close

తాజా వార్తలు

పదితో  ఇంజినీరింగ్‌!

ఉపాధినిచ్చే పాలిటెక్నిక్‌ కోర్సులు

పదో తరగతి పూర్తవగానే  ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి ప్రవేశించే దారి.. పాలిటెక్నిక్‌ విద్య. చిన్నవయసులోనే  వీలైనంత త్వరగా ఉద్యోగంలో చేరి,  స్థిరపడాలనుకునేవారికి ఇది మేలైన మార్గం! ఈ డిప్లొమా కోర్సులకు నిర్వహించే ఎంట్రన్స్‌..  పాలిసెట్‌ ప్రకటన  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే విడుదల అయింది. త్వరలో తెలంగాణలో  విడుదల కానుంది. ఈ సందర్భంగా  పాలిటెక్నిక్‌ విద్య  ప్రత్యేకత, ప్రధాన కోర్సుల ముఖ్యాంశాలు చూద్దాం!

దోతరగతి పూర్తవడంతోనే ఏ విభాగంలో చదువును కొనసాగించాలా అన్న ఆలోచన విద్యార్థుల్లో మొదలవుతుంది. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా ఆసక్తి చూపేవాటిలో పాలిటెక్నిక్‌ ముందువరసలో ఉంటుంది. ముఖ్యంగా తక్కువ వ్యవధిలో చదువు పూర్తిచేసి, ఉద్యోగజీవితంలో స్థిరపడాలనుకునేవారు దీనిపై దృష్టి పెడుతుంటారు. పాలిటెక్నిక్‌ కోర్సులు ప్రాథమికస్థాయిలో ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని పొందడానికి సాయపడతాయి. దీనిలో థియరీకి వెయిటేజీ తక్కువే. ఈ కోర్సులు పూర్తిచేసినవారు సంబంధిత రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. పైగా వీటిని చదవడానికి అయ్యే ఖర్చూ అందుబాటులోనే ఉంటుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ సంస్థల్లో సీటు సంపాదిస్తే ఫీజు మరింత తక్కువ అవుతుంది.
సాంకేతిక విభాగాలు, ఇండస్ట్రియల్‌ ఆర్ట్స్‌ లేదా అప్లయిడ్‌ సైన్సెస్‌లో వృత్తివిద్యా కోర్సులను అందించే పాలిటెక్నిక్‌లో కోర్సునుబట్టి కాలవ్యవధి  రెండు నుంచి మూడేళ్ల వరకూ ఉంటుంది. వీటిని సంబంధిత రంగంలో అవగాహన కల్పించే ప్రీ ఇంజినీరింగ్‌ కోర్సులుగానూ వ్యవహరిస్తారు. ఇవి క్రియాశీల, ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి వీలున్న వాతావరణాన్ని కల్పిస్తాయి.

ప్రధానమైనవివీ!

రెండు తెలుగు రాష్ట్రాలు- ఏపీ, తెలంగాణపరంగా 8 కోర్సులను ప్రధానమైనవాటిగా చెప్పొచ్చు. వీటిల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ (సీఈ), మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంఈ), ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ)లను దాదాపుగా 85% మంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కొన్ని ప్రత్యేక సంస్థలు (జీఐఓఈ- సికింద్రాబాద్‌; జీఐటీటీ- గుంటూరు; జీఐసీటీ- వైజాగ్‌; జీఐఎల్‌టీ-హైదరాబాద్‌; గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెరామిక్‌ టెక్‌-గూడురు లాంటివి) మినహా దాదాపుగా అన్ని సంస్థలూ ఈ ముఖ్య కోర్సులను అందిస్తున్నాయి.
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎంఈ/ సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ (ఏఈ), అయ్లియిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ ఇంజినీరింగ్‌ (ఏఈఐఈ)ల్లో ప్రవేశాలు పొందే వారి సంఖ్య 10%గా ఉంది. ఎంపిక చేసిన కొన్ని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

