close

తాజా వార్తలు

శబరిమల వివాదంపై తీర్పు రిజర్వ్‌  

మహిళల ప్రవేశంపై వైఖరి మార్చుకున్న ట్రావెన్‌కోర్‌ బోర్డు‌

దిల్లీ: కేరళలోని పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు తన వైఖరి మార్చుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. 

శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ బోర్డు, నాయర్‌ సర్వీస్‌ సొసైటీ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో కొన్ని రివ్యూ పిటిషన్లు కూడా ఉన్నాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ట్రావెన్‌ కోర్‌ బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ‘మతాచారాలు అందరికీ సమానంగా ఉంటాయని ఆర్టికల్‌ 25(1) చెబుతోంది. జీవ సంబంధిత లక్షణాల కారణంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. శబరిమల అంశంలో న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తున్నాం’ అని ద్వివేది తెలిపారు. అయితే రుతుక్రమ వయసు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించమని ట్రావెన్‌కోర్ బోర్డ్‌ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మహిళల ప్రవేశంపై బోర్డు తన వైఖరి మార్చుకోవడం గమనార్హం.

అంతకుముందు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, కేరళ ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. శబరిమల తీర్పును పునఃసమీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని, దీనిపై దాఖలైన రివ్వూ పిటిషన్లను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

శబరిమలలో 10-50ఏళ్ల వయసులోపు మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెల 10-50లోపు ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గ ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.