ధమయ్యా. మూడునాలుగు నెలలు శిక్షణ తీసుకున్నా. గాయాలు కాలేదు కానీ... క్రమంగా అలవాటైంది. ఇప్పుడు బైక్‌పై నిల్చుని రాజ్‌పథ్‌లో గణతంత్ర కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథికి సెల్యూట్‌ చేయబోతున్నా. నా వెనుక తొమ్మిది బైకుల్లో ఆర్మీ జవాన్లు పిరమిడ్‌ ఆకృతిలో వస్తారు. అలా దాదాపు 2.4 కిలోమీటరు బైక్‌పై నిల్చుని వస్తా. ఇదే స్టంట్‌ని ఈ సంవత్సరం జనవరి 15 న ఆర్మీ దినం రోజున కూడా చేశా. డేర్‌డెవిల్స్‌ బృందం కొన్నేళ్లుగా స్టంట్లు చేస్తోంది. రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది...’ అని చెబుతుందామె.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.