close

తాజా వార్తలు

ఐదు రోజులైనా దొరకని ఏఎన్‌-32 ఆచూకీ

ఇటానగర్‌: పదమూడు మంది ప్రయాణికులతో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 విమానం గల్లంతై ఐదు రోజులు దాటినా ఇంకా దాని ఆచూకీ మాత్రం తెలియరాలేదు. వాయుసేన, నేవీ, ఆర్మీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు, స్థానికులు అంతా కలిసి అరుణాచల్‌ప్రదేశ్‌ అడవులు, కొండలను జల్లెడపడుతున్నా విమానం గురించి ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. విమానం ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్‌-32 విమానం 13 మంది ప్రయాణికులు, సిబ్బందితో గత సోమవారం మధ్యాహ్నం 12.27 గంటల ప్రాంతంలో అసోంలోని జోర్హాత్‌ నుంచి బయల్దేరింది. ఈ విమానం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షియోమీ జిల్లాలో గల మెచుకా అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు చేరాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఏఎన్‌-32 విమానానికి ఏటీఎఫ్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం గల్లంతైనట్లు గుర్తించిన ఐఏఎఫ్‌ అధికారులు వెంటనే భారీ గాలింపు ఆపరేషన్‌ చేపట్టారు. అయితే రోజులు గడుస్తున్నా విమానం ఆచూకీ మాత్రం తెలియరావట్లేదు. 

అయితే సోమవారం తాము ఓ పర్వతం నుంచి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడటం చూశామని అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా తుంబిన్‌ గ్రామానికి చెందిన కొందరు చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. గ్రామస్థులు చెప్పిన ప్రాంతం సియాంగ్‌ జిల్లాలోని కయింగ్‌, పయుమ్‌ పరిధిలో ఉంటుంది. దాదాపు 2500 చదరపు కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతంలో వాయుసేన ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. హెలికాప్టర్లతో పాటు మానవరహిత విమానాలు(యూఏవీ), నేవీకి చెందిన విమానాలు, ఎలక్ట్రానిక్‌ రాడార్‌, ఆప్టికల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లు, శాటిలైట్ల సాయంతో విమానం కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉండటంతో గాలింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.

ఏఎన్‌-32 విమానంలో ఉండే ఎమర్జెన్సీ లొకేటర్‌ ట్రాన్స్‌మిటర్‌ బెకాన్‌ ప్రమాదం జరిగినప్పుడు సిగ్నళ్లను చేరవేస్తుంది. అయితే దీని బ్యాటరీ కేవలం 36 గంటలు మాత్రమే పనిచేస్తుంది. విమానం గల్లంతై ఐదు రోజులు గడవడంతో ప్రస్తుతం ఆ బెకాన్‌ యాక్టివ్‌లో ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో గాలింపు మరింత సవాల్‌గా మారింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లతో గాలింపును నిన్న సాయంత్రం నిలిపివేశారు. ఈ రోజు ఉదయం మరోసారి గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్యప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఇక్కడ గాలింపు పెను సవాల్‌తో కూడుకున్నదని అధికారులు చెబుతున్నారు. 

మరోవైపు తమ వారి ఆచూకీ తెలపాలంటూ ఏఎన్‌-32 ప్రయాణికుల కుటుంబాలు ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని వాయుసేన అధికారులు హామీ ఇచ్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.