ఆ మూడూ కాకున్నా.. మార్గాలున్నాయ్‌! 
close

తాజా వార్తలు

Published : 16/05/2019 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మూడూ కాకున్నా.. మార్గాలున్నాయ్‌! 

విభిన్న కెరియర్లు

పదోతరగతి, ఇంటర్మీడియట్‌ తర్వాత కాస్త భిన్నంగా కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల వైపు వెళదామనుకునే వాళ్లను ఒక భయం వెంటాడుతుంటుంది. అనుకోని పరిస్థితుల్లో అవి పూర్తి చేయలేకపోతే... అటూ ఇటూ కాకుండా పోతామేమో అని. అలాంటి అపోహలేమీ అవసరం లేదు. కామర్స్‌ మద్దతుతో అదనపు ప్రయోజనాలను అందించే ఆకర్షణీయమైన కోర్సులు అనేకం ఉన్నాయి. సీఏ, సీఎంఏ, సీఎస్‌లపై ఆసక్తి తగ్గి పూర్తి చేయడం కుదరక పోయినా కెరియర్‌ మార్గాన్ని మరో మలుపు తిప్పుకొని మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ దశలో కామర్స్‌ విద్యార్థులు చేయదగ్గ కోర్సుల్లో ముఖ్యమైనది బీకామ్‌. మిగిలినవాటిలో ప్రధానమైనవి లా, మేనేజ్‌మెంట్‌, సోషల్‌ సైన్సెస్‌, హాస్పిటాలిటీ, డిజైన్‌, మాస్‌ కమ్యూనికేషన్‌-జర్నలిజం. సోషల్‌ సైన్సెస్‌, లా కోర్సుల్లో ఇతర గ్రూపులవారు కూడా చేరవచ్చు. కానీ కామర్స్‌ విద్యార్థులకు సబ్జెక్టులపరంగా వీటిలో అదనపు ప్రయోజనం లభిస్తుంది.

సోషల్‌ సైన్సెస్‌లో సుశిక్షితులైనవారు మానవ వనరులకు సంబంధించిన కార్పొరేట్‌ కెరియర్లలో సాధికారికంగా ప్రవేశించవచ్చు. వీరికి ఆకర్షణీయమైన వేతనాలూ లభిస్తాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ‘లా’ కోర్సుకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ రోజుల్లో న్యాయవాదులు కోర్టులకే పరిమితం కావటం లేదు. సైబర్‌ లా నిపుణులుగా, ఐపీ అటార్నీలుగా, న్యాయ సలహాదారులుగా పనిచేస్తున్నారు. సొంతంగా ప్రాక్టీసు పెట్టుకునే వీలూ ఉంది.

ప్రముఖ సంస్థల్లో బీకామ్‌ చదివినవారికి అతిపెద్ద అకౌంటింగ్‌, కన్సల్టింగ్‌ సంస్థలు ఉద్యోగావకాశాలు అందిస్తున్నాయి. ఎస్‌ఆర్‌సీసీ లాంటి చోట్ల డిగ్రీ పూర్తిచేసినవారు కిందటి ఏడాది అత్యుత్తమ ఎంబీఏలతో సమానంగా ప్రాంగణ నియామకాలు పొందారు. 
పేరున్న విద్యాసంస్థల్లో ప్రవేశించాలంటే జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో పోటీపడి ప్రతిభ చూపించాల్సివుంటుంది. విద్యార్థులు పదో తరగతి స్థాయి ప్రాథమిక గణితం, వెర్బల్‌, లాజికల్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌పై పట్టుపెంచుకుంటేనే ఈ పరీక్షల్లో నెగ్గటం సాధ్యమవుతుంది. కోర్సుల్లో చేరి రాణించాలంటే స్వీయ సామర్థ్యంపై అవగాహన, సాఫ్ట్‌స్కిల్స్‌ అవసరమవుతాయి.

- డాక్టర్‌ శరత్‌ గరిమెళ్ళ

 

 


సీఏ, సీఎంఏ కుదరకపోయినా... 

జేఈఈ కోచింగ్‌ తీసుకునే ప్రతి విద్యార్థీ ఐఐటీలో సీటు సాధించలేడు.అలాగే వైద్యవిద్య ప్రవేశపరీక్ష- నీట్‌కు సంసిద్ధమయ్యే విద్యార్థుల్లో కూడా భారీ పోటీలో నెగ్గి సీట్లు పొందేవారు తక్కువగానే ఉంటారు. ఇదే విధంగా సీఏ లేదా సీఎంఏకు రిజిస్టరై,  ప్రిపేరయ్యే ప్రతి విద్యార్థీ ఆ కోర్సులు ఉత్తీర్ణులు కాకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. సమయం వృథా అయ్యిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు చూపుతో ప్రత్యామ్నాయంగా సమాంతరంగా కొన్ని కోర్సులు చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. 
అందుకే... సీఏ, సీఎంఏ చదివేవారిలో సింహభాగం వాటితో పాటు బ్యాక్‌అప్‌ కోర్సుగా బీకామ్‌ లాంటి డిగ్రీ కూడా చదువుతుంటారు. శిక్షణ సంస్థలు కూడా సీఏతో, సీఎంఏతో పాటు డిగ్రీ కూడా చదవమని ప్రోత్సహిస్తుంటాయి. అలాగే సీఏతోపాటు సీఎంఏకు కూడా చాలామంది విద్యార్థులు సిద్ధమవుతుంటారు. ఇలా ఒకే సమయంలో  రెండు కోర్సులు చదవటం వల్ల నష్టం జరుగుతుందేమో అని కొందరు తల్లిదండ్రులు సందేహిస్తుంటారు కానీ, అది అపోహ మాత్రమే. నిస్సందేహంగా ఇది ప్రయోజనకరమైన నిర్ణయమే అవుతుంది. 


