close

తాజా వార్తలు

వస్త్రాలు వారి అస్త్రాలు

క్యాంపస్‌ వ్యాపారవేత్తలు

దుస్తులు సరికొత్త దారి చూపాయి! ఇద్దరూ కాలేజీ విద్యార్థినులే. చదువుకుంటూనే వ్యాపారబాట పట్టారు. అందరికీ తెలిసిన దుస్తుల్నే తమ వ్యాపారమార్గంగా ఎంచుకున్నారు... వినూత్న పద్ధతిలో అడుగులు వేశారు.  ఇంతకీ వాళ్లేం చేస్తున్నారంటే...
అల్మారా తెరిస్తే చాలు... కుప్పలుగా మీదపడిపోతాయి దుస్తులు. డిగ్రీ చదువుతోన్న పద్దెనిమిదేళ్ల లెహర్‌ అలీ పరిస్థితి కూడా ఇదే. ఆ సమస్యనే వ్యాపారమార్గంగా మార్చుకుంది. ‘అల్మారీ’ పేరుతో తనలాంటి చాలామందికి ఓ పరిష్కారాన్ని చూపింది.

మనలో చాలామంది ప్రతి సందర్భానికీ పట్టుచీరలు, గాగ్రా చోళీలు, లెహెంగాలు, క్రాప్‌టాప్‌ లాంటి ఖరీదైన దుస్తులను కొంటుంటాం. కానీ వాటిని భద్రపరిచేటప్పుడు మాత్రం సూట్‌కేసుల్లో, బ్యాగుల్లో కుక్కి పెట్టేస్తాం. కావాల్సినప్పుడు తీసి చూస్తే అవి నలిగిపోయి, ముడతలు పడి వేసుకోవడానికి అనుగుణంగా ఉండవు. అందుకే ఇలాంటి దుస్తుల్ని శుభ్రం చేసి, క్రమపద్ధతిలో, సందర్భానికి ఉపయోగపడేలా దాచి పెట్టడమే మా పని. వినియోగదారులు అడిగినప్పుడు ఇళ్లకు పంపిస్తాం. మాది ముంబయి. ఇక్కడ ఇళ్లు చాలా చిన్నగా ఉండటం వల్ల అరలు విశాలంగా ఉండవు. ఇవన్నీ గమనించి, నా స్వానుభవంతో ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చా.
* ఏం చేస్తామంటే...
ప్రస్తుతం మేం వాట్సాప్‌ ద్వారా దుస్తులను సేకరించి, వినియోగదారులు అడిగిన ఇరవై నాలుగు గంటల్లో వారిళ్లకు పంపిస్తాం. వాళ్లు కోరితే డ్రైక్లీనింగ్‌ కూడా చేస్తాం. ఇందుకోసం ‘క్లోసెట్‌ కేర్‌’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇక, దుస్తుల్ని సేకరించి, అందించేందుకు మాకంటూ ఓ వాహనం ఉంది. మా అమ్మ సన్హ అలీ, నేను మరో ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. ఈ ఏడాది పూర్తయ్యేసరికి రెండు, మూడు నగరాల్లో దాదాపు 10,000 వినియోగదారులను చేరుకోవాలనేదే మా కల. ప్రస్తుతం వందమంది వినియోగదారులు ఉన్నారు. ‘డ్రెస్‌ తుమ్హారీ, స్పేస్‌ హమారీ (దుస్తులు మీవి, చోటు మాది) ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే వందమంది వినియోగారుల్ని చేరుకున్నాం. సేకరించిన దుస్తుల్ని భద్రపరిచేందుకు 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘కేర్‌హౌజ్‌’ను వాయువ్య ముంబయిలోని మలాడ్‌ ప్రాంతంలో ప్రారంభించాం. దుస్తుల్ని గాలి చొరబడని డస్ట్‌ప్రూఫ్‌ కవర్లలో భద్రపరుస్తాం. వాటి మధ్యలో యాక్టివేటెడ్‌ కార్బన్‌ ప్యాకెట్లు కూడా పెడతాం కాబట్టి తేమ చేరదు. ఒకేసారి దాదాపు రెండువేల దుస్తులను భద్రపరచొచ్చు.
* నమ్మకం పెరిగేలా...
‘ఇక్కడ భద్రపరచడం వల్ల మా దుస్తులకు ఎటువంటి హాని జరగదని హామీ ఇస్తారా?’... అంటూ మొదట్లో వినియోగదారులు ప్రశ్నించేవారు. అందుకే ఒకవేళ మా సిబ్బంది వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మేమే ఆ డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చాం. అయితే ఇప్పటి వరకు అలాంటి సంఘటన జరగలేదు. అంతేకాదు ‘అల్మారీ’లో నేనే మొదటి వినియోగదారురాలిని. నా ముప్ఫై జతల దుస్తుల్ని ఇందులో భద్రపరిచా. అలాగే దుస్తుల సేకరణకు ముందు, పంపించే ముందు జాగ్రత్తగా అన్నింటినీ పరిశీలిస్తాం. ఒక సెట్‌ను ఏడాదికాలం మా దగ్గర భద్రపరచడానికి రూ. 1799 వసూలు చేస్తాం. సంవత్సరంలో రెండుసార్లు ఉచితంగా సేవలను అందిస్తాం. రాయితీలు ఉన్నాయి. దాంతోపాటు ఇరవై సార్లు ఉచిత సేవలను అందిస్తాం. మాది ముంబయి. ఇక్కడే మిథీబాయి కాలేజీలో బి.కామ్‌ మొదటి ఏడాది చదువుతున్నా. నాకు వచ్చిన ఆలోచనను నాన్నకు చెబితే ప్రోత్సహించారు. అరవై లక్షల రూపాయల రుణం తీసుకునేందుకు సాయం చేశారు.  కాలేజీ అయిపోగానే దాదాపు రెండు గంటలు స్టోర్‌లో ఉంటా. నా తొలి సంపాదన రూ.9,999. అవి తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.
 

ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వచ్చిన ఓ ఆలోచనతో దీప్తీ వేముల వినూత్నరీతిలో టైలరింగ్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఆమే ఏం చేస్తోందంటే...

మాది కరీంనగర్‌. బి.టెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నా. నాన్న వేముల రమేష్‌ లారీ డ్రైవర్‌, అమ్మ టైలర్‌. నేను, తమ్ముడు. మా దగ్గర పని తెలిసిన దర్జీలు ఎక్కువ. అయితే వారికి వచ్చే ఆదాయం తక్కువ. ఇంటర్న్‌షిప్‌ చేస్తోన్న సమయంలో ఓ స్నేహితురాలిని కలిశా. ఆమె ఓ దర్జీ దగ్గర సాధారణ డ్రెస్‌ కుట్టించుకుంటే పదమూడువందల రూపాయలు తీసుకున్నాడట. మా ప్రాంతంలో అంత తీసుకోరు. నా స్నేహితురాలి లాంటి వారికి దర్జీల అవసరం ఎక్కువగా ఉందని అనిపించింది. అలాగే మా దగ్గర ఉండే టైలర్లకు ఉపాధి చూపించాలని అనిపించి... వినియోగదారులు, టైలర్లను కలిపేందుకు సిద్ధమయ్యా. దీనివల్ల పట్టణ ప్రాంత మహిళలు, గ్రామీణ మహిళలకు సాయం చేసినట్లవుతుందని అనుకున్నా. అలా ‘టైలర్‌మి’ సేవల్ని అందుబాటులోకి తెచ్చా.
* వినియోగదారులకు అనుగుణంగా...
మా దగ్గర ప్రస్తుతం పన్నెండు మంది దర్జీలు, ఓ డిజైనర్‌ ఉన్నారు. వెబ్‌సైట్‌ను రూపొందించే పనిలో ఉన్నాం. ప్రస్తుతానికి ఫోన్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, టైలర్‌మి యాప్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. మా
యాప్‌లోని డిజైన్లను చూసి తమకు నచ్చిన రకాలను వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఆర్డర్‌ ఇచ్చాక వినియోగదారుల నుంచి వస్త్రం తీసుకుని, చెప్పిన కొలతల ప్రకారం ఓ వారంలో కుట్టి ఇస్తాం. ‘డెలివరీ స్టార్టప్‌’ యాప్‌ ద్వారా వినియోగదారుడికి చేరవేస్తాం. ప్రస్తుతం కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌లో మా సేవల్ని అందిస్తున్నాం. ఓ వైపు చదువుకుంటూ దీన్ని నిర్వహించడం ఓ సవాలే. పొరపాట్లు చేస్తూ... వ్యాపార మెలకువలు నేర్చుకుంటూ సమస్యల్ని తగ్గించుకుంటున్నా. కేవలం ఆలోచన మాత్రమే పెట్టుబడిగా పెట్టా. వచ్చిన డబ్బును దానికోసమే కేటాయిస్తున్నా. మా దగ్గర ఎక్కువగా బ్లవుజులు, లెహెంగాలు, చుడీదార్లు కుట్టించుకుంటారు. వినియోగదారులకు అనుకూలమైన ధరల్లోనే దుస్తులు కుట్టిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మంది మహిళలకు ‘టైలర్‌మి’ ద్వారా ఉపాధి కల్పించాలనుకుంటున్నా.
* ఇబ్బందులూ పడ్డా....
ఇది మొదలుపెడతానన్నప్పుడు ఇంట్లోవాళ్లు ‘చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకో. ఇంత చిన్న వయసులో ఇవన్నీ నీకెందుకు’ అని అన్నారు. అయితే వారిని ఒప్పించా. ఇప్పటికీ అమ్మ నేను కష్టపడుతున్నానని బాధపడుతుంది కానీ నేను ఇష్టంగానే చేస్తున్నా. ప్రారంభంలో ఏపనిలోనైనా ఇబ్బందులు, సమస్యలనేవి సహజం. వాటిని అధిగమిస్తూ ముందుకు పోవాలి. ఇప్పుడు స్టాఫ్‌ను వందశాతం పెంచడమే నా ముందున్న లక్ష్యం. ఇవన్నీ చూసుకుంటూనే కాలేజీకి వెళ్తున్నా. వరంగల్‌లోని నిట్‌లో చదువుతున్నా. కాలేజీ అయిపోయాక మిగతా సమయమంతా స్టార్టప్‌ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచిస్తున్నా. అందుకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా. ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నా.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.