close

తాజా వార్తలు

ఫౌండేషన్‌ అవసరమా కాదా?

ఐఐటీ

‘అయిదో తరగతి నుంచే మావాడికి ఐఐటీ కోచింగ్‌ ఇప్పించేస్తున్నాం’ అని కొందరు తల్లిదండ్రులు గర్వంగా తలలెగరేస్తే.. ‘అయ్యో మనం ముందుగా మేల్కొనలేకపోయామా.. తప్పు జరిగిపోయిందా..’ అని ఇంకొందరు తల్లడిల్లుతుంటారు. ‘శిక్షణ సంస్థలు, స్కూళ్ల మార్కెటింగ్‌ మాయాజాలంలో పడి పిల్లలపై అనవసరమైన ఒత్తిడిని పెంచవద్దు’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం ఎప్పుడు శిక్షణ ప్రారంభించాలి.. ఎలాంటి బోధనను పిల్లలకు అందించాలి.. తదితరాంశాలను వివరించే కథనం ఇది.

ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవడం కోసం నిర్వహించే ప్రవేశపరీక్షకు ఒక ప్రత్యేకత ఉంది. మిగతా ప్రవేశపరీక్షలన్నీ విద్యార్థులు జ్ఞాపకశక్తినీ, వేగాన్నీ పరీక్షించేవిగా ఉంటే ఈ పరీక్ష మాత్రం విద్యార్థి తెలివితేటలనూ, సృజనాత్మకతనూ, సమస్యా పరిష్కార చాతుర్యాన్నీ పరీక్షించేలా ఉంటుంది.

2006 సంవత్సరం తర్వాత ఈ పరీక్ష విధానంలో మార్పులు వచ్చాయి. ఆబ్జెక్టివ్‌ విధానం ప్రవేశపెట్టారు. కఠినత్వం కొంత తగ్గి, ఎంతో కొంత సరళ¢మయింది. అయినప్పటికీ ఇది ప్రత్యేకమైన పరీక్షే. పదో తరగతి పూర్తిచేసి ఇంటర్లో చేరినవారు ఈ పరీక్ష కోసం రెండు సంవత్సరాలు కోచింగ్‌ తీసుకుంటున్నారు.

అంతకంటే ముందే...
సృజనాత్మకతనూ, మౌలికాంశాల్లో ప్రావీణ్యతను కోరే పరీక్ష కాబట్టి ముందుగానే వీటిని పెంపొందించుకోవడం కోసం విద్యార్థులు హైస్కూలు స్థాయి నుంచే అంటే 9, 10 తరగతుల్లో ఉన్నప్పటినుంచే ఆ దిశగా సాధన చేయాల్సివుంటుంది. మామూలుగా పాఠశాల తరగతిలో నేర్చుకునే సిలబస్‌, చదివే పుస్తకాలు ఈ లక్షణాలను పెంపొందించటానికి సరిపోవని చాలామంది అభిప్రాయం. అందుకని వారు స్కూల్లో నిర్దేశించిన పుస్తకాలనే కాకుండా తమ సిలబస్‌ను మరింత లోతుగా చదివి, భావనలపైన ఆధారపడి చిక్కుముడితో కూడిన కొన్ని ప్రశ్నలను సాధించడం ముఖ్యమైంది.

ఇలాంటి కోచింగే ఐఐటీ ఫౌండేషన్‌. అంటే ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం స్కూలు స్థాయి నుంచే పునాది వేసేది. 8 లేదా 9వ తరగతి నుంచే ఇలాంటి కోచింగ్‌ తీసుకోవడం వల్ల ఇంటర్‌ తర్వాత సహజంగానే ఐఐటీ ప్రవేశపరీక్ష సులువు అవుతుంది. అందుకనే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఐఐటీ ఫౌండేషన్‌ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈ సెంటర్లలో స్కూలు స్థాయికి కాస్త ఎక్కువగా బోధించి విద్యార్థి చిన్నతనం నుంచే కాన్సెప్చువల్‌గా ఆలోచించేలాగా తయారుచేస్తున్నారు.

ఎప్పుడు ప్రారంభించాలి?
కొన్ని శిక్షణ సంస్థలు 8వ తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్‌ అవసరమంటే మరికొన్ని 6వ తరగతి నుంచే అవసరం అంటున్నాయి. ఎక్కువమంది ఆరో తరగతి నుంచి అనవసరం అని చెబుతున్నారు. 8వ తరగతి నుంచి మొదలు పెట్టడం కొంతవరకు సబబని పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా ఐఐటీ పేరుతో కోచింగ్‌లు ఇవ్వడం వల్ల అనర్థమే కలుగుతుందంటున్నారు. పాఠశాల వేళలకు ముందు, వెనుక వీటిని నిర్వహించి పిల్లలపై ఒత్తిడిని పెంచడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఐఐటీ పదాన్ని ఉపయోగించి మార్కెట్‌ను ఆకర్షించాలని ప్రయత్నించడం   సమంజసం కాదంటున్నారు.

ప్రయత్నం ముఖ్యం
ఒక కొత్త ప్రశ్నను చూడగానే విద్యార్థిలో సహజంగా కలిగే భయాన్ని పోగొట్టి ఆ ప్రశ్నను అతడు సాధించలేకపోయినా కనీసం ప్రయత్నించేవిధంగా అతన్ని తీర్చిదిద్దడం ఐఐటీ ఫౌండేషన్‌ సెంటర్లు చేయాల్సిన పని. అలాంటివాటిలో శిక్షణ తీసుకుంటే విద్యార్థికి తప్పకుండా లాభం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు కానీ అనవసరమైన అత్యంత కఠినమైన సిలబస్‌ను బోధించడమో, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను బోధించడమో చేసే ఐఐటీ ఫౌండేషన్‌ వల్ల సమయం వృథా కావడం, ఆత్మస్థైర్యం దెబ్బతినడమే తప్ప వేరే ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు..

ఫౌండేషన్‌ వల్ల సబ్జెక్టుపై బాగా అవగాహన పెరుగుతుందంటున్నారు- ఐఐటీ ఫౌండేషన్‌ శిక్షణలో హైదరాబాద్‌లో రెండు దశాబ్దాలుగా పేరున్న శర్మ. ‘విద్యార్థులు ఇక్కడ  8-10 తరగతుల సబ్జెక్టులను క్షుణ్ణంగా నేర్చుకుని, కాన్సెప్టులను సానపెట్టుకుంటారు. ఆస్ట్రేలియన్‌ కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌,  ఎన్‌టీఎస్‌ఈ లాంటి ఏడెనిమిది పోటీ పరీక్షలు రాస్తారు. ఈ అనుభవంతో వీరు ఇంటర్‌ సబ్జెక్టులను సులువుగా అవగాహన చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోని న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌ను సునాయాసంగా చేయగలుగుతున్నారు’ అని ఆయన చెప్తున్నారు. ‘ఐఐటీ ఫౌండేషన్‌ వీక్లీ టెస్టుల్లో తక్కువ మార్కులు తెచ్చుకునేవారు కూడా వాళ్ల స్కూలు పరీక్షలు బాగా రాస్తుంటారు. ఇది కనీసమైన ప్రయోజనం. ఇంటర్‌కొచ్చేసరికి వయసు పెరుగుతుంది. ఫండమెంటల్స్‌పై, కాన్సెప్టులపై పట్టూ చిక్కుతుంది. అందుకే వీరిలో చాలామంది ఐఐటీ ప్రవేశపరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపించగలుగుతున్నారు’ అని ఆయన శిక్షణ ఉపయోగాలను వివరించారు. 


జేఈఈకి సృజనాత్మకత, మౌలికాంశాల్లో ప్రావీణ్యత అవసరం.  కాబట్టి ముందుగానే వీటిని పెంపొందించుకోవడం కోసం  9,10 తరగతుల నుంచే సాధన చేయాల్సివుంటుంది.