బీకామ్‌, లా, ఎంబీఏ, పీజీ... 

ఏదైన కారణంతో విద్యార్థి సీఏ లేదా సీఎంఏ కోర్సులను మధ్యలో ఆపివేసినా, వాటితో పాటు డిగ్రీ కూడా సమాంతరంగా చదివితే పట్టా పొంది, బ్యాంకింగ్‌ మొదలైన  పోటీ పరీక్షలు రాసుకోవచ్చు. లా/ ఎంబీఏ / పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి జీవితంలో స్థిరపడవచ్చు. బీటెక్‌ విద్యార్థులు ఇంజినీరింగ్‌ తర్వాత ఎంబీఏ చేస్తుంటారు. అలాగే సీఏ గానీ, సీఎంఏ గానీ ఫెయిలయిన విద్యార్థులు నిరాశపడకుండా, డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏ చేయడం మంచిది. 


అకౌంటెంట్లుగా... 

వ్యాపార రంగంలో అకౌంటెంట్ల కొరత బాగా ఉంది. బీకామ్‌ లాంటి డిగ్రీ పూర్తిచేసినవారు అకౌంటింగ్‌ పరిజ్ఞానం పెంచుకుంటే అకౌంటెంట్లుగా చేరవచ్చు. ఇలాంటివారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సీఏ, సీఎంఏ కోర్సు మధ్యలో ఆపేసిన వారికి ఈ అవకాశం అధికం. ఎందుకంటే... ఆ కోర్సులు పూర్తి చేయలేకపోయినప్పటికీ వీరికి సంబంధిత సబ్జెక్టుల పట్ల అవగాహన ఉంటుంది. దాంతోపాటు అప్పటికే ప్రాక్టికల్‌ శిక్షణ కూడా తీసుకొనివుంటారు కాబట్టి మిగతావారితో పోలిస్తే వీరు అకౌంటింగ్‌ రంగంలో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది.


అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ కోర్సు 

సీఏ కోర్సులోని రెండో దశ సీఏ ఇంటర్‌. దీనికి పాత పేరు సీఏ- ఐపీసీసీ. ఈ ఐపీసీసీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 అనే రెండుంటాయి. ఐపీసీసీలోని గ్రూప్‌-1లో ఉత్తీర్ణత సాధించి ఎవరైనా సీఏ దగ్గర సంవత్సరంపాటు ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేసినవారు సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారికి అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటివారిని అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులుగా గుర్తిస్తారు. అంటే సీఏ. కోర్సులోని రెండో దశ పూర్తిచేసి మూడో దశ పూర్తిచేయలేని విద్యార్థులు కూడా అధికారికంగా అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చన్నమాట.ఇలా కార్పొరేట్‌ సంస్థల్లో మధ్యస్థాయి ఉద్యోగాలు పొందటమే కాకుండా, సొంతంగా ఐటీపీ (ఇన్‌కంటాక్స్‌ ప్రాక్టీషనర్‌) లేదా ఎస్‌టీపీ (సేల్స్‌ టాక్స్‌ ప్రాక్టీషనర్‌) లేదా జీఎస్‌టీ ప్రాక్టీషనర్‌గా మంచి హోదాలో స్థిరపడవచ్చు.

2017 నుంచి  సీఏ సిలబస్‌ మారింది. ఈ కొత్త సిలబస్‌లో సీఏ-ఐపీసీసీకి సీఏ- ఇంటర్‌ అని అని పేరుపెట్టారు. ఈ సీఏ ఇంటర్‌ విద్యార్థులు ఏటీసీ (అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌) ఎలా పొందాలనే విధి విధానాలు త్వరలో ఖరారవుతాయి. 
సీఏ, సీఎంఏలు కామర్స్‌ కోర్సులు కాబట్టి వీటిని చదవాలనుకునేవారు ఇంటర్‌లో ఎంఈసీ. కోర్సు తీసుకోవటం మేలు. చాలామంది విద్యార్థులు అవగాహన లేక ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ కోర్సులు చదివి సీఏ, సీఎంఏ కోర్సుల వైపు వస్తున్నారు. అలా కూడా చేయవచ్చు కానీ, దానికంటే సీఏ, సీఎంఏలు చేయాలనే లక్ష్యం ఉన్నవారు  ఇంటర్‌లో ఎంఈసీ. తీసుకొని సీఏ చేయడం తెలివైన నిర్ణయంగా చెప్పవచ్చు

                                                           - ఎంఎస్‌ఎన్‌. మోహన్‌

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని