సకల కళా కోర్సులు 
close

తాజా వార్తలు

Updated : 22/05/2019 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సకల కళా కోర్సులు 

సృజనకు పట్టం కట్టే ఫైన్‌ ఆర్ట్స్‌


మధురమైన సంగీతం విన్నా.. చక్కటి చిత్రలేఖనాన్ని చూసినా.. అపురూపమైన శిల్పం కనిపించినా.. కాస్త ఆగి ఆలకించి.. అవలోకించి.. ఆస్వాదించి వెళతాం. ఆ నైపుణ్యాలను మెచ్చుకుంటాం. ఇంకా ఉత్సాహం అనిపిస్తే  మనమూ సరదాగా ప్రయత్నిస్తాం. ఆనందంతోపాటు ప్రేరణనూ ఇవ్వడమే కళల గొప్పదనం. అంతేకాదు.. మంచి అవకాశాలతోపాటు ఆదాయాన్నీ అందిస్తున్నాయి. సౌందర్యారాధన, సృజనాత్మకత, భావుకత ఉన్న వాళ్లకు లలిత కళలు (ఫైన్‌ ఆర్ట్స్‌)  సరైన ఉపాధి మార్గాలు. సంప్రదాయ డిగ్రీలను దాటి భిన్నమైన దారుల్లో కెరియర్‌ ప్రారంభించాలనుకునే వారు ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులను ప్రయత్నించవచ్చు. కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. 


ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేసిన వారికి వివిధ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. మంచి ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టే రంగమిది.


ఫొటోగ్రఫీ, టెలివిజన్‌, ఫ్యాషన్‌,  బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, టెక్స్‌టైల్‌ రంగాల్లో అవకాశాలతో పాటు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


అకడమిక్‌, ఆర్కిటెక్చర్‌, సినిమా పరిశ్రమల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి.


బిజీ బిజీ పరుగుల జీవితంలో ఉల్లాసానికీ, వినోదానికీ ప్రాధాన్యం పెరుగుతోంది. మరోపక్క లలిత కళలు (ఫైన్‌ఆర్ట్స్‌)  ఆధునిక హంగులను అద్దుకుని ఉపాధికి అనువైనవిగా మారాయి. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, సంప్రదాయ డిగ్రీలు కాకుండా ఆసక్తికరమైన కోర్సులను అభ్యసించాలనుకునే వారి సంఖ్య ఈమధ్య పెరుగుతోంది. అలాంటివారు ఎంచుకోదగ్గవాటిలో ఫైన్‌ఆర్ట్స్‌ ఒకటి.  తెలుగు రాష్ట్రాల్లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల ప్రవేశ ప్రకటనలు వెలువడ్డాయి.

ఆర్ట్‌ గ్యాలరీలకు వెళ్లినపుడు అక్కడి ఒక చిత్రమో, శిల్పమో ఆకర్షిస్తుంది. అది ఆకట్టుకోవడం వెనక చాలా కారణాలుంటాయి. దాని అందమో, భావమో, భావోద్వేగమో మనసుని కట్టిపడేస్తుంది. బాహ్య రూపమే కాకుండా అంతర్గత భావనలకూ రూపమివ్వడంలోనే కళాకారుడి నైపుణ్యం ఉంటుంది. ఇలా అందమైన ఊహలకు రూపమివ్వాలనుకునేవారికీ కొన్ని కెరియర్‌ అవకాశాలున్నాయి. ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేసి వాటిని అందుకోవచ్చు. కళలపై ఆసక్తి ఉండి, వాటిలో ఉపాధి పొందాలనుకునేవారు ఎంచుకోదగ్గ కోర్సులివి. డ్రాయింగ్‌, స్కల్‌ప్చర్‌, పెయింటింగ్‌, సంగీతం, నృత్యం, ఆర్కిటెక్చర్‌, ఫొటోగ్రఫీ మొదలైనవన్నీ ఫైన్‌ఆర్ట్స్‌ కిందకి వస్తాయి. 


కోర్సులు -  సంస్థలు 

వివిధ సంస్థలు ఫైన్‌ఆర్ట్స్‌లో సర్టిఫికేషన్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డాక్టోరల్‌ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. సర్టిఫికేషన్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తి చేసినవారు అర్హులు. పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ చేసి ఉండాలి. పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఫైన్‌ఆర్ట్స్‌ చదివుండాలి.

