close

తాజా వార్తలు

Updated : 20/03/2019 06:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆయుష్‌మాన్‌ భవ!

ఇంటర్ తర్వాత?

బైపీసీ బాటలో

డాక్టర్‌ కావాలనే లక్ష్యంతోనే చాలామంది ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకుంటారు. విపరీతమైన పోటీలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ల్లో సీటు రాకపోతే నిరాశచెందుతుంటారు. ఖర్చులు భరించలేక కొందరు వెనకడుగేస్తుంటారు. కానీ ఇంకా ఎన్నో డాక్టర్‌ కోర్సులు ఉన్నాయి. అల్లోపతికి దీటుగా ఆయుర్వేదం, యునానీ, హోమియో వంటివి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. వీటిల్లోకి ప్రవేశం ‘నీట్‌’ ద్వారా లభిస్తుంది. డాక్టర్‌ అని పిలిపించుకోవాలనే ఆశయం నెరవేరుతుంది!

 

మనదేశంలో భారీగా, త్వరగా అభివృద్ధి చెందున్న పరిశ్రమల్లో హెల్త్‌కేర్‌/ మెడికల్‌ పరిశ్రమ ఒకటి. ఎక్కువ ఆదరణ, గౌరవాన్ని సంపాదించుకున్న రంగం కూడా! ఇంటర్‌లో బయాలజీని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్న చాలామంది లక్ష్యం వైద్య విద్యే అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రారంభం నుంచే కష్టపడి సన్నద్ధమవుతుంటారు. వీరు రాసే ప్రవేశపరీక్షల్లో నీట్‌, ఎయిమ్స్‌, జిప్‌మర్‌ ప్రధానమైనవి. అందుకే వైద్యవిద్యపై దృష్టిపెట్టే బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ల గురించే ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాటిల్లో సీటు రాకపోతే లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ దిశగా వెళ్లడమో, భారంగా డిగ్రీ కోర్సుల్లో చేరడమో చేస్తుంటారు.
ఈ ప్రధాన కోర్సులకు గుర్తింపు ఎక్కువే. అయినప్పటికీ వాటితోపాటు ఆదరణలో పోటీపడుతూ ఎన్నో మెడికల్‌ కోర్సులు బైపీసీ నేపథ్యం వారికి అందుబాటులో ఉన్నాయి. ఆధునిక వైద్యంతో పోటీపడుతూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. వైద్య రంగంలో వీటిదీ ప్రముఖ స్థానమే. ఎన్నో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వీటిని అందిస్తున్నాయి. పైగా నీట్‌, ఎయిమ్స్‌, జిప్‌మర్‌లతోనే వీటిల్లోనూ ప్రవేశాలను పొందొచ్చు.


 

ప్రధానమైనవి..
ఎంబీబీఎస్‌

డాక్టర్‌ వృత్తిని చేపట్టాలనుకునేవారు చదివే ప్రధాన గ్రాడ్యుయేట్‌ డిగ్రీ- బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ (ఎంబీబీఎస్‌). ఇది రెండు ప్రొఫెషనల్‌ డిగ్రీలు- మెడిసిన్‌, సర్జరీల కలయిక. ప్రతిష్ఠాత్మక కోర్సుగా దీనికి పేరు. పైగా గిరాకీ ఎక్కువ. కోర్సులో భాగంగా ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ వంటి సబ్జెక్టులను చదువుతారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి నాలుగున్నరేళ్లు. ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే నీట్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఎయిమ్స్‌-దిల్లీ, జిప్‌మర్‌-పుదుచ్చేరి కూడా సొంత ప్రవేశపరీక్షలను నిర్వహించి, ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

బీడీఎస్‌
ఎంబీబీఎస్‌ తరువాత ఎక్కువమంది ఆసక్తి చూపే కోర్సు ఇది. ప్రాక్టీసింగ్‌ డెంటిస్ట్‌ లేదా డెంటల్‌ సర్జన్‌ కావాలనుకునేవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ కోర్సును ఎంచుకోవచ్చు. డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఆధ్వర్యంలో కోర్సును నిర్వహిస్తారు. అయిదేళ్ల కోర్సు. నాలుగేళ్లు కోర్సు, ఏడాది వ్యవధి గల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. కోర్సులో భాగంగా డెంచర్‌, పళ్లకు సంబంధించిన సమస్యలు, వాటి సర్జరీలను అధ్యయనం చేస్తారు. నీట్‌ ద్వారా ప్రవేశాన్ని పొందొచ్చు.


 

ఆయుష్‌ కోర్సులు

ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్యాలన్నింటినీ కలిపి ఆయుష్‌ కోర్సులంటారు. ఈ వైద్యాలన్నింటిలో ఎక్కువవాటికి ఆద్యుడు హిపోక్రటీజ్‌. ప్రకృతిసిద్ధమైనవాటితో రోగాలను నయం చేయడం వీటి ఉద్దేశం. వీటిని ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయంగా చెపుతారు. అయితే ఉపయోగించే విధానాలు మాత్రం వేర్వేరు. ఇప్పుడు సంప్రదాయ వైద్యానికీ ఆదరణ పెరుగుతుండటంతో వీటిని ఎంచుకునేవారి సంఖ్యా ఏటా ఎక్కువవుతోంది. .

బీఏఎంఎస్‌ (ఆయుర్వేద)
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ పూర్తిగా ఆయుర్వేద మెడిసిన్‌పైనే దృష్టిసారిస్తుంది. ఆయుర్వేద తత్వశాస్త్రం పంచ భూతాల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిసిద్ధమైన, జీవన విధానాల్ని మార్చుకోవడం ద్వారా రోగాల్ని ఎలా నయం చేయొచ్చో దీనిలో నేర్పిస్తారు. కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). కోర్సు మూడు విభాగాలుగా ఒక్కో విభాగం ఒకటిన్నరేళ్ల చొప్పున విభజితమై ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, ఆయుర్వేదిక్‌ వ్యవస్థ చరిత్ర, టాక్సికాలజీ, ఫార్మకాలజీ, సర్జరీ, ఈఎన్‌టీ, చర్మం, గైనకాలజీ మొదలైన అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. కోర్సు పూర్తిచేసి, ప్రభుత్వం నుంచి నమోదు చేసుకుని లైసెన్స్‌ పొందినవారు వైద్యాన్ని అందించొచ్చు. కోర్సు పూర్తిచేసున్నవారు జనరల్‌ ప్రాక్టీసు పెట్టుకోవచ్చు లేదా ఎండీ ఆయుర్వేద చదవొచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రీయ ప్రవేశపరీక్ష ఏమీ లేదు. నీట్‌ ద్వారానే ప్రవేశాలు జరుపుతారు. కొన్ని ఇతర రాష్ట్రాలు- కేరళ, ఒడిశా వంటివి మాత్రం ప్రత్యేకంగా రాష్ట్రీయ ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

బీహెచ్‌ఎంఎస్‌ (హోమియో)
బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ.. దేశంలో అలోపతి, ఆయుర్వేదం తరువాత మూడో ప్రసిద్ధ వైద్య విధానం. మొక్కలు, జంతువులు, మినరల్స్‌ ద్వారా ద్రవ, టాబ్లెట్‌ రూపంలో దేహంపై దుష్ప్రభావాలు చూపకుండా ఉండే మందులను అందిస్తారు. హోమియోపతి విధానంలో మెడికల్‌ పరిజ్ఞానాన్ని ఈ డిగ్రీ కోర్సులో అందిస్తారు. కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). హెర్బాలజీ, నేచురల్‌ థెరపీలు, హోమియోపతి పద్ధతులు, హీలింగ్‌ టెక్నిక్‌లు మొదలైనవి నేర్చుకుంటారు. కోర్సును ఎంచుకున్నవారు హోమియోపతిక్‌ ఫార్మసీ, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, స్కిన్‌ స్పెషలిస్ట్‌ వంటి స్పెషలైజేషన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వీలుంటుంది. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాష్ట్రీయ ప్రవేశపరీక్ష ఏమీ లేదు. నీట్‌ ద్వారానే ప్రవేశాలు జరుపుతారు.

బీయూఎంఎస్‌ (యునానీ)
బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ.. పురాతన వైద్య విధానాల్లో ఒకటి. అరబ్‌ దేశాలు ఈ విధానాన్ని ఎక్కువగా పాటించాయి. సానుకూల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, వాటి జ్ఞానం, అభ్యాసాలు దీనిలో ఉంటాయి. మూలికల ద్వారా సహజసిద్ధంగా కోలుకునేలా చేయడం దీని ప్రత్యేకత. రోగ లక్షణాలు, నిర్ధారణ, లేబొరేటరీ సదుపాయాలు, వాటిని ఉపయోగించే విధానం మొదలైనవాటిని నేర్చుకుంటారు. యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నవాటిల్లో ఇదీ ఒకటి. అయితే ఉర్దూ తెలిసుండాలి. అయిదున్నరేళ్ల కోర్సు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). కోర్సు చేసినవారిని హకీంలుగా వ్యవహరిస్తారు. నీట్‌ ద్వారా ప్రవేశాలు జరుపుతారు.

బీఎన్‌వైఎస్‌ (ప్రకృతి వైద్యం)
బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగా సైన్సెస్‌.. నేచురోపతి, యోగా సైన్స్‌- రెండింటి కలయిక ఈ కోర్సు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఈ నిపుణులకు ఆదరణ ఎక్కువే. ఈ విధానంలో మందులకన్నా, సహజసిద్ధంగా రోగాన్ని నయం చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. డైట్‌, మసాజ్‌, వ్యాయామం, ఆక్యుప్రెజర్‌, ఆక్యుపంక్చర్‌ మొదలైనవి దీనిలో భాగంగా ఉంటాయి. కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు. దీనిలో ఏడాది కాలాన్ని ఇంటర్న్‌షిప్‌కు కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి రాష్ట్రీయ ప్రవేశపరీక్ష ఏమీ లేదు. నీట్‌ ద్వారానే ప్రవేశాలు జరుపుతారు.

బీఎస్‌ఎంఎస్‌ (సిద్ధ వైద్యం)
మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, ఆయుష్‌ విభాగాల ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) ఆధ్వర్యంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సిద్ధ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ కోర్సును నిర్వహిస్తున్నారు. ఈవిధానం తమిళుల నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు చెబుతారు. ఈ వైద్య విధానంలో శరీరానికే కాదు మానసిక స్థితికీ ప్రాధాన్యమిస్తారు. ఔషధ చికిత్స వ్యాధికి మాత్రమే కాకుండా రోగి, పర్యావరణం, వయసు, అలవాట్లు, శారీరక చికిత్సను పరిగణనలోకి తీసుకోవడమే ఈ వైద్య సిద్ధాంతం. నీట్‌ ద్వారా ప్రవేశాలు జరుపుతారు. కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు. దీనిలో ఏడాది కాలాన్ని ఇంటర్న్‌షిప్‌కు కేటాయించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని