
తాజా వార్తలు
12 మందిని చంపిన నిందితుడు
మహబూబ్‌నగర్ నేరవిభాగం: అతను ఓ ఆటోడ్రైవర్. తన జేబులో పైసలు లేనప్పుడు తెలిసిన వారి వద్ద డబ్బు, ఇతర వస్తువులు ఉంటే వారిని హత్య చేసి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఒకరిద్దరిని కాదు..ఏకంగా 12 మంది ప్రాణాలు తీశాడు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో ఇతని ఘోరాలు వెలుగుచూశాయి. బుధవారం మహబూబ్‌నగర్‌లో ఎస్పీ రెమా రాజేశ్వరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలం చొక్కంపేటకు చెందిన ఎండీ యూసుఫ్ అలియాస్ ఇసాక్ అలియాస్ పాషా అలియాస్ ఇమాయత్ అలియాస్ మహ్మద్ అలియాస్ జానీ(31) కూలీగా, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో హైదరాబాద్‌లో పనిచేసేటప్పుడు యూసుఫ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె భర్త అడ్డంకిగా మారాడని అతడిని 2003లో హత్య చేశాడు. అప్పుడు యూసుఫ్ వయసు పదిహేనేళ్లు. అప్పటి నుంచి మొదలైన హత్యల పరంపర ఈ ఏడాది నవాబుపేట మండలంలో వ్యక్తిని చంపేదాకా కొనసాగింది. రాజాపూర్ మండలం చొక్కంపేటకు చెందిన జమలాపూర్ బాలరాజ్ అలియాస్ కటికె బాలరాజ్(52)కు తక్కువ ధరకు గొర్రెలను ఇప్పిస్తామని తీసుకెళ్లి నవాబుపేట మండలం కానుగకుచ్చతండా పరిసరాల్లో కారంపొడి చల్లి హత్య చేశాడు. అతని వద్ద ఉన్న రూ.14వేల నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. నగదు, బంగారు వస్తువులు, ఖరీదైన సెల్ఫోన్లు ఉన్నప్పుడే వ్యక్తులను హత్య చేసేవాడు.
ఇదీ హత్యల పరంపర..: 2003లో హైదరాబాద్ డబీర్‌పురాలో ఒక హత్య, 2006లో షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రెండు హత్యలు, 2009, 2012, 2013లో ఇక్కడే మూడు హత్యలు, 2017లో వికారాబాద్ పరిధిలో రెండు, జడ్చర్లలో ఒకటి, 2018లో రాజాపూర్‌లో దినేష్ అనే వ్యక్తిని, అదే సంవత్సరం కొత్తూరు సమీపంలోని జహంగీర్‌పీర్ దర్గా వద్ద బాలరాజ్ అనే వ్యక్తిని హత్య చేశాడు. తాజాగా నవాబుపేట మండల పరిధిలో బాలరాజ్ అనే వ్యక్తిని చంపాడు. జడ్చర్ల ఠాణా పరిధిలో ఒక ద్విచక్రవాహనం, హైదరాబాద్ బండ్లగూడలో మరొకటి, ఖైరతాబాద్ పరిధిలో మూడు ద్విచక్రవాహనాలు, హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. వీటిలో కొన్ని నేరాల్లో మూడుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. వరుస హత్యలు చేసేందుకుగల కారణాలను విశ్లేషించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇతన్ని రిమాండ్‌కు తరలించి మళ్లీ అదుపులోకి తీసుకొని విచారణ చేయనున్నారు. నిందితుడి నుంచి నాలుగు ద్విచక్రవాహనాలతోపాటు మూడు సెల్ఫోన్లు, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులో సమర్థంగా పనిచేసిన సిబ్బందికి ఎస్పీ.. రివార్డులు అందించారు. సమావేశంలో డీఎస్పీ భాస్కర్, గ్రామీణ ఠాణా సీఐ కిషన్, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
