close

తాజా వార్తలు

Updated : 18/03/2019 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జంక్షన్‌లో టెన్షన్‌ వద్దు!

ఇంటర్‌ తర్వాత...

భవితకు దారితీసే మార్గాన్ని ఎంచుకునే అవకాశం పదోతరగతి తర్వాత వస్తుంది. ఏ కెరియర్‌ వైపు అడుగులు వేయాలో ఇంటర్లో చేరేటపుడే దాదాపు నిర్ణయమైపోయివుంటుంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇంటర్మీడియట్‌ తర్వాత ఏర్పడుతుంది. నిజమైన ఆసక్తి, స్పష్టత ఉంటేనే కోర్సుపై పూర్తి నిమగ్నతతో దృష్టిపెట్టటానికైనా, రాణించటానికైనా వీలుంటుంది. కెరియర్‌  జంక్షన్లో టెన్షన్‌ పడకుండా మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఏ విషయాలు   గమనించాలి? ముందుకు ఎలా సాగాలి?

 

రాఘవ మెకానికల్‌ ఇంజినీర్‌ గ్రాడ్యుయేట్‌. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ అంటే చాలా ఇష్టం. కానీ ఆ కోర్సు చదవలేకపోయాడు. తల్లిదండ్రుల, బంధు మిత్రుల ఒత్తిడి ఎక్కువయింది. మెకానికల్‌లో చేరి, వాళ్లను సంతోషపెట్టాడు. కానీ తనకిష్టమైన ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ గురించే తరచూ ఆలోచిస్తూ బాధపడేవాడు. దానిలో చేరివుంటే ఎంత సంతోషంగా ఉండేవాడినో అనుకునేవాడు!
చాలా సందర్భాల్లో విద్యార్థులు ఇలా తమ అభీష్టాల ప్రకారం కాకుండా తల్లిదండ్రుల సలహాలతోనో, ఒత్తిడితోనో నిర్ణయాలు తీసేసుకుంటుంటారు. గణితం, ఫిజిక్స్‌లపై ఆసక్తి, నేర్పు లేకపోయినా ఇంజినీరింగ్‌లో చేరతారు. బయాలజీపై పట్టు లేకున్నా మెడికల్‌ కోర్సు కోసం ప్రయత్నిస్తుంటారు. కామర్స్‌పై ఆసక్తి లేకున్నా సంబంధిత కోర్సులకు రిజిస్టర్‌ అవుతుంటారు. ఇది సరైన పంథా కాదు.
ఇష్టంలేని కోర్సుల్లో చేరినవారు మొదటి సంవత్సరం చివరికొచ్చేసరికి చాలా సబ్జెక్టుల్లో ఫెయిలై ఏదో రకంగా కోర్సు పూర్తిచేసే  ప్రయత్నం చేయటం కంటే మొదట్లోనే కోర్సు మారటం ఉత్తమం. అలా కానప్పుడు 20-25 బ్యాక్‌లాగ్‌లతో ఎటూ కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది.

 

కొనసాగటమా? మారటమా?
ఇంటర్‌ పరీక్షలు రాసినవారి ఎదుట రెండు మార్గాలున్నాయి. 1. ఇప్పుడున్న స్ట్రీమ్‌లో కొనసాగటం 2. కొత్త స్ట్రీమ్‌కు మారిపోవటం.
* ఇంటర్‌లో చదివిన సబ్జెక్టులపై ఆసక్తి ఉండి, పాఠ్యాంశాలపై కుతూహలం ఉండి, మంచి మార్కులు వస్తుంటే మరో ఆలోచన లేకుండా కొనసాగవచ్చు. సంబంధిత ప్రవేశ పరీక్షలు రాసి, ఉన్నత కోర్సుల్లో చేరిపోవటం ఉత్తమం.
* చదివిన రెండేళ్లూ సబ్జెక్టులు కొరుకుడు పడక, పరీక్షలను ఏదోలా గట్టెక్కే విధంగా రాసివుంటే మాత్రం మార్గం మార్చుకునే విషయం ఆలోచించటం మేలు. మీ వ్యక్తిగత ఆసక్తులకూ, అభిరుచులకూ చదివిన సబ్జెక్టులకూ బాగా అంతరం ఉందని స్పష్టం చేసుకోవాలి. అప్పుడు ఇతర స్ట్రీమ్‌ల్లో ఏది సరిపోతుందో చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చు.

