close

తాజా వార్తలు

వెండి తెరపై క్రికెట్‌ సంచలనాలు

విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: భారత్‌లో సినిమా, క్రికెట్‌ రెండు కళ్ల లాంటివి. అందులో ఏది లేకున్నా మనకు అసంతృప్తిగానే ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అభిమానించే ఈ రెండూ రంగాలు వేర్వేరైనా రెండూ కలిస్తే అభిమానులకు పండగే.  ఐపీఎల్ కూడా ఈ రెండు రంగాలకు వేదికగా మారింది. అలాగే సినిమా స్టార్లూ, క్రికెటర్ల కాంబినేషన్లూ చూడముచ్చటగా ఉంటాయి. ఇదివరకు బాలీవుడ్‌లో కొంత మంది హీరోయిన్లు క్రికెటర్లను వివాహమాడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు, బలమైన కథా నేపథ్యం, అందుకు తగ్గ నేపథ్య సంగీతం కుదిరితే ఆ సినిమాలు బాక్సాఫీసుల వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి క్రికెట్‌ నేపథ్యం ఉన్న ఆణిముత్యాలే మీకోసం.. 

లగాన్‌: 2001లో క్రికెట్‌ నేపథ్యంలో విడుదలైన లగాన్‌ సినిమా బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్‌హీరో అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించగా ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందించాడు. ఈ సినిమాలో దేశభక్తి, క్రికెట్‌ రెండు వైవిధ్యమైన అంశాలను ఒకే కథలో ఇనుమడించి చాలా చక్కగా తెరకెక్కించారు. బ్రిటీష్‌ పాలనలో అధిక పన్నులు వసూలు చేస్తుంటే తాము కట్టలేమని గ్రామస్థులు ఎదురు తిరుగుతారు. అందుకు వారితో క్రికెట్‌మ్యాచ్‌ ఆడి గెలిస్తే మూడేళ్ల వరకు పన్నులు రద్దు చేసే ఛాలెంజ్‌తో కథ క్రికెట్‌ వైపు మళ్లుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అంటే ఏంటో తెలియని గ్రామస్థులు ఇంగ్లీష్‌ ఆటగాళ్లని ఓడించడమే సినిమా కథ. సినిమా చూస్తున్నంతసేపూ ఉత్కంఠతో పాటు తీవ్ర భావోద్వేగానికి గురౌతారు. 

అజర్‌: ప్రముఖ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ జీవితాధారంగా రూపొందించిన చిత్రం అజర్‌. ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రలో 2016లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారత జట్టులో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఎదుగుతున్న ఓ క్రికెటర్‌ అనూహ్యంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల్లో ఇరుక్కొని కెరీర్‌ కోల్పోవడమే కథాంశం. క్రికెట్‌ బుకీ నుంచి డబ్బు తీసుకుంది నిజమే అని అజర్‌ ఒప్పుకోవడం, దానికి ఒక బలమైన కారణం చూపించడం బాగుంది. అదే కథలో తన వైవాహిక జీవితం కూడా చాలా చక్కగా మేళవించారు. సినిమా చూస్తున్నంతసేపూ అజహరుద్దీన్‌ పాత్ర తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంది. 

ఎంఎస్‌ ధోనీ: టీమిండియా వికెట్‌ కీపర్‌, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఎంఎస్‌ధోనీ. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో 2016లో విడుదలైన చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో ధోనీ చిన్నప్పుడు ఫుట్‌బాల్‌ కీపర్‌ నుంచి టీమిండియా కెప్టెన్‌గా  ఎదిగిన తీరుని అద్భుతంగా తెరకెక్కించారు. భావోద్వేగాలతో పాటు అతడి జీవితంలోని ఒడుదొడుకులను కళ్లకు కట్టినట్టు చూపించారు. రైల్వే టీసీగా ఉద్యోగం, క్రికెటర్‌గా మారాక ఓ యువతితో స్నేహం లాంటి ధోనీ వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించారు. చివరగా సాక్షితో పరిచయం ప్రేమా, పెళ్లి తర్వాత 2011 ప్రపంచకప్‌ విజేతగా టీమిండియాని గెలిపించడంతో సినిమా పూర్తవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యువక్రికెటర్లు ప్రేరణపొందే చిత్రమిది. 

సచిన్‌: క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ జీవితాధారంగా తెరకెక్కిన ఆటోబయోగ్రఫీ సచిన్‌ ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ అనే డాక్యుమెంటరీ. సచిన్‌ చిన్ననాటి నుంచి 2011 ప్రపంచకవరకు అతడి జీవితంలోని ముఖ్య అంశాలను చూపించారు. ఇందులో రెండు ప్రధాన అంశాలను చూపించారు. ఒకటి 1999 వరకు సచిన్‌ ఆటతీరు. ఆ తర్వాత గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా ఎలా ఎదిగాడో అనే అంశాలను ప్రస్తావించారు. చిన్నతనంలో క్రికెట్‌ ఆడటం, పాకిస్థాన్‌తో అరంగేట్రం తదితర విషయాలతో పాటు అనేక విషయాలను వాస్తవ వీడియోలతో తెరకెక్కించారు. ఇదొక స్ఫూర్తిదాయకమైన డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది.

జెర్సీ: ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన జెర్సీ సినిమా క్రికెట్‌ నేపథ్యంలోనే తెరకెక్కింది. న్యాచురల్‌ స్టార్‌ నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంచి విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టీమిండియాలో చేరాలనుకునే ఒక యువక్రికెటర్‌ అనుకోని పరిస్థితుల మధ్య ఆటకు దూరమౌతాడు. పదేళ్ల తర్వాత తన కుమారుడి కోరిక మేరకు మళ్లీ బ్యాట్‌ పట్టి క్రికెట్‌లో తన సత్తా చాటిచెబుతాడు. ఈ క్రమంలో తాను చనిపోతానని తెలిసి కూడా క్రికెట్‌ ఆడి తన కుమారుడి ఆశని నెరవేరుస్తాడు. నాని పూర్తి భావోద్వేగంతో నటించిన ఈ చిత్రం చాలా సహజంగా తీర్చిదిద్దారు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో పాటు క్రికెట్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా అత్యంత సహజంగా తెరకెక్కించారు. ఒక క్రికెటర్‌ నిజ జీవత కథను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా రూపొందించడం విశేషం. 

ఇదిలా ఉండగా ఇకముందూ క్రికెట్‌ నేపథ్యంలో రాబోయే చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిల్లో 1983 ప్రపంచకప్‌ హీరో కపిల్‌దేవ్‌ బయోపిక్‌తోపాటు, టీమిండియా మాజీ డ్యాషింగ్‌ కెప్టెన్‌ సౌరభ్‌గంగూలీ బయోపిక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.