close

తాజా వార్తలు

క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు

8,904 పోస్టులకు ప్రకటన విడుదల

ప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం ఈ సంవత్సరానికి మళ్లీ వచ్చింది. దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్‌ అసోసియేట్స్‌) ఖాళీలతో ప్రకటన వెలువడింది. రెండు వారాల్లో బ్యాంకు ఉద్యోగార్థులకు ఇది రెండో తీపికబురు. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇప్పుడు క్లర్కులు. అభ్యర్థులు పరీక్ష స్వరూపాన్ని, అందుబాటులో ఉన్న సమయాన్ని, తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే విజయాన్ని సాధించవచ్చు.

ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 8904 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను (251 బ్యాక్‌లాగ్‌లతో కలిపి) భర్తీ చేయనుంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 425, ఆంధ్రప్రదేశ్‌లో 253 పోస్టులు ఉన్నాయి. నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్‌ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజిపై నిర్వహించే టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో  మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు.

ఉమ్మడి ప్రిపరేషన్‌
ఎస్‌బీఐ పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటికీ కలిపి ఉమ్మడిగా ఒకటే ప్రిపరేషన్‌ సరిపోతుంది. పీఓకు ప్రిపేర్‌ అయితే క్లర్క్‌ పరీక్షకు సన్నద్ధమైనట్లే.  ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించినంత వరకు పెద్ద తేడాలు లేవు. దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెయిన్స్‌ పరీక్షలో మాత్రం రెండింటికీ చాలా భేదం ఉంటుంది. క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జూన్‌ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది. ఈలోగా ప్రిపరేషన్‌ పూర్తి చేయాలి. పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటిని రాస్తున్న అభ్యర్థులు మాత్రం జూన్‌ 8న నిర్వహించే పీఓ ప్రిలిమ్స్‌ నాటికి తమ ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులను కవర్‌ చేస్తూ,  ఒక మోడల్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల పరీక్ష రాసే పద్ధతికి అలవాటు పడతారు. మొదటసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా అవసరం. మూడు లేదా నాలుగు నెలలు అంకితభావంతో శ్రమిస్తే దేశంలోని నెంబర్‌ వన్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఖాయం.

సాధన చేస్తే.. విజయం మనదే!

బీటెక్‌ పూర్తికాగానే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. దాదాపు ఏడాదిన్నరపాటు కోచింగ్‌ తీసుకుంటూ నిరంతరం శ్రమించాను. మొదటిసారి ఎస్‌బీఐ పీఓ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ సెలక్షన్‌ రాలేదు. ఎస్‌బీఐ క్లర్క్స్‌కు మరింత జాగ్రత్త పడ్డాను.  93.5 (తెలంగాణ), 92.8 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో విజయం సాధించాను. ఒత్తిడికి లోనవకుండా ప్రణాళిక ప్రకారం చదివితే బ్యాంకు ఉద్యోగం కష్టమేమీ కాదు. మొదటి మూడునాలుగు నెలల పాటు రోజుకు 7 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆ తర్వాత రోజుకు గంటన్నర మాత్రమే సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను ప్రతిరోజూ సాధన చేశాను. దీన్ని స్కోరింగ్‌ సబ్జెక్టుగా పెట్టుకున్నాను. రీజనింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇంగ్లిష్‌, కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ న్యూస్‌ పేపర్లను చదివాను. బ్యాంకు పరీక్షలకు సాధనే కీలకమైంది. ఒక్క రోజు కూడా మిస్సవ్వకుండా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాంకు మేనేజర్‌ స్థాయికి ఎదగడం నా జీవిత లక్ష్యం.

- ఏలేటి పృథ్వీ తేజ; మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా

గెలిచే వరకు అలిసి పోవద్దు!

చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్‌ రంగంలో రాణించాలన్న తపన ఉండేది. బీటెక్‌ పూర్తవగానే మొదట అమ్మానాన్నపై ఆధారపడ కూడదని లెక్చరర్‌గా కాలేజీలో చేరాను. తర్వాత పని చేస్తూనే మూడేళ్లపాటు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యాను.  సుమారు పదిహేను పరీక్షలు రాశాను. ఉత్తీర్ణత సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా రాస్తూనే ఉన్నాను.  92.5 (తెలంగాణ), 93.75 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో ఎస్‌బీఐ క్లర్క్స్‌లో విజయం సాధించాను. ఉద్యోగానికి ఎంపికయ్యాను. రోజుకు ఆరు గంటలపాటు అన్ని సబ్జెక్టులను సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన విభాగాలను ప్రతిరోజూ చదివేవాడిని. జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ కోసం హిందూ న్యూస్‌పేపర్‌ రోజూ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారికి న్యూస్‌ పేపర్‌ పఠనం ముఖ్యం. కష్టపడి ప్రయత్నిస్తే బ్యాంకు ఉద్యోగం సాధించడం సులభమే. బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం.