 

సాధారణ డిగ్రీనా? వృత్తి విద్యా?
ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇంటర్‌ విద్యార్హతతో లభిస్తున్నాయి. ఆసక్తులు, నైపుణ్యాలు, అభిరుచులు అన్నింటినీ బేరీజు వేసుకుని భవిష్యత్తుకు బలమైన పునాదులు నిర్మించుకోవడం ఇంటర్‌ తర్వాత సాధ్యమవుతుంది. ఒకవైపు సాధారణ డిగ్రీలు, మరోవైపు ప్రొఫెషనల్‌ కోర్సులు అన్నీ ఇంటర్‌ తర్వాతే మొదలవుతాయి. వీటిలో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తప్ప మిగిలినవన్నీ ఇంటర్‌ ఏ గ్రూపుతోనైనా చేరడానికి అవకాశం ఉన్నవే. అందుబాటులో ఉన్న అన్ని కోర్సులపైనా అవగాహన పెంచుకుంటే వాటిలో ఏది ఎంచుకోవాలో నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.

 

ఇష్టముంటేనే రాణింపు
ప్రస్తుతం విద్యార్థుల్లో ఉన్న అనేక సందేహాల్లో ముఖ్యమైనది- ‘నేను ఈ కోర్సే ఎందుకు చదవాలి?’ అనేది. సమాధానాలు చాలానే ఉన్నా అందరూ ఆశించేది మంచి ఉద్యోగం కోసం అని! చాలా కొద్దిమంది మాత్రమే అభిరుచి, ఆసక్తులతో చదువుతున్నామంటారు. ఇలా ఆ రంగంపై నిజమైన ఇష్టం ఉండి చేరితే ఆ కోర్సుల్లో చాలా మెరుగ్గా రాణించే అవకాశం ఎక్కువ.
ఇంటర్మీడియట్‌ ఎంపీసీ తర్వాత ఇంజినీరింగో, బీఎస్‌సీనో చదవాలనే నిబంధన ఏమీ లేదు. ఆసక్తి ఉంటే సరే. లేకపోతే బీబీఎం లాంటి కోర్సులు ఇష్టమైతే వాటిలో చేరటం ఉత్తమం. ఆ కోర్సుపై అభిరుచీ, ఆసక్తీ ఉన్నాయా అనేది చూసుకోవటం ప్రధానం! అలాగే ప్రతి బైపీసీ విద్యార్థి కూడా డాక్టరవ్వాలనో లేదా బీఎస్‌సీ, ఎంఎస్‌సీ చదవాలనో నియమమేమీ లేదు.
కొన్నిసార్లు కోర్సు ద్వారా వెంటనే ఉపాధి పొందలేకపోవచ్చు. అయినా సబ్జెక్టును బాగా ఆస్వాదిస్తూ ఆ రంగంలో మరెన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చదివే సబ్జెక్టుపై ఇలా విపరీతమైన ప్రేమ ఉంటే ఉద్యోగావకాశాలతో సంబంధం లేకుండా ఈ కోర్సులో చేరొచ్చు. ఇష్టంగా చదువుకోవచ్చు.

 

బయాలజీ తర్వాత భాషాశాస్త్రం!

బైపీసీతో ఇంటర్‌ చదివాక కూడా.. భాషలంటే అభిమానం, నైపుణ్యం ఉన్నవారు భాష/సాహిత్య కోర్సుల్లోకి మారవచ్చు. ఉదాహరణకు- ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు బీఎఎస్‌సీ జీవశాస్త్రం, ఎంఎస్‌సీ వృక్షశాస్త్రం చదివారు. తర్వాత ‘వృక్షాలకు శాస్త్రీయనామాలెలా పెట్టారు?’ అనే సందేహానికి సమాధానం వెతికే క్రమంలో భాషాశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. దాంతో భాషాశాస్త్రంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసి, ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తగా పేరుపొందారు.
ఒకే కోర్సులో కొన్ని సంవత్సరాలు చదివినవారికంటే వివిధ రకాల కోర్సులు మారుతూ చదివేవారిలోనే సృజనాత్మకత ఎక్కువని శాస్త్రీయంగా నిరూపితమయింది. ఇంటర్లో హెచ్‌ఈసీ, సీఈసీ చదివినవారు బీఏ, బీకాంలే కాకుండా లా కోర్సులు, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, భాషా సంబంధ కోర్సుల్లోకి కూడా ఆసక్తిని బట్టి మారవవచ్చు.

 

నిర్ణయానికి ఎలా రావాలి?

ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. మీ ఆసక్తులను గమనించండి. మీ ప్రత్యేకతలు తెలుసుకోండి. మీ బలాలను విశ్లేషించుకోండి. బలహీనతలు బేరీజు వేసుకోండి.
* చేరాలనుకున్న కోర్సు స్వరూపాన్ని గమనించాలి. 
* అది మీకు సరిపోతుందా, లేదా చూసుకోవాలి. 
* నచ్చిన కోర్సు ఎంచుకోవడం మంచిదే. అయితే ఈ కోర్సులో లభించే ఉన్నత విద్య, కోర్సు అనంతరం అందులో ఉండే అవకాశాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా కొత్త కోర్సులు ఎంచుకున్నప్పుడు ఈ విషయాలు

తెలుసుకోవడం మంచిది. 
* గ్రూపులవారీగా విద్యార్థులకు ఉన్న అవకాశాలు గ్రహించాలి.
* ఇంటర్‌ ఏ గ్రూప్‌ చదివినప్పటికీ అందరికీ ఉమ్మడిగా ఉండే ఆప్షన్ల వివరాలు తెలుసుకోవాలి.
* చివరకు వాటిలోంచి సరైనది ఎంచుకోవాలి.

దేనికి ఏం చూడాలి?
ఏ కోర్సుకైనా కొన్ని అవసరమైన నైపుణ్యాలుంటాయి. అవి ఉన్నాయో లేదో నిర్ధారించుకుని కోర్సులను ఎంచుకోవాలి. ఉదాహరణకు...
* లాయర్‌ అవ్వాలంటే తార్కిక ఆలోచనా విధానం
* మేనేజ్‌మెంట్‌ కోర్సుకు భావ వ్యక్తీకరణ
* భాషా కోర్సులకు సృజనాత్మకత
* నర్సింగ్‌ రంగానికి సేవా తత్పరత
* ఇంజినీరింగ్‌కు సమస్యా పరిష్కార నైపుణ్యం
ఇలాంటివి పరిగణనలోకి తీసుకుని కోర్సులను ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది

 

లెక్కలంటే భయముంటే..

ఒక విద్యార్థి ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నా లెక్కలంటే భయం ఉండి పాసవుతానో లేదోననే అనిశ్చితి ఉంటే అలాంటివారు ఇంజినీరింగ్‌ కోర్సులు చదవటం అనవసరం. ఎందుకంటే.. ఇంజినీరింగ్‌లో ఇంతకంటే క్లిష్టమైన మ్యాథ్స్‌తో సంబంధముంటుంది. వీరు గణితం కాకుండా మరేదైనా సబ్జెక్టుల్లో ఆసక్తి ఉందేమో గమనించి, ఆ రంగాన్ని ఎంచుకోవటం మంచిది.

 

మ్యాథ్స్‌ చదివితే...

‘ఎంపీసీతో ఇంటర్‌ అయిందా? ఇక ఇంజినీరింగే కదా?’
‘ఇంజినీరింగ్‌లో కూడా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌లు మాత్రమే కాదు. ఏరోనాటికల,్ ఏరోస్పేస్‌, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌, పాలిమర్‌ మొదలైన ఎన్నో బ్రాంచీలు అందుబాటులోకి వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో మెరుగైన ర్యాంకుతో నెగ్గితే ఎన్‌ఐటీల్లో చేరొచ్చు. అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపించి ఐఐటీల్లో పాగా వేయొచ్చు. ఇవేవీ కాకున్నా మంచి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీటు సంపాదించేలా ఎంట్రన్సుల్లో ప్రతిభ చూపితే భవితకు ఢోకా ఉండదు.
* ఆసక్తి ఉన్నవారికి బీఆర్క్‌ ఉంది. బీ ఫార్మసీ ఉంది.
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఫోరెన్సిక్‌ సైన్స్‌, మల్టీమీడియా లాంటి మంచి కాంబినేషన్లున్న బీఎస్‌సీలో చేరొచ్చు.
* ఆసక్తి మారిందనుకుంటే రూటు కూడా మార్చుకునే వీలుంది. ఆర్ట్స్‌ కోర్సుల్లో, కామర్స్‌ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశించవచ్చు. బిజినెస్‌, లా, మీడియా/జర్నలిజం, భాషలు, టీచింగ్‌ మొదలైనవాటిని ఎంచుకోవచ్చు’.

 

 

సైన్స్‌ తర్వాత...

‘బైపీసీ పూర్తయింది. నీట్‌లో మంచి ర్యాంకొస్తే ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌. ఇవి కాకుండా వేటిలో చేరొచ్చు?’
‘వైద్యరంగంలో ప్రత్యామ్నాయంగా ఆయుష్‌ కోర్సులున్నాయిగా! అంటే- బీఏఎంఎస్‌ (ఆయుర్వేద), బీహెచ్‌ఎంఎస్‌ (హోమియో), బీయూఎంఎస్‌ (యునానీ), బీఎన్‌వైఎస్‌ (నేచురోపతి), బీఎస్‌ఎంఎస్‌ (సిద్ధ).
* ఇక నర్సింగ్‌, పారామెడికల్‌ కోర్సులైన ఫిజియోథెరపీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ. హోమ్‌ సైన్స్‌, బీ ఫార్మసీ ఉండనే ఉన్నాయి.
* ఉపాధి అవకాశాలుండే వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చర్‌ బీఎస్‌సీల్లో చేరవచ్చు.
* మరో అవకాశం- ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరటం. ఇవేవీ వద్దనుకుంటే మంచి కాంబినేషన్లున్న బీఎస్‌సీలో చేరొచ్చు.
* ఆసక్తిని బట్టి రూటు మార్చుకోవచ్చు కూడా. ఆర్ట్స్‌ కోర్సుల్లో కూడా చేరిపోవచ్చు. బిజినెస్‌, లా, మీడియా/ జర్నలిజం, భాషాశాస్త్రం, టీచింగ్‌ మొదలైనవాటిని ఎంచుకోవచ్చు’.

 

కామర్స్‌... ఆపై?

‘కామర్స్‌ గ్రూపులో ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలే ఉన్నాయంటారుగా?’
‘ఒకప్పుడు అలా అనుకునేవారు. కానీ ఇది సైన్స్‌, ఆర్ట్స్‌ స్ట్రీములతో సమానంగా ఎదుగుతూ అవకాశాలను అందిస్తోంది.
* బీకాంలో చేరితే అకౌంటింగ్‌, ఫైనాన్స్‌ల పరిజ్ఞానం పొందవచ్చు. బీకాంలో టాక్సేషన్‌ అండ్‌ టాక్స్‌ ప్రొసీజర్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి సబ్జెక్టులున్నాయి. బీకాంలో రెగ్యులర్‌, బీకాం ప్రొఫెషనల్‌ కోర్సులు చేయొచ్చు.
* కామర్స్‌ వృత్తివిద్యాకోర్సుల్లో  చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంట్స్‌ మేనేజ్‌మెంట్‌, కంపెనీ సెక్రటరీ ఎంతో పేరు పొందాయి.
* బీబీఏ, లా లాంటివాటిలో చేరొచ్చు. రూటు మారాలంటే బీఏ కూడా చేయవచ్చు.
* బీబీఏ-ఎల్‌ఎల్‌బీ; బీఏ-ఎల్‌ఎల్‌బీ కాంబినేషన్లతో కోర్సులు చేయవచ్చు.
* ఆర్నెల్ల నుంచి 2 ఏళ్ల వ్యవధి ఉండే డిప్లొమాలు- ట్రావెల్‌ అండ్‌ టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఏర్‌ హోస్టెస్‌ అండ్‌ ఫ్లైట్‌ స్టెవార్డ్‌, ఎడ్యుకేషన్‌ లాంటివాటిలో ప్రవేశించవచ్చు’.

 

ఆర్ట్స్‌ చదివారా?

‘సైన్స్‌, మ్యాథ్స్‌, కామర్స్‌ వారితో పోలిస్తే ఆర్ట్స్‌ గ్రూపువారికి పెద్దగా అవకాశాలుండవేమో?’
‘పోల్చి చూస్తే అలా అనిపిస్తుంది. కానీ వైవిధ్యభరితమైన కెరియర్‌ ఆప్షన్లు దీనిలో తక్కువేమీ లేవు.  యూపీఎస్‌సీ సివిల్స్‌ పరీక్ష రాసి, అత్యున్నత అధికార హోదాలో స్థిరపడాలంటే ఏ డిగ్రీవారికైనా అవకాశముంది కానీ, ఆర్ట్స్‌ సబ్జెక్టులే స్కోరింగ్‌కు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.
* అత్యాధునిక, విభిన్నమైన కాంబినేషన్లతో మంచి విద్యాసంస్థల్లో చేరి బి.ఎ. చదివితే భవిష్యత్తు బాగుంటుంది. సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, ఇంకా అడ్వర్టైజింగ్‌,  ట్రావెల్‌ అండ్‌ టూరిజం, టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, లా, ఆర్కియాలజీ, లైబ్రరీ సైన్స్‌ లాంటి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* బీబీఏ-ఎల్‌ఎల్‌బీ లాంటి కాంబినేషన్‌తో కోర్సు చేయవచ్చు.
* కామర్స్‌ వృత్తివిద్యాకోర్సులైన చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంట్స్‌ మేనేజ్‌మెంట్‌, కంపెనీ సెక్రటరీలకు రిజిస్టరై సిద్ధం కావొచ్చు.
* ఆర్నెల్ల నుంచి 2 ఏళ్ల వ్యవధి ఉండే డిప్లొమాలు- ఫారిన్‌ లాంగ్వేజెస్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఏర్‌ హోస్టెస్‌ అండ్‌ ఫ్లైట్‌ స్టెవార్డ్‌, ఎడ్యుకేషన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లలో చేరవచ్చు’.
- ప్రొ. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.