close

తాజా వార్తలు

ప్లీజ్‌.. మా పెళ్లి జరిపించండి..

రాజస్థాన్‌ పోలీసులకు వారం రోజుల్లో 21 జంటల నుంచి వినతులు

జయపుర: ‘ప్లీజ్‌... మా పెళ్లి జరిపించండి’ అంటూ రాజస్థాన్‌ పోలీసులకు వారం రోజుల్లో 21 జంటల నుంచి వినతులు వచ్చాయి. ప్రేమికులకు వారి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర‌ పోలీసులు ఇటీవల ఓ నిర్ణయం తీసుకుని, హెల్ప్‌లైన్‌ సౌకర్యాన్ని కల్పించారు. 18 ఏళ్లు దాటిన వారు ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రేమికులు ఈ హెల్ప్‌లైన్‌ను తెగవాడేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని కొందరు , తమను కుటుంబ సభ్యులు నిర్బంధించారని, బయటకు వెళ్లనివ్వట్లేదని మరికొందరు ఫిర్యాదులు చేశారు. తమకు ఎలాగైనా సాయం చేసి పెళ్లి జరిపించాలని వేడుకుంటున్నారు. 

ఈ హెల్ప్‌లైన్‌ను జనవరి 24 నుంచి ప్రారంభించారు. 25 ఏళ్ల ఓ యువకుడు హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి, తాను డిసెంబరు 2018లో అజ్మెర్‌లో 19 ఏళ్ల ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే, తన భార్య కుటుంబ సభ్యులు తమ పెళ్లిని ఒప్పుకోవట్లేదని, ఆమెను తీసుకెళ్లి ఇప్పుడు మరో అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. మరో ప్రేమికుడు పోలీసులకు ఫోన్‌ చేసి, తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు నిర్బంధించారని, తనను కలవనివ్వట్లేదని, తమ పెళ్లి చేయాలని కోరాడు. ఈ సమస్యల పరిష్కారం కోసం విధులు నిర్వహస్తున్న ఎస్పీ లవ్లీ కాటియార్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘వారం రోజుల్లో మాకు 21 ఫిర్యాదులు అందాయి. వీటిని మేము ఆయా ప్రేమికులు ఉంటోన్న ప్రాంతానికి సంబంధించిన నోడల్‌ అధికారులకు పంపుతాము. వారు ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు. 

ప్రేమికులకు తమ బంధువుల నుంచి ప్రాణహాని ఉంటే ఆ నంబర్లకు ఫోను చేసి సాయం కోరవచ్చని ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులకు ఆ రాష్ట్ర పోలీసు ప్రధానకార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ప్రాణహాని ఉన్న ప్రేమికులకు రక్షణ కల్పించే విషయంపై ఇటీవల తమకు రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రేమికులకు తమ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తుండడం, తమకు ప్రాణహాని ఉన్నట్లు ప్రేమికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో వారికి రక్షణ కల్పించే ఉద్దేశంతో పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి కేసులను పర్యవేక్షించేందుకు అన్ని జిల్లాల్లో ఒక్కో సీనియర్‌ పోలీసు అధికారిణిని కూడా నియమిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.