close

తాజా వార్తలు

అంతర్జాలంలో వ్యక్తిగత చిత్రాలు ప్రత్యక్షం

, హైదరాబాద్‌: చేతిలో చరవాణి ఉంది కదా అని సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం ఇప్పుడు సర్వసాధారణ వ్యవహారం.. ఒకప్పుడు ఫొటో దిగాలంటే కెమెరామెన్‌ క్లిక్‌మనిపిస్తే తప్ప సాకారం కాకపోయేది. ఇక వీడియో తీయడమంటే అదో పెద్ద తతంగమే. కెమెరాలతో కూడిన చరవాణుల పుణ్యమా అని ఆ బాధ తప్పింది. అదే సదుపాయం కారణంగా పరువు బజారు పాలయ్యే పరిస్థితులూ ఇప్పుడు షరా మాములయ్యాయి. ఎలాంటి చిత్రాలనైనా చరవాణిలో బంధించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. రహస్యంగా ఉంచుకోవాల్సిన వ్యక్తిగత, ఏకాంత చిత్రాలూ ఆ జాబితాలో చేరిపోవడం అనర్థ దాయకమవుతోంది. ఈక్రమంలో అటు అమ్మాయిలు నవ్వులపాలవుతుండగా.. ఆ చిత్రాల్ని తెరకెక్కిస్తున్న అబ్బాయిలు కటకటాలపాలవుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

స్నేహం, ప్రేమ మత్తులో యువతీయువకులు హద్దులు దాటేస్తున్నారు.. ఆ మత్తులో వ్యక్తిగత చిత్రాల్ని, వీడియోల్ని చరవాణుల్లో నిక్షిప్తం చేసుకుంటుండటం అనర్థాలకు కారణమవుతోంది. ఇద్దరి మధ్య ఆ సంబంధాలు బాగున్నంత వరకు అంతా సవ్యంగానే సాగిపోతుంది. ఒకవేళ విబేధాలు వస్తే మాత్రం ఆ యువతీయువకుల ఇద్దరి పరువు బజారున పడుతోంది. అబ్బాయేమో అహంతో నేరం చేసి కటకటాల పాలైతే.. అమ్మాయి మాత్రం పరువు పోగొట్టుకుని అవమానాల పాలవుతోంది. తనను దూరంగా ఉంచుతోందనే అవమానంతో యువకులు చేయరాని తప్పిదాలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మాజీ స్నేహితురాలిపై ఉన్న అక్కసుతో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలను అప్‌లోడ్‌ చేస్తూ కక్ష తీర్చుకుంటున్నామని భ్రమపడుతున్నారు. బాధితురాళ్లు ఒకప్పటిలా కుమిలిపోవడానికి పరిమితం కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో యువకుల నిర్వాకాలు బట్టబయలవుతున్నాయి. 
 

పోలీసుల గుప్పిట ఐటీ గుట్టు 
ఈ తరహా ఘటనల్లో మాజీ స్నేహితురాళ్ల చిత్రాలను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా కక్ష తీర్చుకున్నామనే భ్రమలో బతికేస్తున్నారు మాజీ ప్రియులు. తీరా సైబర్‌క్రైమ్‌ పోలీసులకు చిక్కాక గాని తాము చెత్త పని చేశామని గుర్తించలేకపోతున్నారు. సైబర్‌క్రైమ్‌ నేరాల దర్యాప్తులో ఆరితేరిన రాజధాని పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి వారి గుట్టును సులువుగా రట్టు చేస్తున్నారు. సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో ఒక చిత్రాన్ని లేదా వీడియోను గాని అప్‌లోడ్‌ చేయాలంటే తప్పనిసరిగా కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, చరవాణిల్లాంటి వాటిల్లో ఏదో ఒకదానిని వినియోగించాల్సిందే. వీటిల్లో ప్రతీ దానికి తప్పనిసరిగా ఐపీ అడ్రస్‌ ఉండి తీరుతుంది. తమ వద్దఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ అడ్రస్‌ను కనిపెడుతున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితులను సులభంగా పట్టేస్తున్నారు. చిత్రాల్ని, వీడియోల్ని అప్‌లోడ్‌ చేసిన అనంతరం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, చరవాణిల్లోనుంచి వాటిని తొలగించినా కనిపెట్టే పరిజ్ఞానం పోలీసుల దగ్గరుంది. ఒకవేళ వాటిని ధ్వంసం చేసినా, పగులగొట్టినా డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ల ద్వారా గుట్టు కక్కిస్తున్నారు. ఈ తరహా తప్పుడు పనులు చేసి తప్పించుకోవడం అసాధ్యమే కావడంతో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇలా తీశారు.. అలా చిక్కారు 
వ్యక్తిగత, ఏకాంత చిత్రాలు అంతర్జాలంలో ప్రత్యక్షమవుతున్న ఘటనలు ఇటీవలికాలంలో ఎక్కువయ్యాయి. గతంలా కాకుండా బాధితురాళ్లు ధైర్యం చేసి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తుండటంతో నేరం చేసినవారి బాగోతం బహిర్గతమవుతోంది. 
విశాఖపట్టణానికి చెందిన సురబత్తుల దిలీప్‌కుమార్‌ తన స్నేహితుడి ద్వారా ఓ అమ్మాయి నగ్నచిత్రాలను సంపాదించాడు. పూర్వాశ్రమంలో ఆ అమ్మాయి తన స్నేహితుడితో చనువుగా మెదిలిన సమయంలో తీసిన చిత్రాలవి. వాటిని ఆధారంగా చూపిస్తూ తన వద్దకు రావాలంటూ దిలీప్‌ బాధితురాలిని బెదిరించాడు. ఆమె వినకపోవడంతో అశ్లీల సైట్లలో ఆ చిత్రాలను పోస్ట్‌ చేశాడు. దీనిపై బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఐపీ చిరునామా ఆధారంగా దిలీప్‌ను అరెస్ట్‌ చేశారు.

పేట్‌బషీరాబాద్‌కు చెందిన గుండుపల్లి సూర్య మణికంఠ చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థినితో స్నేహం చిగురించింది. హద్దులు దాటేంత దగ్గరయ్యారు. చరవాణిలో ఏకాంత చిత్రాలను బంధించుకున్నారు. షరా మామూలుగానే కొంత కాలం తర్వాత మనస్పర్థలు వచ్చాయి. మణికంఠలో అహం దెబ్బతింది. ఆ అహం అతడి విచక్షణపై దెబ్బకొట్టింది. కలిసి ఉన్నప్పుడు స్నేహితురాలిని ప్రైవేటుగా తీసిన చిత్రాలు గుర్తుకొచ్చాయి. అంతే.. ఒక్కసారిగా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలో ఆ చిత్రాల్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. ఫలితంగా మణికంఠ కటకటాల పాలయ్యాడు. 
కేపీహెచ్‌బీ ఓ కన్సల్టెన్సీలో కడపకు చెందిన యువతి పనిచేసేది. ఆమె తన సంస్థ నుంచి వెళ్లిపోవడంతో నిర్వాహకుడు శివ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె ఉండే ప్రైవేటు వసతిగృహంలోనే తన సంస్థలో పనిచేసే మరో యువతి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్నాడు. బాధితురాలు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు, ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు చిత్రాలు తీసి వాట్సాప్‌కు పంపాలని సూచించాడు. ఆమె అలాగే చేయడంతోపాటు బాధితురాలి పేరిట ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతా సృష్టించింది. బాధితురాలి అభ్యంతరకర చిత్రాలను అందులో పోస్టు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శివతోపాటు తప్పుడు పని చేసిన యువతినీ అరెస్ట్‌ చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.