close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/06/2019 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐచ్ఛికాల్లో జాగ్రత్త!

వైద్యవిద్య ప్రవేశాల్లో కళాశాలలు, కోర్సులకు సంబంధించిన ఐచ్ఛికాలను ఎంపిక చేసుకునేటప్పుడే..అప్రమత్తంగా వ్యవహరించాలనీ, లేదంటే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి అన్నారు. 2019-20 వైద్యవిద్యా సంవత్సరానికి ఈనెల చివరి వారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల నీట్‌ ర్యాంకులు వెలువడిన నేపథ్యంలో.. ప్రవేశాల ప్రక్రియపై ‘ఈనాడు చదువు’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ముఖాముఖిలోని ముఖ్యాంశాలివి.

*వైద్యవిద్య ప్రవేశ ప్రక్రియ ఎలా ఉండబోతోంది? 
* ఒక్కసారి నీట్‌ ర్యాంకులు వెలువడ్డాయి గనుక ఇక వాటిల్లో ఏవిధమైన తేడా ఉండదు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లోని వైద్యసీట్లనూ నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే భర్తీ చేస్తారు. వచ్చే వారంలోగా రాష్ట్రాలకు ర్యాంకుల జాబితా వస్తుంది. ఆ తర్వాత ప్రాథమికంగా ఒక అంచనా కోసం మాత్రమే జాబితాను వెల్లడిస్తాం. తుది జాబితా కచ్చితమైనది మనకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరమే తెలుస్తుంది. అప్పుడే ఏయే విద్యార్థులు రాష్ట్రంలో సీట్ల కోసం పోటీపడుతున్నారనేది తెలుస్తుంది. సాధారణంగా అఖిల భారత స్థాయిలో రెండు విడతల ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. అఖిల భారత కోటాలో మొదటి విడత పూర్తయ్యాక.. మన రాష్ట్రంలో మొదటి విడత ఉంటుంది. అయితే అఖిల భారత కోటాలో చేరిన విద్యార్థులు మన రాష్ట్రంలో తదనంతర ప్రవేశాల్లో సీట్లు వస్తే చేరడానికి వీలుగా.. ముందుగా మన దగ్గరే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తాం. అఖిల భారత కోటాలో రెండో విడత పూర్తయ్యాక.. మిగిలిన సీట్లను రాష్ట్రాలకే ఇచ్చేస్తారు. ఆ తర్వాతే మన రాష్ట్రంలో రెండో విడత ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తాం. రాష్ట్రంలోనూ రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత కూడా మిగిలిన సీట్లకు ఆఖరివిడతగా మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహిస్తాం.

*అఖిల భారత కోటాలో చేరాలనుకునేవారు ఇంటర్‌ బోర్డు నుంచి మైగ్రేషన్‌ ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుందా? 
* సాధారణంగా పీజీ చేసేటప్పుడు విశ్వవిద్యాలయాల మధ్య ధ్రువీకరణ ఉంటుంది కాబట్టి అప్పుడు మైగ్రేషన్‌ అవసరమవుతుంది. అయితే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో అఖిల భారత కోటాలో చేరాలనుకునే విద్యార్థులకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. గత ఏడాది కూడా తీసుకోలేదు. ఈ ఏడాది అఖిల భారత స్థాయి ఉన్నతాధికారులతోనూ ఇదే విషయంపై మాట్లాడాను. వారు మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని ధ్రువీకరించారు.

*వైద్యవిద్య ప్రవేశాలకు ఎలాంటి ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి? 
* పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత ధ్రువపత్రాలు, నీట్‌ హాల్‌ టికెట్‌, నీట్‌ ర్యాంకు కార్డు, టీసీ, కుల, ఆదాయ ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ఇవేవీ సమర్పించనక్కర్లేదు. కేవలం సమాచారాన్ని పొందుపర్చితే చాలు. అయితే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సందర్భంలో ఒరిజినల్స్‌ అవసరమవుతాయి. కళాశాలలలో చేరేటప్పుడూ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ధ్రువపత్రాలను కూడా తాజాగా తీసుకోవాలి. ఏపీలో కుల ధ్రువపత్రాలు ఉన్నదున్నట్టుగా తెలంగాణలో చెల్లబాటు కావు. తెలంగాణలో ఆ కులం ఏ కేటగిరీలోకి వస్తుందో.. ఆ విధంగానే పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఏ రకమైన ధ్రువపత్రాలిస్తారో.. అదే రకమైన ధ్రువపత్రాలు ఏపీ నుంచి వస్తే సరైనవిగా పరిగణిస్తాం.

*ఈడబ్ల్యూఎస్‌ కింద భర్తీ ఎలా? 
* ఆర్థికంగా బలహీనవర్గాల కోటా కింద వైద్యవిద్య సీట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంది. ఆ ఉత్తర్వుల అనంతరం ఈడబ్ల్యూఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తాం. ఈ సీట్ల వల్ల ప్రస్తుతమున్న రిజర్వేషన్ల సీట్ల భర్తీకి ఎలాంటి నష్టమూ వాటిల్లదు. ప్రస్తుతమున్న వైద్యసీట్ల ప్రకారం రాష్ట్రానికి అదనంగా 298 ఎంబీబీఎస్‌ సీట్లు రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో వివరాలు వెల్లడవుతాయి. 


*రాష్ట్రంలో 15 శాతం అన్‌రిజర్వుడ్‌ కోటా అమల్లో ఉందా? 
* రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం తెలుగు రాష్ట్రాల్లో 15% అన్‌రిజర్వుడ్‌ కోటా భర్తీ అమల్లో ఉంటుంది. ఈ సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులిరువురూ, తెలంగాణ, ఏపీల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలూ అర్హులే. 
పూర్తి ఇంటర్వ్యూ www.eenadupratibha.net లో. 
- అయితరాజు రంగారావు 
ఈనాడు, హైదరాబాద్‌

*పోటీ ఎలా ఉంటుందనుకుంటున్నారు? 
ఉపకులపతి: ఈసారి రాష్ట్రంలో వైద్యవిద్య సీట్లు పెరిగాయి. అఖిల భారత స్థాయిలోనూ పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. మొత్తం 4600 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వీటిలో అఖిల భారత కోటాకు మన రాష్ట్రం నుంచి సుమారు 225 ఎంబీబీఎస్‌ సీట్లు వెళ్తాయి. కన్వీనర్‌ కోటాలో సుమారు 1550 ఎంబీబీఎస్‌ సీట్లుంటాయి. రాష్ట్ర స్థాయిలో సుమారు 1500-1600వ ర్యాంకు వరకూ వస్తే.. ఓపెన్‌లో కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చే అవకాశాలుంటాయి. 


*అఖిల భారత కోటాలో చేరాలనుకునే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో దరఖాస్తు చేసేటప్పుడు ఏ రాష్ట్రంలో, ఏ కళాశాలను ప్రాధాన్య క్రమంలో ఎంచుకుంటున్నావనేది ముఖ్యం. తప్పనిసరిగా చేరాలనుకుంటేనే ప్రాధాన్యక్రమంలో ఆ కళాశాలను చేర్చాలి. లేదంటే వదిలేయాలి. ఒక్కసారి కళాశాలను ఐచ్ఛికంలో చేర్చిన తర్వాత ఒకవేళ సీటు కేటాయిస్తే అప్పుడు చేరనంటే కుదరదు. ప్రభుత్వ కళాశాలలో అయితే సుమారు రూ.30వేలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో అయితే సుమారు రూ.2 లక్షల వరకూ ముందుగా డిపాజిట్‌గా తీసుకుంటారు. ఒకవేళ కళాశాలలో చేరకపోతే ఆ రూ.30వేలు/రూ.2 లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. అఖిల భారత కోటాలో మొదటి విడత ప్రవేశాల్లో చేరకపోయినా రెండో విడతలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. చేరి వదిలేస్తే మాత్రం రెండోవిడతకు అర్హత లేదు. మొదటి విడతలో చేరకుండా.. రెండోవిడత ప్రవేశాలకు దరఖాస్తు చేసిన తర్వాత.. ఒకవేళ అప్పుడు కూడా కేటాయించిన సీట్లలో చేరకపోతే.. ఇక అఖిల భారత స్థాయిలో ప్రవేశాలకు అర్హత ఉండదు. ఒకవేళ కళాశాలలో చేరితే మాత్రం మార్చుకోవడానికి కొంత గడువు ఇస్తారు.. నిరిష్ట తేదీలోగా గనుక మార్చుకోకపోతే ఇక అనంతర ప్రవేశాలకు అనుమతి ఉండదు. ఎందుకంటే రెండోవిడత తర్వాత మిగిలిన సీట్లను రాష్ట్రాలకు అప్పగిస్తారు. రాష్ట్రాల్లోని ప్రవేశాల్లోనూ వారికి అనుమతి నిషిద్ధం. అందుకే కళాశాల ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. కళాశాలను ముందుగా చూసుకొని అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాతే ఎంపిక చేసుకోవాలి. ఈ విధానం రాష్ట్ర ప్రవేశాల్లోనూ వర్తిస్తుంది. 


