close

తాజా వార్తలు

కొత్త కోర్సులు అదనపు సీట్లు

ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది సుమారు 300 సీట్లు పెరిగాయి. కేంద్రప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన రిజర్వేషన్‌ ప్రకారం 10 శాతం సీట్లు ఆర్థిక బలహీనవర్గాలకు ఇవ్వనున్నారు. ప్రాంగణ నియామకాలకు పేరుపొందిన ఈ యూనివర్సిటీ 2019-20 విద్యాసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

హెచ్‌సీయూ ఈ సంవత్సరం అప్లైడ్‌ జియాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, సిస్టమ్స్‌, కంప్యూటేషనల్‌ బయాలజీ, యానిమల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, సంస్కృతం తదితర కోర్సులను ఆరంభిస్తోంది. వీటితోపాటు 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు ఏటా మాదిరిగానే ఉంటాయి. మొత్తం 119 కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 16 ఇంటిగ్రేటెడ్‌, 42 పీజీ కోర్సులు, 13 ఎంఫిల్‌, 9 ఎంటెక్‌, 39 పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశాలు జరగనున్నాయి.
2016 వరకు నిర్వహించిన తెలుగు ఎంఫిల్‌ కోర్సులో గత కొన్ని ఏళ్లుగా ప్రవేశాలు జరగట్లేదు. 2019-20 విద్యాసంవత్సరంలో దీనికి ప్రవేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

100 మార్కులకు..
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దేశవ్యాప్తంగా ఎవరైనా ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.
* పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ  ప్రవేశాలకు రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. * ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏలకు రాతపరీక్ష 75 మార్కులకూ; గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ కలిపి 25 మార్కులకు ఉంటాయి. * 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. * ఎంటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ టెక్నాలజీ ప్రవేశాలు గేట్‌ స్కోరు ఆధారంగా జరుగుతాయి. * ఎంసీఏ ప్రవేశాలను నిమ్‌సెట్‌ స్కోరు ఆధారంగా నిర్వహిస్తారు.

సీట్ల పెంపు, బంగారు పతకాలు
ఇటీవల జరిగిన అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీట్ల పెంపుపై విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 1900 సీట్లు అందుబాటులో ఉంటే.. ప్రస్తుతం ఈ సంఖ్య 2170కి పెరిగింది. సీట్లు పెరగడంతో ఎక్కువ మందికి ప్రవేశాలు దక్కనున్నాయి. గత కొన్నేళ్ల నుంచి సీట్లు పెంచాలనే డిమాండ్‌ ఈ ఏడాది నెరవేరింది. ఇంటిగ్రేటెడ్‌, పీజీ కోర్సుల్లో అత్యంత ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బంగారు పతకాలు దక్కేవి. వీరితోపాటు ఈ ఏడాది నుంచి ఓబీసీ విద్యార్థులకూ బంగారు పతకాలు అందనున్నాయి.
కోర్సులు: 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 3, 2019,
ప్రవేశపరీక్ష: మే 27 నుంచి 31 వరకు,
వెబ్‌సైట్‌:
https://www.uohyd.ac.in/, http://acad.uohyd.ac.in/

- చిత్తులూరి మురళీకృష్ణ, ఈనాడు, హైదరాబాద్‌

ప్రవేశాలకు విశేష స్పందన

హెచ్‌సీయూలో ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దేశవ్యాప్తంగా అన్నిప్రాంతాల విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. మిగతా వాటితో పోలిస్తే ఫీజు తక్కువ. విద్యాప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. దేశ  వ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలు అందించే విశ్వవిద్యాలయాల్లో హెచ్‌సీయూ 5వ స్థానంలో ఉంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో 11వ స్థానం దక్కింది. ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లోనూ మంచి స్థానం దక్కించుకుంది. విదేశీ విద్యార్థులు వర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది వీరికి కొత్తగా మరొక వసతిగృహం అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఎక్కువమంది విదేశీయులకు ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

- ఆచార్య పి.అప్పారావు, ఉపకులపతి, హెచ్‌సీయూ

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.