పిల్లల ఆప్టిట్యూడ్‌తో, వాళ్ల ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల అభిరుచి మేరకు చేర్పించేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌కు సంబంధించి నిర్ణయం తీసేసుకుంటున్నారు. 


జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత పొందినవారిలో ‘కోచింగ్‌’ తీసుకున్న వారు సగటున 48 శాతం మందే. మన తెలుగు రాష్ట్రాలుండే మద్రాస్‌ జోన్‌ పరిధిలో మాత్రం 63 శాతం మంది కోచింగ్‌ సహాయంతోనే ఐఐటీ సీట్లు సాధిస్తున్నారు.


సిలబస్‌ పరిధి మించితే వ్యర్థమే!

ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు నిర్వహించే ఎన్నో శిక్షణ సంస్థలు కేవలం అడ్వాన్స్‌డ్‌ కోచింగ్‌ మాత్రమే ఇస్తున్నాయి. అంటే 9వ తరగతిలో ఉన్న విద్యార్థికి 10వ తరగతి సిలబస్‌నూ, 10వ తరగతి విద్యార్థికి ఇంటర్‌ సిలబస్‌నూ బోధించడం. దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సిలబస్‌ పరిధిని మించకుండా విద్యార్థిలోని సృజనాత్మకత, ఆలోచనా శక్తులను పెంచేవిధంగా ప్రశ్నలను రూపొందించి, సేకరించి విద్యార్థులతో  సాధింపజేయడం అన్నది ఐఐటీ ఫౌండేషన్‌ లక్ష్యంగా ఉండాలి. కానీ ఈ లక్ష్యాన్ని సాధిస్తున్న ఫౌండేషన్‌ కేంద్రాలు చాలా తక్కువ.

అసలు ఐఐటీ ఫౌండేషన్‌ అనే బదులు కాన్సెప్చువల్‌ కోచింగ్‌ అంటే బాగుంటుంది. కానీ ఐఐటీ అనే ట్యాగ్‌ ఉంటేనే విద్యార్థులను ఆకర్షించవచ్చని ఆ పేరు పెడుతున్నారు. ఐఐటీ ఫౌండేషన్‌ అసలు ఉద్దేశం... విద్యార్థిని ఆలోచింపజేయడం. ఇది  విద్యార్థి స్కూల్లో చేరినప్పటి నుంచే అవసరం కానీ దీన్ని అదనపు ఫీజు తీసుకోకుండా విద్యార్థిపై ఒత్తిడి పెంచకుండా అందించాలి. నిజానికీ బాధ్యత.. పాఠశాలల యాజమాన్యాలదే! ఐఐటీ ఫౌండేషన్‌ పేరుతో సిలబస్‌లో లేని అంశాలను బోధించడం వల్ల విద్యార్థికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.  ఐఐటీ ఫౌండేషన్‌ వారి స్టడీ మెటీరియల్‌, పరీక్షల్లో ఇచ్చే కఠిన ప్రశ్నలు ఐఐటీ ప్రవేశపరీక్షలో కూడా ఉండవు.

ఐఐటీలంటే ఏమిటో కూడా తెలియని వయసులో అంతటే 6, 7 తరగతుల నుంచే ఐఐటీ ఫౌండేషన్‌ మొదలుపెడితే విద్యార్థికి వేరే కోర్సుల గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. చదువంటే కేవలం భౌతిక రసాయన గణిత శాస్త్రాలే అనే భావన విద్యార్థి బుర్రలో పడిపోతుంది!

- ధాగం కృష్ణమూర్తి ఒక రకమైన బాల్యవివాహాలే!

అయిదో తరగతి నుంచి లేదా ఆరో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. తల్లిదండ్రులు ఈ దశలోనే పిల్లల భవిష్యత్‌కు సంబంధించి నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఎక్కడో ఒకటీ అరా మినహాయిస్తే. ఈ ఫౌండేషన్‌ కోర్సులు ఒకరకమైన బాల్య వివాహాల్లాంటివే. పిల్లల ఆప్టిట్యూడ్‌తో, వాళ్ల ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుని, చేర్పించేస్తున్నారు.

