close

తాజా వార్తలు

ఆటాడించేద్దాం... రా!

కెరియర్‌ గైడెన్స్‌ గేమింగ్‌

వీధుల్లో, చిన్న చిన్న మలుపుల్లో రయ్‌ మంటూ రేసింగ్‌ చేయడం.. వెంటపడుతున్న పోలీసుల నుంచి చిటికెలో తప్పించేసుకోవడం.. బంగారు నాణేలను సులువుగా కొల్లగొట్టేయడం.. అడ్డు వచ్చిన విలన్లను చిటికెలో చంపేస్తూ ముందుకు సాగడం.. బృందాన్నీ, ఆస్తులనూ కాపాడే క్రమంలో అప్పుడప్పుడూ చనిపోవడం.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో! కొత్తగా వినేవారికి తికమకే గానీ- ఆన్‌లైన్‌ ఆటలు ఆడేవారికివి సుపరిచితమే!  టెంపుల్‌ రన్‌, పబ్జీ, క్యాండీ క్రష్‌, యాంగ్రీబర్డ్స్‌, ఫోర్ట్‌ నైట్‌, లూడో.. మొదలుపెడితే చాలు.. గంటలకొద్దీ తెరలకు అంటిపెట్టుకునేంత ఆకర్షణ ఈ సాహస క్రీడలది. ఇలాంటి గేమింగ్‌ల రూపకల్పన మంచి కెరియర్‌గా వృద్ధి చెందింది. పది, ఇంటర్‌ అర్హతలతో సంబంధిత కోర్సులు చేసి, ఈ రంగంలో భవిష్యత్తును నిర్మించుకోవచ్చు!

ప్రతి వ్యక్తిలోనూ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, కొన్ని సమయాల్లో అది బయటపడుతుంది అంటుంటారు. ఆటల విషయంలో మాత్రం అందరూ చిన్నపిల్లలై పోతుంటారు. ముఖ్యంగా వెబ్‌, మొబైల్‌ గేమ్స్‌ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అందుకే చిన్నపిల్లలతోపాటుగా పెద్దలూ పోటీపడి ఆడేస్తున్నారు. రోజురోజుకీ ఎన్నో కొత్త గేములు మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. వాటిని ఆడుతున్న వారి సంఖ్యా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. రోజువారీ బిజీ జీవితంలో పని ఒత్తిడి నుంచి కొంత విశ్రాంతి తీసుకుందామనుకునే వారిలో ఎక్కువమంది ఎంపిక కూడా ఆన్‌లైన్‌ గేములే అవుతున్నాయి.
ఇటీవల కేపీఎంజీ, గూగుల్‌ సమర్పించిన నివేదిక ప్రకారం మనదేశంలో వీటిని ఆడుతున్న వారి సంఖ్య 2021కి ఒక బిలియన్‌కు చేరనుందని అంచనా! గ్లోబల్‌ గేమ్స్‌ మార్కెట్‌ ప్రకారం.. ఇదే సమయానికి ప్రపంచ మొబైల్‌ గేమింగ్‌ రంగం ఆదాయం సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అయితే ఈ రంగాన్ని ఆటవిడుపుగానే కాకుండా ఉపాధిగానూ మలుచుకోవచ్చు. ఆడేవారి సంఖ్య పెరుగుతుండటంతో కొత్త, ఎక్కువ కాలం నిలిపి ఉంచే ఆటలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఇందుకు తగ్గట్టుగానే వీటిని రూపొందించేవారికీ ఆదరణ పెరుగుతోంది.
తగిన పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందించే కోర్సులను చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నో సంస్థలు గేమ్‌ డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌కు సంబంధించి వివిధ కోర్సులను అందిస్తున్నాయి.

కెరియర్‌ అవకాశాలు

గేమింగ్‌ పరిశ్రమ సృజనాత్మకత, సాంకేతికత, వినోదాల కలయిక. గేమ్‌ డిజైనర్లు వివిధ క్యారెక్టర్లు, పజిల్స్‌, ఆర్ట్‌, యానిమేషన్లను రూపొందిస్తారు. వీరు వివిధ లాంగ్వేజెస్‌ ప్రోగ్రామ్‌లను గేమ్‌ల కోసం కోడింగ్‌ రాస్తుంటారు. ఈ పరిశ్రమకు సంబంధించి మనదేశం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయినప్పటికీ దేశంతోపాటు విదేశాల్లోనూ గేమ్‌ డెవలపర్లకు మంచి గిరాకీ ఉంది. నైపుణ్యాలున్న వారికి ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. వీడియో గేమింగ్‌, కన్‌సోల్‌ గేమింగ్‌, వైర్‌లెస్‌ గేమింగ్‌, పీసీ గేమింగ్‌, మల్టీ ప్లేయర్‌ గేమింగ్‌ల్లో దేనిలోనైనా కెరియర్‌ను నిర్మించుకోవచ్చు.
కోర్సులు పూర్తి చేసినవారిని గేమ్‌ డిజైనర్‌, గేమ్‌ ఆర్టిస్ట్‌, టెక్చర్‌ ఆర్టిస్ట్‌, క్యారెక్టర్‌ యానిమేటర్‌, ఆర్ట్‌ డిజైనర్‌, టూల్‌ డెవలపర్‌, గేమ్‌ టెస్టర్‌, వరల్డ్‌ డిజైనర్‌, సిస్టమ్‌ డిజైనర్‌, కంటెంట్‌ డిజైనర్‌, గేమ్‌ రైటర్‌, లెవల్‌ డిజైనర్‌, గేమ్‌ ప్లే ప్రోగ్రామర్‌ హోదాలకు వీరిని ఎంచుకుంటున్నారు. 
సాధారణంగా వీరిని గేమింగ్‌ సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, వస్త్ర పరిశ్రమలు, ట్రావెలింగ్‌ సంస్థలు, డిజిటల్‌ మీడియా యూజర్లు ఎంచుకుంటారు. నింటెండో, 2పీఐ ఇంటరాక్టివ్‌, 99 గేమ్స్‌, సోనీ కంప్యూటర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌, డిజిటల్‌ చాకోలెట్‌, జింగా, గేమ్స్‌2విన్‌, హాష్‌టాగ్‌ మొదలైనవి గేమింగ్‌ నిపుణులను ఎక్కువగా నియమించుకుంటున్న సంస్థల్లో కొన్ని. 
ఎంపికైన సంస్థ, అభ్యర్థి నైపుణ్యాలు, హోదాను బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. సాధారణంగా వీడియో గేమ్‌ డిజైనర్లకు ప్రారంభ వేతనం నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకూ ఉంటోంది. అనుభవం, నైపుణ్యాలను బట్టి జీతభత్యాల్లో మంచి మార్పులుంటాయి.

నాలుగు రకాల కోర్సులు

గేమింగ్‌లో ప్రధానంగా డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌ అని రెండు రకాలుంటాయి. డిజైనింగ్‌ ప్రాథమిక దశ. దీనిలో గేమ్‌ కాన్సెప్ట్‌ను రూపొందిస్తారు. డెవలప్‌మెంట్‌లో డిజైనర్‌ ఆలోచనలకు ప్రాణం పోస్తారు. కోర్సు ఏది ఎంచుకున్నప్పటికీ ఈ రెండు అంశాలపై బోధన ఉంటుంది. మనదేశంలో సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. థియరీతోపాటు నిజజీవిత ఉదాహరణలు, గేమ్‌ ఇంజిన్లను ఉపయోగించడం వంటి ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ ప్రాధాన్యముంటుంది. కొన్ని సంస్థలు వ్యక్తిగత, బృంద స్థాయి ప్రాజెక్టులకూ అవకాశం కల్పిస్తున్నాయి. వీడియో గేమ్స్‌, గేమ్‌ మోడ్స్‌, లెవెల్స్‌, బోర్డ్‌ గేమ్స్‌ వంటివి ఇందులో భాగం.
సర్టిఫికెట్‌ స్థాయిలో: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ గేమింగ్‌, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ గేమ్‌ ఆర్ట్స్‌, డిజైన్‌ కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి ఆరు నెలలు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తిచేసినవారు అర్హులు.
డిప్లొమా స్థాయిలో: డిప్లొమా ఇన్‌ గేమ్‌ డిజైన్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌, ప్రొఫెషనల్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ ఆర్ట్‌, డిప్లొమా ఇన్‌ యానిమేషన్‌, గేమింగ్‌ అండ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ 3డి గేమ్‌ కంటెంట్‌ క్రియేషన్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ ప్రోగ్రామింగ్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అప్లికేషన్‌ మొదలైన కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి ఏడాది. డిప్లొమా కోర్సులకు ఏదేని గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులకు డిప్లొమా పూర్తిచేసినవారు అర్హులు.
డిగ్రీ స్థాయిలో: బీఎస్‌సీ, బీఎఫ్‌ఏ, బి.డిజైన్‌ (గేమ్‌ డిజైనింగ్‌), బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.
పీజీ స్థాయిలో: ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ (మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌ విత్‌ గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌) ఎంఎస్‌సీ (గేమింగ్‌; గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌; మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌), ఎం.డిజైన్‌ (డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. టెక్నికల్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. 
కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్లు సాధారణంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ విడుదలవుతాయి. డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. చాలావరకూ సంస్థలు ప్రవేశపరీక్షలను నిర్వహించి, తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్షలతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. చాలా తక్కువ సంస్థలు మాత్రం మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కోర్సు, సంస్థను బట్టి సాధారణంగా రూ.30,000 నుంచి రూ.ఆరు లక్షల వరకూ ఫీజుగా తీసుకుంటున్నారు.

అందిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు

* జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు 
* ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌, బెంగళూరు 
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నొవేషన్‌, హైదరాబాద్‌, పుణె, దిల్లీ, ముంబయి 
* డీఎస్‌కే సుప్‌ఇన్ఫోకామ్‌ 
* సీమ్‌లెస్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ 
* భారతీయ విద్యాపీఠ్‌ యూనివర్సిటీ, పుణె 
* మాయా అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్‌, ముంబయి 
* ఎరీనా యానిమేషన్స్‌, న్యూదిల్లీ 
* జీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌, బెంగళూరు 
* ఐపిక్సియో యానిమేషన్‌ కాలేజ్‌, బెంగళూరు 
* అకాడమీ ఆఫ్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌, నోయిడా

ఆన్‌లైన్‌లోనూ...

నేరుగా కళాశాలలకు వెళ్లి నేర్చుకోలేనివారికి ఆన్‌లైన్‌ కోర్సులు ఓ ప్రత్యామ్నాయం. ఎడ్‌ఎక్స్‌, కోర్స్‌ఎరా, యుడెమి, క్లాస్‌ సెంట్రల్‌, లిండా వంటి వెబ్‌సైట్‌లు ఆ అవకాశం కల్పిస్తున్నాయి. వీటిలో బిగినర్స్‌, అడ్వాన్స్‌డ్‌ వంటి దశలతోపాటు, 3డీ, డిజిటల్‌ పెయింటింగ్‌, పిక్సెల్‌ ఆర్ట్‌ వంటి వివిధ స్పెషలైజేషన్లలతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కనీస ఫీజుతో నేర్పుతుండగా, చాలావరకూ ఉచితంగా అందిస్తున్నాయి. 

ఏ లక్షణాలుండాలి?

* గేమింగ్‌పై బలీయమైన ఆసక్తి, అభిరుచి .
* సృజనాత్మకత,  ఊహాశక్తి 
* సాఫ్ట్‌వేర్లపై, గేమ్‌ ప్లే థియరీపై అవగాహన, ఆసక్తి 
* సమయపాలన 
* భిన్నంగా ఆలోచించే ప్రతిభ 
* మార్కెట్‌లోకి వచ్చే కొత్త ఆటలపై ఎప్పటికప్పుడు అవగాహన.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.