close

తాజా వార్తలు

పదిలో పదికి పది!

విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు చాలా ముఖ్యమైనవి. వీటిలో 10/10 జి.పి.ఎ. లక్ష్యంగా పెట్టుకుని చాలామంది కష్టపడి చదువుతున్నారు. శ్రద్ధగా పునశ్చరణ చేస్తున్నారు. ఈ లక్ష్యసాధన కష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది అపోహ మాత్రమే. ప్రణాళిక ప్రకారం చదువుతూ.. విషయం అర్థం చేసుకుంటూ... దానిపై పట్టు సాధించటం దీనికి మొదటి మెట్టు. అలాగే రాయబోయే పరీక్షావిధానంపై అవగాహన పెంచుకోవాలి. ఆపై ఆత్మవిశ్వాసంతో, విజయంపై నమ్మకంతో పరీక్షలు రాస్తే అనుకూల ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది!

పరీక్షలు దగ్గరపడుతున్నపుడు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే సందేహాలు పదో తరగతి విద్యార్థులను ఆందోళనలకు గురిచేస్తుంటాయి. తగిన మెళకువలు పాటిస్తే వాటిని అధిగమించవచ్చు. శ్రమించే తత్వం, సన్నద్ధత చాలా ముఖ్యం. చదివేటప్పుడూ, రాసేటప్పుడూ ‘ఇక చాలు’ అనుకోకూడదు. ఇంకాస్త చదివితే మార్కులు పెరుగుతాయి,  కొంచెం ఆలోచించి రాస్తే అర మార్కు సంపాదించవచ్చనే భావన పెంచుకోవాలి.

ప్రణాళిక: ఏ పని చేపట్టినా ఒక పద్ధతిని ఆచరిస్తే ఫలితం బాగుంటుంది. ప్రతి సబ్జెక్టుకూ కొంత సమయం కేటాయించాలి. ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, వాటిని బాగా చదివి, చూడకుండా రాయాలి. రాని ప్రశ్నలను వదిలివేయకుండా మళ్ళీ ప్రయత్నించాలి.

ప్రశాంతత: పరీక్షలంటే భయపడితే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడూ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ‘తప్పక సాధిస్తాను’ అనుకోవాలి.

పునశ్చరణ: పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఇంతకుముందు చదివిన ప్రశ్నలనే పునశ్చరణచేస్తూ అవగాహన పెంచుకోవాలి. పరీక్షకు ముందు సబ్‌ హెడ్డింగ్స్‌, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చదవాలి. 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఛాయిస్‌ లేని 1/2, 1, 2 మార్కుల ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. రోజూ ఒకటి లేదా రెండు వ్యాసరూప ప్రశ్నలు రాయడాన్ని సాధన చేస్తే పరీక్షలో వేగంగా, తప్పులు లేకుండా విషయాన్ని వివరించవచ్చు. స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను ఇప్పటికే చాలావరకు చదివిఉంటారు. వాటిని మినహాయించి మిగతావాటిపై దృష్టి పెట్టండి. జవాబులను చదివేసమయంలో బిట్లుగా వచ్చే పాయింట్లను అండర్‌లైన్‌ చేసి ఉంచుకోండి. పరీక్షలు సమీపించినప్పుడు వాటిని పునశ్చరణ చేయండి.

ప్రశ్నపత్రం చదవాలి: పరీక్షల్లో విద్యార్థులంతా సాధారణంగా చేసే పొరపాటు- ప్రశ్నపత్రాన్ని సరిగా చదవకపోవడం. క్షుణ్ణంగా చదివితే ఎలా రాయాలి అనేదానిపై స్పష్టత ఏర్పడుతుంది. సమయపాలన తేలికవుతుంది.

మార్కులకు అనుగుణంగా: ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ఏయే అంశాలను తప్పనిసరిగా రాయాలి అనే దానిపై విద్యార్థులకు స్పష్టత అవసరం. అడిగిన ప్రశ్నకు ఏ పాయింట్లు ఉంటే పూర్తి మార్కులు పొందుతారో తెలుసుకొని ఉండాలి. మొదట ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా తప్పనిసరిగా రాయాల్సిన అంశాల తర్వాతే, మిగతావి రాయటం మేలు.

అవసరముంటేనే అడిషనల్స్‌: అదనపు జవాబుపత్రాలను (అడిషనల్స్‌) అవసరంమేరకే తీసుకోండి. ఎక్కువ పేజీల్లో సమాచారం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చుననేది అపోహే. జవాబు పత్రాల్లో అవసరానికి మించి ఖాళీలు వదిలి ఎక్కువ అడిషనల్స్‌ తీసుకోవద్దు. ఇలా చేస్తే మీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి విసుగ్గా అనిపించడంతోపాటు మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఎక్కువ పేజీలుంటే ఎక్కువ మార్కులు ఇస్తారని రాసిన జవాబునే మళ్లీ రాయవద్దు.

సమయ సద్వినియోగం: కొందరు పరీక్షలో సమయం చూసుకోకుండా రాస్తూనే ఉంటారు. ఇలాంటివారు తెలిసిన జవాబులు రాయకుండానే పేపర్‌ ఇచ్చేయాల్సి వస్తుంటుంది. అందుకని ఆయా ప్రశ్నలకు నిర్దేశిత సమయాన్ని మాత్రమే కేటాయించండి. మొదట మీకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. మరిచిపోయిన జవాబులను చివరిలో ప్రయత్నించండి. ప్రశ్నల నంబరు వేయడం మరవకండి. జవాబుల్లో ఉపశీర్షికలు (సబ్‌హెడ్డింగ్స్‌) ఉంటే వాటిని అండర్‌లైన్‌ చేయాలి. ఉపశీర్షికలు లేని సమాధానాల్లోని పాయింట్స్‌లో ముఖ్యపదాలను అండర్‌లైన్‌ చేయండి. అదనపు (ఛాయిస్‌) ప్రశ్నలను ముందే రాయకండి. చివరిలో సమయం ఉంటేనే రాయండి. అర్థమయ్యే చేతిరాత, క్రమబద్ధంగా రాసిన జవాబులు, ఉప విభాగాలు, ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేయడం, మార్జిన్‌ వదలడం, ప్రశ్నపత్రం దిద్దేవారిని ఆకట్టుకుంటాయి. అన్ని జవాబులూ రాసిన తర్వాత, జవాబు పత్రాన్ని అంతా చదివి తప్పులుంటే సరిచేయండి.

చేతిరాత: పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల దీనిపై శ్రద్ధ వహించాలి. ఒకవేళ మీ చేతిరాత బాగుండకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దస్తూరి అందంగా ఉండటం ముఖ్యం కాదు; మీరు రాసింది దిద్దేవారికి అర్థం కావాలి. అందుకు పదానికీ పదానికీ¨ మధ్య కాస్త ఖాళీ ఇవ్వండి. అలాగే ప్రతి రెండు వాక్యాల మధ్యా కొంచెం దూరం పాటించండి. అంతే!

సాంఘికశాస్త్రం

భూగోళశాస్త్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు భారతదేశ పటాన్నీ, చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు ప్రపంచపటాన్నీ దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పటాలను చూస్తూ చదవండి. ఒకసారి చదివితే ఏదీ రాదు. వచ్చేవరకూ చదవండి. బిట్స్‌ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) బట్టీ పట్టవద్దు. డ్రిల్లింగ్‌ (ఒకరిని ఒకరు అడగటం) చేస్తే మేలు. 

వ్యాఖ్యానించడం: ‘ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి వ్యాఖ్యానించడం’ అనే నైపుణ్యంలో ఇచ్చే పేరాను కొంతమంది ఉన్నది ఉన్నట్లు రాస్తున్నారు. ఇలా చేయకూడదు. పేరాను పూర్తిగా చదవండి. ప్రశ్నను అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన అంశాలు మాత్రమే రాయండి. అభిప్రాయాలు అడిగినప్పుడు ఆ పేరాలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాయండి. దీనికోసం పాఠ్యపుస్తకంలోని రెండు పేరాలను తీసుకుని సాధన చేయండి.

పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు: పాఠ్యపుస్తకంలో ఉన్న పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలను పరిశీలించండి. ఆ పట్టిక మనకు ఏమి తెలియచేస్తుంది? సమాచారంలో మొదటి, చివరి స్థానంలో ఏం ఉన్నాయి? వాటి మధ్య తేడా ఏమిటి? ప్రత్యేకత ఏమిటి? పటాలైతే ఏ దిక్కులో ఏ దేశాలున్నాయి? భారతదేశపటంలో ఏ వైపు ఏ రాష్ట్రాలున్నాయి? మొదలైన ప్రశ్నలతో వాటిని పరిశీలనాత్మక ధోరణిలో చూడండి.

పట నైపుణ్యాలపై అవగాహన ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఈ నైపుణ్యంలో మూడు విధాలుగా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రాలను, భారతదేశ చిత్తుపటాలను గీయమనడం; ప్రాంతాలను, దేశాలను గుర్తించమనడం; గుర్తించిన పటాన్నిచ్చి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమనడం. ఈ మూడింటినీ సాధన చేయండి. ఈ సాధన ద్వారా సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను బట్టీపట్టకుండా అర్థం చేసుకోవచ్చు. దేశాలు, దీవులు, ఇతర ప్రాంతాలను కొన్ని ఆకారాల్లో (జంతువులు, పక్షులు, అక్షరాలు, అంకెలు) గుర్తుపెట్టుకుంటే వాటిని సులభంగా గుర్తించవచ్చు. మ్యాప్‌ను గుర్తించేటప్పుడు ప్రశ్న సంఖ్యను అక్కడ వేయకూడదు. గుర్తించిన చోట పేరు మాత్రమే రాయాలి. ఒకవేళ స్థలం లేకపోతే బాణం గుర్తువేసి రాయాలి. లేదా గుర్తించాల్సిన ప్రదేశంలో మ్యాప్‌పై సంఖ్యవేసి, ఎదురుగా పేరు రాయాలి.

సమకాలీన అంశాలు:  ఈ నైపుణ్యంలో పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి. * మొదటి పేపర్‌లో- పాఠశాల విద్య, భ్రూణహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, లింగ వివక్ష, మధ్యాహ్న భోజన పధకం, మురికి వాడలు, చౌకధరల దుకాణాలు, నీరు- అమ్మకాలు, నీటి కాలుష్యం, భూగర్భజలాలు, ప్రపంచీకరణ, పోషకాహారం, భూగోళం వేడెక్కడం, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్‌పొర. * రెండో పేపర్‌లో- ప్రపంచయుద్ధాలు, భారతదేశంతో ఇతర దేశాల సంబంధాలు, ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, నూతన రాష్ట్రాలు, జిల్లాల ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టండి.

బిట్‌పేపర్‌ రాసేటప్పుడు: బిట్‌పేపర్‌ ఇచ్చిన వెంటనే మెయిన్‌ పేపర్‌ రాయడం ఆపి బిట్‌పేపర్‌ పూర్తి చేయాలి. సమయం ఉంటే ఆ తర్వాత మెయిన్‌ పేపర్‌ రాయాలి.
* A, B, C, D లు బ్రాకెట్టులో రాసేటప్పుడు సరిగా రాయండి. జవాబులు తప్పు రాశామనుకుంటే దానిపై దిద్దవద్దు. తప్పు అనుకున్నదాన్ని పూర్తిగా కొట్టివేసి, అప్పుడు సరైన సమాధానం రాయాలి. అన్ని బిట్లనూ పూరించండి. ఒక్కోసారి ఏదైనా బిట్‌ తప్పుగా రావచ్చు. ఇలాంటివి అటెమ్ట్‌ చేస్తే మార్కు వస్తుందని మర్చిపోవద్దు. 

- బొమ్మడి నారాయణరావు

గణిత శాస్త్రం

నూరుశాతం మార్కులను కచ్చితంగా సాధించగలిగే సబ్జెక్టు గణితశాస్త్రం. దీనిలో విజయానికి వేగం, కచ్చితత్వం రెండూ తప్పనిసరి. ప్రశ్నలు పుస్తకంలోవి యథాతథంగా ఇవ్వకున్నా  కొంత మార్పుచేసి ఇస్తారు. కాబట్టి లెక్కను ఒక్కటికి రెండుసార్లు చదివితే సమాధానం లభిస్తుంది. మల్టిపుల్‌ చాయిస్‌లో  ఏ ఒక్క ప్రశ్ననూ వదిలిపెట్టకూడదు.

సమస్యలు సాధించేటపుడు ప్రతి ప్రశ్నకూ దత్తాంశం తప్పనిసరిగా రాయాలి. గ్రాఫ్‌ గీసేటపుడు పెన్సిల్‌తో గీయాలి. స్కేలు రాయాలి. నిర్మాణం చేసేటపుడు చిత్తుపటం  గీయాలి. నిర్మాణక్రమం పూర్తిగా రాయాలి. ఈ విధంగా చేసేటప్పుడు 3 మార్కులలోపు సంపాదించుకోకపోయినా 10 జీపీఏ వస్తుంది. సెక్షన్‌, ప్రశ్న నంబరు స్పష్టంగా వేయాలి. ప్రతి ప్రశ్న పూర్తికాగానే కి¨ంద మార్జిన్‌ కొట్టాలి. 

* మొదట 1 మార్కు ప్రశ్నలు 7 ఇస్తారు. వీటిని వరసగా రాస్తే బాగుంటుంది. * 2 మార్కుల ప్రశ్నల్లో సులభంగా ఉండే 3 ప్రశ్నలు మొదట ఎంచుకోవాలి. * 4 మార్కుల 4 ప్రశ్నలను అంతర్గత ఎంపిక ద్వారా ఇస్తారు. కనీసం 2 ప్రశ్నలను మొదటగా ప్రయత్నించి రాయాలి.   * మల్ట్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల జవాబుల్లో కొట్టివేతలు, దిద్దివేతలు, రెండు సమాధానాలూ రాయకూడదు. 

పేపర్‌-Iలో
* మంచి మార్కులు సాధించాలంటే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు, సంగత సమీకరణాలు, అసంగత సమీకరణాలు, పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణాలు, జతకు సంబంధించిన సమస్యలు, గ్రాఫ్స్‌ బాగా సాధన చేయాలి. * సమితులు అధ్యాయం నుంచి  4 మార్కుల ప్రశ్న ప్రతిసారీ వస్తోంది. ముఖ్యంగా ఏ చాప్టర్‌కూ మార్కుల వెయిటేజి ఇవ్వడం లేదు. ఏ అధ్యాయంనుంచైనా విద్యాప్రమాణాల ఆధారంగా వెయిటేజి ఇస్తారు. 

పేపర్‌-IIలో
మంచి మార్కులు సాధించాలంటే మొట్టమొదటిగా త్రికోణమితి అధ్యాయాన్ని బాగా సాధన చేయాలి. త్రికోణమితీయ నిష్పత్తులు, త్రికోణమితీయ సర్వసమీకరణాలకు సంబంధించిన సమస్యలు అభ్యాసం చేయాలి. నీ తేలిగ్గా మార్కులు సాధించగలిగే సంభావ్యతలో పేకముక్కలు - సంభావ్యత, సంభావ్యత అనువర్తనాలకు సంబంధించిన సమస్యలు సాధన చేయాలి. నీ సులువుగా ఉండే సాంఖ్యకశాస్త్రంలో 4 మార్కుల సమస్య తప్పకుండా వస్తుంది. 

- పి.వేణుగోపాల్‌ 

పదోతరగతి సోషల్‌, మ్యాథ్స్‌ పరీక్షల్లో ముఖ్యమైన ప్రశ్నల కోసం  ‌www.eenadupratibha.net చూడవచ్చు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.