సివిల్‌ ఇంజినీరింగ్‌
వివిధ కట్టడాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వంటివి కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. రోడ్లు, వంతెనలు, కాలువలు, డ్యామ్‌లు, బిల్డింగ్‌లు వీటి కిందకి వస్తాయి.
నేర్చుకునేవి: ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ అండ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, సీఏడీ, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌, బిల్డింగ్‌ సర్వీసెస్‌ అండ్‌ అమెనిటీస్‌, మెటీరియల్స్‌ ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, ఆర్‌సీసీ, ఎస్టిమేషన్‌ అండ్‌ కాస్టింగ్‌, లాండ్‌ సర్వేయింగ్‌ అండ్‌ జీఐఎస్‌, హైడ్రాలిక్స్‌ అండ్‌ ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌, వాటర్‌ సప్లె అండ్‌ శానిటరీ ఇంజినీరింగ్‌, హైవే అండ్‌ రైల్వే ఇంజినీరింగ్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలను నేర్చుకుంటారు.
ఆ తర్వాత?: ఈసెట్‌ లేటరల్‌ ఎంట్రీ ద్వారా సివిల్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌ చేరొచ్చు. ఎంసెట్‌ ద్వారా బీఈ/ బీటెక్‌ల్లోని ఏదేని బ్రాంచిలో చేరొచ్చు. వీటితో సమానమైన ఏఎంఐఈలోనూ చేరొచ్చు.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌
కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగం. ఫిజిక్స్‌లోని సూత్రాలను ఉపయోగించి మెకానికల్‌ సిస్టమ్స్‌ను రూపకల్పన, విశ్లేషణ, తయారీ చేస్తుంటారు.
నేర్చుకునేవి: ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ అండ్‌ మెషిన్‌ డ్రాయింగ్‌, క్యాడ్‌, క్యామ్‌, థర్మోడైనమిక్స్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏర్‌ కండిషనింగ్‌, వర్క్‌షాప్‌ టెక్నాలజీ, డిజైన్‌ ఆఫ్‌ మెషిన్‌ ఎలిమెంట్స్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, హైడ్రాలిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషినరీ, ఫ్లూయిడ్‌ పవర్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎనర్జీ సోర్సెస్‌, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ ప్లాంట్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఎస్టిమేషన్‌ కాస్టింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ
ఆ తర్వాత?: లేటరల్‌ ఎంట్రీ ద్వారా మెకానికల్‌, ఆటోమొబైల్‌, ప్రింటింగ్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌ చేయొచ్చు. ఎంసెట్‌ ద్వారా బీఈ/ బీటెక్‌ల్లోని ఏదేని బ్రాంచిలో చేరొచ్చు. ఏఎంఐఈలోనూ చేరొచ్చు.

ఈఈఈ
ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో.. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రో మాగ్నటిజాల గురించిన అధ్యయనం, వాటి అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.
నేర్చుకునేవి: ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ మెషిన్‌ డ్రాయింగ్‌, క్యాడ్‌, ఎలిమెంట్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రో కంట్రోలర్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్స్‌
ఆ తర్వాత?: లేటర్‌ ఎంట్రీ ద్వారా బీఈ/ బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో చేరొచ్చు. వీటితో సమానమైన ఏఎంఐఈలోనూ చేరొచ్చు.

ఈసీఈ
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌.. సవాళ్లతో కూడిన బ్రాంచి. ఇది ఎల్లప్పుడూ మార్పు చెందుతూ, స్పష్టమైన అభివృద్ధి కనబరుస్తుంది. దీనిలో ఎలక్ట్రానిక్‌ నెట్‌వర్క్స్‌, పరికరాలు, ఎలక్ట్రిక్‌ మాగ్నటిక్‌ ఫీల్డ్స్‌, కంప్యూటర్‌ ప్రాథమికాంశాలు, కమ్యూనికేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ను అర్థం చేసుకుంటారు.
నేర్చుకునేవి: ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్స్‌, ఎలక్ట్రానిక్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌, మైక్రో కంట్రోలర్స్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌, అనలాగ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌
ఆ తర్వాత?: లేటర్‌ ఎంట్రీ ద్వారా బీఈ/ బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో చేరొచ్చు. వీటితో సమానమైన ఏఎంఐఈలోనూ చేరొచ్చు.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ల సాంకేతికత, సిద్ధాంతాల సమాహారమిది. కంప్యూటర్‌ పరికరాలను పరీక్షించడం, రూపొందించడం కూడా దీనిలో భాగంగా ఉంటుంది.
నేర్చుకునేవి: ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌, ఇంటర్నెట్‌ ప్రొటోకాల్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌
ఆ తర్వాత?: లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో సీఎస్‌ఈ కోర్సులో చేరొచ్చు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
సమాచారం, బొమ్మలు, నంబర్ల రూపంలో ఉన్న సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, నిల్వ, ప్రసారం ఐటీలో భాగం. కంప్యూటింగ్‌, టెలి కమ్యూనికేషన్స్‌ల సమ్మిళితమిది.
నేర్చుకునేవి: ఆపరేషన్‌ సిస్టమ్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌- సి, సి++, జావా మొదలైనవి, డేటా బేసెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌
ఆ తర్వాత?: లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో ఐటీ కోర్సులో చేరొచ్చు.

లాభాలేంటి?

* వ్యవధి తక్కువ: రెండు, మూడేళ్ల వృత్తివిద్యా కోర్సులను పూర్తిచేసి, ఉద్యోగంలో సిరపడాలనుకునేవారికి ఇవి చాలా అనుకూలం. ఒకవేళ ఆపై చదువును కొనసాగించాలనుకున్నా, ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే పూర్తి చేసుకోవచ్చు. లేదా లేటరల్‌ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకీ ప్రవేశించొచ్చు.
* ప్రాక్టికల్‌ పరిజ్ఞానం: పాలిటెక్నిక్‌లో థియరిటికల్‌ పరిజ్ఞానం కంటే ప్రాక్టికల్‌ అవగాహనకు ప్రాముఖ్యం ఎక్కువ. అందుకే సాధారణ ఇంటర్‌ విద్యార్థి కంటే పాలిటెక్నిక్‌ విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానం హెచ్చుస్థాయిలో ఉంటుంది.
* తక్కువ ఫీజు: బీటెక్‌, బీఈ, ఇంకా చాలా డిగ్రీ కోర్సులతో పోలిస్తే పాలిటెక్నిక్‌ కోర్సుల ఫీజు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి.
* విభాగపు మార్పు: పాలిటెక్నిక్‌లో ఉన్న మరో లాభదాయకమైన అంశమిది. భవిష్యత్తులో చదువును కొనసాగించాలనుకుంటే రంగాన్ని మార్చుకునే అవకాశముంటుంది. పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన, ప్రాక్టికల్‌ పరిజ్ఞానం పరంగా ఇతరుల కంటే ముందుంటారు.

కొలువైనా.. స్టార్టప్‌ అయినా...
* పాలిటెక్నిక్‌ చదివితే...పదో తరగతి తర్వాత మూడేళ్లలో డిప్లొమా హోల్డర్లవుతారు. ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవచ్చు.
* విద్యాభ్యాసంలో ముందుకుసాగాలనుకుంటే టెన్త్‌ తర్వాత ఆరేళ్లలోనే ప్రాక్టికల్‌ పరిజ్ఞానంతో డిప్లొమా+ గ్రాడ్యుయేషన్‌ సాధించే అవకాశముంది..
* పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు తర్వాత తమ రంగంలో సొంత స్టార్టప్‌ వెంచర్‌ ఆరంభించవచ్చు.

ఇవీ ప్రత్యేకతలు

1 పాలిటెక్నిక్‌లో ప్రధాన అంశం- సాంకేతికాంశాల థియరీతో పాటు ‘చేయడం ద్వారా నేర్చుకోవటం’.
2‌ విద్యాపరమైన పరిజ్ఞానంతో పాటు భావ వ్యక్తీకరణ, ప్రసంగ నైపుణ్యాలు, విధినిర్వహణలో పాటించే సూత్రాలు, క్రమశిక్షణ, ప్రెజెంటేషన్లు అలవడతాయి.
3 ప్రయోగపూర్వక బోధన మూలంగా విద్యార్థులు వృత్తిపరంగా సుశిక్షితులవుతారు. కార్పొరేట్‌ ప్రపంచానికి తగ్గట్టుగా రూపొంది ఉద్యోగ సంసిద్ధులు (జాబ్‌ రెడీ) అవుతారు.

ఉద్యోగావకాశాలు బాగున్నాయి

పాలిటెక్నిక్‌ డిప్లొమా పట్టా ఉన్నవారందరికి మంచి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. థియరీతోపాటు ప్రాక్టికల్‌ పరీక్షల్లోనూ విద్యార్థి తప్పక పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం వీరికి ఎక్కువ ఉండటం వల్ల ఎన్నో పెద్ద సంస్థలు వీరిని మంచి జీతభత్యాలతో నియమించుకోవడానికి ఆసక్తిని చూపుతున్నాయి. రైల్వే, ఆర్‌ అండ్‌బీ, ఏర్‌పోర్టులు, సీఆర్‌డీఏ, ఎల్‌అండ్‌టీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్‌, డీఆర్‌డీఓ, ఇస్రో, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, నేవీ, ఆర్మీ ఇంకా ఎన్నో చిన్న, మధ్యతరహా సంస్థలు వీరిని సంబంధిత విభాగాల్లోకి తీసుకుంటున్నాయి. పాలిటెక్నిక్‌లో నిర్ణీత హాజరుశాతాన్ని తప్పక చూస్తారు. తక్కువ ఉన్నవారిని పరీక్షలకు అనుమతించరు. చేరేముందే విద్యార్థి ఆసక్తి గల కోర్సుతోపాటు ఈ అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
- ఎర్రగుంట్ల శివరామయ్య, ప్రిన్సిపల్‌, ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌, నల్లపాడు, గుంటూరు జిల్లా

* ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ *అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌  ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ వివరాలు www.eenadupratibha.net లో


 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.