
తాజా వార్తలు
కేరాఫ్ చినగంజాం
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం.. ఉదయం అంతా ఉప్పు తయారీలో నిమగ్నమై ఉండే ఆ కుర్రాళ్లు సాయంత్రం అయితే కూత పెడతారు.. కబడ్డీ కబడ్డీ అంటూ ఉత్సాహంగా బరిలో దూకుతారు. అక్కడ దాదాపు ఇంటికో ఛాంపియన్ ఉన్నాడు.. జిల్లాలకు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ల సంఖ్యకు లెక్కే లేదు.. వందల ఆటగాళ్లు పుట్టారు.. ఇంకా పుడుతూనే ఉన్నారు.. కబడ్డీకి కార్ఖానాగా మారిన ఆ ఊరు పేరు చినగంజాం!
రెండు దశాబ్దాలు.. రెండు వేలకు మందికిపైగా కబడ్డీ ఆటగాళ్లు.. ఒక చినగంజాం..! కబడ్డీని వారసత్వంగా చేసుకుని.. దాన్నే బతుకుదెరువుగా మార్చుకుని..ఆటలో సత్తా చాటుతున్నవాళ్లు అక్కడ కోకొల్లలు. కూలీలుగా పని చేసే ఎక్కువమందికి ఈ ఆట ఓ వ్యాపకం.. ఈ ఆటే పెద్ద లోకం. చిన్నా పెద్దా తేడా లేదు.. అందరి నోటా కబడ్డీనే.. వాళ్లకు కోచ్‌లు బయట ఎక్కడ నుంచో రారు.. తాతలు తండ్రులే కోచ్‌లు. పాతతరం వాళ్లు సాధించిన ఘనతలే వారికి పెద్ద ఆస్తి. అందుకే వాళ్లు ఏది వదిలిపెట్టినా కబడ్డీ మాత్రం వదలరు. కబడ్డీలో ఇక్కడ నుంచి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ప్రొ కబడ్డీ లీగ్‌తో పాటు జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నవాళ్లూ ఉన్నారు.
చిరిగిపోయిన జెర్సీలు.. బూట్లు లేక వరుచుపోయిన కాళ్లు.. కానరాని కనీస వసతులు..! అయినా.. ఇక్కడ కబడ్డీ ఆగదు. వీళ్లందరికి ఈ ఆటే పెద్ద సంపద! కబడ్డీలో రాణిస్తే తమ బతుకులు బాగు పడతాయేమోనన్న ఆశ వారిది. చినగంజాం ఆటగాళ్లు స్వాభావికంగానే దేహధారుఢ్యంలో మిన్నగా ఉండడంతో వారికి కబడ్డీలో అంతగా పట్టు వచ్చింది. క్రీడా కోటాలో పోలీసు, మిలిటరీ లాంటి ఉద్యోగాలు వస్తే తమ పేదరికం కొద్దిగా అయినా తగ్గుతుందేమో అన్న అభిలాషతో వీళ్లు కబడ్డీని వదలరు. విశేషం ఏమిటంటే 1985కు ముందు చినగంజాంలో కబడ్డీ ఆట పెద్దగా ప్రాముఖ్యత లేదు. కానీ అప్పటి ప్రభుత్వ పీఈటీ గోవిందు శ్రీనివాసరావు ప్రోత్సాహంతో మొదలైన ఈ ఆట ఆ తర్వాత మరో పీఈటీ బత్తుల నాగేశ్వరరావు అండతో వేగంగా వ్యాప్తి చెందింది. పక్క ఉళ్లో కబడ్డీ పోటీలు గెలిస్తే డబ్బులు వస్తాయన్న ఆశతో కుర్రాళ్లంతా జట్టుగా ఏర్పడి కబడ్డీని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఆడిన ఆట్ల అంజిరెడ్డి, మోపర్ల వెంకటేశ్వర్లు, ముసలారెడ్డి ఇలా ఎంతో మంది ఆటగాళ్లు పుట్టుకొచ్చారు. ఇక్కడ కబడ్డీ ఆడే వాళ్లందరి వృత్తి దాదాపు కూలీనే. ఉదయాన్నే లేవడం ఏదో ఒక పనికి వెళ్లడం.. ఖాళీ దొరికితే కబడ్డీ ఆడడం ఇదే వాళ్ల దినచర్య. జాతీయ టోర్నమెంట్లతో పాటు స్థానికంగా జరిగే ప్రతి టోర్నీల కోసం చినగంజాం నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లడం ప్రత్యేకత.
కూలీల నుంచి ఛాంపియన్లుగా
2015లో గుజరాత్, 2016లో తమిళనాడులో జరిగిన జాతీయ సీనియర్ కబడ్డీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉమామహేశ్వరరావు, 2018లో విశాఖపట్నంలో జరిగిన జాతీయ కబడ్డీ టోర్నీలో బెస్ట్ డిఫెండర్‌గా నిలిచిన సురేశ్‌రెడ్డి, ఇదే జట్టులో ఉన్న కాశీ విశ్వనాథ్, లక్ష్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి లాంటి ఆటగాళ్లు చినగంజాం నుంచి వచ్చిన వాళ్లే. ఉమామహేశ్వరరావు ఉప్పు తయారీ పనులతో పాటు రొయ్యలు పట్టే పనికి వెళ్లేవాడు. సురేశ్‌రెడ్డి కూడా తన తల్లిదండ్రులతో కలిసి కూలీగా పని చేసేవాడు. మరో ఆటగాడు కాశీ విశ్వనాథ్ ఇసుక క్వారీల్లో పని చేస్తూ జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇంకో ఆటగాడు శ్రీకృష్ణ 2016తో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తినడానికి తిండి లేని పరిస్థితి ఉండే క్రీడాకారులు చాలా మంది. అందుకే వీళ్లందరూ ప్రతిభ నిరూపించుకుని సాయ్ హాస్టల్స్‌కు ఎంపిక కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నైపుణ్యం ఉన్నా సరైన వసతులు లేకపోవడంతో ఆటకు చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రభుత్వం సహకారం అందించి మెరుగైన వసతులు కల్పిస్తే మరింత గొప్పగా రాణిస్తామని చెబుతున్నారు ఈ కబడ్డీ ఛాంపియన్లు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- శరణార్థులకు పౌరసత్వం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