కొందరు పిల్లలకు మ్యాథ్స్‌ అంటే ఇష్టం. మరికొందరికి బయాలజీ అంటే ఇష్టం. కొందరికి సామాజిక శాస్త్రాలంటే ఇష్టం. ఇవేవీ పట్టించుకోవడం లేదు. సాధారణంగా పిల్లలకు పదోతరగతికి వచ్చేసరికి కొంత స్పష్టత వస్తుంది. వాళ్ల ఆప్టిట్యూడ్‌ పట్ల అవగాహన వస్తుంది. ఐఐటీ ఫౌండేషన్‌లో చేర్పిస్తే మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టి బోధిస్తారు. బయాలజీ, సోషల్‌ స్టడీస్‌, లాంగ్వేజెస్‌పై తక్కువ సమయం కేటాయిస్తారు. అలాంటి పిల్లలు భవిష్యత్‌లో మ్యాథ్స్‌లో గానీ ఫిజిక్స్‌లో గానీ రాణించలేకపోతే ఎటూ కొరగాకుండా పోతారు.

- వాసిరెడ్డి అమర్‌నాథ


ఐఐటీ మార్కెట్‌ పదం కాదు

ఐఐటీ అనేది కెరియర్‌కి సంబంధించిన పదం. కానీ ఇప్పుడు దాన్ని మార్కెటింగ్‌కి ఉపయోగించుకుంటున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. కింది క్లాసుల నుంచే జేఈఈ కోసం బోధించినప్పటికీ ఆయా తరగతుల సిలబస్‌ పరిధి దాటకూడదు. పిల్లల మానసికస్థితిని అనుసరించి ప్రశ్నలను రూపొందించాలి. వారి అభిరుచుల మేరకు ప్రశ్నలు ఉండాలి కానీ భయపెట్టకూడదు.

- చుక్కా రామయ్యఇంటర్‌లోకి వచ్చేముందే...

పాఠశాల స్థాయిలో తరగతుల్లో విషయాలు నేర్చుకోవటంపై దృష్టిపెట్టాలి. * ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలి. * పదో తరగతి వరకూ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల మౌలికాంశాలపై (బేసిక్స్‌) పట్టు దొరికేలా శ్రద్ధ తీసుకోవాలి. * సబ్జెక్టుల్లోని కాన్సెప్టులపై స్పష్టత ఏర్పరచుకోవాలి, * లీనియర్‌ ఈక్వేషన్స్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, ఈక్వేషన్‌ ఆఫ్‌ స్ట్రెయిట్‌ లైన్స్‌ లాంటి ముఖ్యమైన అధ్యాయాలు బాగా సాధన చేయాలి. 


నిపుణులు ఏమంటున్నారు?

ఐఐటీ ప్రవేశపరీక్షలపై నిజమైన ఆసక్తి కలిగించటమే ఫౌండేషన్‌ కోర్సులు చేయాల్సిన పని. * పాఠశాల దశలో మ్యాథ్స్‌, సైన్స్‌ల పునాది అంత బాగా లేనివారికి ఫౌండేషన్‌ కోర్సులు (అవి ప్రామాణికంగా ఉంటే) సహాయపడతాయి. 9, 10 తరగతుల్లోని పాఠ్యాంశాలే అసలైన ‘పునాది’. అవే తర్వాత ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల్లోని పాఠ్యాంశాల అవగాహనకు ఉపకరిస్తాయి. * అదనపు ‘క్లిష్టమైన’ ప్రశ్నలను సాధించటం వల్ల ప్రత్యేకంగా మేలేమీ జరగదు. పాఠ్యాంశాలకు సంబంధించి మరింత పరిజ్ఞానం, నైపుణ్యాలు అవసరమనుకునేవారు ఆన్‌లైన్‌ వనరులను కూడా ఉపయోగించుకోవచ్చు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.