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌; డ్రాయింగ్‌ అండ్‌ యానిమేషన్‌; ప్లేట్‌ మేకింగ్‌ అండ్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌; క్రాఫ్టింగ్‌ క్రియేటివ్‌ కమ్యూనికేషన్‌; పర్‌ఫార్మింగ్‌ అండ్‌ విజువల్‌ ఆర్ట్స్‌; విజువల్‌ ఆర్ట్స్‌- అప్లయిడ్‌ ఆర్ట్స్‌; విజువల్‌ ఆర్ట్స్‌- స్కల్‌ప్చర్‌; ప్రొఫెషనల్‌ కోర్స్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్‌ మొదలైన కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి 3 నెలల నుంచి ఆరు నెలల వరకూ ఉంటుంది.

డిప్లొమా ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌; అప్లయిడ్‌ ఆర్ట్స్‌; ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌; కమర్షియల్‌ ఆర్ట్‌; అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఫైన్‌ఆర్ట్‌; డిప్లొమా ఇన్‌ పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌ అండ్‌ అప్లయిడ్‌ ఆర్ట్స్‌; డిప్లొమా ఇన్‌ కర్ణాటిక్‌ ఓకల్‌; డిప్లొమా ఇన్‌ ప్రింటింగ్‌ ఆర్ట్స్‌; డిప్లొమా ఇన్‌ పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌; పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌; పీజీ డిప్లొమా ఇన్‌ స్కల్‌ప్చర్‌; పీజీ డిప్లొమా ఇన్‌ విజువల్‌ ఆర్ట్స్‌ మొదలైన కోర్సులున్నాయి. కాలవ్యవధి- ఏడాది నుంచి రెండేళ్లు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు: డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బీఎఫ్‌ఏ ఆనర్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌ (బీవీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (బీపీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఏ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు కాగా, మిగతావి మూడు నుంచి అయిదేళ్ల వరకూ ఉన్నాయి. వీటిల్లో కొన్ని కోర్సులు ప్రత్యేకంగా ఒక స్పెషలైజేషన్‌తో నేరుగా (ఉదా: బీఎఫ్‌ఏ- గ్రాఫిక్స్‌ పెయింటింగ్‌, లలిత్‌ కళ, స్కల్‌ప్చర్‌, ఫోక్‌ మ్యూజిక్‌ అండ్‌ ఆర్ట్‌) కోర్సులను అందిస్తుండగా, మరికొన్ని చివరి సంవత్సరంలో స్పెషలైజేషన్‌ను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో: మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌ (ఎంఎఫ్‌ఏ), మాస్టర్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌ (ఎంవీఏ), మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌, ఎంఫిల్‌, ఎంఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాలవ్యవధి- రెండేళ్లు. వీటిలో ఎక్కువ శాతం స్పెషలైజేషన్‌తోనే అందిస్తున్నాయి. లలిత్‌ కళ, విజువల్‌ ఆర్ట్స్‌, ఇండియన్‌ ఆర్ట్‌,  గ్రాఫిక్స్‌, స్కల్‌ప్చర్‌, పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌/ వోకల్‌ మొదలైనవి వీటిలో కొన్ని. విదేశీ అంశాల్లోనూ (ఉదా: ఆర్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఏషియా, ఆర్ట్‌ ఆఫ్‌ చైనా అండ్‌ కొరియా, ఆర్ట్‌ ఆఫ్‌ నేపాల్‌ అండ్‌ టిబెట్‌, యూరోపియన్‌ ఆర్ట్‌ మొదలైన వాటిల్లో) ఎంఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డాక్టొరల్‌ కోర్సులు: పీహెచ్‌డీ, డాక్టోరేట్‌ ఆఫ్‌ లిటరేచర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌డీ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు కాగా, లిటరేచర్‌ కోర్సులకు రెండేళ్లు. సాధారణంగా నోటిఫికేషన్లు మే చివరి వారం నుంచి జూన్‌ వరకూ విడుదలవుతుంటాయి.