- బొల్లం వీరనాగబాబు; పటవల, కాకినాడ

లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌

మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న లోకల్‌ లాంగ్వేజిని పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో చదివి ఉంటే లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

10 తప్పులు.. చేయవద్దు!

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైన పది పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే విజయానికి చేరువకావచ్చు.

1 సరైన ప్రణాళిక లేదా టైమ్‌-టేబుల్‌ లేకపోవడం: పరీక్ష తేదీ వరకు ఉన్న సమయం, సబ్జెక్టులు, దేనికి ఎంత సమయం కేటాయించాలి మొదలైన వాటి పట్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి అనుగుణంగా స్వీయ ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా ఆచరించాలి.

2 కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించడం: పరీక్షలో అభ్యర్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. తమకు నచ్చిన ఏవో కొన్నింటి పైనే ఎక్కువ దృష్టిపెడితే మిగిలిన సబ్జెక్టుల్లో నష్టం జరగవచ్చు.

3 పరిమాణంపై దృష్టి పెట్టి, నాణ్యతను విస్మరించడం: కొంతమంది రోజుకు 16 లేదా 18 గంటలు చదివాం అంటుంటారు. ఎన్ని గంటలు సిద్ధమైనా ఎంత నేర్చుకున్నారన్నదే ముఖ్యం. గంటలకు గంటలు సమయం గడిపి బాగా ప్రిపేర్‌ అవుతున్నాం అనుకోకూడదు. ఈ రోజు ఎంత నేర్చుకున్నారో కచ్చితంగా పరిశీలించుకోవాలి.

4 రివిజన్‌ చేయకపోవడం: అభ్యర్థులు తాము నేర్చుకున్న టాపిక్స్‌ అన్నింటినీ ఎప్పటికప్పుడు రివిజన్‌ చేయాలి. రివిజన్‌ చేయకపోతే చదివింది సరిగా గుర్తుకు రాక మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.

5 తాజా మోడల్‌ ప్రశ్నలకు, ట్రెండ్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ లేకపోవడం: ప్రతి పరీక్షలోనూ ఎంతో కొంత మార్పు కనిపిస్తుంటుంది. గత పరీక్షలను పరిశీలించి  ప్రిపేర్‌ కావాలి. అదే సిలబస్‌, అవే ప్రశ్నలు అంటూ పరీక్ష సరళిని గమనించకుండా సాగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

6 ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక మెయిన్స్‌కు ప్రిపేరవడం: ప్రిలిమ్స్‌ అయిన తర్వాత మెయిన్స్‌ సంగతి చూద్దామని కొందరు అనుకుంటారు. అప్పుడు సమయం సరిపోక ఫెయిల్‌ అవుతారు. అందుకే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఉండాలి. కామన్‌ టాపిక్స్‌ నుంచి మొదలు పెట్టాలి.

7 ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయకపోవడం: పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. దానివల్ల అసలు పరీక్ష సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుంది.

8 మోడల్‌ పేపర్‌ విశ్లేషించుకోకపోవడం: అభ్యర్థులు మోడల్‌ పేపర్‌ రాసిన తర్వాత దాన్ని విశ్లేషించుకోవాలి. ఎందులో వెనుకబడి ఉన్నారో గమనించాలి. మెరుగుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రిపరేషన్‌ గుడ్డిగా సాగకూడదు.

9 ఇంగ్లిష్‌ సబ్జెక్టుపై అశ్రద్ధ: ఇది ఎక్కువ మంది అభ్యర్థులు చేసే పొరపాటు.  తెలిసిన భాషే కదా అని అశ్రద్ధ చేస్తారు. భాష తెలిసి ఉండటానికి, దానిలో అడిగే ప్రశ్నలకు తేేడా ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ అవసరమే.

10 షార్ట్‌కట్స్‌ నేర్చుకోకపోవడం: సంప్రదాయ పద్ధతిలో ప్రశ్నలు సాధించడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది. సంక్షిప్త పద్ధతుల (షార్ట్‌కట్స్‌) వల్ల తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. వాటిని నేర్చుకోకపోతే నష్టపోతారు.

- జి.ఎస్‌. గిరిధర్‌

ముఖ్యాంశాలు

మొత్తం పోస్టులు: 8,904 (251 బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో కలిపి)
అర్హత: ఏదైనా డిగ్రీ (డిగ్రీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్‌ అభ్యర్థులు కూడా అర్హులే)
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపునకు చివరి తేది: 03.05.2019
పరీక్ష: ప్రిలిమ్స్‌ -జూన్‌లో, మెయిన్స్‌ - జులైలో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణ - హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
ఆంధ్రప్రదేశ్‌ - చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

https://bank.sbi/careers/
https://www.sbi.co.in/careers/

(క్లర్కు పరీక్షల స్వరూపం, సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ విధానాలు www.eenadupratibha.net లో.)


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.