నాలుగంచెల్లో నీట్‌ కౌన్సెలింగ్‌ 
www.mcc.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా నీట్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. 
1 మొదట న్యూ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చెయ్యాలి. వెంటనే తన సమాచారాన్ని భర్తీ చెయ్యడానికి వీలుగా స్క్రీన్‌ కనబడుతుంది. తన సమాచారాన్ని నింపిన తర్వాత రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లభ్యమవుతాయి. దీనికై తగిన ఫీజును చెల్లించాలి. 
2. candidate login లో పైన పొందిన రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ భర్తీ చెయ్యాలి.రోల్‌నంబర్‌, పాస్‌వర్డ్‌ని ఏర్పరచుకునే ప్రక్రియలో అభ్యర్థి సూచించిన మొబైల్‌కి otp పంపుతారు. 
3 అభ్యర్థి లాగిన్‌ అయ్యాక అభ్యర్థి తన వివరాలను పొందుపరచడానికి మరొక పేజీ కనబడుతుంది. తగిన వివరాలన్నీ భర submit క్లిక్‌ చెయ్యాలి. 
4 పై అంచెలన్నీ పూర్తయిన తర్వాత అభ్యర్థి వివరాలన్నీ  స్క్రీన్‌పై కనబడతాయి. అవన్నీ గమనించి నిర్ధారించుకున్నాక ‘confirm registration పై క్లిక్‌ చెయ్యాలి. ఈ పేజీ ప్రింటవుట్‌ తీసుకోవాలి. 
కళాశాలల ఎంపిక: అభ్యర్ధి తనకు ఇష్టమైన కళాశాలలను ప్రాధాన్యతా పరంగా ఎంచుకోవడానికి వీలుగా నిర్దిష్ట తేదీ, నియమిత సమయం కేటాయిస్తారు. 
నీట్‌ 2019 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక choice available పై క్లిక్‌ చెయ్యాలి. సిస్టమ్‌లో అభ్యర్థి వివరాలు, కేటగిరీ, అర్హత మొదలైనవి ఉపయోగించుకుంటారు. తుది విశ్లేషణ తర్వాత అభ్యర్ధికి లభ్యమయ్యే కళాశాలల వివరాలు, సీట్ల సంఖ్య స్క్రీన్‌పై కనబడతాయి. అభ్యర్ధి తన ప్రాధాన్యానికి అనుగుణంగా కళాశాలలను వరుస క్రమంలో ఎంచుకోవాలి. దీనికోసం నీట్‌- 2018లో వివిధ కళాశాలల కటాఫ్‌ ర్యాంకులను దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవడం మంచిది. కళాశాలలను ఎంచుకొనే ప్రాధాన్య క్రమాన్ని నమోదు చేశాక పాస్‌వర్డ్‌ నింపి lock choices క్లిక్‌ చెయ్యాలి. లాక్‌ చేశాక ఎంపిక విధానాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు. లాక్‌ చేశాక ఆపేజీ ప్రింటవుట్‌ తీసి ఉంచుకోవాలి. 
జాతీయ స్థాయి 15% కోటాని మినహాయిస్తే మిగిలిన 85% సీట్లను ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ అభ్యర్థులతో నింపుతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ప్రాంతాలవారీగా ఉన్న రిజర్వేషన్‌ కోటాల ఆధారంగా సీట్లు పొందగలరు. తెలుగు రాష్ట్రాలలో 85% సీట్లను వైద్య విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలోని కమిటీలు భర్తీ చేస్తాయి. జాతీయస్థాయిలో అభ్యర్థులు పొందిన ర్యాంకులు, కేటగిరీ ర్యాంకులు, వివరాలను ఆయా రాష్ట్ర సెలక్షన్‌ కమిటీలు అందుకున్న తర్వాత రాష్ట్రస్థాయిలో మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు. ఆ మెరిట్‌ లిస్ట్‌లో పొందిన ర్యాంకు పరంగా అభ్యర్థి వైద్య కళాశాలలో సీటు పొందగలుగుతాడు.

- రవీంద్రకుమార్‌ కొండముది

 

డీమ్డ్‌నూ దృష్టిలో పెట్టుకోండి! 
గత ఏడాది జరిగిన కౌన్సెలింగ్‌ ఆధారంగా ఐచ్ఛికాలు పెట్టుకునేముందు ఓ సంగతి గుర్తుంచుకోవాలి. కిందటి సంవత్సరం కంటే ఈసారి నీట్‌ ప్రశ్నపత్రం తేలిగ్గా వచ్చింది. దీంతో పోటీస్థాయి పెరిగిపోయి ఎక్కువ స్కోరు చేసినా ర్యాంకు మాత్రం తగ్గిపోయింది. ఈ తేడా గమనించాలి. 
కొత్త ప్రైవేటు మెడికల్‌ కళాశాలలతో పోలిస్తే డీమ్డ్‌ మెడికల్‌ కాలేజీలపై విద్యార్థులూ తల్లిదండ్రులూ దృష్టిపెట్టటం మేలు. చాలామంది ఈ సంగతిని పట్టించుకోరు. ఈ డీమ్డ్‌ మెడికల్‌ కాలేజీలు యూనివర్సిటీ స్థాయికి దాదాపు సమానం. వీటిలో మౌలిక సదుపాయాలు, బోధన ప్రామాణికంగా ఉంటాయి. వీటిలో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (ఢిల్లీ) నిర్వహిస్తుంది. అయితే వీటిలో సీటు రాగానే ఫీజు కట్టి చేరిపోవాలి. మొదటి రౌండులో వేరేచోట్ల సీటు వచ్చి సీటును వదులుకుంటే ఫీజు తిరిగి ఇచ్చేస్తారు. కానీ రెండో రౌండు కౌన్సెలింగులో సీటు వస్తే మాత్రం దాన్ని వదులుకునే అవకాశం ఉండదు. ఈ విషయంలో జాగ్రత్తపడాలి.

- డా. వి. సతీష్‌కుమార్‌, నిర్మల్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.