ఉద్యోగావకాశాలు 

ప్రస్తుతం ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేసిన వారికి వివిధ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. మంచి ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టే రంగమిది. డిగ్రీ పూర్తిచేసిన వారిని గ్రాఫిక్‌ డిజైనర్‌, ఆర్టిస్ట్‌, విజువలైజింగ్‌ ప్రొఫెషనల్‌, ఆర్ట్‌ ప్రొఫెషనల్‌, పెయింటర్‌, ఇలస్ట్రేటర్‌, క్రాఫ్ట్‌ ఆర్టిస్ట్‌, యానిమేటర్‌, ఆర్ట్‌ కన్సర్వేటర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌, మ్యూజిక్‌ టీచర్‌, డ్యాన్స్‌ టీచర్‌, సెట్‌ డిజైనర్‌, మల్టీమీడియా ప్రోగ్రామర్‌, ఆర్ట్‌ థెరపిస్ట్‌ హోదాల్లోకి తీసుకుంటారు. 
ఇంకా ఆర్ట్‌ టీచర్‌, ప్రభుత్వ విభాగాల్లో ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లుగా చేరొచ్చు. ఫ్రీలాన్స్‌ వర్కర్‌గా కెరియర్‌ ప్రారంభించొచ్చు, ఆసక్తి ఉంటే డైరెక్షన్‌, దుస్తులు, ఫొటోగ్రఫీ, టెలివిజన్‌, ఫ్యాషన్‌ రంగాల్లోకీ ప్రవేశించవచ్చు. ఇతర గ్రాడ్యుయేట్లతోపాటుగా వీరికీ బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, టెక్స్‌టైల్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకునే వీలుంది.

అకడమిక్‌, ఆర్కిటెక్చర్‌, సినిమా పరిశ్రమల్లోనూ వీరికి అవకాశాలున్నాయి. సృజనాత్మక విభాగాలైన మేగజీన్లు, అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు, వార్తాపత్రికల్లోని కొన్ని విభాగాల్లోనూ చేరవచ్చు. మ్యూజియాలు, ప్రైవేటు గ్యాలరీల్లోనూ అవకాశాలు లభిస్తాయి. వీరు రూపొందించిన వస్తువులను స్టూడియోలు, స్టోర్స్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ షోల్లో ఉంచవచ్చు. వేలంలో మంచి ఆదాయం వస్తుంది. మల్టీమీడియా ఆర్టిస్ట్‌లు, యానిమేటర్లు మోషన్‌ పిక్చర్లు, వీడియో గేమ్‌ పరిశ్రమల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. 
జీతభత్యాలు: నైపుణ్యాన్ని బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. సాధారణంగా వేతనం రూ.10,000 నుంచి మొదలవుతుంది. మేగజీన్లు, పబ్లిషింగ్‌ హౌజ్‌లు, అడ్వర్టైజింగ్‌ సంస్థల్లో చేరినవారికైతే రూ.15,000 నుంచి రూ.25,000 వరకూ ఉంటుంది. అభ్యర్థి సృజనాత్మకత, అనుభవాన్ని బట్టి జీతాల్లో మంచి మార్పులుంటాయి. 


తెలుగు రాష్ట్రాల్లో.. 

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీల్లో ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, అప్లయిడ్‌ ఆర్ట్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ విభాగాల్లో బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులను అందిస్తోంది. జాతీయస్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్ష- ఎఫ్‌ఏడీఈఈ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ జూన్‌ 15. ప్రవేశపరీక్ష జూన్‌ 29, 30 తేదీల్లో ఉంటుంది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మ్యూజిక్‌, డాన్స్‌, ఫోక్‌ ఆర్ట్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌, స్కల్‌ప్చర్‌ అండ్‌ పెయింటింగ్‌ల్లో బీఎఫ్‌ఏ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ జూన్‌ 22. ప్రవేశపరీక్ష (పీఎస్‌టీయూ సెట్‌) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.


కోర్సులు అందిస్తున్న ఇతర ప్రముఖ సంస్థలు 

*కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌, న్యూదిల్లీ *కురుక్షేత్ర యూనివర్సిటీ, కర్ణాటక * జమియా మిలియా ఇస్లామియా, న్యూదిల* ఫ్యాకల్టీ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి * సర్‌ జేజే కాలేజ్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఆర్ట్‌, ముంబయి * కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, త్రివేండ్రం*గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, చెన్నై * కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, కర్ణాటక చిత్రకళ పరిషత్‌, బెంగళూరు * అమిటీ యూనివర్సిటీ.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని