close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 12/02/2019 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాయడం వస్తే.. ఆదాయం మస్తే!

కెరియర్‌ గైడెన్స్‌  కంటెంట్‌ రైటింగ్‌

సంస్థల వివరాలు.. విజయాలు.. ఫోన్లు.. బైక్‌లు.. కొత్త ఉత్పత్తులు.. పుస్తకాలు.. ప్రాజెక్టులు.. ఇలా దేని కోసమైనా.. వెబ్‌లో వెతికేస్తుంటాం. ఎట్టకేలకు పట్టేస్తుంటాం.అలాంటి సమాచారమంతా ఎక్కడి నుంచి వస్తుంది? కంటెంట్‌ రైటర్లు అందిస్తారు. వాళ్లెవరు? ఉద్యోగులే.. పార్ట్‌టైమ్‌.. ఫుల్‌టైమ్‌ లేదా ఫ్రీలాన్సర్లు. ఇప్పుడు కంటెంట్‌ రైటింగ్‌ నయా కెరియర్‌గా వేగంగా ఎదుగుతోంది. ఈ ఉద్యోగాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో గాలిస్తున్న వాళ్లలో మూడొంతుల మంది మన వాళ్లేనని ఎస్‌ఈఎం రష్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ కంపెనీ చేసిన అధ్యయనంలో తేలింది. కంటెంట్‌ రైటర్లుగా ఒక్క వెబ్‌లో మాత్రమే కాదు.. బ్రోషర్లు, న్యూస్‌లెటర్లు, కరపత్రాలు, బుక్‌లెట్స్‌ తదితర ఎన్నో రకాలుగా కూడా సేవలందించవచ్చు. ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

వివిధ ఉత్పత్తులు, విభిన్న ప్రదేశాలు, వైవిధ్యభరితమైన కెరియర్‌ అంశాలు, వినోదం, విహారం, ఆహారం...ఇలా విభిన్న అంశాల సమాచారం విస్తారంగా అందుబాటులోకి రావటం వెనక కంటెంట్‌ రైటర్ల కృషి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కంటెంట్‌ రైటర్లు అందించే సమాచారమే ఇదంతా! అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్‌ వాడకం విపరీతంగా పెరుగుతుండటంతో ఈ రంగానికి గిరాకీ పెరిగింది. ఓ మంచి కెరియర్‌ అవకాశంగానూ నిలుస్తోంది.
పేరులో ఉన్నట్టుగానే.. ప్రపంచంలోని ఏ అంశంపైనైనా వీరు సమాచారం అందిస్తారు. అయితే ఒక్కరికే అన్ని అంశాలపైనా పరిజ్ఞానం ఉండాలనేం లేదు. అది అసాధ్యం కూడా! తమకు నచ్చిన లేదా అభిరుచి ఉన్న అంశంలో ప్రతిభ, అవగాహన పెంచుకుంటే చాలు. ఉదాహరణకు- ఒక వ్యక్తికి మార్కెటింగ్‌ రంగంపై అవగాహన ఉంటే.. దాని గురించిన అంశాలను మాత్రమే రాస్తారు. బ్రోషర్లు, న్యూస్‌ లెటర్లు, అడ్వర్టైజ్‌మెంట్లు, ఈ-మెయిల్స్‌, కరపత్రాలు మొదలైన మార్గాల్లో సంబంధిత అంశాలను సిద్ధం చేసి,  వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేస్తారు. ఒక వస్తువు బాగోగుల గురించిన రివ్యూలూ ఇందులో భాగం అవొచ్చు. అదే పూర్తిగా టెక్నికల్‌ అంశాలు- సాఫ్ట్‌వేర్‌ లాంటివి అయితే దానిలోని నిపుణులు రాస్తారు. దుస్తులు, యాక్సెసరీలు.. మొదలైన అంశాల్లో వేటిపై అవగాహన ఉన్నవారు వాటిపై వ్యాసాలూ, కథనాలూ  రాస్తుంటారు. సాధారణంగా వీరు బ్లాగులు, వెబ్‌సైట్లు మొదలైనవాటికి రాస్తుంటారు. అంశాన్ని అప్పజెబుతున్నట్టుగా కాకుండా కొత్తగా, ఆసక్తికరంగా రాస్తూ చదివినవారు ఆచరించాలనేలాగా, ఫలానా ఉత్పత్తిని కొనాలనిపించేలాగా చేస్తారు.

ఎలా అవ్వొచ్చు?
సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా రాయగలిగేవారెవరైనా కంటెంట్‌ రైటర్లు అవ్వొచ్చు. ప్రత్యేకమైన విద్యార్హతలంటూ ఏం ఉండవు. అయితే ఫుల్‌టైం దీనిపైనే చేయాలనుకునేవారు ఏదో విభాగంలో డిగ్రీ పూర్తి చేసుండాలి. చాలావరకూ సంస్థలు డిగ్రీ/ పీజీ చేసినవారినే ఉద్యోగ నిమిత్తం ఎంచుకుంటున్నాయి. దీంతోపాటు ఆంగ్లభాషపై మంచి పట్టు ఉండటం లాభిస్తుంది. వ్యక్తిగతంగా కెరియర్‌ నిర్మించుకునేవారికి మాత్రం విద్యా నేపథ్యంతో సంబంధం లేదు. అలాగే ఏ భాషలోనైనా కెరియర్‌ నిర్మించుకోవచ్చు. ఉదాహరణకు- తెలుగులో పట్టుంటే, తెలుగులోనే రాయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ భాషల్లో పట్టుంటే ట్రాన్స్‌లేటర్‌ అవ్వొచ్చు. వీరికీ గిరాకీ బాగా ఉంది. అయితే ఏ భాషల్లో రాసేవారికైనా అనుసంధాన భాష అయిన ఆంగ్లంలో పరిజ్ఞానం మాత్రం తప్పనిసరి.

ఏయే కోర్సులు?
ప్రత్యేకించి కంటెంట్‌ రైటింగ్‌కు డిగ్రీ, పీజీ కోర్సులేమీ లేవు. సాధారణంగా భాషాశాస్త్రాల్లో డిగ్రీ చేసినవారూ, మాస్‌ కమ్యూనికేషన్స్‌, జర్నలిజం చేసినవారూ ఈ రంగంలోకి అడుగు పెడుతుంటారు. అయితే ఈ రంగానికి క్రమంగా పెరుగుతున్న ఆదరణ కారణంగా కొన్ని సంస్థలు షార్ట్‌టర్మ్‌ కోర్సులను అందిస్తున్నాయి. కోర్సుల కాలవ్యవధి సంస్థను బట్టి మారుతోంది. సాధారణంగా రెండు వారాల నుంచి నాలుగు నెలల వరకూ కోర్సులున్నాయి. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ కోర్సులనూ అందిస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా టెక్నికల్‌, బిజినెస్‌, డిజిటల్‌, న్యూస్‌.. ఇలా ప్రత్యేక అంశాల్లో శిక్షణనిస్తున్న సంస్థలూ ఉన్నాయి.

అవకాశాలు ఎక్కడున్నాయ్‌?

ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయి. దాదాపుగా ప్రతి విభాగంలో కంటెంట్‌ రైటర్ల అవసరముంది. ఎక్కువ ఆదరణ ఉన్నవాటిని పరిశీలిస్తే..

ఎస్‌ఈఓ రైటింగ్‌

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌.. ఎక్కువగా గెస్ట్‌ పోస్టులు, ఆర్టికల్‌ డైరెక్టరీస్‌ కోసం రాస్తుంటారు. ఈ తరహా రైటింగ్‌లో ‘కీ వర్డ్‌ల’ది ప్రధాన పాత్ర.  ఒకరకంగా దీన్ని చాలా సులువైనదానిగా చెబుతుంటారు. ఎక్కువమంది క్లయింట్లు ఈ తరహా వాటిని అడుగుతుంటారు. దీనికి పెద్దగా సృజనాత్మక నైపుణ్యాల అవసరం ఉండదు. కానీ, సమాచారాన్ని వెతికే క్రమంలో వినియోగదారులు ఎలాంటి పదాలను ఉపయోగించే అవకాశముందో ఆలోచించగలగాలి. అలాగే రాసే అంశం ప్రత్యేకంగా ఉండాలి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి రాయకూడదని సంస్థలు కోరతాయి. వీటిని ఎక్కువగా సెర్చ్‌ ఇంజిన్ల కోసం రాస్తుంటారు. కాబట్టి, ప్రత్యేకంగా తమ వద్దే లభించాలన్నది వాటి ఉద్దేశం. వీటికి చెల్లింపులు తక్కువగానే ఉంటాయి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చినవారు మొదట వీటిని ప్రయత్నించడం మేలు.

కాపీ రైటింగ్‌

ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని చూస్తున్నపుడు.. ‘ఈ లింకును నొక్కండి’, ‘ఈ న్యూస్‌ లెటర్‌కు సబ్‌స్క్రైబ్‌ చేయండి’, ‘ఈ వస్తువును సొంతం చేసుకోండి’ వంటివి కనిపిస్తుంటాయి. యూజర్‌ను అలా చేసేలా ప్రోత్సహించడం కాపీ రైటింగ్‌లో భాగం. సాధారణంగా పరిమాణంలో చిన్నగా, సులువుగా, తక్కువ సమాచారంతో నేరుగా ఉంటాయివి. బ్లాగులు, సోషల్‌ మీడియా, ఇతరాలన్నీ రీడర్లకు బోధించేలా ఉంటే, కాపీ రైటింగ్‌ వారిని ఒప్పించేలా ఉంటుంది. కాబట్టి, వారిని ఒప్పించేలా రాయాలంటే కంటెంట్‌ రైటర్లకు వినియోగదారుల మనస్తత్వం, మార్కెట్‌పై అవగాహన ఉండాలి. వీటిని రాయడానికి ఎక్కువ సమయం, శ్రమా అవసరమవుతాయి. వివిధ ప్రొడక్టులను గుర్తుచేసే స్లోగన్లు, ట్యాగ్‌ లైన్లు.. ఉదా: ‘ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది’, ‘భారత్‌ వెలిగిపోతోంది’, ‘మరక మంచిదే’.. ఇవన్నీ కూడా దీనికిందకే వస్తాయి. వెబ్‌సైట్లలోని కంటెంట్‌, లాండింగ్‌ పేజీలు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, మార్కెటింగ్‌ కొల్లేటరల్స్‌, టెక్నికల్‌ మాన్యువళ్లు మొదలైనవి కూడా కాపీ రైటింగ్‌ కిందకే వస్తాయి. పనిచేస్తున్న సంస్థ, అనుభవం బట్టి జీతభత్యాలుంటాయి.

బ్లాగులు

ఒక పరిశోధన ప్రకారం రోజుకు 20 లక్షల బ్లాగు పోస్టులు రాస్తున్నారట. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశముందని అంచనా. అయితే గిరాకీకి  తగ్గ నిపుణులు మాత్రం కరవవుతున్నారు. చాలామంది వార్తలకూ, సంస్థల గురించిన సమాచారానికీ బ్లాగులను నిర్వహిస్తున్నారు. వీటిని రాయాలంటే భాషపై పట్టుతోపాటు, వర్తమాన విషయాలపైనా అవగాహన ఉండాలి. ఫుల్‌ టైం బ్లాగర్లకు అనుభవాన్ని బట్టి జీతభత్యాలుంటాయి. ఫ్రెషర్లకు నెలకు రూ.20,000 వరకూ జీతాలుంటాయి. అనుభవమున్నవారైతే రూ.40,000కుపైగా సంపాదించుకోగలుగుతారు.

సోషల్‌ మీడియా

ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త అంశం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అవుతూనే ఉంటుంది. సంస్థలు.. ముఖ్యంగా ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికీ, తమ వెబ్‌సైట్లలోకి ఆకర్షించడానికీ ఈ సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఎక్కువమందిని తమవైపు ఆకర్షించాలంటే ఎల్లప్పుడూ కొత్త సమాచారాన్ని ఉంచాల్సి ఉంటుంది. అందుకని సంస్థలు ఆకర్షణీయంగా రాయగల నిపుణులను ఎంచుకుంటున్నాయి. దీనిలో ఫొటోలు, ఇన్ఫోగ్రాఫ్‌లకు అనుగుణంగానూ కంటెంట్‌ను రాయాల్సి ఉంటుంది. దీనిని ఈ రంగంలో ఉన్నతస్థాయి పనిగా పరిగణిస్తారు. వ్యక్తి అనుభవం, సృజనాత్మకత ఆధారంగా సంపాదన ఉంటుంది. రాసే భాషపైనే కాకుండా ఆంగ్లంపైనా మంచి పట్టు ఉండాల్సిందే. చాలా సంస్థలు వీరిని రెగ్యులర్‌ ఉద్యోగులుగానూ ఎంచుకుంటున్నాయి. ఫ్రీలాన్సర్లకూ గిరాకీ ఎక్కువే. మంచి నైపుణ్యం సాధిస్తే నెలకు రూ.లక్ష వరకూ సంపాదించుకోగలుగుతారు. ఫ్రెషర్లకు నెలకు రూ.25,000 వరకూ జీతభత్యాలుంటాయి.

వేకాకుండా.. జనరల్‌, బిజినెస్‌ కంటెంట్‌, అకడమిక్‌ రైటింగ్‌, ఎడిటింగ్‌ మొదలైన అంశాల్లోనూ అవకాశాలుంటాయి. కేస్‌స్టడీలు, వైట్‌ పేపర్స్‌, వెబ్‌సైట్‌ కంటెంట్‌, టెక్నికల్‌ కంటెంట్‌, కోర్స్‌ వర్క్‌, ట్రైనింగ్‌ మాడ్యూళ్లు మొదలైనవి బిజినెస్‌ కంటెంట్‌ కిందకీ; వార్తలు, పాటలు, కథనాలు, వ్యక్తిగత ప్రొఫైళ్లు, రోల్‌ ప్లేస్‌ మొదలైనవన్నీ జనరల్‌ కంటెంట్‌ కిందకీ వస్తాయి. అసైన్‌మెంట్లు, థీసిస్‌లు, వివిధ కాన్సెప్టులు మొదలైనవన్నీ అకడమిక్‌ రైటింగ్‌ కిందకి వస్తాయి. వచ్చిన సమాచారాన్ని నేరుగా, ఒక సరైన క్రమంలో పెట్టడంలో నైపుణ్యం ఉన్నవారు కంటెంట్‌ ఎడిటర్లు అవ్వొచ్చు.

విధులు నిర్వహించే విభాగాన్ని బట్టి వెబ్‌ కంటెంట్‌ రైటర్‌, టెక్నికల్‌ రైటర్‌, క్రియేటివ్‌ రైటర్‌, రిసెర్చ్‌ రైటర్‌, సైంటిఫిక్‌ రైటర్‌, కాపీ రైటర్‌, ట్రావెల్‌ రైటర్‌, ఆర్టికల్‌ రైటర్‌, వెబ్‌ కాపీ రైటర్‌, కాపీ ఎడిటర్‌ మొదలైన పేర్లతో పిలుస్తుంటారు.

కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు

* ఏస్‌ వెబ్‌ అకాడమీ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విజయవాడ www.acewebacademy.com
* జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, ముంబయి www.xaviercomm.org
* హెన్రీ హార్విన్‌, నోయిడా, దిల్లీ, బెంగళూరు www.henryharvin.com
* ఉడెమి www.udemy.com
* లీడ్స్‌ అకాడమీ, బెంగళూరు http://www.contentwritingtraining.com
* లర్నింగ్‌ బియాండ్‌ బుక్స్‌, దిల్లీ http://www.learningbeyondbooks.in
* ద బ్రాండ్‌ సెలూన్‌, ముంబయి www.thebrandsaloon.com
* ఐఐఈడీఎం, ముంబయి https://iiedm.com/
* డిజిటల్‌ అకాడమీ 360, బెంగళూరు www.digitalacademy360.com
* కంటెంట్‌ నాక్‌ అవుట్‌, బెంగళూరు http://www.contentknockout.com


 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.