close

తాజా వార్తలు

ఐపీఎస్‌ అధికారినంటూ యువకుడి మోసం

  జైపుర్‌లో గుట్టు రట్టు

జైపుర్‌: ఐపీఎస్‌ అధికారిగా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్న 20 ఏళ్ల యువకుడిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అభయ్‌ మీనా అనే ఈ యువకుడు నిజానికి సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలనంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తుంటాడని చెప్పారు. 12వ తరగతి తప్పిన అతడు తాను ఐఐటీ, యూపీఎస్‌సీ పరీక్షలను మొదటి ప్రయత్నంలోనే సాధించేందుకు సుదీర్ఘ సమయం పాటు చదివేవాడినంటూ నమ్మబలికేవాడు. దీంతో చిన్నవయసులోనే ఐపీఎస్‌ అధికారిగా ఎదిగాడంటూ అనేక మంది అతడిని స్ఫూర్తిగా తీసుకున్నారని ఏఎస్పీ కరణ్‌ శర్మ చెప్పారు. అతడి మాయలో నిజమైన పోలీసు అధికారులూ పడ్డారు. అభయ్‌ గుర్తింపు కార్డును చూసిన ఒక వ్యక్తికి అనుమానం రావడంతో అతడి గుట్టు రట్టయింది. అందులో క్రైమ్‌ బ్రాంచ్‌, క్యాపిటల్‌ అనే ఆంగ్ల పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. దీంతో జైపుర్‌లోని జగత్‌పురలోని అతడి అపార్ట్‌మెంట్‌పై దాడి చేసిన ప్రత్యేక విభాగం పోలీసులు ఆ మోసగాడిని అరెస్టు చేశారు. ఆ సమయంలో పోలీసులను బెదిరించేందుకు అతడు ప్రయత్నించాడు. అంతిమంగా తన నేరాన్ని అంగీకరించాడు. దిల్లీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారినని, అక్కడే ఏసీపీగా పనిచేస్తున్నానని జనాన్ని నమ్మించినట్లు చెప్పాడు.
3 నక్షత్రాల కారు.. 5 నక్షత్రాల హోటల్‌
అభయ్‌ తన కారుపై మూడు నక్షత్రాలు కలిగిన ఒక ఫలకాన్ని పెట్టుకునేవాడు. డీజీ లేదా అదనపు డీజీ అధికారి వాహనానికి మాత్రమే మూడు నక్షత్రాలు ఉంటాయి. ‘‘ఆ లాంఛనం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు మాత్రమే ఉంటుంది. అప్పుడు కొత్తగా సర్వీసులోకి ప్రవేశించిన 20 ఏళ్ల యువకుడికి కాదు. అయినా ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనాన్ని ఎప్పుడూ తనిఖీ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’ అని ఓ అధికారి చెప్పారు. అనేక అవార్డు కార్యక్రమాల్లో పాల్గొని, అసలైన పోలీసు అధికారులను కొనియాడాడు. వీరిలో కొందరు ఆయనకు సెల్యూట్‌ కూడా చేయడం గమనార్హం. అభయ్‌ ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వారు ఖరీదైన హోటళ్లలో ఉంటారు. విలువైన రెస్టారెంట్లలో విందులు చేసుకునేవారు. బిల్లులు కూడా చెల్లించేవారు కాదు. న్యాయపరమైన కొన్ని కేసుల్లో సాయం చేసే సాకుతో అనేక మంది వద్ద అతడు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.